సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1134వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కరుణ
2. ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిరిడీయాత్రను పూర్తి చేయించిన బాబా
3. కోరుకున్నవి అనుగ్రహించిన బాబా

బాబా కరుణ


శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కి జై!!


నా పేరు దేవి. నాకు ఏ కష్టమొచ్చినా బ్లాగులో పంచుకుంటానని మనసులో అనుకుని ఒక కాగితం మీద వ్రాసి సచ్చరిత్రలో పెట్టుకుంటాను. వెంటనే బాబా నా కోరిక తీరుస్తారు. నేను ఇదివరకు చాలాసార్లు నా అనుభవాలు పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఆమధ్య మా అమ్మానాన్నలకి కరోనా వచ్చినప్పుడు వాళ్ల దగ్గర ఎవరైనా ఉండే పరిస్థితి లేకపోయింది. అప్పుడు నేను బాబా, గురువుగారి(శ్రీసాయినాథుని శరత్ బాబూజీ) ఫోటో దగ్గర, "మీరు తప్ప అమ్మానాన్నలను కాపాడే వారెవరూ లేరు" అని బాధపడ్డాను. కొద్దిపాటి జ్వరం తప్ప ఇంకా ఏ ఇబ్బంది కలగకుండా అమ్మానాన్నలను కరోనా నుండి బాబా, గురువుగారు కాపాడారు


ఒకసారి నాకు స్పాండియాలసిస్ సమస్య ఉందేమోనని డాక్టరు ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోమని అన్నారు. కానీ నాకు ఎంఆర్ఐ అంటే చాలా భయం. అందువల్ల ఐదుగురు డాక్టర్లను సంప్రదించానుగాని చివరికి ఎంఆర్ఐ చేయించుకోక తప్పలేదు. కానీ ఎంఆర్ఐ స్కాన్ చేసే యంత్రంలోకి వెళ్ళాక నేను భయపడి గోలగోల చేసి బయటకు వచ్చేసాను. తరువాత ఒక గురువారంనాడు సచ్చరిత్ర రెండు అధ్యాయాలు చదివిన మీదట ఎంఆర్ఐ చేసే యంత్రంలోకి వెళ్ళాను. ఈసారి ఎంఆర్ఐ చేయించుకుని బయటకు వచ్చాను. ఇది బాబా, గురువుగారికి నా మీద ఉన్న కరుణ.


ఒకరోజు మా అక్కకి ఈ అనుభవాలు చెప్పి 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు గురించి చెప్పాను. అప్పుడు అక్క అప్పటికే పెళ్లి కుదిరిన తన కొడుకు పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగితే బ్లాగులో పంచుకుంటానని నాతో చెప్పింది. బాబా దయవల్ల పెళ్లి చాలా బాగా జరిగింది. ఇలా బాబా మా కుటుంబంలోని అందరినీ చల్లగా చూస్తున్నారు. బాబా, గురువుగారి కరుణకి ప్రణామాలు. "మా అబ్బాయి రాహుల్‍కి భుజం దగ్గర బోన్ పెరిగిందని ఆపరేషన్ చేయాలంటున్నారు బాబా. అయితే డాక్టరు డేట్స్ లేవు అంటూ ఏరోజుకారోజు ఆలస్యం చేస్తున్నారు బాబా. దయచేసి మంచి డాక్టరు చేతుల మీదగా ఆపరేషన్ తొందరగా అయ్యేలా అనుగ్రహించండి బాబా".


ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిరిడీయాత్రను పూర్తి చేయించిన బాబా


సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!! నా పేరు శ్రీకాంత్. ఆ సాయినాథుని కృపాకటాక్షాలు మనపై ఉంటే ఎంతటి కష్టమైనా, ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోవడం ఖాయమని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఆ అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. నేను మా నూతన గృహప్రవేశం చేసుకున్న తర్వాత "కుటుంబంతో సహా తప్పనిసరిగా శిరిడీ వస్తాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అయితే కొన్ని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాల వలన శిరిడీయాత్రను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అలా చాలారోజులు గడిచిపోయాయి. చివరికి ఒక గురువారంనాడు నేను బాబా మందిరానికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని, "ఈ సంవత్సరం ఎలాగైనా శిరిడీయాత్ర చేసే అదృష్టాన్ని ప్రసాదించమ"ని బాబాను వేడుకున్నాను. వెంటనే బాబా దయ చూపారు. అనుకోకుండా అదేరోజు 2022, మార్చి 12, 13 తేదీలలో శిరిడీ వెళ్లాలని నిర్ణయించుకుని సాయంకాలం ఇంటర్నెట్ సెంటర్‍కు వెళ్లి శిరిడీయాత్రకు ట్రైన్ టికెట్లు బుక్ చేసాను. అయితే రానూపోనూ వెయిటింగ్ లిస్టు వచ్చాయి. అదీకాక నా కూతురుకి 2వ తేదీనే రావలసిన నెలసరి 11వ తేదీ వచ్చినా రాలేదు. అలా నాలో తెలియకుండానే ఆందోళన మొదలై, ఆ సాయినాథుని ముందు కూర్చొని, "బాబా! మా శిరిడీయాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరిగేలా చూడండి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మొక్కుకున్నాను. ఆ సాయినాథుని కృపవల్ల నాకు పరిచయస్తులైన ఒకరి ద్వారా వెయిటింగ్ లిస్టు ఉన్న మా టికెట్లు కన్ఫర్మ్ అయ్యాయి. ఆ సమాచారం తెలిసి నా ఆనందానికి హద్దులు లేవు, ఇక మిగిలిన నా కూతురు నెలసరి సమస్య విషయంలో "మా దర్శనం పూర్తయ్యేంతవరకు పాపకి నెలసరి రాకుండా ఉండాల"ని బాబాకు మొక్కుకుని సాయినాథుని దర్శనానికి కుటుంబమంతా బయలుదేరాము. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ సాయినాథుని దర్శనం మాకు కలిగింది. విచిత్రం ఏమిటంటే, దర్శనాంతరం మా గదికి వచ్చాక నా కూతురుకి నెలసరి వచ్చింది. 'నా చెడు ఆలోచనలను రూపుమాపి, నావల్ల ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులుపడ్డ నా భార్యకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని, నా కూతురు, కొడుకులకు మంచి విద్యాబుద్ధులు ప్రసాదించమని, అలాగే ప్రతి సంవత్సరం తమ దర్శన భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని' ఆ సాయినాథుని వేడుకుని సాష్టాంగ నమస్కారాలు సమర్పించుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చాము. అలా ఆ సాయినాథుని కృపాకటాక్షాల వల్ల మా శిరిడీయాత్ర సంపూర్ణమైంది. ధన్యవాదాలు బాబా.


కోరుకున్నవి అనుగ్రహించిన బాబా


ముందుగా సాయి భక్తులకు, ఈ బ్లాగు నిర్వాహకులకు నా హృదయపూర్వక వందనాలు. నేను ఒక సాయి భక్తురాలిని. మనమంతా సాయి భక్తులమవ్వడం మన పూర్వజన్మ సుకృతం. నేను ప్రతిరోజూ ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదువుతుంటాను. బాబా దయవల్ల ఈమధ్య మా చిన్నమ్మాయివాళ్ళు తాము తీసుకున్న కొత్త ఇంటి గృహప్రవేశం చేసుకుని ఆ ఇంటిలోకి మారారు. నేను నా గత అనుభవంలో బాబాను, "మా పెద్దమ్మాయివాళ్ళు యు.కే. నుండి ఇండియాకి ప్రయాణమవబోతుండగా రెండు రోజుల ముందు కరోనా టెస్టు చేయించుకుంటే, వాళ్ళకి కరోనా పాజిటివ్ వచ్చిందని, మీ కృపవలన వాళ్ళు క్షేమంగా ఇండియా వచ్చినట్లయితే నా సంతోషాన్ని మళ్ళీ తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని వేడుకున్నాను. ఆ తండ్రి దయవలన వాళ్ళు క్షేమంగా ఇండియాకి వచ్చారు. తరువాత నాకు కోవిడ్ వచ్చింది. అప్పుడు నేను, "బాబా! ఇంట్లో ఇంకెవరికీ కోవిడ్ రాకుండా ఉండాలి. అదే జరిగితే నా అనుభవాన్ని అందరితో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. బాబా కృపవలన ఇంట్లో ఎవరికీ కోవిడ్ రాలేదు, నాకు కూడా చాలా తేలికగా కరోనా తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా. అంతా మీ దయ తండ్రి. ఇంత ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నందుకు, ఇంకా ఏవైనా మర్చిపోయినా నన్ను క్షమించండి బాబా".



4 comments:

  1. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete
  4. ఎందుకు చింతిస్తావు? మీ అమ్మాయి భాగ్యశాలి. గొప్ప ధనవంతురాలవుతుంది. ఆమెను వెతుక్కుంటూ వరుడు స్వయంగా మీ ఇంటికి వస్తాడు. నా మాట ప్రకారం మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాడు.'

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo