బాబా బోధలు, లీలలు ఎంతగా తెలుసుకున్నా కూడా సంప్రదాయాల చట్రంలో చిన్ననాటినుండి ఇరుక్కుపోయిన మన మనస్సు బాబా చెప్పినట్లు నడుచుకోవడానికి అడ్డమై నిలుస్తుంది. ఆ అడ్డు తొలగాలంటే ముందుగా మన మనస్సు సమాధానపడాలి. అప్పుడే మనం సునాయాసంగా బాబా మార్గంలో పయనించగలం. మరి మన మనస్సు సమాధానపడాలంటే బాబా గురించి, బాబా తత్వం గురించి ఉన్నది ఉన్నట్లు చెప్పగల మహాత్ములు కావాలి. అటువంటి మహాత్ములే పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ. బాబా గురించి ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఉన్నది ఉన్నట్లు శ్రీబాబూజీ చెప్పే విషయాలు మనచే బాబాను బాబాగా దర్శింపజేస్తాయి. మనకున్న ఎన్నో సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఫలితంగా మనల్ని బాబాకు చేరువచేస్తాయి. ఈ అనుభూతిని నేను పొందాను. తోటి సాయిభక్తులకు కూడా ఆ శ్రేయస్సు చేకూరాలని శ్రీబాబూజీ రచించిన వ్యాసాల సంకలనమైన 'సాయిభక్తి సాధన రహస్యం' అనే గ్రంథాన్ని మీ ముందుకు తేవాలని చాలాకాలంగా నేను ఆరాటపడుతున్నాను. ఇన్నాళ్లకు బాబా అనుగ్రహంతో ఆ గ్రంథంలోని వ్యాసాలను ప్రచురించే మహద్భాగ్యం లభించింది. ఇందుకు అనుమతినిచ్చినవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
మ్రొక్కినంతనె గ్రక్కున వరములిచ్చెడి వేల్పు!
శ్రీసాయిబాబా చిత్రపటం లేని ఇల్లు, సాయిమందిరం లేని పట్టణం, దక్షిణభారతంలో - ముఖ్యంగా ఆంధ్రదేశంలో - ఈనాడు బహు అరుదంటే అతిశయోక్తి కాదేమో! శ్రీసాయిబాబా మహాసమాధి చెంది మొన్న (1988) విజయదశమికి డెబ్భయి ఏళ్ళయింది. బాబాను భౌతికంగా దర్శించిన తరానికి చెందినవారెందరో నేటికీ సజీవులైవున్నారు. రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఏసుప్రభువు వంటి మహాపురుషులు సామాన్య జనజీవన స్రవంతిలో ఆరాధ్యదైవాలుగా స్థిరపడడం వారు నిర్యాణం చెందిన ఎంతో కాలానికిగాని జరగలేదు. కానీ, మహాసమాధి చెందిన అనతికాలంలోనే భారతీయ ఆధ్యాత్మిక సామాజిక జీవనంలో ఒక భాగమయ్యారు శ్రీసాయిబాబా. ఎన్నో శతాబ్దాలుగా ఆరాధింపబడుతున్న దేవతామూర్తుల సరసన శ్రీసాయినాథుడు ఓ మహామహిమాన్వితుడైన 'దైవం'గా నిలిచారు. ఈనాడు దేశంలో (ముఖ్యంగా మన రాష్ట్రంలో) పెద్దపట్టణాలలోనే కాదు, పల్లెపల్లెల వాడవాడల సాయిమందిరాలు, సాయిభక్తసమాజాలు, సాయి సత్సంగకేంద్రాలు వెలిసాయి ... ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. ఈనాడు లక్షలాదిమందికి శ్రీసాయి ఇలవేలుపు. ఎందరో తమ సంతానానికి, వ్యాపారసంస్థలకు ‘సాయిబాబా’ పేరు ప్రీతితో పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం మనదేశంలో తిరుపతి తరువాత ఎక్కువ సంఖ్యలో ప్రజలు సందర్శిస్తున్న పవిత్రక్షేత్రం శిరిడియేనని కొందరంటారు! మరి కొన్నేళ్ళకు, శ్రీరామ శ్రీకృష్ణ మందిరాల సంఖ్యతో సమానంగా సాయిమందిరాలు వెలసినా ఆశ్చర్యపడవలసిన పనిలేదు. ఇలా ఒక మహాత్ముని మహిమ - సంప్రదాయం ఇంత త్వరితగతిన ప్రజాబాహుళ్యంలో సుస్థిరమవటం ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలోనే అపూర్వం!
పిలిచిన పలికే దైవం!
అయితే, ఈ అపూర్వసంఘటనకు కారణం ఏ వ్యక్తి లేక వ్యక్తులు కాదు! ఏ సంస్థలూ కాదు! మతవిశ్వాసాలతో ముడిపడిన ఆచారసాంప్రదాయాలు అసలే కాదు! ప్రణాళికాబద్ధమైన ‘ప్రచారం' అంతకంటే కాదు! ప్రముఖ సాయిభక్తి ‘ప్రచారకుడు’గ(!) ఎనలేని సేవలందించిన పూజ్యశ్రీ బి.వి.నరసింహస్వామిగారు కూడా యీ విషయాన్నే పదేపదే నొక్కివక్కాణించేవారు. శిరిడీలోని శ్రీసాయిబాబా సంస్థాన్ కూడా - బాబా తత్త్వానికి విరుద్ధమన్న భావంతో - ఏనాడూ సాయిభక్తి ప్రచారకార్యక్రమాలను చేపట్టలేదు. అటువంటప్పుడు, మరి యీ సాయిభక్తి యొక్క అద్భుత విస్తరణకు కారణం ఏమిటి? కొంచెం ఆలోచిస్తే, ఈనాటికీ అద్భుతరీతిన ప్రకటమౌతున్న శ్రీసాయిమహిమయే యీ సాయిభక్తి ఉద్యమవ్యాప్తికి కారణమని ఇట్టే అర్థమౌతుంది. “పిలిస్తే పలికే గొప్ప నిదర్శనం గల దేముడు" ఎవరని అడిగితే, చాలామంది ఠక్కున “శ్రీసాయిబాబా!" అని సమాధానం చెప్తారు. అంతేకాదు, బాబాను భక్తిశ్రద్ధలతో ఆరాధించే ఎంతోమంది భక్తులకు శ్రీసాయిచరిత్ర - ప్రబోధాల గురించి దాదాపు తెలియదనే చెప్పాలి! వారిని శ్రీసాయి ముంగిట కట్టి పడేసిన ఆకర్షణశక్తి శ్రీసాయిమహిమే! జీవితంలో యేదైనా కష్టం వచ్చినపుడు – ‘ఏదో పదిరాళ్ళలో ఒక రాయి’ అన్నట్లు - బాబాను ప్రార్థించి (మొక్కుకొని), ఠక్కున నిదర్శనం రావడంతో సాయిభక్తులయినవారే ఎక్కువమంది!
‘మిషన్’లు కేవలం 'మిష’లు
మరైతే సాయితత్త్వ ‘ప్రచారం’ లక్ష్యంగా అసంఖ్యాకంగా వెలసిన ఆధ్యాత్మిక సంస్థలు, అవి నిర్వహిస్తున్న పత్రికలు, పుస్తక ప్రచురణలు, సత్సంగకేంద్రాలు తదితర కార్యక్రమాల మాటేమిటనే సందేహం ఎవరికైనా కలుగవచ్చు! పైన పేర్కొన్న కార్యక్రమాలన్ని సామాన్యంగా సాయి ‘ప్రచారం’ పేరిట వ్యవహరింపబడుతుండడం నిజమే! కానీ అది సామాన్య వ్యవహారం మాత్రమే. సామదానభేదోపాయాలనుపయోగించి తమ మతానికి, మతసిద్ధాంతానికి సంఖ్యాబలం పెంచడం కోసం చేసే ప్రయత్నమే ‘ప్రచారమ’నే పదానికున్న సూచ్యార్థం. ఇంకొంచెం సూటిగా చెప్పాలంటే, సాధ్యమైనంత ఎక్కువమందిని సాయిభక్తులుగ 'మార్చ'డానికి చేసే ప్రయత్నమే ‘సాయిప్రచారం’. తనకు శ్రేయోదాయకమని నమ్మిన మార్గాన్ని తన సాటివారికి కూడా తెలిపి, వారూ ఆ మార్గంలో పయనించాలని తహతహలాడటం మానవనైజం. శ్రీసాయిని ఆరాధిస్తూ, సాయిలీలలు చవిచూచిన సాయిభక్తులు, శ్రీసాయి అనుగ్రహం అందరిమీదా వర్షించాలని కోరుకోవడం సహజం. తమ తమ అనుభవాలను (సాయిలీలలను) తోటివారితో పంచుకోవడం ద్వారా వారు తమకు తెలియకుండానే సాయిప్రచారం చేస్తున్నారని చెప్పాలి. ఈ దృష్ట్యా ప్రతి సాయిభక్తుడు ఒక సాయిసేవకుడే, ఒక సాయితత్త్వప్రచారకుడే! కానీ ఇక్కడ జరిగేది 'పంచుకోవడమే’ గానీ, తమ (సంఖ్యాబలాన్ని) ‘పెంచుకోవడమనే’ ప్రచారకార్యం కాదు. ఈ పంచుకోవడమనే కార్యం తమ త్రికరణాలను సాధ్యమైనంతసేపు సాయి ఊసులో- సాయిధ్యాసలో వుంచుకొనే మార్గమేనని, అది తమ తరింపుకు చేసే ప్రయత్నమేగాని, ఇతరులను ఉద్ధరించేందుకో లేక వారిని సాయిభక్తులుగ మార్చడానికి చేసే ‘ప్రచార’ కార్యం కాదనే సత్యాన్ని సాయిభక్తులెప్పుడూ మరువరాదు! ఎందుకంటే, ఎవ్వరూ ఎవ్వరిని సాయిభక్తులుగ 'మార్చ’లేరు! ఈ విషయాన్ని, "నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను", "నా భక్తుడు ఎంత దూరాన వున్నా -పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కొన్నట్లు - రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకుంటాను. ఎవరూ వారంతటవారుగ నా దగ్గరకు రారు” అని బాబా నిర్ద్వంద్వంగ ప్రకటించే వున్నారు. అంతేకాదు! “ఇది బ్రాహ్మణ మసీదు. ఈ బ్రాహ్మణుడు లక్షలాదిమందిని శుభ్రమార్గాన నడిపించి, చివరికి గమ్యం చేరుస్తాడు!” “నా నామం పలుకుతుంది! నా మట్టి సమాధానమిస్తుంది!” “నా సమాధి నుండి కూడా నేను నా కార్యాన్ని కొనసాగిస్తాను!" అన్న బాబా, తమకు తాముగ తమ భక్తులను - వివిధ 'మిషల’తో వారికి తమ మహిమను రుచి చూపి, గ్రక్కున వారి అక్కరలు తీర్చి, ప్రేమపాశంతో వారిని అక్కున చేర్చుకొంటున్నారు. ఆ కార్యంలో మనకు బాబాను గురించి ‘తెలియజేసే’ వ్యక్తులు, సంస్థలు కేవలం నిమిత్తమాత్రాలు; ఆయా సంఘటనలు, లీలలు - బాబా మాటల్లో చెప్పాలంటే - వివిధ 'మిషలు’ మాత్రమే! శ్రీసాయిభక్తి ఉద్యమవ్యాప్తికి అసలు కారణం ఆ 'మిషలే’ కాని, ‘మిషన్’లు (missions, ప్రచారసంస్థలు) కావు!
వాపా? బలుపా?
అయితే, ప్రజాబాహుళ్యంలో దినదినాభివృద్ధి చెందుతున్న యీ సాయిభక్తి ఉద్యమం కేవలం ‘వాపే’ కాని ‘బలుపు' కాదని కొందరు 'ఆస్తికుల’ అనుమానం! జరుగుతున్న పరిస్థితి చూస్తే జీవుల ఆధ్యాత్మికోన్నతి, తరింపు శ్రీసాయి అవతారకార్యాలుగా కనిపించటంలేదని, మహిమ-చమత్కారాల ప్రకటన, ‘నిదర్శనాల ప్రదర్శనమే’ బాబా కార్యమా అన్నట్లున్నదనే సందేహం - కొద్దిమందికైనా - కలగడం సహజమే! అద్భుతమైన శ్రీసాయిచరిత్ర - ప్రబోధాలను సునిశితంగా పరిశీలిస్తేగాని, శ్రీసాయి వరదైవమా? పరదైవమా? - అనే నివృత్తివాదుల సందేహం కొంతవరకైనా నివృత్తి కాదు!
వరదైవమా? పరదైవమా?
ఆధ్యాత్మిక పరిణతి పరిణామాల దృష్ట్యా వ్యక్తులను నాలుగు తరగతులుగా విభజించారు మహాత్ములు; ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసువులు, ముముక్షువులు - అని. ప్రజాబాహుళ్యంలో ఎక్కువమంది ఆర్తులు, అర్థార్థులే! ఏవేవో కోరికలతో సంసారిక తాపత్రయాలతో సతమతమౌతూ వుండేవారే ఆర్తులు, అర్థార్థులు. ముక్తి తరింపు సద్గతివంటి విషయాలకు - కేవలం నోటిమాటలుగా తప్ప - ఎక్కువమంది జీవితాలలో పెద్దప్రాముఖ్యత లేదు. రకరకాల కోరికలతో సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తికి, “నిన్ను నీవు తెలుసుకో!”, “జగత్తు మిథ్య! సంసారము మాయ!" వంటి ప్రబోధాలు రుచించవు సరికదా, అవి యీ సంసారసాగరపు గట్టెక్కించలేని వట్టి మెట్టవేదాంతంగా తోస్తుంది. అటువంటి సాంసారిక జీవులలో కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాసను రేకెత్తించి, సత్యపథం వైపుకు నడిపించగల సమర్థుడే నిజమైన సద్గురువు. ఈ దుస్తరకార్యాన్ని అత్యంత సునాయాసంగా సమర్ధవంతంగా నిర్వహిస్తున్న సద్గురు సామ్రాట్ – శ్రీసాయిబాబా!
మహాత్ములున్నదెందుకు?
అదెలాగా? - అంటే, దానికి సమాధానం బాబానే వివరించి వున్నారు. “భక్తులకు ఐహికంగానూ, ఆముష్మికంగానూ లాభం చేకూర్చడానికే మహాత్ములున్నది” అనేవారు బాబా. అంతేకాదు! డబ్బు, వ్యాపారము, ఆరోగ్యము, సంతానము, ఉద్యోగము తదితర విషయసంబంధమైన సమస్యలతో కోరికలతో బాబాను ఆశ్రయించే భక్తులను నిరసిస్తూ, “శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థించాలి గానీ, తుచ్ఛమైన ప్రాపంచిక కోరికలతో ఆశ్రయించకూడదు” అని ‘హితవు’ చెబుతున్న ఒక భక్తునితో బాబా, “అలా అనొద్దు! నాకు సంబంధించినవారు మొదట అలాంటి కారణాలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక, నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి, రకరకాల మిషలమీద నేనే వారిని నా దగ్గరకు రప్పించుకొంటాను. వారెంత దూరాన వున్నా సరే నేనే వారిని కోరి నా వద్దకు చేర్చుకొంటాను. ఎవరూ వారంతటవారుగ నా దగ్గరకు రారు!” అని అన్నారు.
ఆర్తి నుండి జిజ్ఞాస
వివిధ ప్రాపంచిక కోరికలతో, స్వార్థం కోసమే మొదట బాబాను ఆశ్రయించినా, బాబా మహిమవల్ల ఆ కోరికలు తీరి, కష్టాలు గట్టెక్కడంతో, వారిలో మొదట బాబా పట్ల కృతజ్ఞతాభావం ఏర్పడుతుంది. అదే క్రమంగా భక్తివిశ్వాసాలుగా పరిణతి చెందుతుంది. తమనుండి ఏమీ ఆశించకుండా, తమలో యే అర్హతలు చూడకుండా, తమను తాముగా తల్లిలా ప్రేమించి కాపాడే అవ్యాజమైన బాబా ప్రేమకరుణలను గుర్తించగానే వారిలో క్రమంగా బాబాపట్ల బాబాతత్త్వం పట్ల జిజ్ఞాస రేకెత్తుతుంది. అలా, ఆర్తులు జిజ్ఞాసువులవుతారు!
శ్రీసాయి - ఇహపరశ్రేయోదాయి!
అలా జనించిన జిజ్ఞాస మనలో బాబా చరిత్ర - బోధనలను గురించి తెలుసుకొని, శ్రీసాయితత్త్వాన్ని గురించి ఆలోచించేటట్లు చేస్తుంది. బాబా చరిత్రలో ప్రకటమవుతున్న ఆయన అవ్యాజమైన ప్రేమకు కరుణకు సర్వజ్ఞతకు సర్వశక్తిమత్వానికి మన మనసులు ముగ్ధమవుతాయి. క్రమంగా, మన హృదయాలు బాబావైపు తీవ్రంగా ఆకర్షితమవడం మొదలవుతుంది. బాబాపట్ల ఆకర్షణ పెరిగేకొద్దీ, మన మనస్సులను ఎంతో తీవ్రంగా పట్టిపీడిస్తున్న సామాన్య సాంసారిక సమస్యలపట్ల కోరికలపట్ల నిర్లిప్తత జనిస్తుంది. ప్రీతికరమైన వ్యక్తుల గురించి, విషయాల గురించి తిరిగితిరిగి తలపోయడం మనస్సుకున్న సహజలక్షణం. అందువల్ల బాబావైపుకు మన హృదయాలు ఆకర్షితమయ్యేకొద్దీ, బాబాపై మక్కువ ఎక్కువకాసాగి, క్రమంగా అది ‘అనన్యచింతన’కు దారితీస్తుంది. 'తమ అనుగ్రహదృష్టిని ఎప్పుడూ మనమీదనే నిల్పి, జన్మజన్మలనుండి కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ సర్వజ్ఞునికి ప్రత్యేకంగా మన కోరికలు నివేదించడమేమిటి? మనకేది మంచిదో ఆ ఇహపర శ్రేయోదాయియైన సాయికి తెలియదా?' - అనే వివేకం అంకురించి, ఆనందంతో ఆయన చరణాలకు శరణు పొంది, సర్వం బాబా సంకల్పానికి ఇచ్ఛకు నిర్భయంగా వదలిపెట్టి, ‘నిశ్చింతగా’ జీవించడం సాధ్యమవుతుంది. అంటే, క్రమంగా ఆర్తుడు జిజ్ఞాసువుగా, జిజ్ఞాసువు ‘ముముక్షువు’గా మారాడన్నమాట!
ఇహములోనే పరము!
వివిధ విషయవాసనలతో, కోరికలతో, ప్రాపంచిక వ్యామోహాలతో సతమతమవుతున్న మనలను - మనస్సుయొక్క సహజస్వభావాని కనుగుణంగా - సంస్కరించి ఉద్ధరించి సద్గతిని అందజేయడమే సాయి అవతారకార్యం యొక్క పరమార్థం. అంతేకానీ, ముముక్షత్వదశలో బోధించవలసిన వివేకవైరాగ్యాలను, వేదాంతసత్యాలను, ఇంకా ఆర్తులుగా ఆర్థార్థులుగా వున్నదశలో మనకు బోధిస్తే, అది శుష్కవేదాంతమవుతుంది. అటువంటి శుష్కవేదాంతానికి శ్రీసాయిపథంలో చోటులేదు. అందుకే అన్నారు శ్రీవేమనయోగీంద్రులు, “ఇహము విడిచి ఫలములింపుగా గలవని మహిని పల్కువారి మతము కల్ల! ఇహములోన బరము నొసగుట కానరో!” అని.
యోగభోగంబుల సంయోజనం
బాబా ఎన్నడూ ఇహాన్ని నిరసించలేదు. తన భక్తుల పారమార్థిక జీవితంపట్ల మాత్రమే తన బాధ్యత అంటూ, వారి ఐహిక (ప్రాపంచిక) జీవితాన్ని పట్టించుకోక నిర్లక్ష్యం చెయ్యలేదు. తన భక్తులఇహపరాల భారం తామే వహిస్తూ, వివిధ తరగతుల ప్రజలను, వారివారి సంస్కారాలకు, పరిణతికి అనుగుణంగా లాలించి బుజ్జగించి బోధించి తీర్చిదిద్దడమే బాబా యొక్క ప్రత్యేకత.
Source: సాయిభక్తి సాధన రహస్యం, రచన: పూజ్యశ్రీ సాయినాథుని శరత్ బాబూజీ.
🙏🌺🙏ఓం సాయిరాం🙏🌺🙏
ReplyDeletevery nice message.i felt very happy you stareded new blog.to days post is verh nice.om sai ram bless my family.bless my children and hubby
ReplyDeleteOm Sai
ReplyDeleteSri Sai
Jaya Jaya Sai
🙏🙏🙏
Om sai Ram
ReplyDelete