ఈ భాగంలో అనుభవాలు:
- "నాకు తోడుగా ఉన్నాన"ని భరోసా ఇచ్చిన బాబా
- బాబా ఉండగా మనకి భయమెందుకు?
"నాకు తోడుగా ఉన్నాన"ని భరోసా ఇచ్చిన బాబా
సాయిభక్తురాలు హేమ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.
సాయిబంధువులందరికీ నమస్కారం! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగ్ నిర్వాహకులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఈ బ్లాగ్ మాకు బాబా గురించి తెలియజేయడమే కాకుండా, మమ్మల్ని బాబాకు చాలా దగ్గర చేసింది. సాయితండ్రి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ 'హేమ'గా నా మొదటి అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 'హేమ'గా అని ఎందుకు అన్నానో చివరిలో మీకు అర్థమవుతుంది.
కొన్నినెలల క్రిందట మా అమ్మావాళ్ళింట్లో జరిగిన పండుగకి అందరమూ వెళ్ళాము. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయేముందు నాకున్న సమస్యలను బాబాకు చెప్పుకొని నిద్రపోవడం నాకలవాటు. ఆరోజు కూడా నిద్రపోయేముందు, "తండ్రీ, నాకు నీవే దిక్కు" అని బాబాను తలచుకొని నిద్రపోయాను. మరుసటిరోజు ఉదయం నిద్రలేస్తూనే మా అక్క, తనకు బాబా కలలో కనిపించి, "హేమకి తోడుగా నేనున్నాను" అని చెప్పారని ఆనందంగా చెప్పింది. అది వింటూనే నాకు కూడా చాలా ఆనందం కలిగింది. నిజానికి మా అక్క వేంకటేశ్వరస్వామి భక్తురాలు. అయినప్పటికీ సంవత్సరానికి ఒకసారి కుటుంబంతో శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకునేది. తనకు బాబా గురించిగానీ, ఆయన లీలల గురించిగానీ పెద్దగా తెలీదు. బాబా మా జీవితంలోకి వచ్చాక మాకు జరిగిన అనుభవాలను తనతో పంచుకుంటుండేదాన్ని. అవి వింటూ తను బాబా మీద నమ్మకాన్ని పెంచుకుంది.
ఇదిలా ఉంటే, 2020 జులై నెలలో నాకొక సమస్య వచ్చింది. (ఆ సమస్య గురించి ఎవరితోనూ చెప్పుకోలేను, దయచేసి నన్ను క్షమించండి.) ఒకరోజు అక్కకి ఫోన్ చేసి నాకొచ్చిన సమస్యను, నా నిర్ణయాన్ని చెప్తూ ఏడ్చేశాను. అక్క, "నువ్వేం బాధపడకు, నేను ఇంట్లో అందరి అభిప్రాయం అడిగి నీకు కాల్ చేస్తాను" అని చెప్పింది. ఇంట్లో ఎవరూ నా నిర్ణయాన్ని సమర్థించక, "కష్టాలు వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాల"ని ధైర్యం చెప్పారు. చేసేదేమీలేక బాబా మీద భారం వేసి నేను మౌనంగా ఉండిపోయాను. కానీ నేను పడుతున్న బాధని చూసిన అక్క, 'మా అందరిలో బాబా మీద నమ్మకాన్ని నింపిన తానే ఇలా బాధపడుతోంది' అని ఆ క్షణాన తను బాబా మీద కాస్త నమ్మకాన్ని కోల్పోయింది.
తరువాత 2020, జులై 24న అక్క నాకు ఫోన్ చేసి, "నిన్న (జులై 23, గురువారం) ఉదయం నాకొక కల వచ్చింది. ఆ కలలో వేంకటేశ్వరస్వామి, నేను, నువ్వు, నీ ప్రక్కన ఒక వృద్ధుడు కనిపించారు. ఆ వృద్ధుడు నాతో, "హేమకి ఏ సమస్య వచ్చినా నాతో చెప్పుకుంటుంది. నాకు ఏ సమస్య వచ్చినా నేను తనతో చెప్పుకుంటాను. నేను తనకి తోడుగా ఉన్నాను" అని అన్నారు" అని చెప్పింది. అలా చెప్పిన ఆ వృద్ధుడు ఎవరో కాదు, మా సాయితండ్రేనని నాకు తెలుసు. ఆ క్షణాన నేను పొందిన సంతోషాన్ని మాటల్లో వర్ణించలేను.
అక్కకి కల వచ్చిన రోజే బాబా మరో విధంగా ఇచ్చిన సందేశాన్ని కూడా మీతో చెప్పాలి. ఆరోజు ఈ బ్లాగ్ నడిపే సాయి, సంవత్సరం క్రితం బాబా నా జీవితంలో చూపిన లీలలను వాట్సాప్ గ్రూపులో షేర్ చేశారు. నేను దాన్ని ఆరోజు మధ్యాహ్నం చూశాను. దానితో బాబా నాకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఆ అనుభవం ద్వారా 'నీకు వచ్చిన ఇన్ని సమస్యల్లో నేను నీవెంటే ఉండి నడిపించాను కదా, ఇక ముందు కూడా ఏ సమస్య వచ్చినా నేనున్నాను' అని బాబా భరోసా ఇచ్చారు. అంతేకాదు, నాకిచ్చిన ఆ భరోసాతో నమ్మకాన్ని కోల్పోయిన అక్కలో తిరిగి ఎన్నోరెట్ల నమ్మకాన్ని నింపారు మా సాయితండ్రి. "తండ్రీ! మీరు చూపుతున్న ప్రేమకు కృతజ్ఞతగా మీరు చెప్పిన ప్రతి సూత్రాన్ని తు.చ. తప్పకుండా అనుసరిస్తాను. నన్ను ఆశీర్వదించండి బాబా!"
బాబా నా జీవితంలో ప్రవేశించింది మొదలు ప్రేమతో ఎన్నో లీలలు చూపించారు. వాటిలో కొన్నింటిని ఏవో భయాల కారణంగా 'సుచిత్ర' అనే పేరుతో మీ అందరితో ఇదివరకు పంచుకున్నాను. అయితే, "'హేమ'కు నేను తోడుగా ఉన్నాన"ని ఒకటికి రెండుసార్లు బాబా భరోసా ఇచ్చాక నేను ఎంత అవివేకంగా ఉన్నానో అర్థమైంది. "అంతులేని ప్రేమను పంచుతూ, కష్టాలను దాటిస్తూ, ఎల్లవేళలా తోడుగా ఉండే సాయితండ్రికి బిడ్డగా నా పేరు చెప్పుకోవడానికి భయమెందుకు?" అనిపించింది. అందుకే ఇకపై హేమ అన్న నా సొంత పేరుతోనే నేను మీ ముందుకు వస్తాను. 'హేమ' అని నా సాయితండ్రి పిలిచారు. అంతకంటే అదృష్టం ఏముంటుంది? "చాలా చాలా ప్రణామాలు సాయితండ్రీ!"
మా అక్కకి కలిగిన అనుభవం:
శ్రావణమాసంలో మా అక్క సాయిసచ్చరిత్ర సప్తాహపారాయణ చేసింది. పారాయణ చివరిరోజున బాబాకు లడ్డూలు నైవేద్యంగా పెడదామనుకొని లడ్డూలు తయారుచేయడం మొదలుపెట్టింది అక్క. లడ్డూలు చేస్తూ యథాలాపంగా 'ఈ బూందీతో 41 లడ్డూలు అవ్వాలి' అనుకుంది. లడ్డూ తయారీ పూర్తయ్యాక లెక్కిస్తే, సరిగ్గా 41 లడ్డూలు ఉన్నాయి. అక్క ఆనందాశ్చర్యాలతో నాకు ఫోన్ చేసి విషయం చెప్పి, "ఇది బాబా అనుగ్రహం కాకపోతే మరేమిటి?" అంటూ ఆనందంగా పంచుకుంది.
బాబాను ఒక్కసారి నమ్మితే చిరు చిరు సంతోషాల మొదలు పెద్ద పెద్ద సమస్యల వరకు అన్ని సమయాలలోనూ మన వెన్నంటే ఉంటారు.
జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!
బాబా ఉండగా మనకి భయమెందుకు?
ఓం శ్రీ సాయిరామ్! అనంతకోటి బ్రహ్మాండనాయకునికి అనంతకోటి ప్రణామాలు. సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా వందనాలు. నేను ఇంతకుముందు చాలాసార్లు నా అనుభవాలను మీతో పంచుకున్నాను. మీ అందరి ఆశీస్సులు మాకు అందిస్తున్నందుకు చాలా సంతోషం.
ఇటీవల ఒకరోజు మా మనవడికి కొంచెం నలతగా ఉండటంతో వాడు నీరసించిపోయాడు. ఈ కరోనా సమయంలో చిన్నపిల్లవాడు అలా ఉండేసరికి నాకు చాలా భయమేసింది. అప్పుడు బాబాను తలచుకొని, "బాబా! మీ దయతో రేపు ఉదయం నిద్రలేచే సమయానికి బాబుకి నయమైపోతే, నా అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను" అని బాబాతో చెప్పుకొని, బాబు తలపై కొంచెం బాబా ఊదీ పెట్టాను. బాబు చిన్నవాడని ఊదీని నోట్లో వేయడానికి భయపడ్డాను. బాబా ఆశీస్సులతో ఉదయం నిద్రలేచేసరికి బాబు ఉల్లాసంగా కనిపించాడు. దానితో నా మనసు శాంతించింది. అసలు బాబా ఉండగా మనకి భయం ఎందుకు?
తరువాత మావారు ఒక పనిమీద బయటికి వెళ్లారు. కరోనా రోజులు కదా! అందువలన మావారు వచ్చిన తరువాత నాలుగురోజుల వరకు మేము బాబు దగ్గరకు వెళ్లకుండా దూరంగా ఉన్నాము. ఆ సమయంలో నేను, "బాబా! ఏ ఇబ్బందీ రాకుండా చూడండి" అని బాబాను వేడుకుంటూ, మావారికి ఊదీ ఇస్తూ కాలం గడిపాను. బాబా దయవలన ఏ ఇబ్బందీ రాలేదు. మా మనవరాలికి వచ్చిన సమస్య విషయంలో కూడా నేను బాబానే నమ్ముకొని, "బాబా! తన సమస్యేమిటో మీకు తెలుసు. మనవరాలిని కూడా బాగా చూసి, అందరినీ అనుగ్రహించినట్లే అనుగ్రహించండి" అని బాబాను వేడుకున్నాను. నేను మా పిల్లల విషయాలన్నీ బాబాకు అప్పగించాను. ఆయన మనకు ఏది మంచిదైతే అది తప్పక చేస్తారు.
"బాబా! మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ఏదైనా పంచుకుంటానని మర్చిపోయి ఉంటే ప్రేమతో మమ్మల్ని క్షమిస్తారని భావిస్తూ..."
- మీ పాద సేవకురాలు
om sai ram
ReplyDeleteJai Sairam
ReplyDeleteOme Sri Sairam
ReplyDeleteBaba mamalini parikshinchaku baba daya chupinchu ma pyna thandri
ReplyDelete🌼🌹 OM SAIRAM 🙏🙏🙏🌹🌼
ReplyDeleteఓం శ్రీ సాయిరామ్!
ReplyDelete