- కష్టమొస్తే ఆదుకోవడానికి బాబా ఉన్నారు
నా పేరు విజయలక్ష్మి. 2023, ఆగస్టు నెల చివరి నుండి కొన్ని రోజులు నా భర్తకి ఛాతీనొప్పి, వెన్నునొప్పి ఉంటుండేవి. ఆ విషయం మాకు తెలిస్తే కంగారుపడతామని, 'మామూలు నొప్పి' అని మాతో చెప్తూ 10-15 రోజులు అలాగే నొప్పి భరించారు. నేను నొప్పి పోవటానికి బాబా ఊదీ నీళ్లలో కలిపి మావారి చేత తాగించి, ఆయన ఛాతికి ఊదీ రాస్తుండేదాన్ని. కానీ నొప్పి పూర్తిగా తగ్గలేదు. నేను అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అనుకున్నాను. అటువంటి సమయంలో ఒకరోజు ఈ బ్లాగులోని తోటి భక్తుల అనుభవాలు చదువుతుంటే, "నిశ్చింతగా ఉండు. కానీ నిర్లక్ష్యంగా ఉండకు" అని ఒక మెసేజ్ కనిపించింది. అప్పుడు నేను, 'బాబా ఇలా చెప్తున్నారు ఏంటి?' అని అనుకున్నాను. అప్పుడే నాకు ఏదో అనుమానంగా అనిపించి, "బాబా! ఏం జరిగినా మీదే బాధ్యత. నాకున్న నిజమైన ఆత్మీయుడివి నువ్వే" అని ఆ తండ్రి మీద భారమేసి ధైర్యంగా ఉన్నాను.
ఇలా ఉండగా 2023, సెప్టెంబర్ 16న మేము అన్నవరం వెళ్లి వ్రతం చేయించాల్సి ఉంది. అందుకోసం రైలు టిక్కెట్లు కూడా బుక్ చేసాం. మేము వ్రతంలో కూర్చున్నప్పుడు మా ఇద్దరు చిన్నపిల్లల్ని చూసుకోవడానికి మా అమ్మని కూడా మాతో తీసుకొని వెళ్లాలని అనుకున్నాము. అందుకోసం సెప్టెంబర్ 15న మా అమ్మని మా ఇంటికి తీసుకొచ్చాము. తర్వాత మావారికి నొప్పి భరించలేనంతగా వచ్చింది. ఆయన నాకు ఏమీ చెప్పకుండా మా అత్తయ్య దగ్గరికి వెళ్లి తన నొప్పి గురించి చెప్పారు. వాళ్ళు మావారిని వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి తీసుకొని వెళ్లారు. అక్కడ వాళ్ళు, "ఏదో తేడాగా ఉంది. హార్ట్ స్పెసలిస్ట్‌ని కలవండి" అని చెప్పారు. వెంటనే హార్ట్ స్పెసలిస్ట్ దగ్గరకి వెళ్లి విషయం చెప్తే, ఈసీజీ తీసి, "హార్ట్‌లో సమస్య ఉంది. ఈ రాత్రికి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వండి. రేపు ఉదయం 10 గంటలకి యాంజియోగ్రామ్ టెస్ట్ చేస్తే అసలు సమస్య ఏమిటో తెలుస్తుంది" అని చెప్పారు. దాంతో మావారు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఐసీయూ లోపల ఫోన్ అనుమతించరు గనక ఐసీయూ లోపలికి వెళ్లేముందు నాకు ఫోన్ చేసి విషయం చెప్పారు. ఇక అప్పటినుండి బాబాని వేసుకోవడమే నా పని అయిపోయింది. "బాబా! ఏం సమస్య లేకుండా చూడండి. చిన్న సమస్య అని వస్తే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకొని ఆ రాత్రంతా(నిద్రలో కూడా) 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే స్మరించాను. మరుసటిరోజు ఉదయం యాంజియోగ్రామ్ చేసి, "గుండెలో బ్లాకేజ్ ఉంది. అందువల్లనే మీకు నొప్పి వస్తుంది" అని చెప్పి ఆ బ్లాకేజ్‌ని బెలూన్ ద్వారా బ్లాస్ట్ చేసారు. బాబా దయవల్ల నా భర్త బ్రతికారు.
రేపు వినాయకచవితి అనగా మావారు హాస్పిటల్లోనే ఉన్నారు. హెల్త్ ఇన్సూరెన్స్‌వాళ్ళు వచ్చి పర్మాలిటీస్ పూర్తిచేస్తే ఇన్సూరెన్స్ వస్తుంది. అప్పుడే హాస్పిటల్‌వాళ్ళు మావారిని డిశ్చార్జ్ చేస్తారు. అటువంటి పరిస్థితిలో నేను, "బాబా! రేపు వినాయకచవితి అనగా నా భర్తని హాస్పిటల్లో ఉంచావు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. ఈరోజు రాత్రి 12 గంటల లోపు మావారు డిశ్చార్జ్ అయ్యేలా అనుగ్రహించండి బాబా" అని బాబాను కోరుకున్నాను. తర్వాత వెబ్సైట్ ఓపెన్ చేస్తే, "సహనంగా ఉండమ"ని బాబా మెసేజ్ ఇచ్చారు. అంతే, బాబా మీద భారమేసి పడుకున్నాను. మరుసటిరోజు అంటే వినాయకచవితి రోజు ఉదయం మావారు నాకు ఫోన్ చేసారు. అది చూసి నేను, 'ఐసీయూలో ఫోన్ అనుమతించరు కదా! కాల్ ఎలా వస్తుంది' అనుకోని లిఫ్ట్ చేసి మాట్లాడితే, "రాత్రి 11కి ఇన్సూరెన్స్‌వాళ్ళు వచ్చి పర్మాలిటీస్ పూర్తి చేసారు. దాంతో రాత్రి 12- 1 మధ్య నన్ను డిశ్చార్జ్ చేసారు" అని మావారు చెప్పారు. హాస్పిటల్‌కి దగ్గరలో ఉండే మా బంధువులు మావారిని ఆ రాత్రి వాళ్ళింటికి తీసుకెళ్లారు. దయతో అన్నీ ఫాస్ట్‌గా జరిగిపోనించి మాకు పండగ సంతోషాన్నిచ్చారు బాబా. వినాయకుడిని పూజించుకొని సంతోషంగా ఉన్నాం. నేను ఎప్పుడు నా కుటుంబం గురించి బాధపడినా "నీ కుటుంబానికి ఏమీ కాదు. అంతా సవ్యంగా ఉంటుంది" అని మెసేజ్ ఇచ్చేవారు బాబా. అలాగే పెద్ద సమస్యను చిన్నగా తీసేసి బాబా మమ్మల్ని ఆదుకున్నారు. ఇప్పుడు నాకు చాలా ధైర్యంగా ఉంది. నాకు ఏదైనా కష్టమొస్తే ఆదుకోవడానికి బాబా ఉన్నారు. "తండ్రీ బాబా! మీకు శతకోటి వందనాలు".

