నేను ఒక సాయి భక్తురాలిని. బ్లాగులో భక్తుల అనుభవాల ద్వారా "తన పాదాలను ఆశ్రయించిన భక్తులను బాబా ఎలా కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకుంటారో" అని తెలుసుకుంటూ ఉంటే బాబాపై నాకున్న నమ్మకం ఇంకా ఇంకా రెట్టింపు అవుతూ ఉంది. ముందుగా నా అనుభవాన్ని ఇలా సాయిబంధువులతో పంచుకొనే అవకాశం ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు బాబా! నేనేమైనా తప్పులు వ్రాస్తే నన్ను మన్నించండి. నన్నెప్పుడూ మీ పాదాల చెంత ఒక ధూళి కణంలా ఉండనివ్వండి. ఇప్పటివరకు బాబా నాకు లెక్కలేనన్ని అనుభవాలు ఇచ్చారు. వాటిలో బాబా నా భర్తకి ఉద్యోగం ఎలా ఇప్పించారోనన్న అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటున్నాను.
మేము 15 సంవత్సరాలు యు.ఎస్.ఏ.లో ఉన్న తర్వాత ఇండియాకి శాశ్వతంగా వచ్చేయాలని నిశ్చయించుకొని ముందుగా యు.ఎస్.ఏ.లో ఉన్న మా ఇంటిని అమ్మి, అక్కడ అంతా సెటిల్ చేసుకొని ఇండియా వచ్చేలా ప్రణాళిక చేసుకున్నాం. ఏదైనా పెద్దనిర్ణయం తీసుకొనే ముందు బాబా ముందు చీటీలు వేసి బాబా సలహా తీసుకోవడం నాకలవాటు. ఈ విషయంలో కూడా బాబా సలహా తీసుకోదలచి మేము బాబా గుడికి వెళ్లి, అక్కడున్న ఒక చిన్న పాపతో ఒక చీటీ తియ్యమని చెప్పాము. తను తీసిన చీటీలో, "ఇల్లు అద్దెకి ఇవ్వండ"ని ఉంది. ఆ సమయంలో బాబా ఎందుకు అలా చెప్పారో మాకు అర్థం కాలేదు. కానీ ఏదేమైనా బాబా మా క్షేమం కోసమే చెప్తారని, అది ఆయన ఆజ్ఞగా భావించి ఇంటిని అమ్మాలన్న మా ఆలోచన విరమించుకున్నాం. బాబా కృపతో మాఇంట్లో అద్దెకి మంచివాళ్ళు చేరారు. తరువాత మేము ఇండియాకి వచ్చేసాం.
యు.ఎస్.ఏ. సిటిజన్స్ ఐన మేము ఇండియాలో మా జీవితం బాగుంటుందన్న ఉద్దేశ్యంతో ఇండియాకి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక నా భర్తకి యు.ఎస్.ఏ.లో పనిచేసిన అనుభవంతో ఇక్కడ ఉద్యోగం దొరకడం చాలా కష్టమయ్యింది. 20 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికీ ఎంతగా ప్రయత్నించినా కనీసం ఇంటర్వ్యూకి పిలుపు కూడా వచ్చేది కాదు. యు.ఎస్.ఏ.లో తనకి నైపుణ్యమున్న సాఫ్ట్‌వేర్ ఏదీ ఇండియాలో వాడుకలో లేదు. అందువలన తన నైపుణ్యం మెరుగు పరుచుకునేందుకు మావారు కొత్త కోర్స్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. 9 నెలలపాటు కోర్స్ నేర్చుకుంటూ ఇంకోపక్క ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేసారు. అయినా ఉద్యోగం మాత్రం అందని ద్రాక్షలాగానే ఉండేది మా వారికి. ఉద్యోగం లేకపోయినా యు.ఎస్.ఏ. నుండి మాకు వచ్చే ఇంటి అద్దె డబ్బులు మా నెలవారీ ఖర్చులకి సరిపోవడమే కాకుండా కొద్ది మొత్తం ఆదా కూడా చేసుకోగలిగే వాళ్ళం. నిజంగా ఇది బాబా దయే. బాబా మా ఇంటిని అద్దెకు ఇవ్వమని చెప్పినందువల్లే మేము అటువంటి పరిస్థితులలో కూడా కష్టపడకుండా సంతోషంగా ఉండగలిగాం.
2 సంవత్సరాల తరువాత కోర్స్ పూర్తైన వెంటనే మరలా మావారు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈసారి ఇంటర్వ్యూకి కాల్స్ వస్తున్నా, కోర్స్‌కి సంబంధించిన సర్టిఫికేట్ అడిగేవాళ్ళు. అందువలన సమస్య అలానే ఉండేది. 2 నెలల తరువాత సర్టిఫికేట్ రావడంతో ఇంటర్వ్యూలకి వెళ్ళేవారు. 4 నెలల తరువాత మేము కలలో కూడా ఊహించని విధంగా మేము ఉండే చోటుకి దగ్గరలో మంచి కంపెనీలో మావారికి ఉద్యోగం దొరికింది. తన భక్తులకోసం బాబా వేసే ప్రణాళికలు చాలా ప్రత్యేకమైనవి. అవి మన ప్రణాళికలకు పూర్తి భిన్నంగా ఉంటాయి. కొత్త కోర్స్ నేర్చుకొనేలా పరిస్థితులు కల్పించి మావారి నైపుణ్యానికి ఇంకా మెరుగులు దిద్ది, తద్వారా తనని మంచి సంస్థలో, మంచి స్థాయిలో ఉండేలా చేసారు బాబా. అది మేము కలలో కూడా ఉహించనిది. శ్రద్ధ, సబూరీ అని బాబా మనకు నేర్పిన నియమాలు విజయం వైపు మనల్ని చేరుస్తాయి. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని, సహనాన్ని పరీక్షించడానికి కూడా బాబా ఎన్నో కష్టతరమైన పరిస్థితులు కల్పిస్తారు. తద్వారా మనల్ని ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దుతారు.
"బాబా! మీకు సదా నా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది నీవు నాకు కానుకగా ఇచ్చిందే. నీ భక్తులందరినీ ఇలానే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి బాబా!"
🕉 sai Ram
ReplyDeleteOm Sri sairam
ReplyDelete"బాబా! మీకు సదా నా కృతజ్ఞతలు. ఈరోజు నేను ఏదైతే అనుభవిస్తున్నానో అది నీవు నాకు కానుకగా ఇచ్చిందే. నీ భక్తులందరినీ ఇలానే జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళని సరైన మార్గంలో నడిపించండి బాబా!"
ReplyDelete