1. అపారమైన సాయిబాబా ప్రేమ
2. మన ఇష్టాలను నెరవేరుస్తారు బాబా3. ప్రార్థించినంతనే లాకెట్ కనపడేలా చేసిన బాబా
అపారమైన సాయిబాబా ప్రేమ
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
నా పేరు సంధ్య. ముందుగా, సాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగును నిర్వహిస్తున్న సాయికి మరియు సాయిబంధువులకు నా నమస్కారాలు. నేను ఇప్పుడు అపారమైన సాయిబాబా ప్రేమను మీతో పంచుకుంటున్నాను.
మొదటి అనుభవం:- 2021, జూన్ 21వ తేదీన మా బంధువులు గృహప్రవేశం మరియు వారి పిల్లల నూతన పట్టు వస్త్రాలంకరణ కార్యక్రమాలకు మమ్మల్ని ఆహ్వానించారు. మా ఇంటిల్లిపాదిమీ గృహప్రవేశానికి వెళ్లి, వారి క్రొత్త ఇంటిని, వారి పిల్లలను చూసి ‘చాలా చక్కటి ఫ్యామిలీ’ అని చాలా సంతోషించాము. వారం రోజుల తర్వాత వాళ్ళ అబ్బాయి మూడు అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి ప్రమాదవశాత్తూ క్రింద లిఫ్ట్ ఉండే ప్రదేశంలో పడిపోయాడు. ఆ అబ్బాయికి బాగా రక్తస్రావం జరిగి ఉలుకూపలుకూ లేకుండా అపస్మారక స్థితిలో ఉండిపోయాడు. వెంటనే ఆ అబ్బాయిని హాస్పిటల్‌కి తీసుకుని వెళితే, డాక్టర్లు ఆ అబ్బాయిని ఐసీయూలో ఉంచి, "పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. ఇప్పుడే ఏమీ చెప్పలేము" అని చెప్పారట. ఇక ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో ఊహించుకోగలము కదా. వాళ్ళు కూడా సాయిబాబా భక్తులే. మాకు విషయం తెలియగానే నేను సాయిబాబాకు నమస్కరించుకుని, "బాబా! ఆ బాబుకి ఏమీ కాకూడదు తండ్రీ. బాబుకి మీరే డాక్టర్. మీ దయవలన ఎప్పటిలాగే బాబు ఆరోగ్యంతో తిరిగి రావాలి. అదే జరిగితే, మీ అపారమైన ప్రేమను 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను తండ్రీ" అని మ్రొక్కుకున్నాను. అంతేకాక, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' మంత్రాన్ని జపిస్తూ, కొద్దిగా ఊదీ తీసుకుని ఆ బాబుని తలచుకుంటూ నా నుదుటన ధరించి, మరికొంత ఊదీని నోట్లో వేసుకుని, ఊదీ తీర్థాన్ని కూడా సేవించాను. ఆ బాబుకు స్పృహ వచ్చేవరకూ పదేపదే బాబాను ప్రార్థిస్తూ గడిపాను. బాబా దయను చూడండి! మూడు రోజుల్లో బాబుకి స్పృహ వచ్చింది. తనలో వచ్చిన కదలిక చూసి డాక్టర్లు అన్ని పరీక్షలు చేసి, 'మూడు అంతస్తుల మీదనుండి పడిపోయినా ప్రాణనష్టం జరగలేద'ని ఆశ్చర్యపోయారట. తలకి చిన్న కట్టుతో బాబు ఆరోగ్యంగా ఉన్నాడు. బాబు హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక మేము తనను చూడడానికి వెళ్ళొచ్చాము. నేను బాబాను ప్రార్థించినట్లే బాబు మునుపటిలా ఆరోగ్యంగా ఉన్నాడు. "మీ భక్తులు మిమ్మల్ని మరచినా మీరు మరువరని మరోసారి ఋజువైంది బాబా. ప్రాణనష్టం జరగకుండా, పెద్దగా కష్టమేమీ లేకుండా బాబును కాపాడింది మీరేనని నేను విశ్వసిస్తున్నాను తండ్రీ. ధన్యవాదాలు సాయితండ్రీ. మీ పాదాలే మాకు శరణం".
రెండవ అనుభవం:- 2021, జూన్ 1న మా పెళ్లిరోజు. ఆరోజు సాయంత్రం నేను నా చెవికమ్మలు మార్చుకుంటూ పాతవి తీసి క్రొత్తవి పెట్టుకునే సమయంలో చెవికమ్మకి ఉండే శీల(చీల) క్రిందపడిపోయింది. క్రిందపడిన శబ్దం కూడా వచ్చింది. వెంటనే దానికోసం వెతకడం మొదలుపెట్టాను. కానీ ఎంత వెతికినా అది కనిపించలేదు. సరే, ఇంట్లోనే పడిపోయింది కదా, కనిపిస్తుందిలే అని ఊరుకున్నాను. మరుసటిరోజునుంచి 'బంగారుశీల ఎక్కడ పడిపోయిందో ఏమిటో తెలియట్లేదు, చెత్తలో ఏమైనా పడిపోయిందా?' అని కంగారు మొదలైంది. "సాయి తండ్రీ! నా బంగారుశీల నాకు కనపడేలా చేయండి" అని బాబాను ప్రార్థించి మళ్ళీ వెతికాను. కానీ, కనిపించలేదు. అయినప్పటికీ, నా బాబా ఖచ్చితంగా నా బంగారుశీల దొరికేలా చేస్తారనే భరోసాతో గుర్తుకు వచ్చినప్పుడల్లా దానికోసం వెతకసాగాను. 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అనే మంత్రాన్ని జపించాలనుకున్నాను, కానీ బంగారుశీల గుర్తుకు వచ్చినప్పుడు మాత్రమే మనసులో అనుకుంటూండేదాన్ని. ఒకరోజు మాత్రం చాలా దృఢంగా, "నా బంగారుశీల ఏమైంది బాబా?" అని బాబాను అడుగుతూ, మనస్ఫూర్తిగా 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని అనుకుంటూ డ్రాలో వెతకగా అందులో నా బంగారుశీల కనిపించింది. అది చూసి, 'ఇది క్రిందపడిన శబ్దం కూడా వచ్చింది కదా, మరి ఈ డ్రాలో ఎలా ఉంది?' అని ఆశ్చర్యపోయాను. ఏదేమైనా 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని మనఃపూర్వకంగా ప్రార్థించినంతనే నా బంగారుశీల నాకు దొరికేలా చేశారు బాబా. నా బంగారుశీల నాకు దొరికితే ఈ అనుభవాన్ని 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయిబంధువులతో పంచుకుంటానని బాబాకు మాటిచ్చిన ప్రకారం మీ అందరితో పంచుకున్నాను. "ధన్యవాదాలు సాయితండ్రీ. సాయీ! మీ పాదాలే మాకు శరణం. ఆధ్యాత్మికంగానూ, ప్రాపంచికంగానూ మీరు నాకు తోడుగా ఉండి ప్రసాదించే అనుభవాలను ఇలాగే సాయిబంధువులతో మీ బ్లాగులో పంచుకునేలా అనుగ్రహించండి సాయీ".
సద్గురు చరణం భవభయ హరణం శ్రీ సాయినాథ శరణం.
మన ఇష్టాలను నెరవేరుస్తారు బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
"సాయీ! నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నీవే. నీకే సర్వస్వశరణాగతి చేశాను సాయీ. నా సర్వభారాలూ నీవే తండ్రీ". నేనొక సాయిభక్తురాలిని. ఇటీవల బాబా నాకు ప్రసాదించిన తిరుమల దర్శనం గురించి ఇప్పుడు మీతో పంచుకుంటాను. దాదాపు ఒక సంవత్సరంపాటు నేను తిరుమల వెళ్లాలని ఎంతగానో ఎదురుచూశాను. అయితే ఏదో ఒక కారణం చేత వెళ్లలేని పరిస్థితి ఎదురయ్యేది. చివరికి టోకెన్స్ వేసుకున్నాక కూడా అనుకోని ఇబ్బందుల వల్ల వెళ్ళలేకపోయేదాన్ని. అలా జరిగిన ప్రతిసారీ నేను చాలా బాధపడేదాన్ని. ఇలా ఉండగా, ఇటీవల 2021, జులైలో తిరుమల వెళ్లాలని నేను అనుకున్నరోజు నాకు దర్శనం టికెట్స్ దొరకలేదు. అప్పుడు నేను సాయిని ప్రార్థించి, "బాబా! ఎలాగైనా నాకు టికెట్ ఇప్పించండి" అని ఆర్తిగా వేడుకున్నాను. బాబా ఆశీస్సులతో ఆరోజే కళ్యాణం టికెట్స్ విడుదలయ్యాయి. వాటిని మేము బుక్ చేసుకున్నాము. అలా జులై నెలలో సాయి దయవల్ల నాకు శ్రీనివాసుని దర్శనం జరిగింది. ఇదంతా సాయి కరుణ మాత్రమే. అడిగిన వెంటనే వరాలిచ్చే దేవుడు సాయి. బాబా మన ఇష్టాలను నెరవేరుస్తారు. మా అమ్మాయి వచ్చేనెలలో నీట్ ఎగ్జామ్ వ్రాస్తుంది. దయచేసి మీరంతా బాబా దయవల్ల పాప ఎగ్జామ్‌లో విజయం సాధించాలని ప్రార్థించండి. మరో అనుభవంతో మళ్లీ మీ ముందుకు వస్తాను.
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.
శ్రీ సాయినాథ్ మహరాజ్ కీ జై!
ప్రార్థించినంతనే లాకెట్ కనపడేలా చేసిన బాబా
ముందుగా, సాయిబంధువులందరికీ మరియు ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారాలు. నా పేరు శ్రేయ. మేము హైదరాబాదులో నివసిస్తున్నాము. ఒకరోజు ఉదయం మా అమ్మ నన్ను మొక్కలకు నీళ్లు పోయమంది. సరేనని నేను మొక్కలకు నీళ్లు పోస్తుండగా నా మెడలో ఉన్న గొలుసు తెగి క్రిందపడిపోయింది. గొలుసు ఉంది, కానీ దానికున్న లాకెట్ కనబడలేదు. దాంతో ఇల్లంతా చాలాసేపు వెతికాము. కానీ ఆ లాకెట్ దొరకలేదు. అప్పుడు నేను నా మనసులో సాయిని తలచుకుని, "లాకెట్ దొరికితే ఈ అనుభవాన్ని సాయిబంధువులతో పంచుకుంటాన"ని ప్రార్థించి, మళ్ళీ చెట్టు దగ్గరకు వెళ్లి వెతికాను. ప్రార్థించినంతనే సాయి నా కోరికను మన్నించి లాకెట్ కనపడేలా అనుగ్రహించారు. ఇదే సాయి యొక్క మహిమ. నేను ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఆ సమస్యను సాయితండ్రి త్వరగా తీరుస్తారని ఆశిస్తున్నాను. ఆ సమస్య తీరగానే ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteSai please cure my stamak problem. Health problems. Be with us. In every susvation. Slove all problems. You only can do it❤❤❤
ReplyDeleteJai sairam
ReplyDeleteOm sai sri sai Jaya Jaya sai
ReplyDeleteOm Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤
ReplyDeleteBaba amma arogyam bagundali thandri pleaseeee
ReplyDeleteBaba ee gadda ni karginchu thandri pleaseeee
ReplyDeleteBaba karthik, santosh ki health bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete