సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 884వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. కరోనా నుంచి కుటుంబాన్ని కాపాడిన బాబా
2. బాబా హెచ్చరిక!
3. బాబా ప్రసాదించిన ఉద్యోగం - ఆరోగ్యం

కరోనా నుంచి కుటుంబాన్ని కాపాడిన బాబా


సాయిబంధువులకు నమస్కారాలు. నా పేరు సుజాత. ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈ జన్మలో నేను బాబా భక్తురాలినయ్యాను. బాబా నా గురువు, దైవం, తల్లి, తండ్రి, అన్నిటికీ మించి మంచి స్నేహితుడు. నేను ఎవరికీ చెప్పుకోలేని బాధలు నా తండ్రికి మాత్రమే చెప్పుకుంటాను. నాకు ఏ సమస్య వచ్చినా, 'బాబా, నువ్వే దిక్కు' అని అనుకున్నంతనే బాబా మమ్మల్ని సమస్య నుండి సురక్షితంగా కాపాడుతారు. ఏ విషయంలోనైనా నా వెన్నంటే ఉండి నడిపిస్తున్న నా తండ్రికి ఈ జన్మంతా ఋణపడివుంటాను. మాకు ఇద్దరు పిల్లలు. బాబు పేరు సాయి నివాస్, పాప పేరు సాయిశ్రీ. వాళ్ళిద్దరూ గురువారంనాడు పుట్టడం నా బాబా నాకిచ్చిన గొప్ప వరం. ఒక నెల క్రితం మా బాబుకు కరోనా వచ్చింది. రెండవరోజు నుంచి తనకి విపరీతమైన గొంతునొప్పి, జ్వరం ఉండేవి. అప్పుడు నేను బాబా ఊదీని నీళ్లలో కలిపి బాబు చేత త్రాగించాను. ఒక్కరోజులో గొంతునొప్పి తగ్గింది. బాబా దయ, ఊదీ మహాత్మ్యం వల్ల నాలుగు రోజుల్లో బాబు మామూలుగా అయ్యాడు. మళ్లీ 15వ రోజు టెస్ట్ చేస్తే, బాబా దయవల్ల నెగిటివ్ వచ్చింది. నా తండ్రి బాబుని కాపాడారని ఊపిరి పీల్చుకున్నాం. “ధన్యవాదాలు బాబా!”


బాబుకి కరోనా వచ్చిన ఆరవరోజు పాపకు కూడా కరోనా వచ్చింది. మూడు రోజులు బాగా జ్వరం ఉన్నప్పటికీ తను మామూలుగానే ఉండేది. కానీ 10వ రోజున బాగా జలుబు, గొంతునొప్పి వచ్చాయి. అప్పుడు నేను చాలా భయపడి, "బాబా! నువ్వే దిక్కు తండ్రీ" అని వేడుకున్నాను. తరువాత బాబా గుడికి వెళ్లి, "నా బిడ్డను నువ్వే కాపాడాలి బాబా" అని వేడుకుని ఊదీ తీసుకొచ్చి నీటిలో కలిపి పాపకి తగ్గేంతవరకు ప్రతిరోజూ త్రాగించాను. 18వ రోజు టెస్ట్ చేయిస్తే, బాబా దయవల్ల కోవిడ్ నెగిటివ్ వచ్చింది.


పాపకి కరోనా వచ్చిన రెండురోజులకి నా భర్తకి బాగా జ్వరం వచ్చింది. నేను చాలా భయపడ్డాను. వెంటనే నా భర్త, నేను బాబా గుడికి వెళ్ళాం. "మా ఆయనకి కరోనా రాకుండా చూడు తండ్రీ" అని నేను బాబాను వేడుకున్నాను. ఊదీ తీసుకుని ఇంటికి వచ్చాక నీళ్ళలో కలిపి మావారి చేత త్రాగించాను. నా తండ్రి దయవలన ఒక గంటలో ఆయనకి జ్వరం తగ్గింది. అలా కరోనా నుంచి నా కుటుంబాన్ని కాపాడిన బాబాకు ఈ జన్మలోనే కాదు, జన్మజన్మలందు ఋణపడివుంటాను. నా ఈ బాధల నుండి సురక్షితంగా బయటపడేసిన బాబా ఊదీ మహాత్మ్యం గురించి ఇలా సాయిబంధువులకు తెలియజేయటం నా తండ్రి నాకిచ్చిన గొప్ప అవకాశం. ఇది నా అదృష్టం.


ఓం  శ్రీసాయినాథాయ నమః.

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.


బాబా హెచ్చరిక!


“సాయీ! నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే!” నేనిలా ఎందుకంటున్నానో మీకే తెలుస్తుంది. నా వివాహం 1999వ సంవత్సరంలో జరిగింది. నా వివాహం జరిగినప్పుడు మేమిద్దరం శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకోవాలని నా ఆత్మీయులు శిరిడీ ప్రయాణం టికెట్లను నాకు బహుమతిగా ఇచ్చారు. కానీ మా అత్తామామలు, “ఎవరూ తోడు లేకుండా మీరిద్దరే ఎలా వెళ్తారు?” అని చెప్పి, ఆ టికెట్లను క్యాన్సిల్ చేసుకుని మనీ రిటర్న్ తీసుకున్నారు. అది మొదలు, అలాంటి మనుషులతో కలిసివుంటూ నడిసముద్రంలో పడి మునగలేక, చావలేక, ఒడ్డుకురాలేక నా జీవితం నరకంగా మారింది. దాంతో నిరంతరం బాబాను స్మరించుకుంటూ, “బాబా! ఇకనైనా నన్ను కాపాడు తండ్రీ. నాకు ఒక దారి చూపించు. నన్ను, నా(మీ) బిడ్డను కాపాడు. బాబా! మీరు చాలాసార్లు నన్ను కాపాడారు. ఏమని చెప్పాలి మీ దయ తండ్రీ? నా మనసులో ఉన్నది మీకు తెలుసు, అది నెరవేరేలా చూడు తండ్రీ!” అని బాబాను ఆర్తిగా ప్రార్థించేదాన్ని. 


ఆ తరువాత ఈ పరిస్థితుల నుండి బయటపడాలని నేను ఒక బిజినెస్ ప్లాన్ చేశాను. నా చిన్నప్పటి ఫ్రెండ్ సహాయంతో బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు, నాకు తెలిసిన ఇంకో ఫ్రెండ్ నాతో, ‘నేను కూడా మీతో కలుస్తాను’ అని అంటే, ‘సరేలే, అందరం కలిసి బిజినెస్ చేస్తే బాగుంటుంది’ అనుకుని అందుకు అంగీకరించాను. ఇక్కడ మీకు చెప్పేదేమిటంటే, మా చిన్నప్పటి ఫ్రెండుకి, నా ఇంకో ఫ్రెండుకి ముందుగా పరిచయం లేదు. వాళ్ళు కేవలం నా ద్వారానే ఒకరికొకరు పరిచయమయ్యారు. ముగ్గురం మూడు పార్ట్‌నర్లుగానూ, బాబా నాలుగో పార్ట్‌నర్‌గానూ అనుకున్నాము. ఒక నెలరోజులు బిజినెస్ బాగానే జరిగింది. ఒకరోజు నేను ఇంటినుండి బయలుదేరి షాపుకు వెళుతుండగా మధ్యదారిలో నాకు ఫోనులో బాబా వాయిస్ మెసేజ్ వచ్చింది. అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. అందులో బాబా ఇలా అన్నారు: “మంచి చేయకపోయినా పరవాలేదు. కానీ చెడు చేయాలని చూస్తున్నారు. ఎవరు తీసుకున్న గుంతలో వాళ్ళే పడతారు” అని. ‘అయ్యో, ఇలాంటి మెసేజ్ వచ్చిందే!’ అనుకుంటూ షాపుకి వెళ్ళాను. 5 నిమిషాలు గడిచిందో లేదో, నా ఫ్రెండ్స్ నాతో, “నువ్వు ఇక ఇక్కడ పార్ట్‌నర్‌గా వద్దు, నీకు వేరే దగ్గర బిజినెస్ పెట్టిస్తాము. మేము నీకు అన్నివిధాలుగా సహాయం చేస్తాము” అని చెప్పారు. అప్పుడు అర్థమైంది నాకు బాబా మెసేజ్‌లోని అంతరార్థం. దాంతో నేను వాళ్ళతో, “నన్ను వెళ్ళిపొమ్మంటున్నారుగా, ఇంక నాకు ఏ బిజినెస్ వద్దు, మీరూ వద్దు. నా పార్ట్‌నర్ మనీ నాకు ఇచ్చేయండి” అని చెప్పాను. బాబా దయవల్ల వాళ్ళు నాకు రావలసిన డబ్బు నాకు ఇచ్చేశారు. నేను వాళ్ళను ఒక్కమాట కూడా అనలేదు. “కానీ బాబా, వాళ్ళు నాపై లేనిపోని నిందలు వేస్తున్నారు. ‘నిందించేవాళ్ళని ఒక్కమాట కూడా అనొద్దు’ అంటారు మీరు. మరి వాళ్ళ మాటల వల్ల నాకు బాధ కలుగుతోంది కదా బాబా? నేను మనిషిని బాబా. మీరు గురువు అయితే మాత్రం, నన్ను మరీ ఇంతగా పరీక్షిస్తారా? నా పరిస్థితి ఏమిటో మీకు మాత్రమే తెలిసీ నన్ను ఇంకా ఇంకా బాధపెడుతున్నారు. ఇంక ఈ నిందలు నేను పడలేను బాబా”. ఈ సంఘటన జరిగి ఒక సంవత్సరం అవుతోంది. నేను ఉద్యోగం మానేసి ఆ బిజినెస్‌ను ప్రారంభించాను. మరి బాబా నన్నెందుకు ఆ బిజినెస్ నుండి తప్పించారో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఈ సమయంలోనే ఈ బ్లాగ్ గురించి నాకు తెలిసింది. ప్రతిరోజూ ఉదయం ఈ బ్లాగులో ప్రచురిస్తున్న సాయి మహిమలు చదువుతూ ఉంటాను. అంత జరిగాక ఈ కరోనా పరిస్థితుల్లో కూడా మళ్ళీ బాబా దయతో నాకు ఉద్యోగం దొరికింది. “బాబా! మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను కాపాడు తండ్రీ”.


బాబా ప్రసాదించిన ఉద్యోగం - ఆరోగ్యం


సాయిబంధువులందరికీ నా నమస్కారం. నా పేరు అనుపమ. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వహిస్తున్నవారికి చాలా చాలా ధన్యవాదాలు. బాబా తమ భక్తులకు ప్రసాదించిన అనుభవాలు ఈ బ్లాగ్ ద్వారా ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఈ బ్లాగ్ ద్వారా ఎంతోమందికి మేలు జరుగుతోంది. ఇక నా అనుభవానికి వస్తే... 


ఉద్యోగం ప్రసాదించిన బాబా: 


ఇదివరకు నేను నా అనుభవాలు కొన్నిటిని ఈ బ్లాగుకు పంపిన సమయంలో కరోనా పరిస్థితుల కారణంగా నాకు ఉద్యోగం లేదు. అద్భుతం ఏమిటంటే, నేను పంపిన అనుభవాలు బ్లాగులో ప్రచురితమయ్యేసరికి బాబా దయవల్ల నాకు ఉద్యోగం లభించింది. అది కూడా సాయిబాబా గుడికి దగ్గరలో. ఆవిధంగా బాబా రోజూ తమ దర్శనం చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. "శతకోటి వందనాలు సాయిబాబా. మీరు మాపై చూపిస్తున్న కరుణకు మేము ఎంతో ఋణపడివుంటాము సాయీ".


అమ్మకు ఆరోగ్యం ప్రసాదించిన బాబా: 


2021, జూలై చివరివారంలో ఒకరోజు రాత్రి మా అమ్మగారు భోజనం చేసిన కాసేపటికి ఉన్నట్టుండి ఆయాసపడ్డారు. అప్పటివరకు బాగానే ఉన్న అమ్మ తన పొట్ట ఉబ్బి ఊపిరాడక చాలా ఇబ్బందిపడుతున్నారు. ఆ సమయంలో డాక్టర్ని తీసుకుని రావడం కష్టం. అందువలన నేను అమ్మకి జండూబామ్, కొబ్బరినూనె రాశాను. అయినా అమ్మకి ఉపశమనం కలగలేదు. అప్పుడు నేను బాబాను తలచుకుని అమ్మకి ఊదీ రాశాను. తరువాత నేను ఏదో పని మీద నా ఫోన్ తీసి చూస్తే, నిత్యపారాయణ గ్రూపులో ఒక మెసేజ్ వచ్చింది. అదేమిటంటే, "నీ కుటుంబసభ్యుల ఆరోగ్యం బాగవుతుంది. నీ మనసులోని కోరికలు తీరుతాయి. నా ఆశీస్సులు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాయి" అన్న బాబా మెసేజ్. అది చదివాక అప్పటివరకు అమ్మ గురించి నా గుండెల్లో ఉన్న అలజడి తగ్గింది. కాసేపటికి అమ్మ ఆరోగ్యం కుదుటపడుతున్నట్లు అనిపించి, ఉదయానికల్లా ఆమె మామూలుగా అయింది. "బాబా! నువ్వు మాకు తోడుగా ఉంటూ మాపై  చూపిస్తున్న ప్రేమకు శతకోటి వందనాలు తండ్రీ". మరికొన్ని అనుభవాలను త్వరలో పంచుకుంటాను. 


సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!

శుభం భవతు!




6 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  3. Baba santosh ki day shifts ravali, health bagundali thandri

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😃❤

    ReplyDelete
  5. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo