సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 523వ భాగం....



 ఈ భాగంలో అనుభవాలు:

  1. సాయితో నా అనుబంధం
  2. బాబా కృపతో కోవిడ్ టెస్టులో నెగిటివ్

సాయితో నా అనుబంధం

నేను ఒక సాయి భక్తురాలిని. నేను మీ అందరితో ఏం పంచుకోవాలనుకుంటున్నాను? నా అనుభవాలా? వాటిని అనుభవాలు అనాలా? లేక సాయితో నా అనుబంధం అనాలా? రెండవదే సరైనది అనుకుంటున్నాను. ఎందుకంటే అనుభవం అనేది గడచిపోయిన దాని గురించి. కానీ అనుబంధం నిత్యమైనది, శాశ్వతమైనది. అవును, సాయితో నా అనుబంధం ఈ దేహం ఉన్నంతవరకే కాదు, ఆ తర్వాత కూడా ఉంటుంది. ఈ మాట నేను చెప్పటం లేదు, నా సాయే స్వప్నసాక్షాత్కారం ద్వారా నాకు తెలియచేసిన మాట. “నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావుఅని నా సాయి నాతో ఎప్పుడో చెప్పిన మాట ఇప్పటికీ అలాగే నా మనసులో ఉండిపోయింది. అందుకు తగినట్లుగా నా ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి చేతలో 'సాయి, సాయి, సాయి!'. బాబా నన్ను ఇంతలా దగ్గరకు తీసుకుంటారని నేను కలలో కూడా ఊహించలేదు. నాకు సంబంధించిన అతి చిన్న విషయం నుంచి, మాకు సంబంధించిన పెద్ద విషయాల వరకు అన్నిటా సాయి చూపే తల్లిప్రేమను చాలా స్పష్టంగా చూస్తున్నాను. ప్రతిసారీ సాయి మన ఇంట్లో ఉండే ఒక కుటుంబసభ్యునిగా అనిపిస్తారే తప్ప ఎక్కడో ఉండి మనం పిలిచినప్పుడు వస్తారని అనిపించదు.

ఒకరోజు ఉదయం ‘ఫలానా సమయానికి మేల్కొనేలా చూడు బాబా!’ అని బాబాను అడిగాను. సరిగ్గా నేను అడిగిన సమయానికి నా నుదుటి మీద ఒక సున్నితమైన స్పర్శ! లేచి చూస్తే ఎవరూ లేరు. గడియారం చూస్తే అది సరిగ్గా నేను అడిగిన సమయం! అమ్మ కూడా ఇలాగే నన్ను ఎన్నోసార్లు లేపి ఉంటుంది కదా! మరి నేను వాటిని ‘అనుభవాలు’ అని ఎందుకు పంచుకోవటం లేదు? ఎందుకంటే, అమ్మ నాతోనే ఉంటుంది కాబట్టి, అవన్నీ నిత్య జీవితంలో జరిగే చాలా మామూలు విషయాలు కాబట్టి. బాబాతో ఎప్పుడో ఒకసారి జరిగేవి కాబట్టి పంచుకుంటున్నానా? అంటే, సాయి నాతో అప్పుడప్పుడు మాత్రమే ఉంటున్నారా? అందుకే వాటిని అనుభవాలు అంటున్నానా? నాకు సాయితో ఉన్నది అనుబంధం మాత్రమే, అనుభవం కాదు. నేనే అది గుర్తించలేదు. ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది.

కొన్నాళ్ల క్రితం ఒక విషయం మా కుటుంబం మొత్తాన్ని చాలా కల్లోలపరచింది. ఎంతలా అంటే నేను తింటున్న అల్పాహారం కూడా వదిలేశాను. మేము అప్పటివరకు మాకెంతో కావలసినవాళ్ళు అనుకున్న మనుషులే మమ్మల్ని అంతగా భయపెట్టారు. “బాబా! నువ్వే దిక్కు!” అన్నాను. ఆరోజు ఉదయం భయంతో అల్పాహారాన్ని వదిలేసిన నేను ఆ మధ్యాహ్నం చాలా సంతోషంగా భోజనం చేశాను. ఆ కొద్ది గంటల్లో పరిస్థితిని ఒక్కసారిగా మాకు అనుకూలంగా మార్చేశారు బాబా, అది కూడా చాలా సున్నితంగా. ఇదొక్కటే కాదు, నేను ఏది అడిగినా బాబా వెంటనే స్పందిస్తారు. ప్రతి విషయంలో సాయి నా ప్రక్కనే ఉంటుంటే అవి అనుభవాలు ఎలా అవుతాయి? 

ఈమధ్య మా తమ్ముడికి ఉన్నట్టుండి కడుపునొప్పి వచ్చింది. తనని అలా ఎప్పుడూ చూడలేదు. తనకు కడుపునొప్పి తగ్గించమని మేము బాబాను ప్రార్థిస్తునే ఉన్నాము. ఆయన అనుగ్రహం కురిపించారని మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ఇంకా చాలా కొద్దిగా నొప్పి ఉంది. అది కూడా బాబా తగ్గిస్తారని మాకు తెలుసు. ఎందుకంటే, సాయి అంటే గురువు, దైవం మాత్రమే కాదు, నాకు సాయి అంటే తల్లి. తల్లి తన బిడ్డలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోదు. అలాగే ఇప్పుడు ప్రపంచాన్ని కల్లోలపరుస్తున్న కరోనా మహమ్మారిని అతి త్వరలోనే బాబా అంతమొందిస్తారని చాలా బలంగా నమ్ముతున్నాను. 

సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
సర్వేజనాః సుఖినోభవంతు!

బాబా కృపతో కోవిడ్ టెస్టులో నెగిటివ్

అందరికీ నమస్కారం. నేను బాబాకు ఒక సామాన్య భక్తుడిని. నాకు చిన్నతనంనుంచి భయాలు చాలా ఎక్కువ. కరోనా వల్ల పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అందువలన నాలో విపరీతమైన భయం పెరిగిపోయింది. నాకు 3, 4 వారాలు ఒకటే జ్వరం. జ్వరం తగ్గడానికి ప్రతిరోజూ మందులు వాడుతున్నప్పటికీ జ్వరం ఏమాత్రం తగ్గలేదు. ఒకరోజు నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! నేను కోవిడ్ పరీక్ష చేయించుకోబోతున్నాను. అందులో నాకు నెగిటివ్ వచ్చేలా చూడు” అని బాబాను ఆర్తిగా ప్రార్థించాను. తరువాత భయపడుతూనే కోవిడ్ టెస్టు చేయించుకున్నాను. బాబా దయవలన నాకు కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వచ్చింది. సంతోషంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను చెప్పాలనుకునేది ఒకటే, మనం బాబాను నమ్ముకుంటే అన్నీ తానై నడిపిస్తారు. “బాబా! ఈ కరోనా బారినుండి అందరినీ కాపాడు బాబా!”


9 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo