శ్రీసాయిబాబా దినచర్యకు సంబంధించిన ఈ వివరాలు 'సాయిపథం ప్రథమ సంపుటం' నుండి స్వీకరించి ఈరోజు ప్రచురిస్తున్నాము. చదివి ఆనందించండి.
సమయగతి ఎఱుగని సమ్యమీంద్రుని 'సమయనియమాలు'! - శ్రీసాయిబాబా దినచర్య
“కాలగతి మనుగడకు మనసే గతి! కాలమనే గడియారానికి మనసు యొక్క బాహ్యప్రవృత్తి పెద్దముల్లయితే, అంతరప్రవృత్తి చిన్నముల్లు. మనోలయమైన మరుక్షణం ఆ కాలమనే గడియారానికి ‘మరోక్షణ’మనేదే వుండదు. దేశకాలాల పరిమితుల పరిధిలో, ‘నేను వేరు-జగత్తు వేరు’ అనే అన్యత్వభావనలో వేళ్ళూనికొనివున్న మనసు యొక్క అనుభవమే కాలగతి. తలపులుడిగిన తన్మయత్వమే తానైన శ్రీసాయికి ‘కాలగతి’ యొక్క స్ఫురణ వుండదు. అందుకే ఆయన “నా వయసు లక్షల సంవత్సరాల”ని అన్నారు. అంతేకాదు! మరో సందర్భంలో, “నేను పుట్టినప్పుడు నా తల్లి తనకు కుమారుడు కలిగినందుకు యెంతో సంబరపడింది. నా మటుకు నాకు, ‘అసలు నేను జన్మించిందెప్పుడు? అంతకుముందు మాత్రం నేను లేనా?’ అని అనుకొన్నాను” అని అన్నారు. ఒకవైపు ‘నేను పుట్టినప్పుడు’ అంటూ, తమ ప్రాకృతిక దేహం యొక్క సాపేక్షిక వాస్తవాన్ని ముచ్చటిస్తూనే, మరోవైపు, ‘అసలు నేనెప్పుడు పుట్టాను?’ అన్న తమ స్వానుభవాన్ని తెలియజేస్తున్నారు. తత్త్వబోధనలో అది బాబా యొక్క విలక్షణ శైలి! పుట్టగానే తల్లికి, ఆపైన తన స్వరూపమేయైన యీ జగత్తుకు ఆనందాన్నిస్తూ, ఆ ఆనందాన్నే గుర్తిస్తూ, తరుగులేని ఆనందమే తానని తెలియజేస్తూ వున్న ఆనందస్వరూపం ఆయన. దేశకాలపరిమితులకు అతీతమైన అనుభవమనే నీలాకాశపు నేపథ్యంలో, మమతానుబంధాల వర్షపుజల్లుల వెనుక, జ్ఞానవైరాగ్యాల వెలుగులో మనోహరంగా ప్రకాశించే ఇంద్రధనస్సు--శ్రీసాయిరూపం!” అంటారు శ్రీబాబూజీ.కాలగతికి అతీతుడైన శ్రీసాయిని దైనందిక కార్యకలాపాల పరిధిలో ఇమిడ్చి, ఆయన దినచర్యను వర్ణించడం అవివేకమే అయినా, మానవదేహం ధరించి శిరిడీలో చరిస్తున్నప్పటి ఆయన రోజువారి కార్యక్రమాల్ని గురించి మన పరిమితులలోనే చెప్పుకునే ప్రయత్నంచేద్దాం!
తూర్పున వెలుగురేఖలు విచ్చుకోకమునుపే తమ పడక నుండి లేచి, ధుని దగ్గరున్న స్తంభానికానుకుని కూర్చుని కొద్దిసేపు ధ్యాననిమగ్నులయ్యేవారు బాబా. ఆ సమయంలో ఆయన ఏమిచేసేవారో గమనించడానికి ఇతరులకు అవకాశం వుండేది కాదు. ఆయనను సమీపించడానికే కాదు, ఆయనకు యాభై అడుగుల దూరంలో వుండటానికి కూడా అనుమతించేవారు కాదు. తరువాత కొద్దిసేపటికి “యాదేహక్, అల్లావలీ హై!, అల్లామాలిక్ హై!” వంటి పదాలను మెల్లగా ఉచ్ఛరిస్తూ, మధ్యమధ్యన ఏవో యోగభంగిమలు చేసేవారు. ‘అబ్దుల్‌బాబా, మాధవ్‌ఫస్లే’లు మాత్రం మసీదులో ప్రవేశించి అక్కడంతా చిమ్మి శుభ్రపరచటం, దీపాలలో వత్తులు సరిచేసి నూనె పోసి వుంచటం, ధుని దగ్గర కట్టెలు సర్దటం వంటి పనులను నిశ్శబ్దంగా చేస్తుండేవారు. క్రమంగా లోకం తెల్లబడుతూండగా, నెమ్మదిగా భాగోజీషిండే మసీదు(ద్వారకామాయి)లో అడుగుపెట్టేవాడు. ముందు మృదువుగా బాబా కాళ్ళు చేతులు పట్టేవాడు. తరువాత, (1910లో) ఒక పాపను రక్షించేందుకై ధునిలో చేయి పెట్టినప్పుడు కాలిన బాబా చేతికి, ముందురోజు తాను కట్టిన కట్టువిప్పి, నేయి మర్దన చేసి, మరో కొత్తకట్టు కట్టేవాడు. బాబా మహాసమాధి వరకు, అంటే, సుమారు ఎనిమిదేళ్ళపాటు రోజూ అతనా సేవ చేసుకున్నాడు. గాయం కొన్ని రోజుల్లోనే మానిపోయినా, బహుశా, అతని భక్తిశ్రద్ధలు బాబానలా ఆ కట్టుకు కట్టిపడేశాయేమో? ఏమైనా భాగోజీ ధన్యుడు. ఆ తర్వాత అతను చిలిం సిద్ధంచేసి బాబాకందించేవాడు. బాబా ఒకటి రెండుసార్లు పీల్చి, ఆ చిలిం భాగోజీకే తిరిగి ఇచ్చేవారు. ఇదంతా పూర్తయ్యేసరికి సమయం ఏడు-ఏడున్నరయ్యేది. బాబా దర్శనార్థం భక్తులు మసీదు చేరేవారు. వారితో సుదూరప్రాంతాలలో వున్న తన భక్తులను క్రిందటి రాత్రి తానెలా కాపాడిందీ, మరణించినవారి ఆత్మలను ఊర్ధ్వలోకాలకు తానెలా తీసుకెళ్ళిందీ వివరించేవారు బాబా. ఆయన చెప్పినవన్నీ యదార్థాలని, ఆ తరువాత ఆయా ప్రాంతాలనుండి వచ్చిన భక్తుల ద్వారా తెలిసేది.
ఇదంతా అవుతూండగా మాధవ్‌ఫస్లే, తుకారాం వంటి సేవకులు బకెట్ల నిండుగా నీరు సిద్ధంచేసేవారు. బాబా ఎన్నడూ పళ్ళు తోముకునేవారు కాదు. నోరు పుక్కిలించి ముఖం, కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కునేవారు. ఆయన ముఖం కడుక్కునే పద్ధతి ఎంతో సుతారంగా వుండి చూడముచ్చటగొలిపేది. బాబా పుక్కిలించి వుమ్మేసిన నీటిని కుష్టురోగులు భక్తి, శ్రద్ధలతో తమ శరీరాలకు రాసుకునేవారు. వారి విశ్వాసానికి తగ్గ ఫలితము వారు పొందేవారు.
అలా ముఖప్రక్షాళనమవుతూండగానే, భక్తులు కాకడఆరతి కోసమని ఛత్రచామరాలతో సందడిగా సాయివద్దకు చేరేవారు. పొద్దున్నే తన దగ్గరకు వచ్చినవారిని పరుగెత్తుకుంటూ వచ్చిన చిన్నారుల్ని ఆదరించే తల్లిలా, ప్రసన్నంగా ఆదరించేవారు బాబా. ఆపైన, భక్తులంతా బాబా దగ్గర ఊదీ తీసుకుని తమ తమ విధులకోసమని వెళ్ళేవారు (కాకడ ఆరతి, శేజ్ ఆరతి చావడిలో మాత్రమే, అంటే రోజు మార్చి రోజు జరిగేవి).
ఫకీరు నియమాలననుసరించి బాబా రోజూ స్నానం చేసేవారుకాదు. మొదట మొదట్లో ఆయన లెండీ తోటలోనో, లేక వూరి బయటవున్న తుప్పలు, పొదల దగ్గరో స్నానం చేసేవారు. తరువాత మసీదులోనే స్నానం చేయసాగారు. రెండు రాగి అండాలతో వేడినీళ్లు, రెండుబిందెల చన్నీళ్ళు మసీదులో పెట్టి చుట్టూ తెరలు దింపేవారు. బాబా ఆ నీరు కలుపుకొని సుమారు గంటన్నరసేపు స్నానం చేసేవారు. ఆ తరువాత ధుని దగ్గర కొంతసేపు నిలబడేవారు. సన్నిహిత భక్తులు వీపు, మెడ, తల తుడిచేవారు. బాబా స్నానం చేసిన తరువాత ఆ నీళ్ళను భక్తులు ఎంతో పవిత్రంగా భావించి, తీర్థంగా స్వీకరించేవారు. నాసిక్‌కు చెందిన రాంబాజీ అనే వ్యక్తి మతిస్థిమితంలేని స్థితిలో శిరిడీ వచ్చాడు. బాబా స్నానం చేసిన నీటిని తాగిన తర్వాత అతను ఆరోగ్యవంతుడయ్యాడు. అందుకు కృతజ్ఞతతో అతను బాబా స్నానం చేసేందుకు ఒక రాయిని సమర్పించుకున్నాడు. ఆ రాయి మొదట్లో మసీదులో ఉండేది. ప్రస్తుతం దానిని మనం మ్యూజియంలో చూడవచ్చు.
![]() |
Baba's bathing stone |
🕉 sai Ram
ReplyDelete🕉Sri Sai Ram 🕉
ReplyDeleteOm sairam
ReplyDeleteBaba Kalyan ki marriage chai thandi meku sathakoti vandanalu vadini bless chaindi
ReplyDelete