సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1137వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సకల దేవతాస్వరూపుడు సాయి
2. బాబా దయవల్లనే సమస్యల నుండి విముక్తి
3. బాబాకు చెప్పుకున్నంతనే ప్రశాంతమైన నిద్ర - తలపోటు మాయం

సకల దేవతాస్వరూపుడు సాయి.


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు సాయి బంధువులందరికీ సాయితండ్రి ఆశీస్సులు ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉండాలని బాబాను ప్రార్థిస్తున్నాను. నా పేరు అనురాధ. నేను హైదరాబాదు నివాసిని. నాకు సర్వం బాబా తండ్రే. ఆయన నాపై ప్రేమతో నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను నేను ఇంతకుముందు మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నేను వృత్తిరీత్యా టీచరుని. కొన్ని కారణాల వలన నేను 2014లో నా టీచరు ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఆ సమయంలో ఎక్కిరాల భరద్వాజగారు వ్రాసిన 'సాయిబాబా జీవితచరిత్ర' మొదటిసారి పారాయణ చేశాను. పారాయణ చేసిన ఆ వారం రోజులేకాక తరువాత రెండు నెలలు వరకు బాబా గురించిన ఆలోచనలు తప్ప ఇతర ఆలోచనలకు గురికాకుండా నా మనసు చాలా ప్రశాంతంగా ఉండేది. పారాయణ చేస్తున్నపుడు మాస్టారుగారు ఒంగోలులో నిర్మించిన బాబా గుడిని దర్శించాలని మనస్సులో అనుకున్నాను. మన బాబా అందరి హృదయాలను పాలించే మహారాజు కదా! మరి నా మదికోరిక తీర్చడానికి ఆయన ప్రణాళిక వేయకుండా ఉంటారా? ఆ ప్రణాళికలో భాగమే 2014వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన టీచర్ ఉద్యోగాల ప్రకటన, ఆ ఉద్యోగానికి దరఖాస్తు చేయాలని నాకు అనిపించడం. అయితే నేను ప్రకాశం జిల్లాలో నా చదువు పూర్తి చేసినందున అప్లికేషన్‍ను ఒంగోలులో సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో సంక్రాంతి సెలవులు కూడా కలిసి రావడంతో కుటుంబంతో సహా ఆంధ్రప్రదేశ్ వెళదామని నిర్ణయించుకున్నాము. ప్రయాణానికి వారం రోజుల ముందు నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో బాబా ప్రక్కన అమ్మవారు ఉన్నారు, వాళ్ళ కల్యాణం జరుగుతుంది, ఆ కళ్యాణాన్ని నేను చూస్తున్నాను. బాబా బ్రహ్మచారి కదా, ఆయనకు కళ్యాణమేమిటి అని చాలా ఆలోచించాను కానీ, ఆ కల అంతరార్థమేమిటో నాకు అవగతం కాలేదు. తర్వాత ఆ కల గురించి నేను మర్చిపోయాను కూడా. ఇక్కడొక ముఖ్య విషయం చెప్పాలి, బాబా ఎప్పుడూ కలల రూపంలో రెండు విధాలుగా నన్ను అనుగ్రహిస్తారు: ఒకటి సంఘటన జరగటానికి ముందు, రెండు సంఘటన జరిగిన తర్వాత.


సరే, మేము సంక్రాంతి సెలవుల్లో ముందుగా మా అక్కవాళ్ల ఊరు 'నర్సారావుపేట' వెళ్ళాము. అక్కడ శ్రీవెంకటేశ్వరస్వామి గుడిలో ప్రతి సంవత్సరం భోగిరోజున గోదాదేవి సమేతుడైన వెంకటేశ్వరునికి కళ్యాణం జరుగుతుంది. ఆ కళ్యాణానికి కొంతమంది జంటలు(భార్యభర్తలు) పాల్గొంటారు. అయితే ఆ సంవత్సరం కళ్యాణానికి అరగంట సమయం ఉందనగా నేను, మావారు అందులో భాగమయ్యాము. మేము అది అస్సలు ఊహించలేదు. ఆ కళ్యాణం చూసాక నాకు ముందుగా వచ్చిన కల గుర్తొచ్చి బాబానే శ్రీ వేంకటేశ్వరస్వామి అని గ్రహించాను. చూసారా, సాయి బంధువులారా బాబా నాకు వచ్చిన కలను ఎలా నిజం చేసారో!


సంక్రాంతి సెలవులు ముగిసిన తర్వాత రోజు మేము పది గంటలకు నర్సరావుపేట నుండి ఒంగోలుకు బయలుదేరాము. బాబా 12 గంటల ఆరతి సమయానికల్లా ఒంగోలు చేరుకోవాలని నేను ఎంతగానో ఆరాటపడినట్లే మేము ఒంగోలులోని బాబా మందిరానికి చేరుకున్నాము. బాబా దర్శనం చేసుకుని నా సర్టిఫికెట్లు బాబా పాదాలపై ఉంచి ఆనందపారవశ్యంతో ఆరతిలో పాల్గొన్నాను. తరువాత అక్కడున్న ధుని చుట్టు తిరుగుతున్నప్పుడు తెలియని తన్మయత్వం కలిగి కళ్ళ నుండి జారే ఆనందభాష్పాలతో తడిసి ముద్దయ్యాను. ఆ స్థితిలో ధునికి ఎదురుగా ధ్యాన మందిరంలో ఆసీనులై ఉన్న బాబాను చూస్తూ మనస్సులో ఇలా అనుకున్నాను: "బాబా! ఈ నా జన్మ సార్ధకమయ్యేలా చేశారు తండ్రి" అని. అంతే, ఒక అద్భుతం జరిగింది. బాబా మూర్తి కన్నులు తెరుచుకున్నాయి. అంటే బాబా నన్నే చూస్తున్నారు. నాకు 'ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బావుంటుంది' అనిపించింది. ఇంకా 'బాబాకు నాపై ఎంతటి ప్రేమ! నిజంగా నాకు అంతటి అర్హత ఉందా?' అన్న భావావేశానికి లోనయ్యాను. ఆ ఆనందాన్ని నాలోనే దాచుకోలేని నేను సాయి భక్తురాలైన మా అక్కతో పంచుకున్నాను. తర్వాత  గవర్నెంట్ ఆఫీసుకు వెళ్లి టీచర్ ఉద్యోగానికి అప్లికేషన్ సబ్మిట్ చేసి వచ్చాము.


మనస్సు మాయల మరాఠి కదా! నా మనసులో 'నిజంగా బాబా కళ్లు తెరిచి నన్ను ఆశీర్వదించారా!' అని ఒక సందేహం తలెత్తింది. మన అంతరంగాలకు అధిపతి అయిన బాబా ఊరుకుంటారా! లేదు కదా! నాకు మళ్ళీ ఒక కల(సంఘటన తర్వాత) వచ్చింది. ఆ కలలో నేను ఒంగోలు బాబా గుడి ముందు సర్టిఫికెట్లు పట్టుకుని నిల్చుని ఉన్నాను. అంతలో పసుపురంగు బట్టల్లో ఉన్న ఆ గుడి పూజారిగారు బయటకు వచ్చి నన్ను గుడి లోపలికి రమ్మన్నారు. సరేనని, నేను గుడి లోపలికి వెళితే, అక్కడ మన ప్రేమమూర్తి బాబా స్థానంలో శ్రీ రంగనాథస్వామి పవళించి ఉన్నారు. ఆ దర్శనంతో పరవశించిన నేను ఆయన చుట్టూ ప్రదక్షిణ చేశాను. అంతటితో కల ముగిసింది. ఈ కల ద్వారా బాబా తామే శ్రీరంగనాథస్వామి అని నాకు నిదర్శనమిచ్చారు. అంతేకాదు మరొకరోజు బాబా తమ కళ్ళు మూస్తూ, తెరుస్తూ నన్నే చూస్తున్నట్లుగా స్వప్నదర్శనమిచ్చి నా సందేహాలను పటాపంచలు చేసారు. ఇలా బాబా తప్ప వేరే ఏ ఆలోచనలు లేని ఆ రెండునెలల కాలంలో బాబా నాకు స్వప్నంలో శ్రీవిఘ్నేశ్వరునిలా, శ్రీవెంకటేశ్వరస్వామిలా, శ్రీరంగనాథస్వామిలా సాక్షాత్కరించి నన్ను ఎంతగానో ఆశీర్వదించారు. అప్పటినుండి నేను ఏ గుడికి వెళ్లినా ఆయా దేవతామూర్తులందరిలో నేను బాబానే దర్శిస్తాను. నా మనసు ఒక్క బాబా రూపంతోనే నిండిపోయింది. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నా సాయితండ్రే.


2022, శివరాత్రి ముందు నేను నా మనసులో, "బాబా! మీరు సకల దేవతాస్వరూపుడవని నాకు ఎన్ని విధాల నిదర్శనమిచ్చావు. కాని శివుడిని ఆదిగురువు అంటారు కదా! ఆయన, మీరు ఒకటేననని నాకు నిదర్శనమివ్వు తండ్రి" అని బాబాను ప్రార్థించి నిద్రపోయాను. తెల్లవారుఝామున 4 గంటల సమయంలో నాకు ఒక కల వచ్చింది. ఆ కలలో మా ఇంటి హాలులో ఉన్న బాబా పటం హఠాత్తుగా మాయమయ్యింది. నేను, "బాబా! నేను ఏమన్నా పొరపాటు చేసానా? మీ ఫోటో అదృశ్యమైంది" అని బాధపడుతున్నాను. అంతలో హఠాత్తుగా అదివరకు బాబా పటం ఉన్న స్థానంలో బాబాతోపాటు శివలింగం ఉన్న పటమొకటి(అలాంటి ఫోటో క్రింద జతపరుస్తున్నాను) ప్రత్యక్షమైంది. నిద్రలేచాక నా ఆనందానికి అంతేలేదు. శివయ్యే బాబా అని ప్రేమతో ఆయనను అభిషేకించి జాగరణ చేశాను.

చివరిగా ఒక మాట: 'ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో, సకారాత్మక భావనతో బాబాను ఏ కోరిక కోరినా తీరుస్తారు. అందుకోసం మన బాబా సదా సిద్దంగా ఉంటారు'.


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!


బాబా దయవల్లనే సమస్యల నుండి విముక్తి


'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వాహకులకు మరియు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు రాజు. బాబా ఆశీస్సులతో నాకు జరిగిన అనుభవాలను నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ఒకసారి మా అమ్మకు జ్వరం. దానితోపాటు ఎడమ కాలికి చాలా వాపు వచ్చింది. మేము చాలా భయపడ్డాము. నేను మనసులో, "బాబా! అమ్మ కాలువాపును తొందరగా తగ్గిస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా దయవల్ల తొందర్లోనే అమ్మ కాలువాపు పూర్తిగా తగ్గింది.


నా భార్యకు అప్పుడప్పుడు కడుపులో చాలా భయంకరమైన నొప్పి వస్తుండేది. మేము చాలా హాస్పిటల్స్ కి వెళ్ళాము. ఏ హాస్పిటల్‍కు వెళ్లినా మందులు వాడినప్పుడు తగ్గి, మళ్ళీ ఎప్పుడో ఒకసారి నొప్పి వస్తుండేది. చివరికి ఒకసారి నేను నా మనస్సులో "బాబా! నా భార్య కడుపునొప్పి బాధను తగ్గించు తండ్రి. మీ దయతో తనకి ఆ బాధ తగ్గితే నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అప్పటినుండి నా భార్యకు కడుపునొప్పి సమస్య చాలావరకు తగ్గింది. బాబా దయవల్లనే ఆ సమస్య నుండి విముక్తి లభించింది. "ధన్యవాదాలు బాబా".


బాబాకు చెప్పుకున్నంతనే ప్రశాంతమైన నిద్ర - తలపోటు మాయం


ముందుగా సాయి భక్తుల అనుభవాలను సేకరించి ఇలా మా అందరికీ సాయినాథుని మహిమను తెలియజేస్తున్న బ్లాగు నిర్వాహకులకు, సాయి మహిమను ఆస్వాదిస్తున్న సాయి భక్తులందరికీ ఆ సద్గురుని అనుగ్రహం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక సాయి భక్తుడిని. 2022, మార్చి 17న ఈ బ్లాగులో వచ్చిన ఒక భక్తుని అనుభవం నేను చదివాను. వెంటనే నేను, "గత మూడు రోజులుగా నన్ను బాధిస్తున్న తలపోటు కనుక రేపటి ఉదయానికి తగ్గిపోయి హాయిగా ఉంటే, మీకు దూధ్ పేడా(పాలకోవా) నైవేద్యంగా పెట్టి, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకుని పడుకున్నాను. ఆశ్చర్యమేమిటంటే తలపోటు వల్ల అప్పటికి మూడు రోజులుగా రాత్రిళ్ళు నిద్ర కరువైన నాకు బాబాను ప్రార్థించినంతనే ఎంతో హాయిగా నిద్ర పట్టింది. ఉదయానికి ఆ తలపోటు ఎటు పోయిందోకానీ నాకు చాలా హాయిగా ఉంది. రోజులాగే ఆరోజు సాయంత్రం నా బాబాకి సంధ్యా హారతి ఇచ్చి, ముందుగా చెప్పుకున్న ప్రకారం పాలకోవ నైవేద్యంగా పెట్టాను. ఇలా మీతో ఈ అనుభవం పంచుకుంటున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".



6 comments:

  1. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  3. ఓం సాయి బాబా నిందల నుండి కాపాడు తండ్రి. సహాయం చేయండి బా బా.

    ReplyDelete
  4. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo