సాయి వచనం:-
'నా ముందర భక్తితో మీ చేతులు చాపినచో నేను రాత్రింబవళ్ళు మీ చెంతనే ఉంటాను.'

'సంస్కరణాకార్యంలో భాగంగానే సద్గురువు మనకు అనుభవాలు ప్రసాదిస్తారు. సద్గురువు ప్రసాదించే ప్రతి అనుభవం వల్ల మనలో మార్పు, సంస్కార పరిణతి రావాలి' - శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 886వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్తం బాబానే!
2. బండి స్టార్ట్ అవడంలో బాబా సహాయం
3. బాబా కరుణ

సమస్తం బాబానే!


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా కృతజ్ఞతలు. నా పేరు గోష్టేశ్వరి. నేను ఇదివరకు నా అనుభవాలు కొన్నిటిని ఈ బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలను మీతో పంచుకుంటాను. నా గత అనుభవంలో నేను ఒక సమస్య గురించి వ్రాశాను. ఆ అనుభవం బ్లాగులో ప్రచురితమైన కొద్దిరోజుల తరువాత ఆ సమస్యలో కొంచెం సానుకూలత వచ్చింది. "ధన్యవాదాలు బాబా. మీ దయతో సమస్య పూర్తిగా పరిష్కారమైతే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను".


ఇటీవల నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. నేను ఏ మందులూ వాడకుండా కేవలం బాబా ఊదీనే సమస్య ఉన్న చోట రాశాను. బాబా దయవల్ల కొద్దిరోజుల్లోనే నా చర్మసమస్య తగ్గిపోయింది. "ధన్యవాదాలు బాబా".


ఈమధ్య ఒకరోజు మా ఇంటి తాళం కనిపించలేదు. కొద్దిసేపు వెతికిన తర్వాత తాళం దొరికింది. నేను వెంటనే ఆ విషయం మా పాపకి చెప్తే, "మమ్మీ! 'తాళం దొరికితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన'ని నేను బాబాకు మ్రొక్కుకున్నాను. అందుకే అంత త్వరగా దొరికింది" అని తను చెప్పింది. మా పాప వయసు 7 సంవత్సరాలే. ఆ వయస్సులోనే తనకు బాబాపట్ల అంత భక్తి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా అనిపించింది. "బాబా! మీ కృప ఎల్లప్పుడూ నా బిడ్డపై ఇలాగే ఉండాలి తండ్రీ".


2021, జూన్ 26న నేను కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకున్నాను. బాబా దయవలన నాకు జ్వరం, ఒళ్లునొప్పులు వంటి ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. కానీ పదిరోజుల తర్వాత బ్యాక్ పెయిన్ మొదలైంది. వ్యాక్సిన్ వేయించుకున్నందున పెయిన్ కిల్లర్స్ వాడకూడదని అలాగే నొప్పిని భరించసాగాను. తరువాత ఒకరోజు రాత్రినుండి ఒళ్ళంతా తిమ్మిరెక్కినట్లుగా ఉండి నిద్రపట్టలేదు. నాకు భయం వేసి హాస్పిటల్‌కి వెళ్లాలని అనుకున్నాను. మరుసటిరోజు ఈ బ్లాగులో ఒక భక్తుని అనుభవంలో, 'బ్యాక్ పెయిన్ ఉన్నచోట బాబా ఊదీని రాయడం వలన నొప్పి తగ్గింద'ని ఉంది. నాకది బాబా సందేశంలా అనిపించింది. తరువాత నేను డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని టెస్టులు చేసి, "వెన్నెముకలో చిన్న సమస్య ఉంది, పదిరోజులపాటు మందులు వాడితే తగ్గిపోతుంది" అని చెప్పారు. నేను ఆ మందులతోపాటు బాబా ఊదీ కలిపిన నీళ్లు రాసుకోవడం మొదలుపెట్టాను. బాబా దయవలన ఇప్పటికి నొప్పి, తిమ్మిర్లు చాలావరకు తగ్గాయి. నా బాధను తగ్గించమని నేను బాబాను ప్రార్థించను కూడా లేదు. కానీ బాబానే ఒక తల్లిలా నా బాధను అర్థం చేసుకుని సరైన సమయంలో తగిన సూచనలిచ్చి నా బాధను తగ్గించారు. అందుకే అంటాను, 'బాబా నా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వమూనూ. నాకు సమస్తం బాబానే'. "ధన్యవాదాలు బాబా". 


చివరిగా సాయి కుటుంబసభ్యులమైనందుకు మనమంతా గర్వించాలి. అంతకుమించిన అదృష్టం మరొకటి లేదు. ఎందుకంటే, "నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను. పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్లు నా భక్తుణ్ణి నా వద్దకు తెచ్చుకుంటాను" అని బాబా చెప్పారు. అంటే, బాబానే మనల్ని తమ భక్తులుగా ఎన్నుకున్నారు. అంతకుమించి మనకు ఏం కావాలి? కానీ, మనం మానవమాత్రులం కాబట్టి ఒక్కోసారి బాధను తట్టుకోలేక బాబాను నిందిస్తాం. అయినా బాబా అవేవీ పట్టించుకోకుండా కంటికి రెప్పలా మనల్ని కాపాడుతుంటారు. "బాబా! నన్ను మీ భక్తురాలిగా ఎన్నుకుని, ఇంత మంచి సాయికుటుంబాన్ని ఇచ్చినందుకు మీకు వేలవేల కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బండి స్టార్ట్ అవడంలో బాబా సహాయం

 

సాయిబంధువులందరికీ అనేక నమస్కారాలు. ఈ కలియుగంలో ఇంత అద్భుతమైన సేవ చేస్తున్న ఈ బ్లాగ్ నిర్వాహకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బ్లాగ్ ఒక 'ఆధునిక సచ్చరిత్ర' వంటిది. బ్లాగ్ చదవకుండా నా రోజు పూర్తి కాదు. ఇక నా అనుభవానికి వస్తే... 2021, జులై నెల చివరి వారంలో కొన్ని అత్యవసర పనుల కారణంగా నేను పట్టణ శివార్లలో ఉన్న ఒక బ్యాంకుకి వెళ్లాల్సి వచ్చి, మంచి కండిషన్‌లో ఉన్న హోండా యాక్టివా బండి మీద బ్యాంకుకు వెళ్లాను. నేను వెళ్లిన పని 30 నిమిషాల్లో పూర్తయింది. తిరిగి వచ్చేందుకు బండి స్టార్ట్ చేస్తే, అది స్టార్ట్ కాలేదు. అన్ని విధాలా ప్రయత్నించినప్పటికీ బండి స్టార్ట్ కాలేదు. పట్టణ శివారు ప్రాంతమైనందున కనుచూపు మేరలో మెకానిక్ కనిపించలేదు. పైగా వాతావరణం చాలా వేడిగా ఉంది. ‘ఇప్పుడీ బండిని తోసుకుంటూ, మెకానిక్‌ని వెతుక్కుంటూ ఎంత దూరం వెళ్లాలో?’ అని అనుకున్నాను. అంతలోనే బాబాను తలచుకుని, "ఇలా అయ్యిందేమిటి బాబా? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి బండి స్టార్ట్ అయ్యేలా చేయండి లేదా మెకానిక్ షాపు కనపడేలా సహాయం చేయండి" అని బాబాను ప్రార్థించాను. అవతలవైపు రోడ్డు కొద్దిగా వాలుగా ఉండటంతో నేను బండి సీటుపై కూర్చుని, కాలుతో బండిని ముందుకు నెట్టాను. బండి నెమ్మదిగా కదులుతోంది. కొద్దిదూరం దాటితే మరో ఆరు కిలోమీటర్ల వరకు పెద్దగా జనసంచారం ఉండదని తెలిసిన నేను బండిని నెడుతూనే, "బండి స్టార్ట్ అయితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాను ప్రార్థించాను. అలా అనుకుంటూ ఉండగానే అదృష్టవశాత్తూ ఒక టైర్ రిపేర్ షాపు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ షాపతనితో, "ఏమి జరిగిందో తెలియదు, అకస్మాత్తుగా బండి ఆగిపోయింది" అని చెప్తుండగానే ఎలా జరిగిందో తెలియదుగానీ, ఇగ్నీషన్ బటన్ ప్రెస్ అయి దానంతటదే బండి స్టార్ట్ అయింది. అది చూసి మెకానిక్ కూడా ఆశ్చర్యపోయాడు. నిజంగా ఈ బ్లాగ్ ద్వారా బాబా నాకు సహాయం చేశారు. "థాంక్యూ బాబా". ప్రియమైన భక్తులారా! బాబా సర్వవ్యాపి. ఆయన అంతటా ఉన్నారు. ప్రతీ క్షణం ఆయన మనకోసం ఉన్నారు. బాబాపై నమ్మకం ఉంచండి.


బాబా కరుణ


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!


ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు యశోదమ్మ. మాది అనంతపురం. నేను ఇదివరకు ఒక అనుభవాన్ని మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవాన్ని పంచుకుంటున్నాను. నా భర్త ఎస్.కే యూనివర్సిటీలో పనిచేస్తున్నారు. ఇటీవల ఒక వారంరోజులపాటు ఆయన యూనివర్సిటీ ఎలక్షన్లలో బాగా తిరిగారు. ఆ కారణంగా 2021, ఆగష్టు 2న ఆయనకి జలుబు, దగ్గు సమస్యలు మొదలయ్యాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మాకు చాలా భయం వేసింది. వెంటనే బాబాకు నమస్కరించి, "మావారికి జలుబు, దగ్గు తగ్గితే ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకున్నాను. ఆశ్చర్యం! మరుసటిరోజు ఉదయం లేచేసరికి మావారికి జలుబు, దగ్గు పూర్తిగా తగ్గిపోయాయి. "మా మీద ఇంత కరుణ చూపించినందుకు మీకు వేలవేల నమస్కారాలు తండ్రీ. మీ కరుణ ఎప్పటికీ అందరిమీదా ఇలాగే ఉండాలని కోరుకుంటూ... మీ పాదసేవకురాలు".


9 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤🌸😀🌼🌺🌹

    ReplyDelete
  3. Om Sairam
    Sai Always Be with me

    ReplyDelete
  4. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  6. Baba karthik ki thyroid taggipovali thandri

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo