1. సాయినాథుని అనుగ్రహాలు2. సాయినాథుని దయ
2023, ఆగస్టు 26, శనివారం పొద్దున్న ఒక ఫంక్షన్‌కి హాజరు అవ్వడం కోసం మావారు ఫ్లైట్‌లో వైజాగ్ వెళ్లారు. ఆ రోజు వాతావరణం ఏమీ బాగోలేదు, వర్షం పడుతోంది. నాకు ఆందోళనగా అనిపించి, "బాబా! ఆయన క్షేమంగా వైజాగ్ చేరుకునేలా అనుగ్రహించండి" అని సాయినాథుని వేడుకున్నాను. బాబా దయవల్ల ఆయన క్షేమంగా ఫంక్షన్‌కి హాజరై ఇంటికి తిరిగి వచ్చారు.
కరోనా సమయంలో సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు ఇంటి నుంచి పని చేసే అవకాశము ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. తర్వాత చాలామంది ఆఫీసులకు వెళ్లడం మొదలుపెట్టారు కానీ, నేను మాత్రం అప్పటినుండి ఇంటి నుండే పని చేస్తున్నాను. ఆఫీసుకి వెళ్లే పని లేకపోవడంతో నేను పూర్తిగా బయటకు వెళ్లడమే మానేశాను. దాంతో ఎప్పుడూ ఇంట్లోనే ఉండటం వలన చాలా ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఇక లాభం లేదని 2023, ఆగస్టు 28 నుండి ఫిట్నెస్ క్లాసులకి వెళ్లడం ప్రారంభించాను. అయితే అక్కడ ట్రైనర్ మొదటిరోజునే నా చేత కొద్దిగా వెయిట్ లిఫ్ట్ చేయించారు. దానివల్ల కుడి అరచేయి, మణికట్టు నరాలు బాగా నొప్పి పెట్టాయి. ఆ రోజంతా కనీసం టీ గ్లాస్ కూడా చేత్తో పట్టుకోలేకపోయాను. ఆ బాధను భరిస్తూ చిన్నదే తగ్గిపోతుందని కాస్త ధైర్యం చెప్పుకుంటున్నప్పటికీ మరోపక్క ఏమైనా స్ట్రైన్ అయిందేమో అని భయం మొదలవడంతో యధావిధిగా బాబాని వేడుకుని చేతికి ఊదీ రాసుకొని పడుకున్నాను. బాబా దయవల్ల తెల్లారేపాటికి నొప్పి చాలావరకు తగ్గింది. ఇలా చెప్పుకుంటూ పోతే బాబా అనుగ్రహంతో నేను పొందిన అనుభవాలు కోకొల్లలు. ఎల్లప్పుడూ మన వెంట ఉండి మనల్ని నడిపిస్తూ, ప్రతి కష్టంలోనూ ఆదుకుంటూ, ప్రేమతో అక్కున చేర్చుకునే మన సాయితండ్రికి శతకోటి వందనాలు.
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!!!
సాయినాథుని దయ
నా పేరు గౌతమి. ఒకసారి నేను నా నల్లపూసలు ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఎంత వెతికినా కనపడలేదు. అప్పుడు, "సాయినాథా! బంగారం పోతే నాకు సెంటిమెంట్‌గా ఉంటుంది. దయచేసి దొరికేలా చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల వెంటనే దొరికాయి. "ధన్యవాదాలు బాబా".
మేము మా అపార్ట్మెంట్లో సాయినాథుని విగ్రహం పెట్టుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాము. విగ్రహం సిద్ధంగా ఉన్నా మందిరం కట్టించలేకపోయాము. చివరికి 2023లో నేను, "బాబా! మీ మందిరం మీరే కట్టించుకోండి" అని బాబాకి చెప్పుకొని మందిరం నిర్మాణం చేపట్టాం. బాబా దయవల్ల నేను అనుకున్న దానికంటే చాలా బాగా మందిర నిర్మాణం జరిగింది. విగ్రహ ప్రతిష్ట చేసి అభిషేకాలు, హోమాలు చాలా బాగా చేసాం. నేను ఇప్పుడు ప్రతిరోజూ సాయినాథునికి దీపం పెట్టుకుంటున్నాను. అంతా ఆ సాయినాథుని దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. ఇలా ఎప్పుడూ నా దగ్గరే ఉండు తండ్రీ. కొంచెం ఆరోగ్యం బాలేదు, సరి చేయి తండ్రీ".
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై!!!

