సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 263వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. మన సమస్యలు - శ్రీసాయి సచ్చరిత్ర సమాధానాలు..!!
  2. సాయిబాబా ఆశీర్వాదాలు

మన సమస్యలు - శ్రీసాయి సచ్చరిత్ర సమాధానాలు..!!

శ్రీసాయి సచ్చరిత్ర ఒక మహిమాన్విత గ్రంథమని మన సాయిభక్తులందరికీ అనుభవమే. శ్రీసాయి సచ్చరిత్ర, బాబా వేరు కాదు. సాయి సచ్చరిత్రలో ఎన్నో ఆణిముత్యాలు ఉన్నాయి. ప్రతి మాట, ప్రతి పదం అన్నీ కూడా బాబా స్వయంగా చెప్పిన మధురవాక్కులు. సచ్చరిత్రను ప్రతిరోజూ పారాయణ చేసేవారు తమ సమస్యలకు బాబా ఇచ్చే సమాధానాలను కూడా సచ్చరిత్ర ద్వారానే తెలుసుకుంటూ ఉంటారు. ఏదయినా సమస్య ఎదురయినప్పుడు కనులు మూసుకొని, పరిష్కారం చూపించమని బాబాని మనస్పూర్తిగా ప్రార్థించి, సచ్చరిత్రలోని ఏదో ఒక పేజీ తీసి చూస్తే ఆ సమస్యకు పరిష్కారం కనపడుతుంది. 

ఈరోజు మీరు చదవబోయేది అటువంటి సంఘటనే. ఇది హైదరాబాదు వాస్తవ్యులు శ్రీహరికిరణ్ అనుభవం. వారి శ్రీమతి ఆ అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు. అవధరించండి..

ఈమధ్యనే నా భర్తకు కలిగిన అనుభవాన్ని వివరిస్తాను. ప్రతిరోజూ నేను నా భర్త కన్నా ముందుగానే నిద్రనుండి మేల్కొంటాను. ఒకరోజు ఉదయాన్నే ఆయన నాకన్నా ముందే నిద్రలేచి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నారు. తను మాట్లాడే మాటలవల్ల నాకర్థమైందేమిటంటే, నా భర్త ఒక కంపెనీకి సంబంధించిన షేర్లలో పెట్టుబడి పెట్టడానికి తన స్నేహితునితో సంప్రదిస్తున్నారు. ఆయన స్నేహితుడు ఒక షేర్ బ్రోకరు. నా భర్త షేర్లలో పెట్టుబడి పెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆ కంపెనీలో పెట్టుబడి పెడితే త్వరలోనే ఆ కంపెనీ షేరు విలువ బాగా పెరిగి లాభాలు విపరీతంగా వస్తాయని ఆ తరువాత నాతో చెప్పారు. 

నా భర్తకి బాబా అంటే చాలా నమ్మకం. కొద్దిరోజులుగా సాయి సచ్చరిత్ర పారాయణ కూడా చేస్తున్నారు. ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే సచ్చరిత్రలోని ఏదో ఒక పేజీ తీసి చదువుతారు. ఆరోజు స్నానం చేసిన తరువాత పూజా మందిరంలో కూర్చొని సచ్చరిత్ర చేతిలోకి తీసుకొని ఒక పేజీ తెరిచారు. ఆశ్చర్యం! అది 25వ అధ్యాయం. ఆ అధ్యాయంలో దామూ అన్నా ప్రత్తి వ్యాపారంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలను గడిద్దామని, దానికోసం బాబా సహాయం కోరదలచిన సంఘటన ఉంది. దామూ అన్నా మాధవరావుకు ఉత్తరం వ్రాస్తాడు. మాధవరావు బాబాకు ఆ ఉత్తరం చదివి వినిపించగానే బాబా, "ఉన్నదానితో తృప్తిపడమను. అతనికి యింటిలో ఏ లోటూ లేదు. లక్షల కోసం వెంటపడవద్దని చెప్పు" అంటారు. నా భర్త ఆ అధ్యాయాన్ని చదివిన తరువాత అది షేర్ల విషయంలో బాబా తనకిచ్చిన సలహాగా భావించారు. నిజానికి ఆరోజున చాలా పెద్దమొత్తంలో తను అనుకున్న కంపెనీ షేర్లలో పెట్టుబడి పెడదామనుకున్నారు. కానీ బాబా హెచ్చరికను అర్థం చేసుకొని పెట్టుబడి పెట్టకూడని నిర్ణయించుకొన్నారు

నా భర్త నిర్ణయంతో తన స్నేహితుడు హతాశుడయ్యాడు. తనకి నా భర్త అటువంటి నిర్ణయం తీసుకోవడం నచ్చలేదు. కనీసం కొద్దిమొత్తమైనా పెట్టుబడి పెట్టమని బలవంతపెట్టి నా భర్తను ఒప్పించాడు. రెండు రోజులలోనే ఆ షేరు విలువ బాగా పడిపోయి, పెట్టుబడి పెట్టినవాళ్ళందరూ బాగా నష్టపోయారు. ముందే అనుకున్న ప్రకారం ఎక్కువమొత్తంలో పెట్టుబడి పెట్టివుంటే మేము బాగా నష్టపోయి చాలా కష్టాలు పడేవాళ్ళం. ఎప్పటికీ పూడ్చలేని నష్టాలను అనుభవించి ఉండేవాళ్ళం. అటువంటి కష్టానికి లోనుకాకుండా సమయానికి సలహా ఇచ్చిన బాబాకి మేమెంతో ఋణపడివున్నాము.  

బాబా హెచ్చరించినా కూడా నా భర్త తెగించి పెట్టిన కొద్దిపాటి మొత్తం మాకు నష్టాన్ని మిగిల్చింది. బాబా యిచ్చిన సలహాని నా భర్త పూర్తిగా పాటించలేదు. బాబా హెచ్చరికను పెడచెవిన పెడితే మానవుడు ఒక్కసారిగా శిఖరాగ్రం నుండి ఏవిధంగా క్రిందకు జారిపోతాడో నిరూపిస్తుంది ఈ సంఘటన. ఇది ఒక కనువిప్పు. కావలసినదల్లా బాబా పట్ల పూర్తి నమ్మకం.

సాయిబాబా ఆశీర్వాదాలు

యు.ఎస్.ఏ. నుండి సాయిభక్తురాలు బట్టగిరి.జీవనప్రియాంక తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను దేవుణ్ణి నమ్ముతానుగాని గొప్ప భక్తురాలినేమీ కాదు. అలాంటి నేను 2017 నుండి సాయిబాబాకు గొప్ప భక్తురాలినయ్యాను. ముందుగా నేను ఉద్యోగం పొందడంలో సాయిబాబా నాపై కురిపించిన ఆశీస్సులను మీతో పంచుకుంటాను. 

నేను మాస్టర్స్ పూర్తిచేసి అందరిలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేశాను. కానీ 4 నెలలు గడిచినా ఉద్యోగం రాలేదు. నా స్నేహితులలో కొందరు నాకిష్టమైన ఆహారాన్ని వదిలిపెట్టి, ఉద్యోగాన్ని ప్రసాదించమని బాబాను ప్రార్థించమని సలహా ఇచ్చారు. నేను వాళ్ళు చెప్పినట్లుగా చేశాను. కేవలం 2 నెలల్లో నాకు ఉద్యోగం వచ్చింది. బాబా ఆశీస్సులతో నాకు గొప్ప ఉద్యోగం లభించిందని నేను చెప్పాలి. ఎందుకంటే, నేను పనిచేసే చోట ఎటువంటి పనిఒత్తిడిలేని చాలా ప్రశాంతమైన, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది.

కొన్నిరోజుల తరువాత నేను నా STEM(science, technology, engineering and mathematics degree) OPT(optional practical training) చేసుకోవాల్సిన అవసరమేర్పడి దానికోసం దరఖాస్తు చేసాను. కాని USCIS(United States Citizenship and Immigration Services) నా OPT పొడిగింపుపై ప్రశ్న వేసింది. సాధారణంగా అలా జరగదు. దానితో నేను చాలా క్లిష్టపరిస్థితుల్లో పడ్డాను. OPT పొడిగింపు ఆమోదించబడకపోతే ఒక నిర్దిష్టమైన సమయంలోపు నేను దేశాన్ని విడిచిపెట్టవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి సమయంలో నా స్నేహితులలో ఒకరు సాయి నవగురువార వ్రతం చేయమని సూచించారు. తన సూచనల మేరకు నేను వ్రతం చేశాను. అయినప్పటికీ నా బాధ తీరలేదు. నేను సాయిబాబా నామం జపిస్తూ ఆ పరిస్థితి నుండి నన్ను రక్షించమని చాలాసార్లు బాబాను ప్రార్థించాను. చివరికి కొన్నిరోజుల తరువాత అద్భుతం జరిగింది. నా OPT ఆమోదం పొందింది. ఇదంతా నా బాబా ఆశీర్వాదం వల్లే జరిగింది. నా కోరిక నెరవేరితే నా అనుభవాన్ని పంచుకుంటానని నేను బాబాతో చెప్పుకున్నాను. కానీ కొన్ని కారణాలవల్ల జాప్యం జరిగింది. "ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి బాబా!" తన భక్తులకు ఏది ఉత్తమమైనదో బాబాకు తెలుసని నేను ఖచ్చితంగా చెప్పగలను. దయచేసి బాబాపై దృఢమైన విశ్వాసాన్ని కలిగి సహనంతో ఉండండి. ఖచ్చితంగా ఆయన మీకు ఉత్తమమైనదాన్ని ఇస్తారు.

ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! 

5 comments:

  1. i like this blog.daily i read this blog.om sai ram

    ReplyDelete
  2. OM SAI RAM

    I FELL IN LOVE WITH THIS BLOG AND DAILY I READ THE BEAUTIFUL EXPERIENCES OF SAI BABA..........THANK YOU ALL

    ReplyDelete
  3. ఓం శ్రీ సాయిరాం జీ 🙏🙏🙏

    ReplyDelete
  4. ఓం సాయిరాం...🌹🙏🏻🌹

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo