సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 534వ భాగం....


ఈ భాగంలో అనుభవం:

  • సర్వవేళ సర్వావస్థలలోనూ అన్నీ తానై బాబా చేసిన వివాహం

సాయిభక్తుడు శ్రీ వెంకటరావుగారు తనకు బాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ముందుగా సాయిబంధువులందరికీ నా నమస్కారములు. ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. గత కొన్ని నెలలుగా క్రమం తప్పకుండా ఈ బ్లాగులోని సాయిలీలలను చదివే భాగ్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. ఇందులో సాయిభక్తులు పంచుకుంటున్న అనుభవాలను ప్రేరణగా తీసుకుని నేనూ నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నా పేరు వెంకటరావు. శిరిడీ సాయిని సర్వస్య శరణంగా నమ్ముకున్నవాడిని. క్షణక్షణమూ బాబా ఎన్నెన్నో అనుభవాలను ప్రసాదిస్తుంటారు. వాటిలో ముఖ్యంగా మీతో పంచుకోవాలనుకుంటున్నది మా చిన్నబ్బాయి పెళ్ళి గురించి. ఒకసారి ఈ బ్లాగులో పిల్లల వివాహం గురించిన ఒక అనుభవం చదివిన గుర్తుంది. అప్పటివరకు మేము మా అబ్బాయి పెళ్ళి ఆలోచన కూడా చేయలేదు. ఎందుకంటే, మావాడు ఉద్యోగంలో ఇంకా ట్రైనింగులోనే ఉన్నాడు. అది పూర్తయ్యేంతవరకు పెళ్ళి గురించిన ఆలోచనే వద్దని వాడు ఖరాఖండీగా చెప్పేశాడు. కానీ దైవనిర్ణయాన్ని ఎవరూహించగలరు? అది ఎవరి ప్రమేయమూ లేకుండా జరుగుతూనే ఉంటుంది, మనమనుకున్నా అనుకోకపోయినా. అందులో భాగంగానే పైన పేర్కొన్న అనుభవం చదివిన కొన్నాళ్ళకి మా దగ్గరబంధువుల్లో ఒకరు ఒక పెళ్ళిసంబంధం ప్రస్తావించారు. “మా అబ్బాయి ఇప్పట్లో పెళ్ళి వద్దన్నాడ”ని చెప్పాము. కానీ ఆయన, "మంచి సంబంధం, ఒకసారి అబ్బాయిని అడిగి చూడండి" అని బలవంతం చేశారు. వారి బలవంతమూ మరియు "బహుశా ఇది సాయి తలంపేమో" అని మాకు అనిపించి మా అబ్బాయితో పెళ్ళిసంబంధం గురించి చెప్పాము. వాడు ససేమిరా అంటాడేమోననుకున్నాము. కానీ ఆశ్చర్యంగా మా అబ్బాయి ఒప్పుకున్నాడు. బహుశా సాయి సంకల్పం అలా ఉందేమో! అయితే ‘పెళ్ళి మాత్రం ట్రైనింగు అయ్యాకనే’ అనే షరతు మీద అమ్మాయిని చూడటానికి ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత పెళ్ళిచూపులు జరగటం, ఒకరికొకరు నచ్చటం త్వరత్వరగా అయిపోయాయి. ఇదంతా మాకు విస్మయం కలిగించింది. అయితే దీనికంతటికీ సాయికృపే కారణమని మా నమ్మకం. "బాబా! ఇదే నీ సంకల్పమైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళు" అని ప్రతి క్షణమూ సాయిని ప్రార్థించేవాణ్ణి. అందుకేనేమో, ‘ట్రైనింగు తర్వాతే పెళ్ళి’ అని అనుకున్న మా అబ్బాయి వధువు తరఫువాళ్ళు ‘పెళ్ళి త్వరలో చేసేద్దాం’ అంటే ఒప్పేసుకున్నాడు. మొత్తంమీద 2020, ఏప్రిల్ నెలలో వివాహం చేసేందుకు ఇరువర్గాలు నిర్ణయించారు. అప్పుడప్పుడే కోవిడ్ కేసులు ఒకటీ అరా బయటపడుతున్నాయి.’ పెళ్ళికి ఇంకా నెలపైనే సమయముందిలే, మనకేమీ ఆటంకం కాదులే’ అనే ధీమాతో పెళ్ళి పనులు ప్రారంభించాము. బంధువులందరికీ ఆహ్వానపత్రికలు పంచటానికి ఊరికి వెళ్ళాము. కొన్ని పంచాము కూడా. సరిగ్గా అప్పుడు మొదలయింది, ‘లాక్ డౌన్’. 

లాక్ డౌన్ కారణంగా మా దంపతులమిద్దరం ఊర్లోనే ఉండాల్సొచ్చింది. దాంతో అనుకున్న ముహూర్తానికి వివాహం జరిపించలేకపోయాము. కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏమీ చెయ్యలేని స్థితి. అలాగే ఏదో ఒకటి చెయ్యకుండా ఉండలేని సందర్భం. "సాయిదేవా! ఈసారి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే ముహుర్తాన్ని నువ్వే నిర్ణయించి దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించు తండ్రీ!" అని మనసారా సాయిని ప్రార్థించాము. రెండువైపులా అనేక తర్జనభర్జనల అనంతరం ఏ పరిస్థితిలోనైనా, అంటే ఎవ్వరూ రాలేకపోయినా జులై నెలలో పెళ్ళి చేసేందుకు ముహుర్తం నిర్ణయమైంది.

ఇక అప్పుడు మొదలైంది అసలు కథ. మొదటి సమస్య కళ్యాణమండపం. మార్చి నెలలోనే కళ్యాణమండపం బుక్ చేశాము. అయితే లాక్ డౌన్ మూలంగా జులై మొదటివారం వరకు వేచి చూడమన్నారు మండపంవారు. అప్పుడు కాదంటే ఎలా? అందుకని పెళ్ళిలో 50 మందికి మాత్రమే అనుమతి కాబట్టి మేముండే కాలనీ కమ్యూనిటీ హాల్ ఇవ్వటానికి కమిటీవారు ఒప్పుకున్నారు. సరిగ్గా పెళ్ళి రెండు వారాలుందనగా మండపంవాళ్ళు వీలుకాదన్నారు. ‘సరే, కమ్యూనిటీ హాల్ ఉంది కదా!’ అనుకున్నాము. కానీ, అదే సమయంలో కాలనీ కమిటీవారు "చుట్టూ కోవిడ్ పాజిటివ్ కేసులున్నాయి, కాబట్టి హాల్ ఇవ్వలేము” అనేశారు. అప్పుడు మొదలైంది అసలు టెన్షన్. ఇప్పుడు దారేంటి? చుట్టూ ఉన్న ఫంక్షన్ హాళ్ళు రాత్రి 9.30 వరకే పర్మిషన్ అన్నారు. మా ముహూర్తమేమో అర్థరాత్రి. ఎలా? బాబానే దిక్కు. "నేనున్నాను, నిన్నెప్పటికీ ఒంటరిని చేయను" అని ఎన్నో మాధ్యమాల ద్వారా బాబా మాకు సందేశాలిచ్చారు. ఎంతో ఆందోళన తర్వాత ఆయనే దారి చూపించారు. ఒక దేవాలయంలో ఉన్న పెద్ద హాలు ఏర్పాటు చేశారు. రాత్రి ముహూర్తం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ప్రతినిధి దగ్గరుంటామని భరోసా కూడా ఇచ్చారు.

తర్వాత సమస్య పెళ్ళికి వచ్చే బంధువుల గురించి. కొంతమంది దగ్గరబంధువులు ఆంధ్రా నుంచి రావాలి. కోవిడ్ కేసుల దృష్ట్యా వారి భయాలు వారివి. మేమూ బలవంతం చేయలేని పరిస్థితి. బాబా దయవల్ల ఆ సమస్య కూడా తీరింది.

తరువాత సమస్య భోజనాల ఏర్పాట్ల గురించి. కరోనా కారణంగా క్యాటరింగుకి ఎక్కువమంది సుముఖంగా లేరు. పూర్వాపరాలన్నీ కూలంకషంగా చర్చించాక, పెళ్ళిరోజు మరియు వ్రతంరోజు క్యాటరింగుకి ఇవ్వాలని, మిగిలిన కార్యక్రమాలకు ఇంట్లోనే అందరూ కలిసి వంట చేసుకుందామని నిర్ణయించారు. 

బాబా దయవల్ల అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తయ్యాయి. వివాహం వైభవంగా జరిగింది. వివాహమైన తరువాత బంధువులు ఆంధ్రాకి తిరిగి వెళ్ళేందుకు పాస్ సమస్య. అది కూడా కొంత ఉద్విగ్నతకు గురయ్యాక తీరింది. పెళ్ళికి వచ్చిన వారెవరికీ ఎటువంటి ఆరోగ్య సమస్య రాకూడదని బాబాని ఆర్తిగా అర్థించాము. బాబా ఆ విషయంలోనూ ఎంతో కరుణించారు. వివాహమై నెలరోజులు కావస్తోంది. ఇంతవరకు అందరూ కుశలమే.

ఈ విధంగా అంతా సవ్యంగా సంపన్నమయేందుకు అడుగడుగునా ఆ శిరిడీ సాయియే కారణం. “ఇలాగే సర్వవేళ సర్వావస్థలలోనూ మమ్మల్ని చల్లగా చూడు తండ్రీ!”

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!


10 comments:

  1. very nice leela.sai proctes us.why tenstionbaba takes care of us.om sai ram

    ReplyDelete
  2. Saideva I am in exam hall right now,pls bless me good result baba love u sai

    ReplyDelete
  3. అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

    ReplyDelete
  4. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  5. Baba ma arogya samasyalu teerchu thandri

    ReplyDelete
  6. Om Sai Ram 🙏 🌹🙏
    ఓం శ్రీ సాయినాథాయ నమః 🙏
    ఓం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః🙏

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo