సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఇల్లే మందిరమైన - విల్లేపార్లే సాయిమందిరం....


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


విల్లేపార్లేలోని సాయిమందిరం
శ్రీసాయి అంకితభక్తురాలిచే నిర్మించబడిన ముంబయి, విల్లేపార్లేలోని సాయిమందిరం గురించిన వివరాలను 'సాయిపథం ప్రథమ సంపుటము' నుండి స్వీకరించి ఈరోజు సాయిభక్తుల ముందుంచుతున్నాము.

శ్రీ సాయిబాబా సశరీరులుగా ఉన్నప్పుడు ప్రత్యక్షంగా సేవచేసుకునే భాగ్యానికి నోచుకున్న ప్రముఖ భక్తులలో 'శ్రీమతి చంద్రాబాయి బోర్కర్' ఒకరు. ఆమె జీవితాన్ని గమనిస్తే అనుక్షణం బాబా ఆమెనెలా చెయ్యిపట్టుకుని నడిపించారో అన్నది మనకు అర్థమవుతుంది. ఈమెకు బాబాపట్ల గల ప్రేమ అపారం. తన స్వగృహాన్నే సాయిమందిరంగా మలచిన సాయిభక్తురాలీమె. ముంబాయిలో విల్లేపార్లే, తిలక్‌రోడ్‌‌లోని 'శ్రీరామ్‌‌సాయినివాస్ మందిరం'గా పిలవబడే ఈ మందిర వివరాలను, శ్రీమతి చంద్రాబాయి బోర్కర్‌‌కు బాబాతో గల అనుబంధాన్ని, ఆమె కోడలు శ్రీమతి 'మంగళా బోర్కర్' మాటల్లో తెలుసుకుందాం.

"మా మామగారు శ్రీరామచంద్రబోర్కర్ రైల్వేలో మెకానికల్ ఇంజనీరుగా పనిచేసే రోజులలో వారికి తరచూ బదిలీలవుతూ ఉండేవి. అప్పట్లో వారికి సంతానం లేనందువలన ఒంటరిగా ఇంట్లో ఉండలేక మా అత్తగారు శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ ఆరునెలలు భర్త దగ్గర, ఆరునెలలు శిరిడీలోని శ్రీసాయిబాబా సన్నిధిలో గడిపేవారు. దాదాపు 80 సంవత్సరాల క్రితం, అంటే శ్రీసాయిబాబా పేరు కూడా అంతగా ఎవరికీ తెలియని రోజుల నుండే, మా అత్తగారు శిరిడీ వెళ్తూ ఉండేవారు. ఆ రోజులలో ఆమె శిరిడీలో శ్రీమతి శారదాబాయి చందోర్కర్ భోజనశాలలో బసచేసేది. ఒకసారి శారదాబాయి చందోర్కర్ అస్వస్థతతో ఉన్న తన కుమార్తె యమూబాయిని బాబా సన్నిధికి తీసుకువచ్చి, ఆ అమ్మాయి అనారోగ్యం గురించి బాబాకు విన్నవించుకున్నది. బాబా అప్పుడు శారదాబాయికి తన సమక్షంలో కూర్చొనివున్న మా అత్తగారిని చూపుతూ, "చంద్రాబాయి ఒడిలో వెయ్యి" అన్నారు. ఆమె బాబా చెప్పినట్లు చేసింది. యమూబాయి ఆరోగ్యం మెరుగయింది. అప్పటినుండి యమూబాయి ఆలనాపాలనా మా అత్తగారే చూసుకునేవారు. బాబాను స్వంత సోదరునికంటే ఎక్కువగా చూచుకుంటూ ఆయన భుజించిన పిదపే తాను భుజించాలని నియమం పెట్టుకొని దానిని అక్షరాలా పాటిస్తూ బాబాకు సేవచేసుకున్న బయజాబాయి, ఆమె భర్త శ్రీగణపతిరావుకోతే పాటిల్‌ల కుమారుడు శ్రీతాత్యాకోతేపాటిల్‌‌కు చాలాకాలంగా సంతానం లేదు. ఒకసారి మా అత్తగారు బాబాను తాత్యాకు ఒక్కబిడ్డనన్నా ప్రసాదించమని ప్రార్థించింది. అప్పుడు బాబా, "నీకూ, వాడికి ఒకేసారి పిల్లలు కలుగుతారు ఫో!" అని అన్నారు. బాబా మాటలకు ఆమె నిర్ఘాంతపోయింది. ఆమెకు అప్పుడు వయస్సు దాదాపు 50 సంవత్సరాలు. ఆ వయసులో తనకు పిల్లలు కలుగుతారు అన్నమాట ఆమెకు నమ్మశక్యంగా లేదు. కానీ వరదాయి శ్రీసాయి అనుగ్రహవిశేషం వల్ల మా అత్తగారికి ఆ తర్వాత ఒక మగబిడ్డ పుట్టాడు. ఆయనే నా భర్త 'శ్రీరాజారామ్ రామచంద్ర బోర్కర్'. అలానే తాత్యాబాకు కూడా మగబిడ్డ కలిగాడు. అతడే బాజీరావ్ కోతేపాటిల్.

బాబా దేహావసాన సమయంలో మా అత్తగారు కూడా అక్కడే ఉన్నారు. బాబా నోటిలో మంచినీళ్లు పోసి, ఆయన పాదాలు కడిగారు. బాబా సమాధి చెందటము, మా అత్తగారికి సంతానం కలగటం వలన బొంబాయిలోనే స్థిరపడాలని నిర్ణయించుకుని, విల్లేపార్లేలో ఒక పెద్ద బంగళా నిర్మించారు. పార్లేలోని మా ఇంట్లో ఒక పెద్ద సాయిబాబా చిత్రపటం ఉంది. ఆ చిత్రపటాన్ని శ్రీజయకర్ చిత్రీకరించారు. శ్రీజయకర్ చిత్రకళలో ఏ శిక్షణా తీసుకోకపోయినా, బాబా కృపవలన ఆయనకు ఆ కళలో అత్యంత ప్రావీణ్యం లభించింది. ఆయన కూడా విల్లేపార్లేలో నివసిస్తుండడం వలన, ఈనాటికీ వారి కుటుంబంతో మా స్నేహానుబంధం అలానే ఉంది. జయకర్‌గారు చిత్రించిన బాబా పటం ఇప్పటికీ మా ఇంటిలో ఉంది. విజయదశమి, గురుపూర్ణిమ ఉత్సవాలు మా అత్తగారు చాలా ఘనంగా నిర్వహించేది. 'బనుబాయి దుఃఖండే' భక్తి కీర్తనలను గానం చేయడానికి వచ్చేది. చాలా దూరప్రాంతాల నుండి ప్రజలు ఆ ఉత్సవాలకు హాజరయ్యేవారు. ఒకసారి వసంతరావు గోరక్షకర్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనకు ఒక చక్కని అనుభవం కలిగి, దానిగురించి మా అత్తగారికి చెప్పినప్పుడు, ఆమెకు ఇక్కడ బాబా విగ్రహాన్ని ప్రతిష్టించాలని సంకల్పం కలిగింది. ఆమె తన కోరికను మాకు తెలపటంతో అందరం ఆనందంగా ఆ ప్రయత్నంలో భాగం పంచుకున్నాము. సరిగ్గా అదేసమయం(1954)లో శిరిడీ సమాధిమందిరంలో శ్రీసాయి విగ్రహం ప్రతిష్ఠించడం జరిగింది. అత్యద్భుతమైన ఆ విగ్రహాన్ని ప్రసిద్ధ శిల్పకారుడు శ్రీ తాలిమ్ మలిచారు. ఆ విగ్రహం యొక్క నమూనాను కాంగ్రెస్‌‌హౌస్ వీధిలోని "సాయిధామ్"లో ప్రతిష్ఠించడం జరిగింది. అందుకని ఆ మందిరం ట్రస్టీ శ్రీ మాల్‌‌పెకర్‌‌గారిని సంప్రదిస్తే ఆయన ప్రముఖశిల్పి శ్రీ వసంతరావు గోవేకర్‌‌గారిని పరిచయం చేశారు. శ్రీ గోవేకర్‌గారికి రెండు అడుగుల బాబా విగ్రహాన్ని తయారుచేయమని, దానికి చెల్లించవలసిన ధరను కూడా నిర్ణయించుకున్నాము. ఆ తరువాత మేము విగ్రహాన్ని చూడడానికి వెళ్లేసరికి శ్రీ గోవేకర్‌‌గారు నిలువెత్తు బాబా విగ్రహాన్ని తయారుచేసి వున్నారు. మేము దానికి ఎక్కువ ధర చెల్లించవలసి వస్తుందేమోనని భయపడుతుంటే, బాబా దయవల్ల ఆయన ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రకారమే డబ్బు తీసుకున్నారు. పాలరాతిపొడితో వైట్ సిమెంటును కలిపి తయారుచేసిన ఆ విగ్రహం సాక్షాత్తూ సాయిబాబానే అక్కడ కూర్చున్నారా అనిపిస్తూ అత్యద్భుతంగా ఉంది.

అప్పట్లో మా ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేకపోవడం వలన మేము మందిరం నిర్మించే పరిస్థితిలో లేము. అందువలన మేము విగ్రహాన్ని మా ఇంటిలోనే ప్రతిష్టించి, దానినే ఒక మందిరంగా చేయాలని నిర్ణయించుకున్నాము. అలా విల్లేపార్లేలోని మా ఇల్లే బాబా మందిరమయ్యింది. బాజాభజంత్రీలతో వైభవంగా ఊరేగింపుతో బాబామూర్తిని పార్లేకు తీసుకురావడం జరిగింది. అప్పుడు మా అత్తగారి ఆనందం చెప్పనలవి కాలేదు. శ్రీసాయి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి అవసరమైన మండపాన్ని నా సోదరుడు సుధాకర్ తన స్వహస్తాలతో నిర్మించాడు. శ్రీ పాలేయ్‌‌శాస్త్రిగారి చేతులమీదుగా విగ్రహప్రతిష్ఠ కార్యక్రమం కన్నులపండుగగా జరిగింది.

తరువాత కొద్దిరోజులకు మా అత్తగారు స్వర్గస్తురాలయ్యారు. నేను బాబా సేవలోనే కాలం గడుపుతున్నాను. క్రమంగా బాబా మందిరం రూపురేఖలు కూడా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. 1987వ సంవత్సరంలో బాబా పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్టించాలనిపించి శ్రీ గోవేకర్‌‌గారికి చెప్పాము. తరువాత అక్షయతదియరోజు బాబా పాలరాతి విగ్రహానికి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ జరిగింది. అంతకుముందున్న విగ్రహాన్ని మేడమెట్ల దగ్గర ఇప్పటికీ చూడవచ్చు. అప్పటివరకు గురుపూర్ణిమ, విజయదశమి ఉత్సవాలు మాత్రమే జరిగేవి. ఇప్పుడు అక్షయతదియ ఉత్సవం కూడా మొదలైనది. ఆ ఉత్సవంలో పాల్గొనే భక్తులందరికీ పితలా - భాకరి, మసాలా అన్నము, శీరా, లడ్డు వంటి  ప్రసాదాలు పంచిపెడుతుంటాము.

నేను అనారోగ్యానికి గురవటంతో మా కోడలు సౌ౹౹ఉజ్వల నాకంటే ఎక్కువగా బాబా సేవ  చేసుకుంటున్నది. ఒక సామాన్య గృహిణినైన నా చేతులమీదుగా ఇంతటి అసామాన్య కార్యం జరిగిందంటే అది శ్రీసాయినాథుని కృపావిశేషమే. నా తల్లీ, తండ్రీ అన్నీ బాబానే.
శ్రీమతి మంగళా బోర్కర్ గారి కోడలు ఉజ్వల బోర్కర్

శ్రీమతి మంగళా బోర్కర్,
విల్లేపార్లే, బొంబాయి.

7 comments:

  1. Om sai ram baba pleaseeee help me

    ReplyDelete
  2. Om sai ram bless my family.please give long life to my hubby and children.be with us.improve my health baba.om sai ram

    ReplyDelete
  3. Om sai ram bless my family.be with us

    ReplyDelete
  4. Om Sree Sachidhanandha Samardha Sadguru Sai Nadhaya Namaha 🕉🙏😊❤😃🌺😀🌸🤗🌼🌹

    ReplyDelete
  5. ఓం శ్రీ సాయిరాం

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo