శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
సాయిబంధువులందరికీ సాయిరామ్. నాపేరు విజయ. శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మా కుటుంబమంతా బాబా దర్శనార్థం శిరిడీ వెళ్ళాము. అక్కడ బాబా మామీద చూపించిన కరుణాపూరితమైన అనుగ్రహాన్ని ఈ "సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్" ద్వారా మీ అందరికీ తెలియచేయాలనుకుంటున్నాను.
శిరిడీ వెళ్ళడానికి ముందు, "బాబా! నేను మీ దర్శనానికి వస్తున్నాను. నాకు ఏదైనా మంచి అనుభవాన్ని కానీ, లీలని కానీ చూపిస్తావా?" అని బాబాను అడిగాను. కానీ నేను బాబాని ఒకటి అడిగితే, ఆయన నాకు చాలా లీలలే చూపించారు. ప్రస్తుతం వాటిలో ఒకదానిని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఇక వివరాల్లోకి వెళితే .....
శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శిరిడీలో చాలా రద్దీగా ఉంది. బాబా దర్శనానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ వాళ్ళు బాబా సమాధి మందిరంలో బాబా ముందు ఎక్కువ సమయం ఉండనీయట్లేదు. ఇటువంటి పరిస్థితిలో కూడా బాబా మమ్మల్ని చక్కగా అనుగ్రహించారు. నా మనసు తృప్తిపడేంతవరకు తమ ముందు ఉంచుకొని అద్భుతమైన దర్శనాన్ని మాకు ఇచ్చారు. బాబా దివ్యమంగళరూపం చూసాక నేను ఒక ఆనందమైన స్థితిలోకి వెళ్ళాను. చుట్టూ ఏమి జరుగుతుందో కూడా తెలియలేదు. మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ ఆనందంలో బయటకొస్తున్న సమయంలో గానీ నాకు గుర్తురాలేదు, బాబా కోసం కోవా తెచ్చానని. "అయ్యో, బాబా! మీకోసం నేను కోవా తీసుకొచ్చాను, నా హ్యాండ్‌బ్యాగ్‌లోనే ఉంది" అనుకుని మళ్ళీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేశాను, కానీ సెక్యూరిటీ వాళ్ళు ఒప్పుకోలేదు. బాబాకోసం తీసుకొచ్చిన నైవేద్యాన్ని ఇవ్వలేకపోయానని మనసులో ఒకటే బాధ. తరువాత గురుస్థాన్ దగ్గరకి వెళ్లాను. అక్కడికి వెళ్లగానే ఒక వేపాకు దొరకడంతో చాలా సంతోషంగా అనిపించింది. బాబా ఈ రకంగా నన్ను ఆశీర్వదించారనిపించింది. కానీ 'నా నైవేద్యం తీసుకోలేదే' అనే బాధ మాత్రం నన్ను విడిచిపెట్టట్లేదు. దీక్షిత్ వాడా దగ్గర కూర్చుని ఉన్నాను. ఎక్కడనుంచి వచ్చిందో కానీ ఒక కుక్క నా చుట్టే తిరుగుతోంది. ఎంతదూరంగా వెళ్తున్నా నా చుట్టూ తిరుగుతూనే ఉంది. మా ఆయన, "బాబాకోసం తీసుకొచ్చిన కోవా ఈ కుక్కకు పెట్టు!" అని అన్నారు. నేను బాబాకోసం తెచ్చానని, ఇంకోసారి దర్శనానికి వెళ్లినప్పుడు బాబాకు నివేదిస్తానని చెప్పాను. ప్రక్కనున్న వాళ్లంతా దానికి వివిధరకాలైన ప్రసాదాలను ఇస్తూనే ఉన్నారు. కానీ అది మాత్రం దేన్నీ తినట్లేదు. అప్పుడు నాకు సచ్చరిత్రలోని ఒక సంఘటన గుర్తుకు వచ్చింది. లక్ష్మీబాయిషిండే బాబాకోసం రొట్టెలు తీసుకొని రాగా, వాటిని బాబా తినకుండా ప్రక్కనే ఉన్న కుక్కకు వేస్తారు. ఆమె చిన్నబుచ్చుకుని, "మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే!" అంటుంది. అపుడు బాబా, "దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చు గాని, ఆత్మ వున్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే!" అంటారు. ఈ వివరాలన్నీ గుర్తొచ్చాక వెంటనే బ్యాగులో నుండి కోవా తీసి ఆ కుక్కకు పెట్టాను. అంతవరకూ ఎవరు ఏమి పెట్టినా తిననిది, నేను పెట్టిన వెంటనే తినేసింది. ఇంకా కావాలన్నట్లు నావైపే తదేకంగా చూస్తోంది. దాని కడుపునిండేంత వరకు కోవాను పెట్టాను. నా ప్రక్కన ఉన్నవాళ్లు కూడా కోవా పెట్టారు. కానీ అది వాళ్ళు పెట్టేవి తినట్లేదు, నేను పెట్టింది మాత్రమే తింటోంది. అది చూసి నాకు చాలా ఆశ్చర్యమేసింది. మా ఆయన, "చూశావా! బాబా నైవేద్యాన్ని స్వీకరించలేదని నువ్వు బాధపడ్డావు. కానీ ఆయనే స్వయంగా నీ నైవేద్యాన్ని ఈ రకంగా స్వీకరిస్తున్నారు" అన్నారు. నేను మనసులో అనుకుంటున్న విషయాన్నే మావారు కూడా చెప్పేసరికి చాలా ఆనందమేసింది. నా మనసులో ఉన్న దిగులంతా పోయింది. నా మనసులో ఉన్నటువంటి ఆ దిగులుని తీసివేయటానికి బాబా ఈ రూపంలో వచ్చారని చాలా సంతోషంగా అనిపించింది. నేను కోరుకున్నది చిన్న కోరికే అయినా ఈవిధంగా తీర్చి బాబా నన్ను చాలా సంతోషపెట్టారు. ధన్యవాదాలు బాబా!
ఓం సాయిరాం.
🕉 sai Ram
ReplyDelete