నేను ఒక సాయి భక్తుడిని. 2018, నవంబర్ నెలలో ఒకనాటి రాత్రి సాయి నాకు ప్రసాదించిన ఒక అద్భుత అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నాను. ఆ రోజు రాత్రి భోజనం చేశాక నాకు చాలా నలతగా అనిపించింది. తీవ్రమైన తలనొప్పి, కడుపులో ఇబ్బందిగా ఉండి, వాంతి వచ్చేలాగా ఉంది. ఎందుకలా ఉందో కారణం కూడా అర్ధం కాలేదు నాకు. నేను గదిలో ఒంటరిగా ఉన్నాను. అర్ధరాత్రి అయ్యే కొద్దీ నా పరిస్థితి మరీ అధ్వాన్నంగా మారిపోతోంది. నేను ఎక్కడ పడిపోతానో అనే భయం వల్ల మంచంపై నుండి కూడా లేవలేదు. నేను మంచంపైనే ఉండి నాకు నమ్మకం ఉన్న ప్రతి దేవుడినీ ప్రార్థిస్తూ ఉన్నాను. గాయత్రి మంత్రం, మహా మృత్యుంజయ మంత్రం జపిస్తూ ఉన్నాను. అయినా కూడా ఉపశమనం లభించలేదు.
నేను సాయి భక్తుడినే, అందులో ఎటువంటి సందేహమూ లేదు. కానీ అప్పటివరకు నేను సాయిని ఎలా మరచిపోయానో నాకే తెలియలేదు. నా మూర్ఖత్వానికి నన్ను నేనే తిట్టుకుని, నన్ను ఈ గడ్డు పరిస్థితి నుండి బయట పడవేయమని బాబాని మనస్పూర్తిగా ప్రార్ధించాను. నన్ను నమ్మండి, మరుక్షణమే బాబా నా మంచం పక్కన నిల్చొని ఉన్నారు. నేను నొప్పితో బాధపడుతూ అసహనంగా ఉన్నప్పటికీ, బాబా కళ్ళలో ఉన్న తేజస్సుని, భౌతికంగా నా ప్రక్కన నిలిచి ఉన్న ఆయన దివ్య రూపాన్ని స్పష్టంగా చూడగలిగాను. బాబా నా తలపై చేయి వేసి, “నువ్వు తిన్న ఆహారంలో విషం ఉంది. అది నీ రక్తంలో కలిసిపోయింది. కానీ నీకు ఏమీ భయం లేదు. నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నీకు తప్పకుండా నయం అవుతుంది” అని అన్నారు. మరుక్షణమే నా శరీరంలో ఇబ్బందులన్నీ మాయమయ్యాయి. తరువాత బాబా, “రేపటి నుండి ఒక వారం పాటు రోజుకి ఐదు బిల్వ పత్రాలు తిను, దాంతో అంతా సర్దుకుంటుంది” అని చెప్పి, నా కళ్ళముందే అంతర్ధానమయ్యారు. ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోయారు బాబా. తలుపులు, కిటికీలు అన్నీ మూసే ఉన్నాయి. ఇది నిజంగా నాకు బాబా చూపించిన అద్భుతమైన లీల. నాకు జరిగిన ఈ లీల అలనాడు సాయి మేఘకు చూపిన అనుభవం, మేఘతో బాబా చెప్పిన మాటలు, “నేను రావడానికి ఏ తలుపులూ అవసరం లేదు. ఈ గోడలు, తలుపులు నా రాకని ఆపలేవు. 'సాయి, సాయి' అని నన్ను ఎవరు పిలుస్తారో వాళ్ళ ముందు నేనెప్పుడూ ఉంటాను” గుర్తుకు తెచ్చాయి.
మరునాడు ఉదయానికి నేను ఫ్రెష్ గా, నార్మల్ గా ఉన్నాను. బాబా చెప్పిన విధంగా ఒక వారం పాటు చేశాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉన్నాను.
🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me