1. రైలు తప్పిపోకుండా చేసి శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా2. ప్రార్థన మన్నించిన బాబా
రైలు తప్పిపోకుండా చేసి శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
సాయి కుటుంబసభ్యులకు నా నమస్కారములు. నా పేరు వీరవెంకట సత్యనారాయణ. నేను వైజాగ్ నివాసిని. నేను ఒక బిజినెస్ నడుపుతున్నాను. కరోనా రెండో వేవ్ తర్వాత బిజినెస్ బాగా పడిపోయింది. అందువల్ల నేను ఆ బిజినెస్ ఎవరికైనా ఇచ్చేద్దామని అనుకున్నాను. కానీ ఎవరూ నా బిజినెస్ తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇదిలా ఉంటే నా స్నేహితుడు ఎప్పటినుండో శిరిడీ వెళదాం రమ్మంటుంటే నాకు ఆసక్తి లేక వెళ్ళలేదు. 2023లో ఒకరోజు తను వచ్చి, "నేను చెప్పిన మాట ఒకసారి విను. మనం శిరిడీ వెళ్ళొద్దాం. నీకు అంతా మంచి జరుగుతుంది" అని చెప్పి చివరకు ఒప్పించాడు. దాంతో 2023, జూన్ 29కి టికెట్లు బుక్ చేసుకున్నాం. నేను ప్రతి నెల సింహాచలం వెళ్ళి వరాహనరసింహస్వామి దర్శనం చేసుకుంటూ ఉంటాను. ఆ అలవాటు ప్రకారం జూన్ 29, ఉదయం 8.20కి శిరిడీ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉండగా ఉదయం 5.30కి సింహాచలం వెళ్ళాను. అక్కడ 7గంటల వరకు దర్శనం లేదన్నారు. సరే, ట్రైన్‌కి టైం ఉంది కదా! 300 రూపాయలు టికెట్ తీసుకుంటే త్వరగా దర్శనం అయిపోతుందని ఆ టికెట్ తీసుకొని లైన్‌లో వెయిట్ చేశాను. అయితే మమ్మల్ని ముందు వదలకుండా ఉచిత దర్శన లైన్ వదిలారు. మమ్మల్ని 7.30కి వదిలారు. దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పటికి 7.55 అయింది. ట్రైన్ బయలుదేడానికి ఇంకా 25 నిముషాల సమయం మాత్రమే ఉంది. ఎలా లేదన్నా కొండ మీద నుండి ఇంటికి వెళ్ళి నా లగేజ్ బ్యాగు తీసుకొని స్టేషన్‌కి వెళ్ళడానికి ఒక గంట సమయం ఖచ్చితంగా పడుతుంది. నాకు ఏమి చేయాలో అర్దం కాలేదు. మొదట్లో నా స్నేహితుడు అడిగినప్పుడు శిరిడీ రానన్నందుకు బాబాకి కోపమొచ్చి ఉంటుంది, అందుకే ఇలా అయిందనుకొని మనసులోనే బాబాను తలచుకొని, "నేను మనస్పూర్తిగానే శిరిడీ వస్తున్నాను. రైలు తప్పిపోకుండా చూడు బాబా" అని అనుకున్నాను. తర్వాత మా బావమరిదికి ఫోన్ చేసి, "నువ్వు మా ఇంటికి వెళ్ళి, నా బ్యాగు తీసుకొని రైల్వేస్టేషన్‌కి వచ్చేయి" అని చెప్పి నేను నేరుగా కొండ మీద నుండి రైల్వేస్టేషన్‌కి బయలుదేరాను. కేవలం 20నిమిషాలే ఉండటంతో బైక్ ఎలా తోలానో నాకే తెలియనంత వేగంగా బైక్ నడిపాను. అయినా రైలు తప్పిపోతుందేమో అని ఒక పక్క, తప్పిపోతే నా స్నేహితుడు, 'వీడికి మొదటినుండి శిరిడీ రావడానికి ఆసక్తి లేదు. అందుకే రాలేదు అంటాడ'ని మరోపక్క భయపడుతూ మనసులో బాబాకి క్షమాపణ అడిగి, "నేను మనస్పూర్తిగా వస్తున్నాను బాబా. ఎలాగైన రైలు తప్పిపోకుండా చూడండి" అని వేడుకుంటూ వెళ్ళాను. నిజంగా బాబా దయమయులు. నన్ను క్షమించి, రైలు అందేలా చేశారు. నేను ఎక్కిన మరుక్షణం రైలు కదిలింది. దాంతో నాకు బాబా మీద పూర్తి నమ్మకం కలిగింది. ఆయన దయతో శిరిడీలో దర్శనం కూడా చాలా బాగా జరిగింది. తిరిగి ఇంటికి వచ్చిన తరువాత నా భార్యకి, పాపకి కొద్దిగా ఆరోగ్యం బాగోకపోతే బాబాని వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే వాళ్లకు నయమైంది. ఈ విధంగా బాబా నన్ను క్షమించి సహాయం చేశారు.
శ్రీ సమర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!
ప్రార్థన మన్నించిన బాబా
నా పేరు రాజేంద్రప్రసాద్. 2023లో మా బాబుకి జ్వరం వచ్చింది. జ్వరం తగ్గిన తర్వాత బాబుకి ఒక రకమైన స్కిన్ ఎలర్జీ వచ్చింది. అప్పుడు నేను సాయిని ప్రార్ధించి, "బాబా! బాబుకి ఈ అలర్జీ తొందరగా తగ్గేలా అనుగ్రహించండి" అని బాబాని వేడుకున్నాను. బాబా నా కోరిక మన్నించి మూడు రోజుల్లో బాబుకి ఎలర్జీ తగ్గేలా చేశారు. తర్వాత కొన్నిరోజులకి మా పాపకి తీవ్రమైన జ్వరమొచ్చి రెండు రోజులైనా తగ్గలేదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయించమన్నారు. టెస్ట్ చేస్తే డెంగ్యూ జ్వరమని తేలింది. ఆ సమయంలో పాప ఏమీ తినలేక బాగా ఇబ్బందిపడుతుంటే నేను బాబాను తలుచుకుని, "బాబా! పాపకి త్వరగా జ్వరం తగ్గాల"ని వేడుకొని ప్రతిరోజూ ఊదీ పాపకు పెడుతుండేవాడిని. ఎంతో దయ, ప్రేమ కలిగిన బాబా ఎప్పటిలా నా ప్రార్ధన మన్నించి పాపకు పూర్తిగా నయమయ్యేలా చేశారు. మనకు ఏ కష్టం, అనారోగ్యం, మరే ఇతర సమస్యలు వచ్చినా బాబా మనకు ఉన్నారన్న ఒక్క తలంపు మనలో ఉంటే చాలు. ఎటువంటి కష్టమైనా మనల్ని వదిలిపోవాల్సిందే. బాబా సహాయం మన ఊహకు కూడా అందదు. ఇది నాకు ఎన్నోసార్లు అనుభవమైంది. "బాబా! నేను, నా కుటుంబం మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటాము తండ్రీ".

