1. బాబా లీలల ఆస్వాదన ఎంతో సంతోషదాయకం2. బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు
3. బాబా రక్షణ
బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా, ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి లీలలు అనంతము, వర్ణనాతీతము. వాటిలోనుండి కొన్ని లీలలను ఇప్పుడు మీతో పంచుకుంటాను. నేను గత 20 సంవత్సరాల నుండి బాబా భక్తురాలిని. నాలో అంచెలంచెలుగా ఆ బ్రహ్మాండనాయకుడిపై ప్రేమ పెరుగుతూ వచ్చింది. లాక్‌డౌన్ సమయంలో ఒకరోజు మా నాన్నగారికి హఠాత్తుగా హై-ఫీవర్ వచ్చింది. దాంతో కొంచెం భయపడ్డాను. ఆ తరువాత తనకు బి.పి. చెక్ చేయిస్తే 190 ఉంది. అప్పుడు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నీ బిడ్డను ఇబ్బందిపెట్టకు. నాన్నకు ఆరోగ్యం బాగుంటే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను” అని చెప్పుకున్నాను. బాబా దయవలన నాన్న కోలుకోవడంతో ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
మా నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే బ్లాగులో పంచుకుంటానని బాబాకు చెప్పుకున్నాను కదా! కానీ, ఆ లీలను పంచుకోవటంలో కొంచెం ఆలస్యం చేశాను. తరువాత నాకొక చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది. అప్పుడు నేను నా షుగర్ లెవల్స్ చెక్ చేయించుకుంటే షుగర్ ఎక్కువగా ఉందని చెప్పారు. అప్పుడు నేను బాబాకిచ్చిన మాట గుర్తుకొచ్చింది. వెంటనే, ఆలస్యం చేసినందుకు బాబాకు క్షమాపణలు వేడుకుని, "నా ఆరోగ్యం బాగుండేలా అనుగ్రహించమ"ని ప్రార్థించి, "నా ఆరోగ్యం బాగుంటే ఈ రెండు అనుభవాలను, వాటితోపాటు మరికొన్ని నా అనుభవాలను బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. బాబా దయవల్ల నేనిప్పుడు ఆరోగ్యంగా ఉన్నాను. ఏమి చేసినా ఆ సాయినాథుని ఋణం తీర్చుకోలేము. మనం తెలుసుకోవలసిన విషయమేమిటంటే, బాబాకు మాటిచ్చి అశ్రద్ధ చేయకూడదు. బాబా ప్రేమమయుడు, సర్వాంతర్యామి. బాబా పాదాలకు అనంతకోటి వందనాలు. ‘నన్ను, నా తల్లిదండ్రులను, నా బిడ్డలను ఎల్లప్పుడూ క్షేమంగా చూసుకోవాలనీ, మేము ఎల్లప్పుడూ వారి సేవ చేసుకోవాల’నీ మనస్ఫూర్తిగా బాబాను కోరుకుంటున్నాను. ఇకపోతే, బాబా నాకు చేసిన సహాయానికి సంబంధించి మరికొన్ని అనుభవాలు...
1) ఒకసారి నాకు కొన్ని ఆర్థిక సమస్యలొచ్చాయి. వాటినుండి బయటపడటానికి నేను ప్లాట్లు అమ్మాలనుకున్నప్పుడు బాబా నాకు ఎంతో సహాయం చేశారు.
2) మా అమ్మ డయాలసిస్, ఏ.వి. ఫిస్టులా శస్త్రచికిత్స విషయంలో బాబా మాకు మార్గనిర్దేశం చేశారు.
3) మా పెద్దబ్బాయికి పదవ తరగతిలో మంచి మార్కులు వచ్చేలా సహాయం చేశారు.
ఇవే కాకుండా, నాకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాటి విషయంలో నేను ధైర్యం వహిస్తూ, "మా సమస్యలను పరిష్కరించమ"ని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూ సాయిచరిత్ర పారాయణలు చేశాను, చేస్తూనే ఉన్నాను. బాబా ఎంతో కరుణతో మా సమస్యలన్నింటినీ తీరుస్తున్నారు. ‘బాబాను నమ్ముకుంటే మనకు తప్పకుండా మంచి జరుగుతుంద’ని అనటానికి ఇవే నిదర్శనాలు. "బాబా! నేను ఒకచోట ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాను. దయచేసి దయతో తొందరగా మాకున్న సమస్యలను తొలగించి నా కోరిక తీరేలా ఆశీర్వదించండి బాబా".
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
బాబా రక్షణ
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నిర్వహిస్తున్నవారికి సాయిబాబా ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు అరుణ. బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను ఇదివరకు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. ఇటీవల మా అన్నయ్య వాళ్ళింట్లో అందరికీ జ్వరం వచ్చింది. ఎంతమంది డాక్టర్లకు చూపించుకున్నా తగ్గలేదు. ఒకరోజు మా వదిన ఫోన్ చేసి, "ఇంట్లో అందరూ అనారోగ్యంగా ఉండడం వలన నా మనసు ఏం బాగోలేద"ని చాలా బాధపడ్డారు. అప్పుడు నేను, "అన్నయ్యకి, పిల్లలకి రెండు రోజుల్లో జ్వరం తగ్గిపోవాలి బాబా. అలా జరిగితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. రెండు రోజుల తర్వాత మెల్లగా జ్వరం తగ్గి ఇప్పుడు అందరూ బాగున్నారు. "బాబా! మీ అనుగ్రహం వలనే జ్వరం తగ్గిందని నా పూర్తి విశ్వాసం. మీ కృప ఎప్పటికీ ఇలానే ఉండనీయండి బాబా".
నేను ఈమధ్య ప్రతి చిన్న విషయానికీ బాబా మీద ఆధారపడుతున్నాను. ఎంత చిన్న సమస్య అయినా భారం బాబా మీదే వేస్తున్నాను. ఒక నెలరోజుల క్రితం మేము ఒక రాష్టం నుంచి ఇంకొక రాష్ట్రానికి ప్రయాణమవ్వాల్సి వచ్చింది. ‘కరోనా సమయంలో ప్రయాణం ఎలా చేయాల’ని చాలా భయపడ్డాను. చివరికి బాబా మీద భారం వేసి బయలుదేరాము. బాబా దయవల్ల ప్రయాణమంతా సవ్యంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. నా ఆరోగ్యం, పిల్లల భద్రత మీకే అప్పగించాను బాబా. మమ్మల్ని సదా రక్షించండి బాబా. ఇంకా, నా కోపాన్ని తగ్గించండి బాబా".

