ఈ భాగంలో అనుభవాలు:
- నామసప్తాహంతో ఆరోగ్య సమస్యని తొలగించిన బాబా
- మెడనొప్పి నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
నామసప్తాహంతో ఆరోగ్య సమస్యని తొలగించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్సుమాంజలి. నా పేరు శివకుమార్. తాత్యాతో బాబా, "నీది నాది జన్మజన్మల అనుబంధం" అని అన్నారు. బహుశా నాకు కూడా బాబాతో ఏదో జన్మలో బంధం ఉండి ఉంటుంది. అందుకే, 'దేవుడు నిజంగా ఉన్నాడా?' అంటూ వితండవాదం చేసే నన్ను బాబా తనవాడిగా చేసుకున్నారు. బాబా ఎప్పుడూ నా వెంట ఉంటారు. నా జీవితంలో ప్రతిరోజు ఆయనతో ముడిపడి ఉంది. బాబా, "నాపై పూర్తి విశ్వాసముంచు, నీ కోరిక నెరవేరుతుంది" అని అన్నారు. అలాంటి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.
చాలా ఏళ్ళ క్రితం తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, చెల్లూరి గ్రామంలో జరిగింది ఈ అనుభవం. నాకు సంవత్సరం సరిగా గుర్తులేదు. ఆ సమయంలో మా ఊరిలో బాబా నామసప్తాహం జరుగుతోంది. నేను నా ప్రాణస్నేహితులతో మాట్లాడుతున్నాను. అందులో ఒక స్నేహితుడికి అప్పటికి రెండు నెలల క్రితం పెద్ద ప్రమాదం జరిగింది. తను 40 - 60 అడుగుల ఎత్తులో పని చేస్తుండగా, పైనించి క్రిందకి జారిపడిపోయాడు. అతడికి వెన్నుపూస దగ్గర దెబ్బ తగిలింది. నేను తనని, "బాబా నామసప్తాహం జరుగుతోంది కదా, అక్కడికి వెళదామా?" అని అడిగాను. తను, "నేను కూర్చోలేను, ఎక్కువసేపు నిలబడలేను, స్థిమితంగా పడుకోలేను. నా పరిస్థితి ఇదీ అని తెలిసి కూడా నన్ను రమ్మంటున్నావా?" అని నాపై కాస్త కోపం చూపించాడు. నేను, "కాసేపు ఉండి వచ్చేద్దాం" అని వాడిని బ్రతిమాలి నామసప్తాహం జరుగుతున్న గుడికి తీసుకొని వెళ్ళాను. గుడి బయట బాబా విగ్రహం ఒకటి ఉంటుంది. నేను ఆ బాబా దగ్గరకి వెళ్ళి, "బాబా! నీపై నమ్మకంతో వీడిని నీ దగ్గరకి తీసుకొచ్చాను. పది నిమిషాలు కూడా కూర్చోలేని పరిస్థితి వీడిది. వీడి భారం నీదే తండ్రీ!" అని చెప్పుకున్నాను. తరువాత నా స్నేహితుడిని తీసుకొని వెళ్లి నామసప్తాహంలో కూర్చోబెట్టాను. నేను కూడా కూర్చొని బాబా నామాన్ని పఠిస్తున్న తనని గమనించసాగాను. పది నిమిషాలు కూడా కూర్చోలేనివాడు 24 గంటలు ఆ నామసప్తాహంలో కూర్చున్నాడు. ఇది చాలా పెద్ద మిరాకిల్. ఎన్నో రోజులుగా బాధపడుతున్న తను బాబా అనుగ్రహంతో నెలరోజుల్లో మామూలు మనిషయ్యాడు. ఇప్పుడు వాడికి బాబా అంటే ప్రాణం. ఎక్కడ బాబా మాట వినపడినా వాడు ముందుంటాడు. ఇద్దరం బాబా సన్నిధిలో కలిసున్నప్పటికీ వాడు, నేను మాట్లాడుకొని చాలా ఏళ్ళు అయింది. అయినా పర్వాలేదు, నా స్నేహితుడు బాగున్నాడు, అది చాలు నాకు. ఇన్నేళ్ల తరువాత ఇంత పెద్ద మిరాకిల్‌ని మీతో పంచుకొనే అదృష్టాన్ని కలుగజేసిన ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా హృదయపూర్వక నమస్కారాలు.
జై సాయిరామ్!
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
మెడనొప్పి నుండి ఉపశమనం ప్రసాదించిన బాబా
సాయిభక్తురాలు ప్రజ్ఞాన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:
నేను హైదరాబాద్ నివాసిని. నేను బాబాకు చాలా సాధారణ భక్తురాలిని. ఇటీవల వెన్నునొప్పి, తలనొప్పి కారణంగా నాకు నిద్రపోవడం చాలా కష్టమైంది. నేను క్రిందికి చూస్తే చాలు, నొప్పి మొదలైపోయేది. నా మెడకు ఏదో అయ్యిందన్న ఆలోచనలతో నేను మానసికంగా కూడా కృంగిపోయాను. ఆ నొప్పిని భరించలేక, "ఈ నొప్పినంతా తీసేయండి బాబా" అని బాబా ముందు చాలా ఏడ్చాను. తరువాత బ్లాగులో కొన్ని అనుభవాలు చదివాక ఊదీని 5 రోజులపాటు ఔషధంగా తీసుకున్న ఒక భక్తుని అనుభవం తారసపడింది. వెంటనే నేను బాబా ఊదీని ఔషధంగా తీసుకుని, "సరిగ్గా 5వ రోజున వచ్చే రామనవమినాటికి ఈ బాధలన్నింటి నుండి ఉపశమనం కలిగించండి, మూడునెలల గర్భవతినైన నేను ఈ బాధలన్నీ ఒకేసారి భరించలేను. బాబా! దయచేసి నాకు సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. రోజుకు మూడుసార్లు చొప్పున 5 రోజులు ఊదీ తీసుకున్నాక మెడనొప్పి దాదాపు 80% తగ్గిపోయింది. అప్పుడు నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రపోగలిగాను. సాయి నా కష్టాలన్నీ తీసుకుంటారని నాకు నమ్మకం ఉంది. ఆయనకు ప్రతిదీ తెలుసు. ఆయనే ఆ భక్తుని అనుభవం ద్వారా నన్ను గైడ్ చేసి నొప్పినుండి ఉపశమనం కలిగించారు. "చాలా చాలా థాంక్స్ బాబా! దయచేసి నన్ను క్షమించండి, ఆలస్యంగా నా అనుభవాన్ని పంచుకుంటున్నాను. జీవితంలోని ప్రతి దశలోనూ మీరు నాకు కావాలి. మీరు నాతో ఉంటే నావైపు ఎటువంటి సమస్యలూ రావు. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి బాబా!"
ఓం సాయినాథ్ మహారాజ్ కీ జై!
ఓం శ్రీ సాయిరాం జీ🙏🙏🙏
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai. Om sai sri sai Jaya Jaya sai om sai sri sai Jaya Jaya sai 🙏🙏🙏
ReplyDeleteOm Sai Ram 🙏🌹🙏
ReplyDeleteఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏
ఓం సాయిరాం...🌹🙏🏻🌹
ReplyDelete