సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1141వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సాయినాథుడు నాపై వర్షించిన అనుగ్రహం
2. శిరిడీకి రప్పించుకుని గొడవలు లేకుండా అనుగ్రహించిన బాబా

సాయినాథుడు నాపై వర్షించిన అనుగ్రహం


నా పేరు రత్నాజీ. నేను సాయి లీలామృతంలో ఉన్న 'ఈ బుక్ చదివితే, ఏదో ఒక రూపంలో బాబా తప్పక వస్తారు' అన్న మాటను పూర్తిగా విశ్వసించి ఒక్క రోజులో ఆ పుస్తకాన్ని చదివి, "రండి బాబా" అని మనస్ఫూర్తిగా బాబాను ఆహ్వానించాను. మర్నాడు ఉదయం నేను అమ్మతో, "అమ్మా! ఇవాళ బాబా వస్తారు. అన్నం పెట్టు" అని చెప్పి కాలేజీకి వెళ్ళిపోయాను. అద్భుతం జరిగింది. నేను సాయంత్రం కాలేజీ నుంచి వచ్చాక అమ్మ నాతో, "ఎవరో ఒకాయన వచ్చి మన ఇంట్లో అద్దెకున్న వేణిగారిని, 'భోజనం పెట్టమ'ని అడుగుతుంటే, ఆవిడ, 'ఏమీ లేద'ని అన్నారు. నేను ఆయన్ని 'రండి' అని పిలిచి పీటవేసి కూర్చోమన్నాను. అప్పుడాయన, "యజమాని ఏరి, ఆయన కూడా నాతోపాటు తినాలి" అన్నారు. తరువాత నాన్నని తమ పక్కన కూర్చుండబెట్టుకుని వంటగదిలోకి వచ్చి అడిగిమరీ బూరెలు మొదలైనవన్నీ వేయించుకుని తిని వెళ్లారు" అని చెప్పింది. అదంతా విన్నాక బాబా మాపై చూపిన ప్రేమకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలననిపించింది. పరీక్షగా వస్తారో, రారో అనికాకుండా వస్తారని నమ్మి పిలిచినందుకు ఆయన వచ్చి మమ్మల్ని ఇంతలా అనుగ్రహించారు. అలాంటి నమ్మకమే మనకు బాబా మీద ఉండాలి. ఏదైనా బాబాకు బాధ్యత అప్పగించి మనం ముందుకెళ్ళాలి. అప్పుడు అంతా ఆయన చూసుకుంటారు.


2015లో ఒకసారి, 2018లో ఒకసారి ఆగిపోయిన నాకు రావలసిన ప్రమోషన్లను ఒకే సంవత్సరంలో వచ్చేలా చేసి కొత్త పి.ఆర్.సిలో హైక్ ఇప్పించారు బాబా. నేను ముక్కుసూటి మనిషిని, నాకు ఆత్మాభిమానం ఎక్కువ. అవే నాకు ప్రమోషన్ ఆలస్యంగా రావడానికి కారణం. మొదట ఇద్దరు ఆఫీసర్లు కాన్ఫిడెన్సియల్ రిపోర్టులో నా గురించి లేనివి వ్రాయడం వల్ల రెండుసార్లు ప్రమోషన్ ఆగిపోయింది. ఇక తరువాత అసలు కథ మొదలైంది. 2020లో పాత ఆఫీసర్ వెళ్ళిపోగా కొత్త ఆఫీసర్ బాబా ఫోటోతో ఎంట్రీ ఇచ్చారు, ఆఫీసులో నా సీటు పక్కన ఉన్న అలమరాలో 'సాయి లీలామృతం' పుస్తకం నాకు దొరికింది, నేను, మా ఆఫీసర్ బాబా కబుర్లు చెప్పుకునేవాళ్ళము. ఇంకేముంది మళ్ళీ ప్రమోషన్స్ సమయం రావడం, మా ఆఫీసర్ నా గురించి మంచిగా వ్రాయడం, ఆగిపోయిన రెండు ప్రమోషన్లు ఒకే సంవత్సరంలో రావడం జరిగాయి. అంతా బాబా దయ. ప్రమోషన్ ఆలస్యమయ్యే క్రమంలో బాబా నాకు సహనం, ఓర్పు మొదలైనవి నేర్పి చివరికి అద్భుత ఫలితాన్ని అనుగ్రహించారు. ఏ ఎండకి ఆ గొడుగులా, ఏ సమయానికి ఏమి ఇవ్వాలో అవి ఇస్తూ ఉద్యోగంలో ప్రమోషన్ తోపాటు వ్యక్తిగత జీవితంలో ప్రమోట్ చేస్తున్నారు. ఈ మాట చెప్పడానికి కారణం నా భార్య ఇప్పుడు ఎనిమిది నెలల గర్భవతి. సాయిని నమ్మితే ఇలా ఉంటుంది.


బాబా ప్రేమతో నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్‍లో మా ఇంట్లో అందరికీ కోవిడ్ వచ్చినా ఇలా వచ్చి అలా వెళ్లిపోయినట్లు కేవలం మూడు రోజుల్లో తగ్గిపోయింది. తరువాత కరోనా మూడో వేవ్‍లో నా భార్య మూడు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు తనని చూడటానికి మా బావవాళ్ళు తమ కుటుంబంతో మా ఇంటికి వచ్చారు. మేమెవరమూ మాస్కులు పెట్టుకోలేదు. అందరం కలిసి భోజనాలు చేసాము. వాళ్ళు హైదరాబాద్ తిరిగి వెళ్ళాక మా బావ ఫోన్ చేసి, "బావ! మా కుటుంబంలో అందరికీ కోవిడ్ వచ్చింది. తను గర్భవతి కదా, జాగ్రత్త! అందరూ టెస్టు చేయించుకోండి" అని చెప్పారు. అయితే ఇంట్లో ఎవరికీ ఏ లక్షణాలు లేవు కాబట్టి భయపడనక్కరలేదని మా ఫ్యామిలీ డాక్టర్ చెప్పారు. ఏడు రోజుల తరువాత టెస్టు చేయించుకుంటే ఏమీ లేదని వచ్చింది. మమ్మల్ని కాపాడింది బాబాకాక ఇంకెవరు? "మీకు శతకోటి కృతజ్ఞతలు బాబా".


నేను పూర్వం ఉద్యోగం లేని సమయంలో బాబా హారతులకి వెళుతూ ఎన్నో సమస్యలను పరిష్కరించుకున్నాను. అప్పట్లో నేను, "సాయీ! నాకు ఉద్యోగం కావాలి. జీతం రావాలి. కానీ పని ఉండకూడదు, ఖాళీగా ఉండాలి. నేను ఒక వైపు ఆ ఉద్యోగం చేసుకుంటూ మరోవైపు సంతోషంగా మీ హారతులకు హాజరవ్వాలి" అని బాబాను కోరుకున్నాను. అదే తప్పు! ఎందుకిలా అంటున్నానంటే, బాబా నేను కోరుకున్న ఉద్యోగమే నాకు ఇచ్చారు. కానీ రోజంతా ఖాళీగా ఉంటున్నా, గుడి పక్కనే ఉన్నా నేను ఇప్పుడు ఆరతులకు వెళ్ళలేకపోతున్నాను. ఖాళీగా కూర్చున్న ఈ సమయంలో నాకు ఎంత బుద్ధి రావాలో, ఎంత సంస్కరించాలో అంతా చేసి సోమరితనం కూడదని నాకు అనుభవపూర్వకంగా తెలియజేసారు బాబా. కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాబాని ప్రార్థించాలి. ఆయనను అడిగేవి మంచిగా అడగాలి, పనిని ప్రేమించాలి, ఫలితం పొందాలి. కలికాలంలో ఖాళీగా ఉంటూ దేవునిపై దృష్టి పెట్టలేం కనుక ఏదో ఒక పని చేసుకుంటూ బాబాని ప్రేమిస్తూ ఉండాలి. "క్షమించండి బాబా. పనిని ప్రేమిస్తూ మిమ్మల్ని తలుచుకోవాలని నాకు బుద్ది వచ్చింది. నా తప్పుని మన్నించి మనసుపెట్టి పని చేసుకుంటూ కుదిరినంతలో మీ అరతులకు హాజరయ్యేలా అనుగ్రహించండి. ఉద్యోగంలో నాకు తోడుగా ఉండి, నలుగురిలో మంచి పేరు తెచ్చుకునేలా నన్ను నడిపించండి. నన్ను, నా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడండి బాబా. మీ దయతో నా భార్యకి సుఖ ప్రసవమవ్వాలి. ఏ బిడ్డను అనుగ్రహించినా అది మీ దయ, ఇష్టం. తల్లి, బిడ్డ సంతోషంగా ఉండేలా ఆశీర్వదించి మా కుటుంబమంతటిని మీ దర్శనం కోసం శిరిడీకి రప్పించుకోండి బాబా. బిడ్డ పుట్టాక, ప్రమోషన్ మీద వచ్చిన కొత్త పదవిని చక్కగా నిర్వర్తించాక మళ్ళీ ఈ బ్లాగులో నా అనుభవం పంచుకునే అవకాశం నాకు ఇవ్వండి బాబా. మీరే మా బలం. మీ చల్లనిచూపుతో మేము మా జీవితాలలో ముందుకెళ్లాలి తండ్రి. మేమందరము ఆజన్మాంతం మీకు ఋణపడి ఉంటాము బాబా".


రక్షమాం పాహిమాం!!!


శిరిడీకి రప్పించుకుని గొడవలు లేకుండా అనుగ్రహించిన బాబా


నా పేరు మల్లేశ్వరి. నేను 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే మన బాబా భక్తురాలిని. నేను ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునేవరకు 'బాబా నీదే భారం నాయనా' అని మనసులో అనుకుంటూనే ఉంటాను. మాది కర్ణాటకలో ఒక గ్రామం. మాది వ్యవసాయ కుంటుంబం. మా నాన్నగారికి ఉన్న ఐదు ఎకరాల భూమిలో మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. ఒకప్పుడు మా ఊరిలో గొడవలు జరిగి మా చేనుకు దారి లేదన్నారు. మా నాన్నగారు చాలా దిగులు చెంది బాధపడుతుండేవారు. ఎప్పుడో ఒకప్పుడు మనం చేసుకున్న కొన్ని కర్మల ఫలాలను కొంతైనా మనం అనుభవించాలి కదా! ఆ సమయంలో మా ఊరిలోని పది ఇల్లవాళ్ళు, "అందరం కలిసి శిరిడీ వెళదాం. మీరు వస్తారా?" అని అడిగారు  "నేను రాను, ఊర్లో గొడవల వల్ల అందరు పోలీస్ స్టేషన్‍కు వెళ్లారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను" అని చెప్పాను. అప్పుడు వాళ్ళందరూ, "సరే, మీ పొలంలో విత్తనాలు నాటిన తరువాత వస్తావా?" అని అన్నారు. నేను మావారిని అడిగి చెప్తానని అన్నాను. తరువాత మా వారిని అడిగితే, "విత్తనాలు నాటాక వెళ్ళు" అని అన్నారు. ఆ మరుసటిరోజే మా చేనులో విత్తనాలు నాటారు. నేను సంతోషంగా శిరిడీ వెళ్ళొచ్చాను. అంతే, బాబా దయవల్ల తరువాత ఊర్లో ఏ గొడవలు లేక అందరమూ బాగున్నాము. ఇది జరిగి 16 సంవత్సరాలు అవుతుంది. ఆవిధంగా సాయి అంటే అంతగా తెలియని ఆరోజుల్లోనే బాబా నన్ను శిరిడీకి రప్పించుకున్నారు. అప్పటినుండి నేను శ్రీసాయి సచ్చరిత్ర పారాయణ చేస్తున్నాను. ఇప్పుడు ఈ బ్లాగు ద్వారా బాబాకు మరింత దగ్గరయ్యాను. ఈ బ్లాగును అనుగ్రహించిన బాబాకు నా పాదాభివందనాలు. ఈ బ్లాగును ఇంత బాగా నడిపిస్తున్న సాయి బంధువులందరికీ వందనాలు. ఇందులో మన ప్రతి కష్టాన్ని, బాబా మనపై చూపిన అనుగ్రహాన్ని చెప్పుకోవచ్చు. "బాబా! కొందరి మనసులను మార్చు నాయన. సమస్యను మీకు ఎట్లా చెప్పాలో అర్థం కావడం లేదు సాయితండ్రి. కానీ మీకు అన్నీ తెలుసు. ఎందుకంటే, నేను ప్రతిరోజు మీకు చెబుతూనే ఉంటాను కదా. మా కుటుంబంలో అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఎందుకో మనశ్శాంతి లేదు. అది కూడా మావారి వల్లనే ఎక్కువగా. అలాగని ఆయన చెడ్డవారేం కాదు. ఆయనకి ఏ అలవాట్లు లేవు. మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు. కాకపోతే నోరు కొద్దిగా మంచిది కాదు అంతే. బాబా మీరు పంది గురించి చెప్పారుగా అట్లా ఉంటుంది ఆయన ప్రవర్తన. అందరిలో చెడుని చూస్తారు. అది నాకు చాలా బాధగా ఉంది. ఈ బ్లాగులో పంచుకుంటే మీతోనే చెప్పుకున్నట్లని నా బాధను ఇలా చెప్పుకున్నాను బాబా. మా అమ్మాయి పెళ్ళి కుదిర్చి మావారిలో మార్పు తీసుకుని రావాలని కోరుకుంటున్నాను సాయినాథా. అలా చేసి నాకు మనశ్శాంతిని ప్రసాదించు బాబా. అందరినీ శ్రద్ధ, సబూరితో ఉండేటట్లు అనుగ్రహించు నాయన".



7 comments:

  1. Om Sai Ram 🪔🙏🪔

    ReplyDelete
  2. Jaisairam bless amma for her eye operation recovery and bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  6. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  7. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo