సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

శిరిడీలో సేవాభాగ్యం


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి

తేనె సాయి మందిరం,  నిజామాబాద్

సాయిబంధువులందరికీ సాయిరామ్. నా పేరు భాను. నేను నిజామాబాద్ నివాసిని. నేను మా ఊరిలోని తేనె సాయిమందిరానికి తరచూ వెళ్తుంటాను. నాకు శిరిడీలో సేవ చేయాలని చాలారోజులనుండి కోరిక ఉండేది. మా మందిరంలో ఒకతను శిరిడీలో సేవకి వెళ్లడానికి ప్రణాళిక వేసుకున్నారు. కానీ మందిరంలో నన్ను అందరూ చాలా చిన్నచూపు చూస్తారు కాబట్టి నన్ను తీసుకొని వెళ్లరనిపించి, "సరేలే, సమయం వచ్చినప్పుడు వేరే గ్రూపు వాళ్లతో అయినా తన సేవకి బాబా నన్ను రప్పించుకుంటారు" అనుకున్నాను. ఇలా అనుకున్న తరువాత అనుకోకుండా శిరిడీ వెళ్లి గురుస్థానం వద్ద ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాను. అక్కడ కొందరు సేవకులను చూసి, వాళ్ళ దగ్గరకు వెళ్లి, "మీలాగా నాకు కూడా సేవ చేసుకోవాలని ఆశగా ఉంది" అని అన్నాను. వాళ్ళు వాళ్ళ సర్ విజయ్‌గారి ఫోన్ నెంబర్ ఇచ్చి మాట్లాడమన్నారు. శిరిడీనుండి ఇంటికి వచ్చిన తరువాత విజయ్‌గారికి ఫోన్ చేశాను. అతను, "అమ్మా, నిన్ను ఒకసారి కలవాలి. నీ ఆధార్ కార్డు తీసుకొని హైదరాబాద్ బేగంపేటలోని బాపూనగర్ బాబా మందిరానికి రాగలవా?" అని అడిగారు. నేను హైదరాబాద్ వెళ్లి విజయ్‌గారికి ఫోన్ చేస్తే, "నేనిప్పుడు పనిలో ఉన్నాను, సాయంత్రం 4గంటలకి వస్తాను. అప్పటివరకు వేచి ఉంటావా?" అని అడిగారు. నేను 'సరే, ఉంటాన'ని చెప్పి, బాబా మందిరానికి వెళ్లి అక్కడి వాళ్లతో, "విజయ్‌గారిని కలవడానికి వచ్చాను. అతను సాయంత్రం 4గంటలకి వస్తారట, అప్పటివరకు నన్ను ఇక్కడ వేచి ఉండమన్నారు" అని చెప్పాను. వాళ్ళు 'సరే'నన్నారు. ఆరోజు అక్కడ అన్నదానం జరుగుతూ ఉంది. నేను, "ఈ అన్నదానంలో సేవ చేసుకోవచ్చా?" అని అడిగాను. అందుకు వాళ్ళు, "సంతోషంగా చేసుకోమ్మా!" అన్నారు. ఇక సంతోషంగా ఆ సేవ, తరువాత మందిరం లోపల కడిగే సేవ కూడా చేసుకుంటూ 4గంటల వరకు బాబా సేవ సంతృప్తిగా చేసుకున్నాను. బాబా గుడిలో సేవాభాగ్యానికి నా మనస్సు ఉప్పొంగిపోయింది. ఇక్కడే కాదు, నేను ఏ బాబా మందిరానికి వెళ్ళినా ఇలాగే బాబా నాకు తనని సేవించుకునే భాగ్యం ఇస్తారు. అది నాకెంతో ఆనందంగా ఉంటుంది. సరిగా 4 గంటలకి విజయ్‌గారు వచ్చి, నా ఆధార్ కార్డు తీసుకొని, "సరేనమ్మా, మే 13వ తేదీకి శిరిడీ వెళ్ళాలి. సిద్ధంగా ఉండమ్మా" అని చెప్పారు. అలా నేను మే 13న మొదటిసారి బాబా సేవకి శిరిడీ వెళ్లి 10 రోజులు సేవ చేసుకున్నాను. తరువాత రెండవసారి జులై నెలలో గురుపౌర్ణమికి 10 రోజులు, మళ్ళీ మూడవసారి విజయదశమికి శతాబ్దిఉత్సవాలలో 10 రోజులు వెళ్లి, మొత్తం 30 రోజులు పవిత్ర శిరిడీక్షేత్రంలో బాబా సేవ చేసుకున్నాను. ఎంత ఆనందమో ఇక్కడ పదాలలో పెట్టలేకపోతున్నాను. ఇంకో విషయం ఏమిటంటే మా ఊరి టెంపుల్ నుండి ఇప్పటివరకూ ఒక్కరు కూడా శిరిడీలోని సేవకి వెళ్ళలేదు. నేను మాత్రం 3 సార్లు సేవకి వెళ్లి వచ్చాను. మొదటిసారి నాతో వచ్చిన వాళ్లలో కూడా ఏ ఒక్కరూ మళ్ళీ సేవకి రాలేదు. వాళ్లందరికీ శిరిడీలో సేవ చేసే అవకాశం ఒక్కసారి మాత్రమే వచ్చింది. నాకు మాత్రమే మూడుసార్లు సేవ చేసుకొనే అదృష్టాన్నిచ్చి బాబా నన్ను అనుగ్రహించారు. బాబా నా జీవితంలో చాలా చమత్కారాలు చేసారు. బాబాకి ఆజన్మాంతం ఋణపడివుంటాను.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo