సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 912వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు
2. అడిగినంతనే అనుమతి ఇప్పించిన బాబా
3. ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే!

బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు

సాయిబంధువులందరికీ నమస్తే. నా పేరు గంగాభవాని. మాది వైజాగ్. సాయిబాబాతో నాకు 1998 నుండి అనుబంధం. అప్పటినుండి ఆయన మమ్మల్ని అడుగడుగునా రక్షిస్తూ ఉన్నారు. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను ఆ సర్వాంతర్యామి గురించి? శిరస్సు వంచి సర్వస్య శరణాగతి వేడుకున్నవారి అన్ని విషయాలూ ఆయనే చూసుకుంటారు, మనం ఏమీ చెప్పవలసిన పనిలేదు. కాకపోతే మనకు కాసింత శ్రద్ధ, సబూరీ, ప్రేమ, నమ్మకం ఉండాలి, అంతే. పరీక్ష పెట్టేదీ ఆయనే, పాస్ చేయించేదీ ఆయనే. ఇక బాబాతో అనుభవం విషయానికి వస్తే... ఈ గ్రూప్ గురించి నాకు తెలియదు. కానీ, బాబా అనుభవాలు ఎవరు చెప్పినా ఆనందంగా వింటాను. ఈమధ్య రాఖీ పండుగరోజు మా బాబుకి జ్వరం వచ్చింది. తను పదవతరగతి అయ్యి, డిప్లొమా చేయడానికి ఎంట్రన్స్ పరీక్ష నిమిత్తం కోచింగ్‌కి వెళ్తున్నాడు. ఆరోజు కూడా తను ఎప్పటిలాగే క్లాసుకి వెళ్లి, మధ్యలో తలనొప్పి అని వచ్చేశాడు. వెంటనే తనను హాస్పిటల్‌కి తీసుకెళ్తే, "ఇప్పుడేగా జ్వరం వచ్చింది, రేపు టెస్టులు చేద్దాం, ప్రస్తుతం మందులు వాడండి" అని పంపించేశారు. ఆ రాత్రంతా జ్వరం తగ్గలేదు. మాకు కంగారుగా అనిపించి, పొద్దున్నే తనను మళ్ళీ హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళాం. టెస్టుల్లో డెంగ్యూ పాజిటివ్ వచ్చింది. ప్లేట్లెట్స్ లక్ష లోపుకు పడిపోయాయి. డాక్టర్, "పరిస్థితి విషమంగా ఉంది, పెద్ద హాస్పిటల్‌కి తీసుకుని వెళ్ళండి" అని పంపించేశారు. అప్పుడు బాబుకి జ్వరం 104 డిగ్రీలు ఉంది. వాళ్ళు వస్తారని ఇంట్లో ఎదురుచూస్తున్న నాకు మావారు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే బాబుని హాస్పిటల్‌కి తీసుకువెళ్లాము. అక్కడ అడ్మిట్ అయ్యాక వాళ్ళు, "ఇప్పుడే ఏం చెప్పలేము, అవసరమైతే తనకు ప్లేట్లెట్స్ ఎక్కించాలి" అని చెప్పి ట్రీట్మెంట్ మొదలుపెట్టారు.

మా బాబు చాలా హైపర్ యాక్టివ్. వాడికి ఎప్పుడూ మందులు వేసింది లేదు. వాడి బ్లడ్ గ్రూప్ అరుదని నేను తనని జాగ్రత్తగా చూసుకుంటాను. అందునా మాకు ఒక్కడే బాబు. అటువంటి తన పరిస్థితి ఇలా ఉండేసరికి ఇక నా కంగారు చూసుకోండి. బాబు స్పృహ లేకుండా బెడ్ మీద ఉంటే నాకు ప్రాణం ఆగలేదు. బాబానే తలచుకుని ఏడుస్తూ కూర్చున్నాను. ఆరోజు సోమవారం. "ఎందుకు ఇలా చేశావు బాబా? ఆ కష్టమేదో నాకు పెట్టవచ్చు కదా!" అని ప్రార్థించుకుంటూ ఉన్నాను. డాక్టర్లు, ‘వారం రోజులు హాస్పిటల్లో ఉండాలి’ అన్నారు. నేను అక్కడే పారాయణ మొదలుపెట్టి, పగలు, రాత్రి తేడా లేకుండా చదివాను. మూడవరోజు డాక్టర్ వచ్చి, "కొద్దిగా పరవాలేదు" అన్నారు. ఆ మాటతో నాకు కాస్త ధైర్యం వచ్చింది. ఇప్పుడు అసలు విషయం చెప్పాలి. అలా హాస్పిటల్లో ఉన్న నాకు రాత్రి నిద్రపట్టక ఫేస్‌బుక్ చూస్తున్నాను. అనుకోకుండా ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' గ్రూపు కన్పించింది. అందులో ఉన్న అనుభవాలన్నీ చదువుతూ, "బాబా! మా బాబుని రేపు ఇంటికి పంపించేస్తే నేను ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని అనుకున్నాను. అంతే, మరుసటిరోజు తెల్లవారి డాక్టర్ వచ్చి, "మీ అబ్బాయికి ఇప్పుడు పరవాలేదు, తనను ఇంటికి తీసుకెళ్లిపోండి" అని అన్నారు. నేను సంతోషం పట్టలేకపోయాను. ఇంటికొచ్చిన మరుసటిరోజు గురువారం బాబా దివ్యపూజ చేశాను. మా బాబు ఇప్పుడు నెమ్మదిగా కోలుకుంటున్నాడు. ఇప్పుడు నాకు సచ్చరిత్రలోని కమ్మరివాని బిడ్డను బాబా కాపాడిన లీల గుర్తుకొస్తోంది. అదేవిధంగా బాబా మమ్మల్ని కాపాడారు. ఇలా బాబాతో నాకు ప్రతిరోజూ అనుభవాలే. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే, అష్టోత్తర నామాలలోని మన సమస్యకి దగ్గరగా ఉన్న నామాన్ని పఠించాలి. ఎలా అంటే, కూర్చున్నా, నిలుచున్నా, నడుస్తున్నా, ఏమి చేస్తున్నా సరే ఆ నామాన్ని స్మరిస్తూ ఉండాలి. నేను అలాగే చేస్తాను. ఉదాహరణకు ఆరోగ్యం కోసమైతే 'ఓం ఆరోగ్యప్రదాయ నమః', ఏదైనా కష్టమొస్తే 'ఆపద్బాంధవాయ నమః'... అలా. బాబాని నమ్మితే చాలు, అన్నీ ఆయన చూసుకుంటారు. మళ్ళీ ఇంకో అనుభవంతో మీ ముందుకు వస్తాను. అందరికీ బాబా అనుగ్రహసిద్ధిరస్తు!

అడిగినంతనే అనుమతి ఇప్పించిన బాబా

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

నా పేరు అరుణదేవి. ముందుగా ఈ బ్లాగును నిర్వహిస్తున్న సాయికి నా ధన్యవాదాలు. ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని లీలలు అనంతం, వర్ణనాతీతం. అందులోనుండి ఒక చిన్న లీలను మీతో పంచుకుంటాను. మేము ఒక ఇల్లు కట్టుకుంటున్నాము. దాని ప్రహరీగోడ హద్దుల దగ్గర స్థలం కొంచెం క్రాస్ రావడంతో ఒక అడుగున్నర స్థలం ప్రక్కింటివాళ్ళ స్థలంలోకి జరగవలసి వచ్చింది. వాళ్ళని అనుమతి అడిగితే వాళ్ళు, "మాకు ఏమీ అభ్యంతరం లేదు, మీరు మా స్థలంలోకి జరగవచ్చు" అని అనుమతించారు. దాంతో మేము పని మొదలుపెట్టాం. అంతా సవ్యంగా జరుగుతున్న సమయంలో ప్రక్కింటివాళ్ళ బంధువు ఒకావిడ వచ్చి, "మా స్థలంలోకి రావడానికి వీల్లేదు. మీ హద్దు వరకు మీరు నిర్మించుకోండి" అని చెప్పి పనిచేసేవాళ్ళని పని ఆపేయమని చెప్పింది. పనివాళ్ళు మాకు ఆ విషయం చెప్పి పని ఆపేశారు. మాకు ఏం చేయాలో అర్థంకాక, "బాబా! ఏమిటి ఈ ఆటంకాలు? మీరే ఈ సమస్యకు పరిష్కారం చూపించాలి. మాకు మీరు తప్ప వేరే దిక్కు లేదు. ఎలాంటి వాదనలు, గొడవలు లేకుండా మంచిగా అనుమతించేలా సహాయం చేయండి బాబా" అని ప్రార్థించి 'ఓం శ్రీసాయి సూక్ష్మాయ నమః' అని జపించసాగాను. అలా బాబాను ప్రార్థించిన తరువాత ఒక గంటలో ఆ స్థలం యజమాని మాకు ఫోన్ చేసి, "ఆవిడ మాటలు పట్టించుకోకండి, నేను చూసుకుంటాను. మీరు పని మొదలుపెట్టుకోండి" అని చెప్పారు. అడిగిన వెంటనే బాబా మాకు అనుమతిని ఇప్పించినందుకు మాకు ఎంతో సంతోషం కలిగింది. అడుగడుగునా మా వెంట ఉండి మమ్మల్ని కాపాడుతున్న సాయికి ఏమిచ్చినా ఆయన ఋణం తీరదు. "బాబా! మీకు శతకోటి పాదాభివందనాలు. ఎల్లప్పుడూ ఇలాగే కనికరించి కాపాడండి బాబా. మీ దయవలన ఇప్పుడు పని జరుగుతోంది. మా పని మొత్తం పూర్తయ్యేవరకు ఎటువంటి ఆటంకాలు ఎదురుకాకుండా మీరే ముందుండి నడిపించండి బాబా. మీ బిడ్డలమైన మేము తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేసి ఉంటే క్షమించి మంచి మార్గంలో నడిచేలా చేయండి".

ఇప్పుడు నేను మీతో నేను చేసిన తప్పు గురించి చెప్పాలనుకుంటున్నాను. ముందు అది తప్పని నాకు తెలియదు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తున్నాను అనుకుని చేశాను. కానీ ఇప్పుడు వాటి ఫలితం అనుభవిస్తున్నాను. నా దగ్గర ఉన్న ఆరు లక్షల పదమూడు వేల రూపాయలు వెనకా ముందూ చూసుకోకుండా అడిగినవాళ్ళకి ఇచ్చేశాను. ఇప్పుడు నాకు అవసరమై అడుగుతుంటే, ఒక్కరు కూడా ఇవ్వడం లేదు. ఈ విషయం నాకు, నా బాబాకు తప్ప ఎవరికీ తెలీదు. ప్రతిరోజూ నేను, "వాళ్ళ మనసులు కరిగించి నా డబ్బులు నాకు తిరిగి ఇప్పించమ"ని బాబాను ప్రార్థిస్తున్నాను. ఈ విషయమై ఒకరోజు బాబా ముందు చీటీలు వేద్దామని మనసులో అనుకుని ఏదో ధ్యాసలో పడి మర్చిపోయాను. కొద్దిసేపటికి వాట్సాప్ గ్రూపు ఓపెన్ చేస్తే, "నీ డబ్బు ఎక్కడికీ పోదు. నువ్వు ప్రశాంతంగా ఉండు" అనే బాబా మెసేజ్ కనిపించింది. 'బాబా వాక్కు, ఇక నాకు భయంలేద'ని అనుకున్నాను. కానీ నేను స్థిరంగా ఉండలేకపోతున్నాను. ఎవ్వరూ సహకరించడం లేదు. మీ అందరితో చెప్పుకోవాలనిపించి ఇలా చెప్పుకున్నాను. ఈ సమస్య నుండి గట్టెక్కితే ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటాను. "బాబా! వాళ్ళకి ఏమి సమస్యలున్నాయో, ఏమో? వాటినుండి వాళ్ళను కాపాడి, నా సమస్యను అతిత్వరలో పరిష్కరించండి బాబా. నాకు సహాయం చేసి నన్ను సమస్యల నుండి కాపాడండి సాయీ. మీకు శతకోటి ధన్యవాదాలు".

ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే!

శ్రీసాయిబాబాకు, శరత్‌బాబూజీకి, అలివేలుమంగమ్మ సహిత భరద్వాజ మాస్టారుకి జై!

నా పేరు దేవి. నాకు జనవరిలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. కానీ ఎలాంటి బాధా లేకుండా దాని బారినుండి బయటపడ్డాను. కానీ కోవిడ్ తగ్గిన తరువాత 'స్పాండిలోసిస్' రావడం వలన నొప్పితో పదిరోజులు మంచం మీదనే ఉన్నాను. ఆ సమయంలో సాయి గ్రూప్ అడ్మిన్ కి ఏడుస్తూ నా తరఫున బాబాను ప్రార్థించమని మెసేజ్ పెట్టాను. తనకు అలా మెసేజ్ పెట్టిన మరుసటిరోజు నుండి నొప్పి చాలావరకు తగ్గింది. కానీ నాకు విపరీతమైన నీరసంగా ఉంటూ, చనిపోతానేమో అనేంతగా భయం వేసేది. ఆ నీరసం పోవాలని ఎంతమంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళినా తగ్గలేదు. అందరూ ‘పోస్ట్ కోవిడ్ వలన అలా నీరసంగా ఉంటుంద’ని చెప్పారు. ఆ సమయంలోనే మా స్కూల్లో పనిచేసే సార్ ‘శరీరంలో ఉప్పుశాతం తగ్గిందేమో చూసుకోమ’ని సలహా ఇచ్చారు. దాంతో నాలుగు రోజులపాటు ఓఆర్ఎస్ తాగాను. ఇవన్నీ చేస్తూ నా బాధనంతా బాబాకి, గురువుగారికి చెప్పుకుంటూ ఉండేదాన్ని. తెలిసిన ఒక సాయికి కూడా నా ఆరోగ్య సమస్య గురించి మెసేజ్ చేశాను. వారు కూడా నా తరఫున బాబాను ప్రార్థించారు. అదేరోజు రాత్రి కలలో ఏదో ఒక నల్లని ఆకారం నా వైపు వస్తుంటే, మా గురువుగారైన శరత్‌బాబూజీ దాన్ని తరిమికొట్టమని నాతో చెప్తూ, తామూ దానిని తరిమికొట్టారు. మరుసటిరోజు నుండి నా ఆరోగ్యంలో మార్పు వచ్చింది. నాలో ఏదో తెలియని కొత్త శక్తి సంతరించుకుని నేను పూర్తి ఆరోగ్యవంతురాలినయ్యాను. ఇది కేవలం బాబా, గురువుగారి వలననే సాధ్యమైంది. నాకు రావాల్సిన ఆపదను ఆ కల రూపంలో తొలగించారని నా నమ్మకం. నేనీరోజు బ్రతికి ఉన్నానంటే కారణం బాబా, గురువుగారే. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ప్రస్తుతం మా అమ్మానాన్నలకు కరోనా వచ్చింది. అమ్మకు జ్వరం తగ్గడం లేదు. వారిరువురి ఆరోగ్య భారం మీ మీదే వేస్తున్నాను బాబా. కరోనా బారినుండి వారిని రక్షించండి బాబా".

సాయివంటి దైవంబు లేడోయి లేడోయి!

12 comments:

  1. Jai sairam. Bless amma for her eye surgeries and bless me for my gain good health and wealth. Jai sairam

    ReplyDelete
  2. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  3. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏❤😀🌼🥰🌹😊🌺🤗🌸

    ReplyDelete
  4. Om Sri sai sadhu swaroopaya namaha 🙏🙏🙏

    ReplyDelete
  5. Om sai ram baba amma arogyam bagundali thandri infection taggipovali thandri

    ReplyDelete
  6. Baba ee gadda ni tondarga karginchu thandri

    ReplyDelete
  7. Baba santosh Carrier bagundali thandri

    ReplyDelete
  8. Baba pillala arogyam bagundali thandri

    ReplyDelete
  9. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo