సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ప్రప్రథమ సాయిమందిరం, భివ్‍‍పురి.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ  -  సబూరి


శ్రీసాయిబాబా మహాసమాధి చెంది ఎంతోకాలం కాకుండానే భారతీయ ఆధ్యాత్మిక జీవన స్రవంతిలో ఒక భాగమయ్యారు. ఈనాడు మొత్తంమీద నగరాలలో, పట్టణాలలోనే కాదు పల్లెపల్లెలా, వాడవాడలా సాయిమందిరాలు వెలిసాయి. ఇంకా ఎన్నో వెలుస్తున్నాయి. అయితే, సాయిబాబా సశరీరులుగా ఉండగానే, అంటే 1916లోనే వెలసిన ప్రప్రథమ బాబామందిరం గురించిన వివరాలను 'సాయిపథం ప్రథమ సంపుటము' నుండి సేకరించి యధాతథంగా ఈరోజు మీ ముందు ఉంచుతున్నాము.

బొంబాయి నుండి పూనా వెళ్ళే రైలు మార్గంలో కర్జత్‌కు ముందు "భివ్‍‍పురి రోడ్" అను చిన్న స్టేషన్ వస్తుంది. ఈ ‍స్టేషన్‍‍లో దిగి కుడివైపు దృష్టిసారిస్తే, పొలాల మధ్యనున్న మందిర గోపురం కనిపిస్తుంది. అదే భివ్‍‍పురిలో ఉన్న శ్రీ సాయిమందిరం. పొలాల మధ్యనుండి పది నిమిషాలు నడిస్తే  ఈ మందిరాన్ని చేరుకోవచ్చు. ఉత్సుకత గొలిపే ఈ మందిర చరిత్ర సాయిభక్తులందరూ తెలుసుకొని తీరవలసినదే. శ్రీసాయినాథుడు తమ భక్తులను విచిత్రరీతులలో ఎలా రప్పించుకుంటారో ఈ మందిర చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది. ఈ మందిరం వ్యవస్థాపకులైన కీర్తిశేషులు శ్రీ కేశవ్ రామచంద్ర ప్రధాన్‍‍గారు మొదట నాస్తికుడంటే ఎవరూ నమ్మలేరు.
శ్రీ కేశవ్ రామచంద్ర ప్రధాన్‍‍
శ్రీప్రధాన్‍‍గారు బొంబాయికి చెందిన ఒక పార్సీ పెద్దమనిషి దగ్గర పేథీగా పనిచేసేవాడు. (పేథీ అంటే తన యజమాని తరపున బాకీలు వసూలు చేసే ఉద్యోగం.) ఇతడు భివ్‍‍పురిలోనే ఉండి బొంబాయి వెళ్లివస్తూ ఉండేవాడు. ఉద్యోగరీత్యా ఇతను తరచూ మన్మాడ్, నాసిక్, కోపర్‍గాం మొదలైన ఊర్లకు వెళ్ళవలసి వచ్చేది. ప్రధాన్ సన్నిహిత స్నేహితుడొకడు సాయిభక్తుడు. ఇతను తరచూ శిరిడీ వెళ్లి బాబాను దర్శించేవాడు. ఇతనొకసారి ప్రధాన్ తన ఊరికొచ్చినప్పుడు శిరిడీ వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ప్రధాన్‍‍ను కూడా తనతో వచ్చి బాబాను దర్శించుకోమని చెప్పాడు. దైవంపైన, సాధువులపైన నమ్మకంలేని ప్రధాన్, తను శిరిడీ రావడానికి సుముఖత చూపలేదు. చివరకు స్నేహితుని బలవంతంపై శిరిడీకి వెళ్లడానికి అంగీకరించాడు కానీ, మశీదులో అడుగుపెట్టనన్నాడు. ఆ స్నేహితుడందుకు ఒప్పుకున్నాడు.

మిత్రులిద్దరూ శిరిడీ చేరి వాడాలో బస చేశారు. మధ్యాహ్న ఆరతి సమయమవ్వడంతో ఆ స్నేహితుడు మసీదుకు వెళ్ళాడు. ప్రధాన్ మాత్రం గదిలోనే ఉండిపోయాడు. ఆరతి మొదలయ్యేముందు గంటలు మ్రోగాయి. గదిలో ఉన్న ప్రధాన్‍‍కు కూడా ఆరతి గంటలు వినబడ్డాయి. ఆ శబ్దాలు అతనిలో ఏదో తెలియని అలజడి రేపాయి. క్రమేణా ఆ గంటలశబ్దం వింటున్నకొద్దీ తనేం చేస్తున్నాడో తనకే తెలియని ఒకానొక విచిత్రస్థితిలో నడుచుకుంటూ నేరుగా మసీదుకు చేరుకున్నాడు. మండపంలో ఒకచోట కూర్చొని బాబా వైపే చూస్తూ భావపారవశ్యతలో మునిగిపోయాడు. ఆరతి అయిపోవడంతో భక్తులందరూ ఊదీ తీసుకొని వెళ్లిపోయారు. బాబా ప్రధాన్‍‍ను దగ్గరికి రమ్మని పిలిచారు. అసంకల్పితంగానే తమ దగ్గరకు చేరిన ప్రధాన్‍‍ని  బాబా దక్షిణ అడిగారు. ప్రధాన్ జేబులో అతను వసూలు చేసిన బాకీల మొత్తం రెండువేల ఐదువందల రూపాయలు (2500) ఉన్నాయి. ఆ డబ్బు మొత్తం బాబా చేతుల్లో ఉంచి అదే పారవశ్యంతో తిరిగి గదికి చేరుకున్నాడు. ఆ తరువాత బాహ్యస్మృతిలోకి వచ్చిన ప్రధాన్ జరిగిన విషయమంతా గుర్తొచ్చి నిర్ఘాంతపోయాడు. విషయం తెలుసుకున్న ప్రధాన్ స్నేహితుడు చింతపడవలసిన అవసరమేమీ లేదని, అతనికి ఏ ఇబ్బందులు రాకుండా అతని బాధ్యతంతా బాబాయే వహిస్తారని చెప్పాడు.

ప్రధాన్ శిరిడీనుండి టాంగాలో కోపర్‍గాం బయల్దేరాడు. అతను కోపర్‍గాం చేరిన తర్వాత గానీ తన దగ్గర పైకమేమీ లేదన్న సంగతి గుర్తించలేదు. టాంగావాడితో తన ఉంగరం అమ్మి అతని బాడుగ తీసుకుని మిగిలిన పైకం తెమ్మన్నాడు. ఇంతలో అక్కడికి ఖరీదైన బట్టలు ధరించిన ఒక అపరిచిత వ్యక్తి వచ్చి ప్రధాన్ ఇబ్బందిని తెలుసుకొని టాంగావాడికి డబ్బులు ఇచ్చి, బొంబాయికి టిక్కెట్టు కూడా కొనిచ్చి వెళ్ళిపోయాడు.

ప్రధాన్ భివ్‍‍పురి చేరాడు. యజమానికి డబ్బు ఎలా ఇవ్వాలో తోచక, తాను జబ్బుపడ్డానని, నయమైన తర్వాత పనిలోకి వస్తానని కబురుచేశాడు. స్వస్థత చిక్కాకే పనిలోకి నింపాదిగా రమ్మని, కానీ అతను వసూలు చేసిన దానికన్నా రెట్టింపు పైకం ఎందుకు పంపాడో అర్థం కాలేదని యజమాని తెలియజేశాడు. విషయం తెలుసుకొన్న ప్రధాన్ బాబా తనపై చూపిన కరుణకు కరిగిపోయాడు. ప్రథమ దర్శనంతోనే తననింతగా అనుగ్రహించిన బాబా కృపకు ప్రధాన్ ముగ్ధుడయ్యాడు. అప్పటినుండి బాబాకు పరమభక్తుడై శిరిడీ తరచూ వెళ్లి వారిని దర్శించుకుంటూ ఉండేవాడు. శిరిడీ వెళ్ళినప్పుడల్లా బాబాను భివ్‍‍పురి రమ్మని ఆహ్వానిస్తూ వుండేవాడు. 1916లో ప్రధాన్ శిరిడీలో ఉన్నప్పుడు బాబా తన ప్రతిమను ఒకదాన్ని ప్రధాన్‍‍కిచ్చి, "భివ్‍‍పురి వెళ్ళు, మందిరాన్ని నిర్మించి ఈ మూర్తిని అందులో ప్రతిష్టించి పూజించుకో! ఇకపై నీవు శిరిడీ రానక్కర్లేదు!" అని చెప్పారు. ప్రధాన్ భివ్‍‍పురి వచ్చాడే కానీ బాబా ఆదేశాలను పాటించలేదు. ఆ తర్వాత ప్రధాన్ మళ్లీ శిరిడీ వెళ్ళినప్పుడు బాబా, "నేను మీ ఇంటికొచ్చి ఉండగా ఇక్కడికి ఎందుకొచ్చావ్? భివ్‍‍పురియే నీ శిరిడీ! అక్కడకు వెళ్లి నే చెప్పినట్లు చెయ్యి!" అన్నారు.
తర్వాత కొద్దిరోజులకే ప్రధాన్ తన ఇంటి సమీపంలో చిన్న మందిరాన్ని కట్టించి బాబా మూర్తిని ప్రతిష్టింపచేశాడు. నిత్యపూజలు మొదలయ్యాయి. ఈ మందిర పరిసరాలు పచ్చని చెట్లతో రమణీయంగా ఉంటాయి. రాత్రులు ప్రశాంతంగాను, నిశ్శబ్దంగాను ఉన్న సమయాల్లో మందిరం తలుపులు తీసిన చప్పుడు వినబడేది. బాబా బయటకు వచ్చి మందిర ప్రాంగణంలో సంచరించేవారు. ఒక్కొక్కసారి మందిరం ముందున్న చెట్టుక్రింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటూ కనిపించేవారు. వేకువఝామున మూడు గంటలకు మందిరం తలుపులు మూసుకున్నట్లు చప్పుడయ్యేది. ఇవన్నీ ప్రధాన్, వారి కుటుంబసభ్యులకే కాక వారింటికి వచ్చిన అతిథులకు కూడా అనుభవం అయ్యేది. దీనితో ప్రధాన్‍‍కున్న సందేహాలన్నీ పూర్తిగా నివృత్తి అయి బాబాపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడ్డాయి. మందిరానికి చక్కని గర్భగుడి, దానిముందు విశాలమైన పెద్దగది, వరండా, అతిథిగృహం మొదలైనవి ఏర్పాటు చేశాడు.

ప్రధాన్ అల్లుడైన వి.వి.గుప్తెగారు కూడా మందిర కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని దాని అభివృద్ధికి పాటుపడ్డారు. గుప్తెగారు 1936లో శిరిడీ వెళ్లారు. అక్కడి బాబా సమాధిమందిరాన్ని చూచి అనిర్వచనీయమైన ఆనందాన్ని పొందాడు. భివ్‍‍పురి మందిరాన్ని కూడా శిరిడీలోని మందిరమంత చక్కగా రూపొందించమని బాబాను ఆర్తితో ప్రార్థించాడు. అతని ప్రార్థన ఫలించి, బాబా కృపతో భివ్‍‍పురి మందిరం విఖ్యాతిగాంచి అసంఖ్యాకంగా భక్తులు మందిరానికి రాసాగారు.

1939లో ప్రధాన్‍‍గారు పరమపదించడంతో మందిర బాధ్యతంతా గుప్తెగారు తీసుకున్నారు. వారి ఆధ్వర్యంలో 'శ్రీ సద్గురు సాయినాథుని సేవాసంస్థ' ఏర్పడింది. క్రమంగా భక్తుల రద్దీ పెరగడంతో మందిరానికి మరిన్ని వసతులు చేయవలసి వచ్చింది. నిధుల కొరతతో చేపట్టిన కార్యక్రమం కొంత మిగిలిపోయింది. సాయిభక్తుడైన నారాయణ్ పురోహిత్ అనునతడు 'శ్రీసాయిసచ్చరిత్ర' పారాయణ ప్రారంభించాడు. నాలుగురోజుల పారాయణ తర్వాత బాబా అతనికి కలలో కనిపించి, "నా ధుని ఏది? ధుని లేకుండా ఇది శిరిడీ ఎలా అవుతుంది? మందిరమెలా సంపూర్ణమవుతుంది?" అన్నారు. ఇదే కల రెండుసార్లు కనిపించడంతో, పురోహిత్‌గారు గుప్తెగారికి ఈ విషయం చెప్పారు. ధుని నిర్మాణాన్ని బాబా ఆదేశంగా భావించి మందిరంలో ధునిని ఏర్పాటు చేశారు. 1949 శ్రీరామనవమి రోజున శ్రీ హేమాడ్‌పంత్‌గారి మనుమడైన వలవాల్కర్‌చే ధుని వెలిగించబడింది. ఈ మందిరంలో శ్రీరామనవమి, బాబా పుణ్యతిథి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి.
ధుని

5 comments:

  1. Sai nako chinna doubt.adi yantanta sai prashnavali ana app manalanti valu create chasinda ga andulo pratyekata yemundi munda question and answers type chasi patintaru manam number yadana press chasta daniki yado answer vastundi daniki answer baba icharu ani anukovadam yantavaraku correct chapandi. Nakayta e app ni namalani ledu.adana vunta swayanga answer chayadaniki baba na adagachuga idanta yanti

    ReplyDelete
    Replies
    1. కరక్ట్ సాయి. బాబాని డైరెక్ట్ గా అడిగితె ఏదో ఒకరూపంలో ఆయన ఆన్సర్ వస్తుంది. అందులో అనుమానమే లేదు. అయితే ఎవరి విశ్వాసం వారిది. అందరికీ బాబా ఇచ్చే ఆన్సర్ రిసివ్ చేసుకొనే సామర్ధ్యం ఉండదు కదా సాయి. అది ఇక్కడ ప్రాబ్లెం సాయి. ఇంకా మీరు అన్నట్లు ఆ app లో ఎవరో ఆల్రెడీ ఆన్సర్స్ డిజైన్ చేసినవే అయితే, వాళ్ళు పెట్టిన వందల ఆన్సర్స్ నుండి మనం అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఒకటే వస్తుంది. అది చాలామందికి సరైన ఆన్సర్ కూడా అవుతుంది. ఇది ఎలా సాధ్యం ఒకసారి మిరే ఆలోచించండి. విశ్వాసానికి ఉన్న శక్తి దేనికి లేదు. ఒక బొమ్మను గురువుగా భావించిన ఏకలవ్యుడు అర్జునుడి కంటే గొప్ప విలువిద్య సంపన్నుడు కాలేదా? అందుకు కారణం ఏమిటి? అతని విశ్వాసమే కదా!

      “తనను తను నీ గురువుగా చేసుకోవాల్సింది గురువు కాదు. ఆయనపై పూర్తీ విశ్వాసాన్ని వహించటం వల్ల ఆయనను గురువుగా తలచవలసింది నీవే. పూచిక పుల్లనైన సరే గురువుగా బావిస్తే గమ్యం చేరుతవో లేదో చూడు”

      బాబా చెప్పిన పై వాక్యాలే అందుకు నిదర్శనం సాయి.

      నాకు తోచింది చెప్పాను సాయి.

      Delete
    2. chaala baaga explain chesaaru.nammakam tho chese pani ki sai always answers isthaaru. Naaaku idhe doubt vundedhi but others experience chusaaka anni practical gaa aalochinchaddhu anipinchindhi.

      Delete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo