సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1119వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎప్పుడూ సాయిని తలచుకోవడం వల్ల బాధలన్నీ తీరిపోయాయి
2. ప్రార్థనతో నెలసరి వచ్చేలా అనుగ్రహించిన బాబా
3. బాబా ఊదీ మహిమ

ఎప్పుడూ సాయిని తలచుకోవడం వల్ల బాధలన్నీ తీరిపోయాయి


ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!! ముందుగా మన ఈ బ్లాగు నడిపించే సాయికి ధన్యవాదాలు. నా పేరు ఉమ. మాది నిజామాబాద్ జిల్లా. నేను గతంలో కొన్ని అనుభవాలను మన బ్లాగులో పంచుకున్నాను. ఇప్పుడు మరికొన్ని అనుభవాలు  పంచుకోవాలనుకుంటున్నాను. "ఆలస్యంగా నా అనుభవాలను పంచుకుంటున్నందుకు నన్ను క్షమించండి సాయీ". ఇక నా అనుభవాల విషయానికి వస్తే...  మా అత్తయ్యగారికి కలహ స్వభావం ఎక్కువ. ఆమె గత కొన్ని రోజులుగా మా గురించి మా కుటుంబంలో అందరికీ చెడుగా చెప్పుకుంటూ వచ్చింది. దానివల్ల నలుగురిలోకి వెళ్ళాలంటే నేను ఆలోచించేదాన్ని. కానీ నేను ఏ తప్పు చేయలేదని నా సాయికి తెలుసు. ఇలా ఉండగా ఒకసారి తప్పనిసరై మా బంధువులలో ఒకరి అంత్యక్రియలకు వెళ్లాల్సి వచ్చింది. నేను ఊహించినట్లుగానే అప్పుడు దగ్గర వాళ్ళెవరూ నాతో మాట్లాడలేదు. నాకు చాలా బాధగా అనిపించింది. తరువాత ఒక 20 రోజులకి నా భర్త బలవంతపెట్టడంతో ఒక చిన్న ఫంక్షన్‌కి ఇద్దరమూ కలిసి బైక్ మీద బయలుదేరాము. దారిలో నేను నా భర్తతో బాబా నాకు ప్రసాదించిన అనుభవాలను నా భర్తతో చెప్పుకుంటూ వెళ్లాను. అలా సాయి లీలలను ఒకరితో పంచుకుంటుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫంక్షన్ దగ్గరకి చేరుకున్నాక నేను 'బంధువులు ఎవరూ నాతో మాట్లాడర'ని అనుకున్నాను. కానీ నా సాయి చేసిన అద్భుతం చూడండి. 20 రోజుల ముందు నాతో మాట్లాడని వారందరూ వాళ్లంతట వాళ్లే నా దగ్గరకొచ్చి నన్ను పలకరించారు. నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మన సాయిని ఎప్పుడూ తలచుకోవడం వల్ల ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటూ మన చిన్న చిన్న బాధలన్నీ తీరుస్తారు. ఆయన తమ భక్తులు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేరు.


ఒకరోజు హైదరాబాదులో ఉన్న మా అక్కయ్య దగ్గరకి నేను ఒంటరిగా వెళ్లాల్సి వచ్చింది. హైదరాబాదులో దిగిన తర్వాత రెండు బస్సులు మారాల్సి ఉండటంతో నేను బాబాతో, "సాయీ! నన్ను క్షేమంగా ఇంటికి చేర్చండి" అని చెప్పుకున్నాను. బాబా నన్ను క్షేమంగా ఇంటికి చేర్చారు.


2022, జనవరిలో నాకు చాలా విపరీతంగా జలుబు చేసింది. ఎన్ని మందులు వాడినా 15 రోజులు వరకు తగ్గలేదు. పైగా నాకు ఎలాంటి వాసన, రుచి తెలిసేవి కావు. నాకు చాలా భయమేసి సాయికి దణ్ణం పెట్టుకుని, "సాయీ! నాకు జలుబు తగ్గేలా చేయండి. తగ్గితే, నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయతో జలుబు తగ్గిపోయింది. "సాయీ! మీకు వేలవేల ధన్యవాదాలు చెప్పుకున్నా సరిపోదు తండ్రి. సదా నా హృదయంలో మిమ్మల్ని స్మరిస్తూ ఉండేలా ఆశీర్వదించండి సాయి. ఇకపోతే నేను, నా భర్త ఒక రకమైన సమస్యతో బాధపడుతున్నామని మీకు తెలుసు కదా తండ్రి. పగ్గాలు మీకు అప్పగించి మిమ్మల్ని స్మరించడం తప్ప ఆ విషయంలో నేనేమీ చేయలేను సాయి.  ఆ విషయంలో మాకు ఏది మంచిదో అదే చేయండి సాయి. ఇంకో విషయం పెళ్లి సంబంధాలు కుదరక చాలా బాధపడుతున్న నాకు తెలిసిన ఒక అమ్మాయి చేత మీరు సచ్చరిత్ర పారాయణ మొదలుపెట్టించారు. మీ కృపతో ఆ అమ్మాయికి పెళ్లి జరిగితే, ఆ అనుభవంతో మళ్ళీ మీ భక్తుల ముందుకు వెళ్తాను తండ్రి. చివరిగా మీ భక్తులందరిపై మీ అనుగ్రహం తప్పకుండా ఉండాలని కోరుకుంటున్నాను సాయి".


- ప్రేమతో మీ అతి చిన్న భక్తురాలు.


ప్రార్థనతో నెలసరి వచ్చేలా అనుగ్రహించిన బాబా


శ్రీసాయినాథునికి ప్రణామాలు. ఈ బ్లాగుకి ధన్యవాదాలు. నేను ఒక సాయి భక్తురాలిని. నాకు ఎప్పుడూ నెలసరి సమయానికి వచ్చేది. నేనెప్పుడూ ఆ విషయంగా చెప్పుకోదగ్గ పెద్ద సమస్యలు ఎదుర్కోలేదు. అలాంటిది ఈసారి నెలసరి ఆలస్యమైంది. దాంతో నాకు చాలా భయమేసింది. ఈ బ్లాగులో చాలామంది ఆడవాళ్ళు తమ నెలసరికి సంబంధించి తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి చెప్తున్నప్పుడు 'నేను చాలా లక్కీ, ఇంతమంది ఆడవాళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు' అని అనుకునేదాన్ని. కానీ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. మనకి ఉన్న వాటి విలువ తెలియక వాటిని అనందించకుండా, ఏదో లేదని, లేని వాటికోసం వెంటపడుతూ వాటి గురించి దేవుడికి గుర్తుచేస్తూ, నిందిస్తూ జీవితమంతా వృధాగా గడిపేస్తుంటాం. నేను కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడు భగవంతుడు ఇచ్చినదాన్ని గుర్తించలేదు, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోలేదు. తీరా నెలసరి ఆలస్యమయ్యేసరికి అసలే నాకు ఇంకా పెళ్లి కాలేదని, ప్రస్తుతం చాలామంది పిసిఓడి, థైరాయిడ్ వంటి చాలా సమస్యలతో బాధపడుతున్నారన్న మొదలైన ఆలోచనలన్నీ హఠాత్తుగా నా మనుసులోకి వచ్చి బాబాకి క్షమాపణలు, అలాగే ఆయన ప్రసాదించిన వాటికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుని 'ఎప్పటిలా నెలసరి సక్రమంగా వస్తే బ్లాగులో పంచుకుంటాను' అని అనుకున్నాను. మరుసటిరోజే నాకు నెలసరి వచ్చి సమస్య పరిష్కారమైంది. బాబాకి మాటిచ్చినట్లు నేను నా అనుభవాన్ని పంచుకున్నాను. "నా మీద మీకున్న ప్రేమకు, ఆప్యాయతకు, ఇంకా అన్నిటికీ ధన్యవాదాలు బాబా. అందరినీ ఆశీర్వదించండి బాబా".


బాబా ఊదీ మహిమ


అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


ఓం శ్రీసాయినాథాయ నమః!!! 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు నిర్వహిస్తున్న సాయికి మరియు సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు తిలోత్తమ. నేను ఇదివరకు ఈ బ్లాగు ద్వారా కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు సాయినాథుని దివ్యపాదాలపై శిరస్సు వంచి నమస్కరిస్తూ మరోసారి బాబా ప్రేమను మీతో పంచుకుంటున్నాను. 2022, మార్చి 3న నాకు జలుబు చేసింది. నేను 'జలుబే కదా' అని పెద్దగా పట్టించుకోలేదు. మరుసటిరోజుకి ఏ వస్తువు వాసన నాకు తెలియలేదు. ఈ విషయం నేను మా అమ్మతో చెపితే, "మందులు వేసుకుని, ఆవిరి పట్టమ"ని చెప్పింది. నేను బాబాకు నమస్కరించి కొంచెం ఊదీ నీళ్ళలో కలుపుకుని త్రాగి, మరి కొంచెం ముక్కుకి రాసుకున్నాను. అంతే మూడు గంటల్లో కొద్దికొద్దిగా వాసన తెలియడం మొదలై కొంతసేపటికి పూర్తిగా తెలిసింది. ఏ వస్తువు వాసన చూసినా వాటి వాసన నాకు తెలిసింది. అప్పటివరకు నేను ఏ మందులు వేసుకోలేదు, ఆవిరి కూడా పట్టలేదు. కేవలం బాబా ఊదీ మహిమతోనే నాకు వాసన తెలిసింది. "ధన్యవాదాలు బాబా. వివాహమై కొన్ని సంవత్సరాలైనా మాకు ఇంకా సంతానం కలగలేదు తండ్రి. దయతో త్వరగా మాకు సంతానం కలిగేలా ఆశీర్వదించండి బాబా. మా నాన్నగారు మా తమ్ముడి ఉద్యోగ విషయమై ఒకరికి డబ్బులిచ్చి మోసపోయారు. పోలీసు స్టేషన్, కోర్టుల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదు. ఆ విషయమై ఒక పరిష్కారం చూపండి బాబా. దయతో ఈ రెండు కోరికలు తొందరగా నెరవేరేలా ఆశీర్వదించండి బాబా. అదే జరిగితే నా అనుభవాలను 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా సాటి సాయి భక్తులతో పంచుకుంటాను బాబా".


సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!



సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo