1. అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినా కాపాడిన బాబా
2. చల్లగా కరుణించిన బాబా
3. బాబాని తలచుకుంటే చాలు
అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగినా కాపాడిన బాబా
నా పేరు హరిప్రియ. నాకు మరలా మన బ్లాగులో అనుభవం పంచుకునే అవకాశం కల్పించిన మన తండ్రి సద్గురు బాబాకి అనేక శతకోటి వందనాలు. ఈమధ్య, అంటే 2022, ఫిబ్రవరి - మార్చి ప్రాంతంలో ఒక నెలరోజులపాటు బాబా నాకు, 'ఆందోళన చెందకు', 'నా నామస్మరణ చేయి', 'పారాయణ చేయి', 'బిడ్డలు తప్పుచేస్తే మనమే సరిదిద్దాలి' వంటి సందేశాలు ఇస్తుండేవారు. నేను గత కొద్దికాలంగా మా కుటుంబంలో జరుగుతున్న కొన్ని గొడవల వలన బాబా అలాంటి సందేశాలు ఇస్తున్నారేమో అనుకున్నాను. అయితే అనూహ్యంగా మా అమ్మాయి కొన్ని ఇబ్బందులలో ఇరుక్కుంది. ఆ విషయం తను కూడా గ్రహించలేదు. అసలు విషయమేమిటంటే, క్రిస్మస్ సందర్భంగా మా అమ్మాయి తన ఫోటోలను, తన కుటుంబం ఫోటోలను మరియు మా మనవడి ఫోటోలను తన కాలేజీ స్నేహితులందరూ ఉండే ఒక గ్రూపులో పోస్ట్ చేసింది. ఆ గ్రూపులోని ఒక అబ్బాయి ఆ ఫొటోలలో నుండి మా అమ్మాయి విడిగా ఉన్న ఫొటోలని మార్చి అసభ్యంగా ఎడిట్ చేసి తన స్నేహితులకి పంపి, తనని ఇష్టపడుతున్నట్టు చెప్పాడట. ఈ సంగతులేవీ ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఎవరికీ తెలియవు. ఆరోజు గ్రూపులో ఒకరి ద్వారా మా పాపకి విషయం తెలిసింది. అది కేవలం బాబా దయవల్లనే. అదేరోజు నాకు ఆ విషయం తెలిసింది. వెంటనే నేను, "బాబా! ఏమి జరిగినా ఆడపిల్లనే అంటారు. అసలే ప్రేమపెళ్ళని అందరూ తనని వదిలేశారు. ప్రభువైనా, నువ్వైనా ఒకటే కదా. తన కష్టం తీర్చు బాబా" అని బాబాను ప్రార్థించసాగాను. మా అల్లుడు, మా బాబు వారంరోజులపాటు తీవ్రంగా ప్రయత్నించి ఆ పని చేసినవాడిని పట్టుకున్నారు. కానీ వాడి ఫోన్లో ఫోటోలు వంటివేమీ లేకపోవడంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేశారు. ఏ గొడవ లేకుండా కష్టం తీరిపోయిందని అనుకున్నాను నేను. కానీ మార్చి 4వ తేదీన ఆ వెధవపని చేసినవాడి స్నేహితుని దగ్గర కొన్ని ఫోటోలు దొరికాయి. మా అల్లుడు ఆ విషయం మా వరకు రానివ్వకుండా ఒక రాజకీయ నాయకుని కొడుకు ద్వారా వాళ్ళందరికీ గట్టిగా వార్నింగ్ ఇప్పించి వాటిని డిలీట్ చేయించారు. కానీ ఇంకెంతమంది దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయో తెలియదు. ఆ బాధతో మా అమ్మాయి నిద్రమాత్రలు ఎక్కువ మోతాదులో మింగేసింది. ఇవేమీ నాకు తెలియవు. ఆరోజు రాత్రి 10.30కి మా అమ్మాయి నాతో మాట్లాడింది. 11 గంటలకి నేను నిద్రపోయాను. ఎందుకంటే, నేను అప్పటికి రెండురోజుల ముందునుంచి టెస్టులకోసం ఎయిమ్స్ హాస్పిటల్‍కి తిరుగుతున్నాను. ఇకపోతే, నిద్రలో ఉన్న నాకు గుండెనొప్పి వచ్చినట్టు, బాబా నాతో, "ఈ సమయం వెళ్ళిపోతుంది. మంచి సమయం వస్తుందని నిరంతరం అనుకో" అని అన్నారు. నిద్రలో నేను ఆ మాటలనే అనుకుంటున్నాను. అంతలో 11.30కి నాకు ఫోన్ వచ్చి విషయం తెలిసింది. కానీ అప్పటికే బాబా నన్ను సిద్ధం చేసి ఉన్నందువల్ల నేను పెద్దగా భయపడలేదు. 12 నుండి 13 నిద్రమాత్రలు మింగిన మా అమ్మాయిని బాబా కాపాడారు. నిద్రమాత్రలు మింగినా కేసు వంటివి లేకుండా మరుసటిరోజు సాయంత్రం అమ్మాయి ఇంటికి వచ్చింది. తనిప్పుడు సురక్షితంగా ఉంది. అలానే, ఒకటిన్నర సంవత్సరం వయసున్న తన చిన్నబాబుని కూడా బాబా ఆరోజు రోడ్డు మీద వెళ్తుంటే బండిమీద నుండి పడిపోకుండా కాపాడారు. బాబా దయవలన ఈరోజు నేను సంతోషం అనే దానికంటే ఎక్కువ ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే, అంతటి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా బాబాడాడీ నా కంటి నుంచి ఒక చుక్క నీటిని రానివ్వకుండా నాకు ధైర్యం ఇచ్చారు. "ధన్యవాదాలు బాబా. నా బిడ్డలాంటి అందరికీ ధైర్యం ఇవ్వండి బాబా"
అసలు ఈ అనుభవం ఎందుకు పంచుకున్నానంటే, ఏ సమస్యకైనా చావు పరిష్కారం కాదు. నా బిడ్డలాంటి ఎందరో ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. అందరికీ ఈ అనుభవం ద్వారా బాబా ఇచ్చే సందేశమే ఇది - 'ఈ సమయం వెళ్ళిపోతుంది. మంచి సమయం వస్తుంది. చెడ్డవాళ్ళు వేరేగా ఉండరు. మన స్నేహితులు, చుట్టాలు, తెలిసినవాళ్ళలా మనతోనే ఉంటారు. చెడు జరిగితే భయపడి ఇంకో తప్పు చేసి బిడ్డలను, కుటుంబాన్ని పోగొట్టుకోవద్దు. మీరు నమ్మిన దైవానుగ్రహం మీకు తోడు వస్తుంది. సమస్యని ధైర్యంగా ఎదుర్కోండి. బాబా అనుగ్రహం అందరిపైనా సమంగా ఉంటుంది. స్టేటస్‍లోనూ మరియు ఫ్రెండ్స్ గ్రూపులోనూ ఫోటోలు పెట్టేముందు ఒకసారి ఆలోచించండి'.
చల్లగా కరుణించిన బాబా
అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కీ జై!!!
నేనొక సాయిభక్తురాలిని. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్నవారిపై బాబా అనుగ్రహం వర్షించాలని కోరుకుంటున్నాను. రోజూ ఈ బ్లాగులో ప్రచురితమవుతున్న అనుభవాలు చదువుతుంటే సాయితో ఉన్నట్టే అనిపిస్తుంది. నేను ఇంతకుముందు రెండు అనుభవాలు పంచుకున్నాను. ఇది మూడవ అనుభవం. 2021, ఏప్రిల్ నుంచి 2022, మార్చి 16 వరకు నేను యు.ఎస్.ఏలోని డెట్రాయిట్‍లో ఉన్నాను. మేము 2021, నవంబర్, డిసెంబర్ నెలలో ట్రిప్‍కి వెళ్లాలని అనుకున్నాము. కానీ కరోనా వల్ల చాలా భయపడి 'అందరి ఆరోగ్యాలు బాగుండాలని, ఎవరికీ ఏమీ కాకుండా చూడమ'ని బాబాతో చెప్పుకుని సాయి దివ్యపూజ చేసుకుని ట్రిప్‍కి వెళ్ళాము. ముందుగా 2021, నవంబరులో మా అమ్మాయి, అల్లుడు, పిల్లలు, ఇంకా నేను దారిలో పలు ఇతర ప్రదేశాలు చూసుకుంటూ వెళ్లొచ్చని కారులో డల్లాస్‍కి బయలుదేరాము. అక్కడ మా బావగారి అబ్బాయి ఉంటున్నాడు. దారిలో కొన్ని హోటల్స్‌లో ఉన్నాము. కరోనా పరిస్థితుల వల్ల భయమేసినా బాబా ఉన్నారని ఆయన మీదే భారం వేశాము. తరువాత డిసెంబరులో ఫిలడెల్ఫియా, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు చూడాలని వెళ్ళాము. అప్పుడు కూడా సాయినే నమ్ముకున్నాము. చివరిగా పిట్స్‌బర్గ్‌లో శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సురక్షితంగా ఇంటికి తిరిగి చేరుకున్నాము. సాయి కృపవల్ల మా ట్రిప్ అంతా జాలీగా గడిచిపోయింది. పిలిస్తే పలికే దైవం సాయి. మమ్మల్ని చల్లగా కరుణించారు. 2022, మార్చి 16న మేము ఇండియాకి తిరుగు ప్రయాణమయ్యాము. ప్రయాణంలో నేను సాయిసచ్చరిత్ర, సాయిభక్తుల అనుభవాలు చదువుకున్నాను. ఫ్లైట్ జర్నీలో ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా సాయి చూసుకున్నారు. మేము యు.ఎస్.ఏలో మొత్తం ఒక సంవత్సరం ఉన్నాము. ఈ సంవత్సరకాలంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇండియాకి తిరిగి వస్తే శిరిడీ దర్శనం చేసుకుంటానని అనుకున్న నేను ప్రస్తుతం ఆయన దర్శనం కోసం ఎదురుచూస్తున్నాను.
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి!!!
బాబాని తలచుకుంటే చాలు
సాయిబంధువులందరికీ నా నమస్కారాలు. ఈ బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదాలు. నేనొక సాయిభక్తురాలిని. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. ఈమధ్య మాకు తెలిసిన ఒక పంతులుగారు మా అమ్మాయి విషయంలో ఉన్న దోషనివారణార్థం "కర్ణాటకలో ఉన్న శ్రీకొక్కె సుబ్రహ్మణ్యస్వామి గుడికి వెళ్లి, అమ్మాయి చేత పూజ చేయించమ"ని చెప్పారు. 500 కిలోమీటర్ల దూరం నేను, నా కూతురే పోవాలంటే ఎలా అనిపించి బాబాతో, "మాకు ఎవరినైనా తోడు పంపించండి బాబా, నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. తరువాత మనసులో బాబాను తలచుకుంటూ, తిరుపతిలో ఉన్న మా మరిదికి ఫోన్ చేసి, విషయం చెప్పి "మాకు తోడుగా రమ్మ"ని అడిగాను. అతను వెంటనే, "సరే వదినా" అని చెప్పి, తన పనులన్నీ పక్కన పెట్టి మాకు తోడుగా వచ్చారు. బాబా దయవల్ల పూజ పూర్తి చేసుకుని, మా యాత్ర జయప్రదంగా ముగించుకుని ఇంటికి వచ్చాము. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. నేను సాయికోటి రాస్తున్నందువల్ల ఇన్నిరోజులూ నా అనుభవాన్ని పంచుకోలేకపోయాను. ఆలస్యమైనందుకు క్షమించండి బాబా. మాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ మీరే బాబా. నా కొడుకుకి అన్ని విషయాలలో తోడుగా ఉండండి బాబా".
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
Omsairam omsairam omsairam omsairam omsairam omsairam
ReplyDeleteJaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
OM SAIRAM
ReplyDeleteSAI ALWAYS BE WITH ME
OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete