సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1131వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఉన్నారు - ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు
2. అమ్మ తుది కార్యక్రమాలకు ఏ ఆటంకాలు లేకుండా అనుగ్రహించిన బాబా

బాబా ఉన్నారు - ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు

ఓంసాయి శ్రీసాయి జయజయసాయి!!! సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు లక్ష్మి. నేను సాధారణ సాయిభక్తురాలిని. సాయిబాబా నాకు ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. అవి మాటల్లో చెప్పలేను. నేను ఇంతకుముందెప్పుడూ నా అనుభవాలను పంచుకోలేదు. ఇప్పుడే మొదటిసారి నా అనుభవాలు కొన్ని మీతో పంచుకోబోతున్నాను. 2020వ సంవత్సరం అక్టోబర్ 29వ తేదీ ఉదయం మా బాబు నిద్రలేవగానే తనకి రక్తవిరోచనం అయిందని అన్నాడు. అంతకుముందే మావారు రెండు రోజులుగా తన కాలు నొప్పిగా ఉందని, ఆరోజు నొప్పి ఇంకా ఎక్కువైందని అన్నారు. అందుకే బాబు రక్తవిరోచనం అనేసరికి మేము అందరమూ భయపడిపోయాము. నేను, 'ఏమిటి ఇలా జరుగుతోంది?' అని అనుకున్నాను. వెంటనే మావారు, బాబు దగ్గరలో ఉన్న సిటీకి వెళ్లి హాస్పిటల్లో చూపించుకున్నారు. డాక్టరు మావారికి 'సయాటికా' నొప్పి అని చెప్పి, నొప్పి తగ్గటానికి మందులిచ్చారు. అలాగే, విరేచనాలు తగ్గడానికి మా బాబుకి మందులిచ్చారు. అయినా బాబుకి విరేచనాలు తగ్గలేదు. ఇంకా, అదేరోజు సాయంత్రం మా పాప తన కడుపులో నొప్పిగా ఉందని చెప్పి బాధపడసాగింది. ముగ్గురికీ ఒకేసారి అలా అనారోగ్య సమస్యలు తలెత్తడంతో నేను ఎంత బాధపడ్డానో అ దేవుడికే తెలుసు. సరే, పాపను వెంటనే హాస్పిటల్‍కి తీసుకుని వెళ్తే, అక్కడ డాక్టరు స్కానింగ్ చేయించమన్నారు. అప్పుడు నేను, "బాబా! స్కానింగ్ రిపోర్టులో సమస్యేమీ లేదని వస్తే, నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాన"ని నా సాయికి ఎన్నిసార్లు మ్రొక్కుకున్నానో నాకే తెలియదు. నా సాయి దయవల్ల డాక్టరు "రిపోర్టులో ఏ సమస్యా లేదని వచ్చింది. అంతా బాగుంది. సరిగ్గా జీర్ణంకాక నొప్పి వచ్చింది" అని చెప్పి మందులు ఇచ్చి పంపించారు. అప్పుడు నా సంతోషం మాటలలో చెప్పలేను.

ఇకపోతే, "బాబుకి రక్తవిరేచనాలు, మావారి కాలునొప్పి తగ్గితే బ్లాగులో పంచుకుంటాను" అని సాయిని వేడుకున్నాను. అయినా బాబుకి మరునాడు కూడా రక్తవిరేచనాలు అయ్యాయి. నాకు ఎంతో భయమేసింది. కానీ, ఏమీ చేయలేక ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాను. ఆ మరుసటిరోజు బాబు నిద్రలేవడానికి ముందు నేను బాబాతో, "బాబా! బాబు నిద్రలేచి టాయిలెట్‍కి వెళ్తాడు. తను, 'రక్తవిరేచనం కాలేదు, నాకు తగ్గిపోయిందమ్మా' అని చెప్పాలి. అలా చెపితే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకుని నా పనులు నేను చేసుకుంటున్నాను. కాసేపటికే బాబు లేచాడు. బాత్‌రూంకి వెళ్ళి ఏం చెబుతాడోనని ఒకటే టెన్షన్‍తో నాకు కాళ్ళుచేతులు ఆడలేదు. వెంటనే బాబు వచ్చి, "అమ్మా! విరోచనాలు తగ్గాయి. ఇప్పుడు నాకు బాగానే ఉంది" అని చెప్పేసరికి నేను ఎంతో ఆనందపడిపోయాను. "బాబా! నువ్వు ఉన్నావు. మీరే నా బిడ్డను కాపాడారు తండ్రీ" అని చెప్పుకుని మనసులో ఎన్నోసార్లు నా సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. కానీ నా అనుభవాన్ని ఎలా చెప్పాలో, ఎలా వ్రాయాలో, ఎలా పంపించాలో తెలియక ఇప్పటివరకు 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకోలేకపోయాను. చివరికి ఇప్పుడిలా బాబా నాచేత నా అనుభవాన్ని వ్రాయించారు. అంతా బాబా దయ. బాబా దయలేనిదే ఏమీ జరగదు.

ఈమధ్యకాలంలో నేను గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నాను. అది కూడా గురువారంనాడే. ఆపరేషన్‍కి ముందు నేను, "బాబా! నువ్వు ఉన్నావు. మీ దయవలన ఆపరేషన్ బాగా జరిగితే, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని మనసులోనే ఎన్నోసార్లు సాయినాథునికి చెప్పుకున్నాను. ఆ తండ్రి దయవలన నాకు నొప్పి అన్నదే తెలియకుండా ఆపరేషన్ బాగా జరిగింది. అయితే, వారంరోజుల తరువాత ఇంటికి వచ్చిన నేను తెలియక బి.పి టాబ్లెట్లు రోజుకి రెండు వేసుకునేదాన్ని. ఒక బి.పి. టాబ్లెట్ నేను అదివరకే వాడుతున్నది కాగా, కొత్తగా ఆపరేషన్ తరువాత డాక్టరు వ్రాసిన బి.పి టాబ్లెట్ మరొకటి. కొత్తగా డాక్టరు వ్రాసిన టాబ్లెట్లలో బి.పి. టాబ్లెట్ ఉన్న విషయం నాకు తెలియక రోజుకు రెండేసి బి.పి టాబ్లెట్లు చొప్పున 12  రోజులు వేసేసుకున్నాను. దాంతో నాకు నిద్రపట్టేది కాదు. ఏమిటి, నిద్రపట్టడం లేదని, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని జపించాను. కానీ ఎన్నిసార్లు ఆ నామాన్ని పఠించినా నాకు నిద్ర వచ్చేది కాదు. దాంతో మా నాన్నగారు డాక్టరు దగ్గరకు వెళ్ళి, 'ఇవి ఏ మందులు?' అని అడిగితే, ఆయన 'బి.పి టాబ్లెట్లు' అని చెప్పారు. ఇక అప్పుడు నేను, "బాబా! నాకు నిద్రను ప్రసాదించండి. ఈ రాత్రి నాకు నిద్రపడితే నా అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి'లో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అంతే, నా తండ్రి బాబా నా కోరికను మన్నించి నాకు నిద్రను ప్రసాదించారు. ఇంకా ఇలాగే ఎన్నో అనుభవాలు ప్రసాదించారు బాబా. ఎన్నని చెప్పను? సాయిబాబా లేనిదే మనం లేము.

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సర్వేజనాః సుఖినోభవంతు!!!

అమ్మ తుది కార్యక్రమాలకు ఏ ఆటంకాలు లేకుండా అనుగ్రహించిన బాబా

శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!! నేనొక సాయిభక్తురాలిని. 2022, ఫిబ్రవరి 25న దురదృష్టవశాత్తు నా తల్లి మరణించారు. ఆమెకు 80 ఏళ్ళ వయసులో ఊహించని సర్జరీ జరిగింది. రెండురోజుల్లో కోలుకుని ఇంటికి వస్తారని ఆశించిన ఆమె తీవ్రమైన జ్వరంతో రెండు వారాలు ఐ.సి.యులో ఉండి మరణించారు. ఆమె దశదిన కర్మలు మొదలైన మూడవరోజున మా బాబాయి భార్య (మా అమ్మ తోటికోడలు) ఐ.సి.యులో ఉన్నారనీ, ఆమె పరిస్థితి విషమంగా ఉందనీ వార్త వచ్చింది. నాకు చాలా బాధేసింది. అందుకు కారణం - ఆమె ఆరోగ్యం కూడా బాగాలేదనేది ఒకటైతే, ఆమెకు ఏదైనా జరిగితే అమ్మ కార్యక్రమాలు నిలిచిపోతాయని పెద్దవాళ్ళు అనడం మరొకటి. నేను వెంటనే ఆ సాయినాథుని శరణువేడి, "అమ్మ కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం రాకుండా 13 రోజులు పూర్తయి అమ్మ ఆత్మకు శాంతి చేకూరాల"ని బాబాను వేడుకున్నాను. బాబా నా బాధను అర్థం చేసుకున్నారు. కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా చూశారు. బాబా కృపవలన మేము మా అమ్మకు తృప్తిగా అన్నీ జరిపించామని సంతోషించాము. ఈ విధంగా మా అమ్మ విషయం ఈ బ్లాగులో తెలియచేసి బాబాకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన బ్లాగ్ నిర్వాహకులకు నా ధన్యవాదాలు. ఇకపోతే, బాబా దయవలన మా పిన్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చారు. ఆమె ఆరోగ్యంగా ఉండాలని బాబాను కోరుకుంటున్నాను.


5 comments:

  1. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  2. 🙏ఓం సాయి రామ్ 🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి.. అనేక సార్లు గొప్ప గొప్ప మహిమలను మాకు దివ్యంగా చూపినందుకు మీకు కృతజ్ఞతలు ధన్యవాదములు సాయిరాం.. సాయి దేవా మమ్ములను ఆశీర్వదించి రక్షించు.. మేము మీ దివ్యమైన ఓంసాయిరాం.. సాయి సాయి అన్న నామస్మరణ తో మీరు కరుణించి ఎంతటి కష్టాలలో ఉన్న మమ్మల్ని కాపాడి బయటపడేస్తారని మా నమ్మకం.. ప్రతిరోజు మీ పాదాలపై మాకు మరింత శ్రద్ధ భక్తులు పెరిగే విధంగా మమ్ములను ఆశీర్వదించండి శ్రీ షిరిడీ సాయి దేవా...

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo