1. సమస్యలను పరిష్కరించి మనఃశాంతినిచ్చే బాబా.
2. సాయి కృపతో సమసిపోయిన సమస్యలు
సమస్యలను పరిష్కరించి మనఃశాంతినిచ్చే బాబా.
కలియుగాన వెలసిన గురుదైవం శ్రీశిరిడి సాయిబాబా. 'సాయీ' అని తలచిన వెంటనే మనల్ని సంతోషపరుస్తారు, మనం కోరిన, అనుకున్న పనులను నెరవేరుస్తారు. సాయిని తలవనిదే నాకు రోజు గడవదు. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా నేను 'సాయి సాయి' అని అనుకుంటాను. మళ్ళీ నేను ఆ సమస్య గురించి ఆలోచించేలోపు బాబా నన్ను ఆ సమస్య నుండి బయటపడేసి శాంతపరుస్తారు. సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. ఇప్పుడు 2022, మార్చ్ 14, 15 తేదీలలో జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.
మా చిన్నబాబు ఫైనాన్స్ మేనేజరుగా పని చేస్తున్నాడు. తన చేతుల మీదుగా కోట్లల్లో వ్యవహారం జరుగుతుంది. తను ఈమధ్యనే ట్రాన్స్ ఫర్ మీద ఒక ఊరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్లిన కొన్నిరోజులలోనే మంచిగా తన టీమ్‍ని నడిపిస్తూ 'సార్ మంచివారు' అని పేరు తెచ్చుకున్నాడు. అంతకుముందు మా బాబు స్థానంలో ఉన్న సార్ దగ్గర ఒక అతను లోన్ తీసుకుని కొద్దిగా ఇబ్బందిపెట్టాడట. ఆ సార్ వెళ్ళిపోయాక ఆ స్థానంలోకి వచ్చిన మా బాబును కూడా అతను అది, ఇది అంటూ ఇబ్బంది పెట్టసాగాడు. చివరికి ఏకంగా మా అబ్బాయికి లక్షల్లో డబ్బు ఇచ్చాను, నాకు రసీదు ఇవ్వలేదని గొడవ మొదలుపెట్టాడు. ఒకటి, రెండుసార్లు మా అబ్బాయి మౌనంగా ఊరుకున్న తరువాత తన పైఆఫీసర్లకి ఫోన్ చేసి విషయం చెప్పాడు. వాళ్ళు పోలీసులకి రిపోర్ట్ చేయమన్నారు. దాంతో మార్చి 14న మాబాబు పోలీసులను ఆశ్రయించాడు. ఈ విషయాలేవీ తెలియని నేను సరిగ్గా అదే సమయానికి రోజువారీ అలవాటు ప్రకారం మా బాబుకి ఫోన్ చేస్తే, "నేను బిజీగా ఉన్నాను. తరువాత మాట్లాడతాను" అని ఫోన్ పెట్టేసాడు. తరువాత తనే కాల్ చేసి జరిగిందంతా చెప్పి, "నువ్వు ఫోన్ చేసినప్పుడు పోలీసులకు పిర్యాదు చేయడానికి వెళ్ళాను. అందుకే నీతో మాట్లాడలేదు" అని చెప్పాడు. నాకు చాలా భయమేసి, "బాబా! బాబు చిన్నవాడు. 22 ఏళ్లకే తనకి ఉద్యోగం వచ్చింది. అయినా నా పిల్లల విషయం మీకు తెలుసు కదా. ఏ సమస్య లేకుండా చూస్తే, బ్లాగులో ఈ అనుభవాన్ని పంచుకుంటాను బాబా" అని బాబాను వేడుకుని, 'సాయి సాయి' అని అనుకోసాగాను. ఇక అసలు విషయానికి వస్తే, ఎస్.ఐ గారు ఆ ఊరు సర్పంచికి ఫోన్ చేసి లోన్ తీసుకున్న అతన్ని పోలీసు స్టేషన్‍కి రమ్మనమని కబురుపెట్టారు. దాంతో అతను, అతని తండ్రి, మరో ఇద్దరు స్టేషన్‍కి వచ్చారు. అతను ఎస్.ఐ.తో, "నేను మేనేజర్ గారికి డబ్బులిచ్చాను" అని చెప్పాడు. అందుకు ఎస్.ఐ. "సరే ఇచ్చావు. మరి అంత మొత్తం ఇచ్చినప్పుడు సార్ నీకు రసీదు ఇస్తారు కదా! ఆ రసీదు ఇవ్వు" అన్నారు. అతను, "నాకు రసీదు ఇవ్వలేద"ని గట్టిగా చెప్పాడు. అప్పుడు ఎస్.ఐ.గారు, "ఈ కాలంలో 100, 200 ఇచ్చిన వాళ్ళే రసీదు, స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. అలాంటిది నువ్వు లక్షల్లో డబ్బిచ్చి తీసుకోలేదా?" అని అడిగారు. అంతలో మా బాబు సి.సి కెమెరా ఉంది కదా, అది చూస్తే తెలుస్తుంది" అని అన్నాడు. అందుకు ఎస్.ఐ.గారు అవసరం లేదని ఆ లోన్ తీసుకున్న వ్యక్తితో, "నువ్వు సార్‍కి డబ్బులు ఇచ్చాను అంటున్నావు కదా, ఆ రసీదు తీసుకుని వస్తే, నేను నీ లోన్ క్లోజ్ చేయిస్తా. అంతేగాని నువ్వు అనవసరంగా ఆఫీసుకి వెళ్లి గొడవ చేసావని తెలిస్తే నీ మీద కేసు బుక్ చేస్తాను" అని అన్నారు. అప్పుడు అతని తండ్రి "నేను అయితే డబ్బు ఇచ్చాను సార్. వీడే ఏదో చేసాడు" అని అన్నాడు. ఈ విషయాలన్నీ తెలిసి నేను చాలా టెన్షన్ పడి, "ఏమిటి బాబా, నా పిల్లల గురించి మీకు తెలుసు కదా! ఇతరులకు అవసరముంటే వాళ్ళ సొంత డబ్బిచ్చి సహాయం చేస్తారు. అలాంటింది తనపై ఇలాంటి అపవాదేమిటి బాబా?" అని అనుకున్నాను. అంతలోనే, నేను ఇంకా ఆ టెన్షన్ నుండి తేరుకోక ముందే మా బాబు మళ్ళీ కాల్ చేసి, "ఎస్.ఐ గారు వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి పంపారు" అని చెప్పాడు. అయితే అతను మళ్ళీ వచ్చి మాబాబుని ఎక్కడ ఇబ్బంది పెడతాడోనని నాకు కొంచెం భయంగానే ఉండింది. ఎందుకంటే అతను డబ్బు ఇవ్వలేదని చెప్పలేదు. అదీకాక పెద్దల సమక్షంలో సమస్య పరిష్కారమైతే ఇంకే సమస్యా ఉండదు. ఈ అనుభవం బ్లాగుకి పంపితే అయినా సమస్య సమసిపోతుందేమోననిపించి అప్పటివరకు జరిగిందంతా వ్రాసి మార్చి 15న బ్లాగుకి పంపించాను.
ఒక గంట తరువాత మామూలుగా నేను మా బాబుకి ఫోన్ చేసాను. బాబు, "ఇప్పుడే నా గదికి వచ్చానమ్మా" అని అన్నాడు. "మళ్ళీ అతను ఏమైనా ఇబ్బంది పెట్లాడా?" అని నేను అడిగాను. అప్పుడు మాబాబు, "ఈరోజు మా పైఆఫీసర్లు వచ్చి అతన్ని మళ్ళీ పోలీస్ స్టేషన్‍కి పిలిపించి 'నువ్వు నిజంగా డబ్బులు ఇచ్చావా?' అని గట్టిగా నిలదీశారు. అప్పుడతను, 'లేదు. నేను డబ్బు ఇవ్వలేదు' అని చెప్పాడు. 'మరి అలా ఎందుకు చెప్పావు?' అని అడిగితే, 'లోన్ విషయంలో ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. అందుకే అలా చెప్పాను' అని సారీ చెప్పాడు. తరువాత ఆఫీసర్స్ నాతో ఎవ్వరినీ ఎక్కువగా నమ్మకు అని చెప్పారు" అని చెప్పాడు. ఈవిధంగా బాబా నా మనసులో మిగిలి ఉన్న కాస్త భయాన్ని కూడా తీసేసారు. బాబా మన మీద ఎలా దయ, కరుణ, ప్రేమ చూపిస్తారో చూడండి. నాకు సచ్చరిత్రలోని చోల్కర్ గురించి గుర్తుకు వచ్చింది. అతను బాబా దర్శనం కోసం చక్కెర లేని టీ త్రాగడం ద్వారా కూడబెట్టిన డబ్బులతో శిరిడీ వెళ్లి బాబాను దర్శిస్తే, ఆయన, "ఇతనికి చక్కెర ఎక్కువ వేసిన టీ ఇవ్వండి" అని భక్తులతో అంటారు. నిజంగా బాబా సర్వాంతర్యామి అనటంలో సందేహం లేదు. మన మనస్సులో ఏది ఉన్నా బాబాకు తెలుసు. ఆయన మీద భారం వేస్తే అంతా ఆయనే చూసుకుంటారు. బాబాకి తెలుసు ఎవరు ఎలాంటివాళ్ళో! నిజాయతీగా ఉండేవాళ్లకు ఆయన ముందుండి మార్గం చూపిస్తారు. నాకు ఈ అనుభవం మిగతా అన్ని అనుభవాల కన్నా చాలా సంతృప్తినిచ్చింది. చివరిగా ఒక విషయం, పై అనుభవం జరిగిన వెంటనే బ్లాగుకి పంపాలనిపించి వ్రాసి లేస్తుంటే మా అక్క కొడుకు మా పిల్లలిద్దరికోసం శిరిడీ నుంచి పాలరాతి బాబా విగ్రహాలు, ఊదీ, ప్రసాదాలు తెచ్చి ఇచ్చాడు. బాబా ప్రేమకు నాకు చాలా సంతోషమేసింది. "ధన్యవాదాలు బాబా. ఇలాగే మాకు ఏ టెన్షన్ లేకుండా కాపాడు తండ్రి. మా పిల్లల బాగోగులు మీరే చూడండి బాబా".
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!
సాయి కృపతో సమసిపోయిన సమస్యలు
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి. 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుని నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారము. నా పేరు లలిత. మాది రాజాం. నేను ఇంతకుముందు ఒక అనుభవాన్ని ఈ 'సాయి మహారాజ్ సన్నిధి'లో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. నా తమ్ముడుకి తాగుడు అలవాటు ఉండేది. దానివలన వాడి ఆరోగ్యం చెడిపోయింది. అంతేకాదు తనకి తన భార్యకి మధ్య తరచూ గొడవలు వస్తుండేవి. అందువల్ల నేను, "బాబా! మీ దయతో నా తమ్ముడు తాగుడు అలవాటు మానేయాలి. భార్యభర్తల మధ్య గొడవలు లేకుండా ఉండాలి. ఇంకా తన ఆరోగ్యం కూడా బాగుండాలి" అని నా సాయిని వేడుకున్నాను. నిజంగా నా సాయి నాకు సహాయం చేసారు. తమ్ముడు ఇప్పుడు తాగుడు అలవాటు మానేసాడు. ఇంకా భార్యభర్తల మధ్య గొడవలు తగ్గి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. నా సాయికి శతకోటి వందనాలు.
మా చిన్నపాపకి నెలసరి సమస్య ఉండేది. తనకి ఇరవై రోజులకే నెలసరి వస్తుండేది. ఆ కారణంగా పాపకి చాలా నీరసంగా ఉండేది. ఇంకా నేను, "బాబా! పాపకి నెలసరి సక్రమంగా రావాలి" అని నా సాయిని వేడుకున్నాను. నా సాయి నాకు సహాయం చేసారు. పాపకి ఇప్పుడు నెలసరి సరైన సమయంలో వస్తుంది. సాయికి నా వందనాలు. "ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోను సాయి. మీ పాదాల యందు నిజమైన భక్తి కలిగి ఉండేలా నన్ను ఆశీర్వదించండి సాయి".
ఒకసారి నేను నా పిల్లల బట్టలు ఇస్త్రీ చేస్తుంటే హఠాత్తుగా ఇస్త్రీ పెట్టె పని చేయడం మానేసింది. మా ఇంట్లో వాళ్ళు ఏమంటారోనని నాకు చాలా భయమేసింది. అప్పుడు నేను నా సాయికి దణ్ణం పెట్టుకుని, కొంచం బాబా ఊదీ ఇస్త్రీ పెట్టెకి పెట్టాను. మరునాడు ఆ ఇస్త్రీ పెట్టె ఎప్పటిలానే పని చేసింది. ఇదంతా నా సాయి దయ. "సాయీ! మా పెద్ద పాప సమస్య మీకు చెప్పుకున్నాను. అది తీరితే, మళ్లీ నా అనుభవాన్ని తోటి సాయి భక్తులతో పంచుకుంటాను".
🙏ఓం సాయి రామ్ 🙏
ReplyDeleteJai sairam
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI ...OM SAI RAM
ReplyDeleteOmsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteBaba sab ka malik hi
ReplyDelete