సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 531వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా సూచన - ఊదీ మహిమ
  2. బాబా దయతో తగ్గిన కడుపునొప్పి
  3. బాబా దయతో హాయిగా నిద్రపోయిన బిడ్డ

బాబా సూచన - ఊదీ మహిమ

పేరు వెల్లడించని ఒక సాయిభక్తుడు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

సాయిభక్తులందరికీ సాయిరామ్! ముందుగా భక్తులకు సదా అండగా ఉంటున్న సాయికి నా ధన్యవాదాలు. గత సంవత్సరం నా భార్య కడుపుతో ఉన్నప్పుడు డెలివరీ డేట్ 2019, మార్చి 13 అని డాక్టర్ చెప్పారు. అయితే మార్చి 5 గురువారంనాడు నా భార్య కొంచెం చికాకుగా ఉండటం నేను గమనించాను. ఆరోజు గురువారం కావడంతో తనని హాస్పిటల్‌కి తీసుకెళ్లమని బాబా సూచిస్తున్నట్లుగా నాకనిపించింది. అందువలన నేను హాస్పిటల్‌కి వెళదామని తనని ఒత్తిడి చేశాను. అందుకు తను, "డాక్టరు చెప్పిన తేదీ మార్చి 13, ఇంకా సమయం ఉంది. కాబట్టి, ఇప్పుడు హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేద"ని చెప్పి హాస్పిటల్‌కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నా మనసుకి మాత్రం తనని హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చాలా బలంగా అనిపిస్తోంది. అందుచేత ఏదోవిధంగా తనని ఒప్పించాను. ఇంటి నుండి బయలుదేరి చాలా దూరంలో ఉన్న హాస్పిటల్‌కి సాయంత్రానికి చేరుకున్నాము. డాక్టరు పరీక్షించి వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేయమని చెప్పారు. తనని హాస్పిటల్లో చేర్చి, సమయానికి సూచనలు ఇచ్చినందుకు బాబాకు ధన్యవాదాలు చెప్పుకున్నాను. మరుసటిరోజు శుక్రవారంనాడు నార్మల్ డెలివరీ అయి నా భార్య ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే బిడ్డ జన్మించిన వెంటనే డాక్టర్ నాతో, "శ్వాస తీసుకోవడంలో బిడ్డకు సమస్యలు ఉన్నాయి. రెండురోజులు బిడ్డను ఐసియులో పరిశీలన నిమిత్తం ఉంచాలి" అని చెప్పారు. నేను ఆందోళనచెంది బిడ్డ క్షేమం కోసం ప్రార్థన చేయమని చెన్నైలోని సాయిభక్తులకు సందేశం పంపాను. తరువాత నేను బాబా ఊదీ తీసుకుని నా బిడ్డ కుడిపాదానికి రాశాను. కొద్ది నిమిషాల్లోనే బిడ్డ శ్వాస నెమ్మదిగా మెరుగుపడుతుండటం నేను గమనించాను. వెంటనే డాక్టర్ని పిలిచాను. వారు కూడా అదే చెప్పారు. తరువాత పదినిమిషాల్లో శ్వాస తీసుకోవడం సాధారణ స్థితికి వచ్చింది. దాంతో తల్లీబిడ్డలను వార్డుకు తరలించారు. ఆదివారంనాడు డిశ్చార్జ్ చేశారు. బాబుని ఇంటికి తీసుకెళ్ళిన వెంటనే నేను తనని, “ఆవో సాయీ, ఇంటిలోకి స్వాగతం” అని చెప్పాను. అలా సాయి మా ఇంటికి వచ్చారు. వారంరోజుల్లో బారసాల చేసి, బాబుకి “సాయిదర్శన్” అని పేరు పెట్టుకున్నాము. వాడు మాకు బాబా ఇచ్చిన బహుమతి. నా జీవితంలో బాబా నా పట్ల తన ప్రేమను, ఆప్యాయతను మరోసారి చూపించిన సంఘటన ఇది. బాబా తన భక్తులను ఎప్పుడూ విడిచిపెట్టరు, సదా ఆశీర్వదిస్తూనే ఉంటారు. "ధన్యవాదాలు బాబా. మీ మేలు, ఊదీ మహిమ ఎప్పటికీ మరువలేనివి".

ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

బాబా దయతో తగ్గిన కడుపునొప్పి

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

గత సంవత్సరం హోళీ పండుగ సమయంలో మా ఆరేళ్ల అబ్బాయి వాష్‌రూమ్‌కు వెళ్లబోతుండగా తన స్నేహితులు పిలిచారు. దాంతో వాడు మలవిసర్జన చేయకుండా నియత్రించుకుని తన స్నేహితులతో కలిసి హోళీ ఆడటానికి వెళ్ళిపోయాడు. కాసేపటికి అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పితో వాడు విలవిలలాడిపోయాడు. వాష్‌రూమ్‌కు వెళ్లి ఎంత ప్రయత్నించినా తనకి మలవిసర్జన కాలేదు. మేము వాడికి వేడినీళ్ళు త్రాగడానికి ఇవ్వడం, వజ్రాసనంలో కూర్చోమని చెప్పడం, ఇలా పలురకాల సూచనలిచ్చి చూశాము, కానీ ప్రయోజనం లేకపోయింది. ఈలోగా వాడు తీవ్రంగా వాంతులు కూడా చేసుకున్నాడు. నొప్పితో వాడు మెలికలు తిరిగిపోతుంటే, మేము ఇంటి చిట్కాలన్నీ ప్రయత్నించాము. కానీ ఏదీ ఫలితం చూపలేదు. హోళీ పండుగ అయినందున పిల్లల హాస్పిటల్స్‌కి ఫోన్ చేసినా ఎవరూ స్పందించడం లేదు. అప్పుడు మేము బాబాని తలుచుకుని, ఊదీ తీసుకుని బాబు పొట్టపై రాసి, "ఓం శ్రీసాయి ఆరోగ్య క్షేమదాయ నమః" అని జపించడం ప్రారంభించాము. క్షణాల్లో కాస్త మెరుగ్గా ఉన్నట్లు కనిపించినప్పటికీ మళ్ళీ నొప్పి తట్టుకోలేక ఏడవడం మొదలుపెట్టాడు. ఆరేళ్ల మా బిడ్డ నిస్సహాయంగా “అమ్మా‌, దయచేసి నాకు నయమయ్యేలా చేయి” అని విలపిస్తుంటే మా హృదయం ద్రవించుకుపోయింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. నీరు త్రాగడం, వాష్‌రూమ్‌కి వెళ్లడం, ఇలా దాదాపు గంటన్నర సమయం గడిచింది. అప్పుడు నేను తనతో, 'సాయి, సాయి' అని జపం చేయమని చెప్పాను. నేను కూడా బాబాను ప్రార్థించి, "నా బిడ్డకి నయమైతే నా  అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు మాట ఇచ్చాను. మరుక్షణంలో బాబా దయవల్ల మావారికి స్ఫురణ కలిగి వాడిని ఒక ప్రత్యేకరీతిలో ఉంచారు. దాంతో లోపలినుండి వాయువులు బయటకు రావడం మొదలయ్యాయి. వెంటనే వాడు వాష్‌రూమ్‌కి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వెంటనే మలవిసర్జన జరిగి ఆనందంగా అరిచాడు. వాడు నొప్పి నుండి పూర్తి ఉపశమనం పొందాడు. "బాబా! మీ దయకు ధన్యవాదాలు. నా బిడ్డ కష్టాన్ని తొలగించారు. అనుభవాన్ని పంచుకోవడంలో ఆలస్యం అయినందుకు క్షమించండి".

జై జై సాయిరామ్!

బాబా దయతో హాయిగా నిద్రపోయిన బిడ్డ

UK నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

బ్లాగు ద్వారా తోటి సాయిభక్తులతో పంచుకుంటానని బాబాకు వాగ్దానం చేసిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను. 17 నెలల వయస్సున్న మా బాబు రాత్రిళ్ళు సరిగా నిద్రపోడు. ప్రతీ రాత్రి నేను తను బాగా నిద్రపోవాలని బాబాను ప్రార్థిస్తూ ఉంటాను. ఒక సాయంత్రం తను చాలా ఏడ్చాడు. వాడెందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎలాగో వాడిని సముదాయించి నిద్రపుచ్చాను. తరువాత నేను 'ఇంత త్వరగా నిద్రపోయాడు కాబట్టి ఈ రాత్రికి నిద్రపోకుండా బాగా అల్లరి చేస్తాడ'ని అనుకున్నాను. అనుకున్నట్లే తను ఆ రాత్రి ఏడుస్తూ చాలాసార్లు లేచాడు. అప్పుడు నేను, "బాబా! నేను నిస్సహాయురాలిని. దయచేసి నా బిడ్డని ఆశీర్వదించండి. వాడు ప్రశాంతంగా నిద్రపోయేలా అనుగ్రహించండి" అని బాబాను ప్రార్థించాను. తరువాత కొద్దిగా ఊదీ తీసుకుని తన నుదుటిపై పెట్టాను. అద్భుతం! కొద్దిసేపట్లో తను నిద్రపోయాడు. రాత్రంతా హాయిగా నిద్రపోయి, మళ్ళీ ఉదయం లేచాడు. "బాబా! మీ ప్రేమకు ధన్యవాదాలు. త్వరలోనే మీ ఆశీస్సులతో నా బిడ్డ రాత్రిపూట హాయిగా నిద్రపోతాడని ఆశిస్తున్నాను".


6 comments:

  1. Om sai ram baba please help us

    ReplyDelete
  2. ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి

    ReplyDelete
  3. Om Sai Ram 🙏🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete
  4. 🌼🌷🏵 Om Sri Sai Arogya Kshemadhaya Namaha 🌼🌷🏵

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo