1. టెన్షన్ వలదు - బాబా మార్గం చూపుతారు
2. ఆరోగ్యం బాగుండేలా సహాయం చేసిన బాబా
3. బాబా దయ ఉంటే కానిది ఏముంది?
టెన్షన్ వలదు - బాబా మార్గం చూపుతారు
ఓంసాయి శ్రీసాయి జయజయసాయి. ముందుగా సాయినాథుని పాదపద్మములకు నా శతకోటి పాదాభివందనాలు. సాయి బంధువులకు నమస్కారాలు. నేను 30 సంవత్సరాల నుండి సాయి భక్తురాలిని. ఆ సాయినాథుని అనుగ్రహంతో నాకు ఎన్నో అనుభవాలు జరిగాయి, బాబా ఎన్నో నిదర్శనాలు చూపారు. ఆయన నన్ను ఒక గండం నుండి కాపాడారు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే సాయినాథుని దయవల్లే.
2021, ఆగస్టులో సాయినాథుని దయవల్ల మా పాపకి చాలా మంచి సంబంధం వచ్చింది. ఆ సంబంధం కుదరడంతో ఆగష్టు 15న వేరే ఊరిలో నిశ్చితార్థం పెట్టుకున్నాము. ఒక గంటలో బయలుదేరుతామని అన్ని సర్దుకుంటుండగా నగలు కూడా పెట్టుకుందామని చూస్తే పట్టణంలోని లాకరులో ఉన్న నగలు తెచ్చుకోవడం మర్చిపోయానని తెలిసింది. ఆరోజు బ్యాంకు సెలవు కూడా. దాంతో ఏం చేయాలో తెలియక నేను చాలా టెన్షన్ పడ్డాను. అప్పుడు మా పాప, "టెన్షన్ పడకు అమ్మ. బాబా ఏదైనా మార్గం చూపుతారు" అంది. మా ఇంట్లో హాల్లో ఒక పెద్ద బాబా ఫోటో ఉంది. అక్కడికి వెళ్ళి, "సాయినాథా! నాకు మార్గం చూపించండి" అని బాబాను వేడుకున్నాను. నిజంగా చాలా అద్భుతం చూపారు సాయితండ్రి. మావారు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్పారు. వాళ్ళు వెంటనే బ్యాంకు మేనేజర్‌కి ఫోన్ చేసి, "ఒకసారి లాకర్ ఓపెన్ చేయగలరా?" అని అడిగారు. అందుకు ఆ మేనేజర్, "సెలవు రోజు కదా, ఆగస్టు 15న లాకర్ తెరవము. అయినా అవకాశం ఉందేమో చూస్తాను" అని అన్నారు. తరువాత ఆయన లాకర్ తెరిచే వ్యక్తికి ఫోన్ చేస్తే, అతను వస్తాను అన్నాడు. తరువాత కాసేపట్లో లాకర్ ఓపెన్ చేసి మాకు కావాల్సిన వడ్డాణం మాకు ఇచ్చారు. ఇక నిశ్చితార్థం బాగా జరిగింది. ఇదంతా ఆ సాయితండ్రి వల్లే జరిగింది. తరువాత ఆ సాయినాథుని ఆశీస్సులతో నవంబరు 17న మా అమ్మాయి పెళ్ళి చాలా బాగా జరిగింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".
ఫిబ్రవరి 5న మా అమ్మాయి పుట్టినరోజు. 2022లో తను వాళ్ళ అత్తగారింట్లో ఉంది. పుట్టినరోజునాడు తన దగ్గరకి వెళదామని ఆరోజు తెల్లవారుఝామున మేము బయలుదేరి కారులో వెళ్తూ 7గంటలప్పుడు ఒక చోట టిఫిన్ చేద్దామని ఆగాము. టిఫిన్ చేసి అరగంట తర్వాత కారు స్టార్టు చేస్తే, స్టార్టు కాలేదు. ఇంకా 3గంటలు ప్రయాణం చేస్తే కాని మా అమ్మాయి వాళ్ళింటికి చేరుకోలేము. కానీ అరగంటసేపు ఎంత ప్రయత్నించినా కారు స్టార్టు కాలేదు. అక్కడ 10 కిలోమీటర్ల దూరంలో మాత్రమే మెకానిక్ దొరుకుతారని చెప్పారు. మాకు ఏమి చేయాలో తెలియలేదు. నేను వెంటనే, "సాయితండ్రి! కారు స్టార్ట్ అయ్యేలా చూడండి" అని సాయితండ్రిని వేడుకున్నాను. తరువాత మావారు దగ్గరలో ఎవరైనా మెకానిక్ దొరుకుతారేమోనని ఫోన్‌లో చూస్తుంటే బాబా దయవల్ల ఒక మెకానిక్ ఫోన్ నెంబరు దొరికింది. అయితే ఫోన్ చేస్తే, అతను ఫోనే తీయలేదు. మేము ఇప్పుడేం చేయాలని అనుకుంటుండగా అతనే మాకు కాల్ చేసి ఎవరు అని అడిగాడు. మేము అతనితో పరిస్థితి ఇది అని చెప్పాం. అతను ఫోన్ మా కారు డ్రైవరుకి ఇవ్వమని, కారును కొద్ది దూరం తోస్తే, స్టార్టు అవుతుందని చెప్పాడు. బాబా దయవల్ల కొద్ది దూరం తోయగానే కారు స్టార్టు అయింది. మేము క్షేమంగా మా అమ్మాయివాళ్ళ ఇంటికి చేరుకున్నాము. అప్పటివరకు స్టార్ట్ అవ్వని కారు సాయితండ్రిని వేడుకోగానే ఐదు నిమిషాల్లో జరిగిన సాయి మహిమ ఇది. "ధన్యవాదాలు బాబా".
ఆరోగ్యం బాగుండేలా సహాయం చేసిన బాబా
నా పేరు శ్వేత. ముందుగా ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉండే సాయినాథునికి నా శతకోటి వందనాలు. తోటి సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. ఈమధ్య మా ఇంట్లో అందరికీ కరోనా వచ్చి తగ్గింది. బాబా దయవల్ల అందరం బాగున్నాము కానీ, మా ఇంటి పెద్ద అయిన మా మామయ్యగారిని కోల్పోయాం. చాలా బాధేసినప్పటికీ బాబా మమ్మల్ని చల్లగా చూసుకుంటారని ధైర్యంతో ఉన్నాము. ఇకపోతే చాలారోజుల క్రితం మావారి పన్ను ఒకటి తీసేయాలని డాక్టరు చెప్పారు. కానీ ఏదో ఒక పని ఉండటం వల్ల పన్ను తీయించడానికి సమయం దొరకలేదు. 2022, ఫిబ్రవరి రెండవ వారంలో మా పిల్లలిద్దరికీ కొంచెం పంటి సమస్య ఉండటం వల్ల డెంటిస్ట్ దగ్గరకి తీసుకుని వెళ్ళాము. అప్పుడు మావారికి తను కూడా పన్ను తీయించుకోవాలన్న సంగతి గుర్తొచ్చి డాక్టరుని అడిగితే, "సరే, రాత్రి భోజనం చేశాక రండి. పన్ను తీసేస్తాను" అన్నారు. దాంతో నేను, మావారు ఆ రోజు రాత్రి భోజనం చేసాక వెళితే, పది నిమిషాల్లో పన్ను తీసి, మందులిచ్చి పంపించారు. ఇంటికి వచ్చాక మావారు మందులు వేసుకున్నారు. కాసేపటికి అదే పనిగా ఆయనకు వాంతులు మొదలయ్యాయి. నేను, "బాబా! వాంతులు ఆగిపోయేలా చూడు స్వామి" అని బాబాను వేడుకున్నాను. సమయానికి మా ఆడపడుచు భర్త ఇంట్లోనే ఉన్నారు. ఆయన వెంటనే మావారిని పక్కనే ఉన్న హాస్పిటల్‍కి తీసుకుని వెళదామన్నారు. సరేనని, మావారిని వెంటనే హాస్పిటల్‍కి తీసుకుని వెళ్ళాము. అక్కడ వాళ్ళు వాంతులు ఆగడానికి మావారికి ఇంజెక్షన్ వేశారు బాబా దయవల్ల మారికి వాంతులు ఆగిపోయాయి. ఇప్పుడు మావారు బాగున్నారు. "మీ చల్లని దయ మా అందరిపై ఎప్పుడూ ఇలానే ఉండేలా చూడండి సాయి. అన్నిటికీ మీకు చాలా చాలా ధన్యవాదాలు సాయి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి బాబా".
బాబా దయ ఉంటే కానిది ఏముంది?
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!
నా పేరు జ్యోతి. బాబా దయవలన మా కుటుంబమంతా ఆయన భక్తులం. మేము కొంతకాలంగా ఆర్థికపరమైన ఇబ్బందులు చాలా అనుభవిస్తుండగా కరోనా కారణంగా అవి ఇంకా ఎక్కువ అయ్యాయి. అటువంటి పరిస్థితుల్లో నా చెల్లి, తన భర్త సంక్రాంతి పండుగకు మా ఇంటికి వస్తున్నామని చెప్పారు. వాళ్ళు కొత్తగా పెళ్ళైన జంట. వాళ్ళను చూసుకోవడానికి సమయానికి మా దగ్గర డబ్బులు లేనందున నేను, "బాబా! పెళ్ళైన తరువాత మొదటిసారి నా చెల్లి, తన భర్త మా ఇంటికి వస్తున్నారు. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. మీరే ఈ సమస్యను పరిష్కరించాలి తండ్రి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయ ఉంటే కానిది ఏముంది? ఆయన దయవల్ల సమయానికి డబ్బులు అందాయి. నా చెల్లి వాళ్లకు కొత్త బట్టలు పెట్టి ఆనందంగా పండుగ చేసుకున్నాము. "ధన్యవాదాలు బాబా! ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేకపోతున్నాము సాయీ. మమ్మల్ని ఈ సమస్యల నుంచి గట్టెక్కించు తండ్రి. మీరు తప్పితే మాకు దిక్కులేదు బాబా. నువ్వే మా కుటుంబానికి రక్షణ బాబా. సాయి... సాయి.. సాయి".

