సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 896వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు
:

1. బాబాకు చేసిన ప్రార్థన యొక్క ఫలం
2. బాబా చేసిన తక్షణ సహాయం 
3. బాబా దయతో తగ్గిన జ్వరం

బాబాకు చేసిన ప్రార్థన యొక్క ఫలం


నా పేరు శ్రీదేవి. ముందుగా, సాయితండ్రి అనుగ్రహానికి మారుపేరైన 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు మరియు సాయిబంధువులకు నమస్కారం. శ్రీహేమాడ్‌పంత్ రచించిన 'సచ్చరిత్ర’, శ్రీభరద్వాజ మాస్టర్ రచించిన 'సాయిలీలామృతం', ఇలా ఇంకెంతోమంది సాయిభక్తులు రచించిన గ్రంథాల ద్వారా బాబా తమ లీలలను భక్తులకు తెలిసేలా అనుగ్రహించారు. కానీ ఈ కంప్యూటర్ యుగంలో పుస్తకం పట్టుకుని చదవడానికి కూడా తీరిక ఉండట్లేదు. అందుకని ఎంతో తేలికగా చేతిలో ఉన్న ఫోన్లోనే బాబా లీలలను తెలుసుకుని, ప్రార్థన ద్వారా కష్టాలు గట్టెక్కేలా బాబా అనుగ్రహించిన ఒక అద్భుతమైన వేదికే ఈ 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్'. ప్రతిరోజూ ఈ బ్లాగులోని సాయిభక్తుల అనుభవాలు చదివితేగానీ నాకు తృప్తిగా ఉండదు. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం మన సాయితండ్రి. బాబా గురించి తెలియకముందు నాకేమైనా కష్టమొస్తే అమ్మకి చెప్పుకునేదాన్ని. బాబా గురించి తెలిశాక నాకు సంతోషం కలిగినా, బాధ కలిగినా మొదట బాబాకే చెప్పుకుంటున్నాను. ఈ బ్లాగ్ గురించి తెలిసినప్పటినుండి నాకు ఏ కష్టం వచ్చినా బాబాతో, "నాకు సహాయం చేయండి బాబా. నా అనుభవాన్ని మీ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ ద్వారా సాటి సాయిబంధువులందరితో పంచుకుంటాన"ని చెప్పుకుంటున్నాను. వెంటనే బాబా నా కష్టాన్ని తీర్చడం, ఆ అనుభవాన్ని మీ అందరితో పంచుకోవడం జరుగుతోంది. ఇంతకుముందు బాబా ప్రసాదించిన ఎన్నో అనుభవాలను నేను మీ అందరితో పంచుకున్నాను. ఇప్పుడు మరో రెండు అనుభవాలను పంచుకుంటాను.


2021, జులై 15న మా అన్నయ్య వ్యవసాయం చేస్తుండగా 'ఇనుప గొర్రు' అనే వ్యవసాయ పరికరం తన కాలికి తగిలి చిన్న గాయమైంది. అన్నయ్య దానిగురించి పెద్దగా పట్టించుకోలేదు. ఐదు రోజుల తర్వాత మాత్రం 'టేట్వాక్'(టిటి) ఇంజెక్షన్ చేయించుకున్నాడు. అయినా ఆ గాయం తగ్గటానికి ఏ ట్యాబ్లెట్లూ వాడకపోయేసరికి మోకాళ్లదాకా చీముపట్టి ఇన్ఫెక్షన్ అయింది. దాంతో అన్నయ్య చలిజ్వరంతో చాలా బాధపడ్డాడు. చివరికి హాస్పిటల్‌కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్ మాకు తెలిసినవారైనందున అన్నయ్యను వెంటనే హాస్పిటల్లో చేరమని అన్నారు. అప్పటికప్పుడు అన్నయ్య తన దగ్గర ఉన్న ఐదు వేల రూపాయలు కట్టి హాస్పిటల్లో చేరాడు. ఇంటి దగ్గర నేను ప్రతిరోజూ 'మా అన్నయ్యకు త్వరగా నయం కావాలి, ఎక్కువ ఖర్చు కాకుండా త్వరగా ఇంటికి రావాలి. అలా జరిగితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను' అని బాబాకు చెప్పుకుని, అన్నయ్యకి బదులుగా నా నుదుటన బాబా ఊదీ ధరించి, మరికొంత ఊదీని నా కాలికి రాసుకునేదాన్ని. సరైన సమయంలో హాస్పిటల్లో చేరడంతో తొందరగా అన్నయ్యకి చికిత్స మొదలైంది. కేవలం పదకొండు వేల రూపాయల ఖర్చుతో నాలుగు రోజుల్లోనే అన్నయ్య ఇంటికి తిరిగి వచ్చాడు. ఇదంతా మన సాయితండ్రి దయ. ఎటువంటి సమయంలోనైనా 'బాబా' అని ఆర్తిగా పిలిస్తే, వెంటనే మన చెంత నిలిచి 'నేనున్నాన'ని అభయమిచ్చే మన సాయితల్లి ఉండగా మనకింక భయమెందుకు? నిరంతరం సాయి నామస్మరణ చేస్తూ, ఊదీని ధరించి, ఊదీ తీర్థాన్ని సేవించండి. అదే మనకు సాయిరక్ష. "ధన్యవాదాలు బాబా! నా మనసులో ఇంకో కోరిక ఉంది బాబా. అది ఏంటో మీకు తెలుసు. నా మనసులోని ఆ బాధను తీర్చి నాకు సహాయం చేయండి బాబా. ఆ అనుభవాన్ని కూడా నేను ఈ బ్లాగులో పంచుకుంటాను".


స్నేహితురాలి అనుభవం: నా స్నేహితురాలి భర్తకు మద్యం సేవించే అలవాటు ఉంది. ఆ విషయంలో ఆమె ఎంతగానో అతనికి నచ్చజెప్పినప్పటికీ అతను తన అలవాటును మానుకోలేకపోయాడు. పైగా అతనికి ఆరోగ్య విషయంలో కూడా కాస్త సమస్య ఉంది. ఒకరోజు నా స్నేహితురాలు తన భర్త ఆరోగ్యం గురించి, ఆర్థికపరమైన బాధల గురించి నాతో చెప్పుకుని బాధపడింది. అప్పుడు నేను తనతో, "బాబా తప్పకుండా నీకు సహాయం చేస్తారు. బాబాపై విశ్వాసముంచు" అని చెప్పి, “ఐదు గురువారాలు సాయి దివ్యపూజ చేసుకో”మని చెప్పాను. అప్పుడామె అలాగే చేస్తానని చెప్పి, "నా భర్త మద్యం త్రాగడం మానేసి నా కోరిక నెరవేరితే, ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పింది. ఆమెకు బాబా అంటే చాలా భక్తి. ఆమె సాయి దివ్యపూజ మొదలుపెట్టి తన కోరిక తీర్చమని బాబాను ఎంతగానో వేడుకుంది. ఆమె పూజలు ఫలించాయి. ఒకరోజు ఉదయం అకస్మాత్తుగా ఆమె భర్త తనని, తన కూతురుని పిలిచి, "నేను ఇక మద్యం త్రాగను" అని చెప్పాడట. అది విన్న ఆమె సంతోషానికి అవధులు లేవు. వెంటనే తను నాకు ఫోన్ చేసి ఈ అనుభవాన్ని, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగుకు పంపమని చెప్పింది. మనం బాబాను పరిపూర్ణమైన భక్తివిశ్వాసాలతో పూజిస్తే, ఆ సాయినాథుడు తప్పక మన కోరికలు నెరవేరుస్తాడు. "ధన్యవాదాలు బాబా! ఇదేవిధంగా నా స్నేహితురాలి కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ".


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


బాబా చేసిన తక్షణ సహాయం


సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయి అన్నకు చాలా థాంక్స్. నా పేరు శ్వేత. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇటీవల అనుకోకుండా బాబా నాకు ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం ప్రసాదించారని నేను నా గత అనుభవంలో పంచుకున్నాను. అయితే, సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ ఆఫర్ ఇచ్చే ప్రక్రియలో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటుంది. అందుకోసం గతంలో పనిచేసిన అన్ని కంపెనీల ఆఫర్‌ లెటర్స్, ఎక్స్‌పీరియన్స్ లెటర్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఇదివరకు 3 కంపెనీలలో వర్క్ చేశాను. ఆ కంపెనీల లెటర్స్ అన్నీ సబ్మిట్ చేయాల్సి ఉండగా ఒక కంపెనీకి సంబంధించిన ఎక్స్‌పీరియన్స్ లెటర్ ఎక్కడో పోగొట్టుకున్నాను. ఎంత వెతికినా అది దొరకలేదు. దాన్ని సబ్మిట్ చేయకుంటే నాకొచ్చిన ఉద్యోగావకాశాన్ని నేను కోల్పోవచ్చు. కానీ నాకు ఏమి చేయాలో తోచలేదు. అప్పుడు నేను, "బాబా! నువ్వే నాకు దిక్కు. ఏదో ఒక దారి చూపించు తండ్రీ" అని బాబాను వేడుకుని, సాయి నామస్మరణ చేస్తూ ఉండసాగాను. అనుకోకుండా ఆ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి నాకు ఫోన్ చేసింది. మాటల్లో నేను ఆ కంపెనీ హెచ్.ఆర్ నెంబర్ తీసుకుని, అతనికి ఫోన్ చేసి, "నేను ఇదివరకు మీ కంపెనీలో పనిచేశాను. నేను నా ఎక్స్‌పీరియన్స్ లెటర్ పోగొట్టుకున్నాను. దయచేసి నాకు ఇంకో కాపీ ఇవ్వండి" అని అడిగాను. బాబా దయవల్ల వాళ్లు సానుకూలంగా స్పందించి, ఆరోజు సాయంత్రంలోపు మరో ఎక్స్‌పీరియన్స్ కాపీ పంపించారు. నేను బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుని, దాన్ని వెంటనే కొత్త కంపెనీలో సబ్మిట్ చేశాను. బాబా చల్లని దయతో మిగతా ప్రాసెస్ అంతా బాగా జరిగి నాకు ఆ ఉద్యోగం వచ్చింది. ఈ ప్రక్రియ అంతా ఎటువంటి ఇబ్బందీ లేకుండా జరిగి నాకు ఉద్యోగం వస్తే సాటి సాయిబంధువులతో నా అనుభవాన్ని పంచుకుంటానని సాయికి మాటిచ్చిన విధంగా నేను నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నాను. "థాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ సాయీ".


ఇంకో చిన్న అనుభవం: ఈమధ్యనే మా చిన్నబ్బాయికి జలుబు, దగ్గు సమస్యలొచ్చాయి. నాకు చాలా భయం వేసి, "బాబా! వాడికి ఏమీ అవకుండా చూడు" అని వేడుకున్నాను. తరువాత దయగల మా సాయి ఊదీ పెట్టగానే, బాబుకి నయం కావడం మొదలై రెండు రోజులకంతా పూర్తిగా నయమైంది. "థాంక్యూ సాయీ. మీరు ఎల్లప్పుడూ ఇలాగే అందరికీ తోడుగా ఉండాలని వేడుకుంటున్నాను. మీ నామస్మరణ సదా మా మనసులో నడిచేలా అనుగ్రహించు సాయీ".


బాబా దయతో తగ్గిన జ్వరం


అందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. 2021, జూలై నెల చివరివారంలో మా అమ్మగారికి జ్వరం వచ్చింది. కోవిడ్ సమయం అయినందున మాకు చాలా భయం వేసింది. అమ్మకు అన్ని పరీక్షలు చేసిన మీదట, ‘తనకు ఏ సమస్యా లేద’ని డాక్టరు చెప్పారు. అయినప్పటికీ అమ్మకి జ్వరం తగ్గలేదు. జ్వరం వస్తూ పోతూ ఉండేది. నాకు చాలా భయమేసి సాయితండ్రి మీద భారం వేసి, రోజూ స్తవనమంజరి చదువుతూ ఉండేదాన్ని. అంతేకాదు, "అమ్మకి జ్వరం తగ్గితే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని సాయినాథుని వేడుకున్నాను. బాబా దయవల్ల అమ్మకి జ్వరం తగ్గింది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. "ధన్యవాదాలు బాబా. ఈ అనుభవాన్ని పంచుకోవడంలో కాస్త ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. మమ్మల్ని ఎల్లవేళలా ఇలాగే కాపాడుతూ ఉండండి సాయినాథా".


8 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. ఓం సా౦ుు బాబా త౦డ్రి మా కుటుంబము కాపాడు తండ్రి. ఆరోగ్యంగా ఉండాలంటే నీ ఆశీర్వాదము కావాలి తండ్రి. ఓం సా౦ుు బాబా నమస్కారము❤❤❤

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤🌺🥰🌹🌼🌸🌿😃

    ReplyDelete
  4. Om sai ram baba Amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  5. Baba karthik, santosh ki health bagundali thandri

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. SAI mamalini raboyee apadala nundi rakshinchu plz baba.nivu junavani nammuthunna nannu kapada.

    ReplyDelete
  8. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo