1. బాబానే నాకు దిక్కు
2. అన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇచ్చిన సాయితండ్రి
3. అర్థించినంతనే మూడునెలల గడువు ఇచ్చిన బాబా
బాబానే నాకు దిక్కు
అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
ముందుగా బాబాకు శతకోటి పాదాభివందనాలు. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి ధన్యవాదాలు. నా పేరు ఇందిర. గత కొన్ని సంవత్సరాలుగా అంటే నేను ఏడవ తరగతి చదువుతున్నప్పటి నుండి బాబా భక్తురాలిని. అప్పటినుండి బాబా నా వెన్నంటే ఉండి నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఉన్నారు. నా తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ నా బాబానే. ఆయనే నాకు దిక్కు. ఏ సమస్య వచ్చినా నేను, 'నాకు బాబా ఉన్నారు. నాకు ఏమవుతుంది? నన్ను ఎవరు ఏమి చేస్తారు? నా బాబా ఉండగా ఎవరూ ఏమీ చేయలేరు' అని సాయి నామజపం చేసుకుంటూ ఉంటాను. పెళ్లి అయినప్పటి నుండి నాకు అన్నీ సమస్యలే. వచ్చిన చాలా పెద్ద పెద్ద సమస్యలన్నిటిని తట్టుకునే శక్తిని, ధైర్యాన్ని బాబా నాకు ప్రసాదించారు. నాకు ఇద్దరు అబ్బాయిలు. వాళ్ల ద్వారా నాకు సంతోషాన్ని ఇస్తున్నారు నా బాబా, నా సాయి. 2022, ఫిబ్రవరి మొదటివారంలో నాకు చెడు కలలు ఎక్కువగా వస్తుండేవి. అప్పుడు నేను, "ప్రతిరోజూ నాకు ఇలాంటి చెడు కలలు రావద్దు బాబా" అని బాబాను వేడుకుని ప్రతిరోజూ ఊదీ ప్రసాదాన్ని నుదుట ధరించి పడుకునేదాన్ని. "చెడు కలలు రాకుండా అనుగ్రహిస్తే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా తోటి భక్తులతో పంచుకుంటాను బాబా" అని బాబాకి మొక్కుకున్నాను. అంతే, బాబా నా మొర ఆలకించి నాకు చెడు కలలు రాకుండా అనుగ్రహించారు.
ఈమధ్య మా పెద్దబ్బాయి సాయితేజ ఎడమచేతి మోచేయి వద్ద కురుపులా వచ్చి కొద్దిగా వాపు కనిపించింది. నాకు భయమేసి బాబాతో చెప్పుకుని ఊదీ పెట్టాను. అంతే, తెల్లవారేసరికి ఆ కురుపు లేకుండా పోయింది.
2022, ఫిబ్రవరి మూడోవారంలో నా భర్త మార్కెట్‌కి వెళ్ళారు. అప్పుడు నేను, "పత్తి ధర మంచిగా ఉండాలి బాబా. మా కష్టం వృధా కానివ్వకండి బాబా. మా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కేలా చూడు తండ్రి. పత్తి ధర మంచిగా ఉంటే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకి మ్రొక్కుకున్నాను. అంతే, ఆ బాబా కరుణించి మా పత్తికి మంచి ధర వచ్చేలా చేసి మాకు అమితానందాన్ని ప్రసాదించారు. "బాబా! మీ దివ్య పాదచరణారవిందములకు నా శతకోటి నమస్కారాలు. ఏమిచ్చినా మీ ఋణం తీర్చుకోలేము తండ్రి. ఇలాగే మా పంటలు మంచిగా పండేలా, అన్ని పంటలకు మంచి ధర వచ్చేలా చూడు తండ్రి. ఎప్పటికీ ఇలాగే మా కుటుంబాన్ని రక్షిస్తూ ఉండు బాబా. మా అమ్మవాళ్ళ వైపు కుటుంబసభ్యులు, అత్తవాళ్ళ వైపు కుటుంబసభ్యులు అందరూ బాగుండాలి బాబా. నా భర్త, నా పిల్లలు మంచిగా ఆరోగ్యంగా ఉండేలా చూడు బాబా. నాతోటి సాయి భక్తులందరినీ చల్లగా చూడు తండ్రి. మా మీద మీ దయ, మీ కరుణాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. నువ్వే మాకు దిక్కు బాబా. మా తప్పులేవైనా ఉంటే క్షమించు బాబా".
రక్ష రక్ష సాయి రక్ష! సర్వేజనా సుఖినోభవంతు!!
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు!!!
అన్ని ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం ఇచ్చిన సాయితండ్రి
సాయి భక్తులందరికి నమస్కారం. నాపేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో నివాసముంటున్నాము. నాకు బాబా అంటే చాలా ఇష్టం. బాబా నాకు ఎన్నో అనుభవాలు. ప్రసాదించారు. నేను ఇప్పుడు ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య మా బాబుకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించింది. వాడికి ఏ సమస్య లేకపోయినప్పటికీ అప్పుడప్పుడు వాడు అలా ఇబ్బందిపడటం నేను గమనించాను. వెంటనే నేను బాబాను ప్రార్థించి, ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా బాబుని హాస్పిటల్‍కి తీసుకెళదామనుకున్నాము. ఆ రోజు రాత్రి నేను బాబాను "బాబుకి ఏమీ కాదు కదా బాబా!" అని అడిగాను. దానికి బాబా నుండి, "రేపు నీకు సమాధానం దొరుకుతుంది. భయం వద్దు. గురువు యందు ప్రేమ, నమ్మకం కలిగి ఉండు" అని సమాధానం వచ్చింది. నా ప్రశ్నకు ఎంత స్పష్టమైన సమాధానమో చూడండి. మరుసటిరోజు మేము బాబుని హాస్పిటల్‍కి తీసుకుని వెళితే, కొన్ని టెస్టులు చేసారు. అప్పుడు నేను, "బాబా! సమస్యేమీ లేదు, అంతా నార్మల్ అని రిపోర్టు వస్తే, బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన దయవలన రిపోర్టు నార్మల్ అని రావడంతో డాక్టరు సమస్యేమీ లేదు అన్నారు. ముందురోజు రాత్రి బాబా నాకు చెప్పినట్లే జరిగింది. డాక్టరు చెప్పిన మాట విని నాకు కలిగిన సంతోషాన్ని నేను మాటల్లో చెప్పలేను. బాబా ఫోటో పట్టుకుని ఎంతగా ఏడ్చానో నాకే తెలుసు. మా బాబు విషయంలో వాడి చిన్నప్పటి నుండి నాకు ఒక అనుమానం ఉండేది. ఎందుకంటే, వాడు ఆటల్లో త్వరగా అలసిపోతాడు. అందువలన వాడికి ఏదో సమస్య ఉందని నాకు ఎప్పుడూ సందేహంగా ఉండేది. ఈ అనుభవం ద్వారా నా మనసులోని అన్ని ప్రశ్నలకు, సందేహాలకు నా సాయితండ్రి సమాధానం చెప్పారు. "బాబా! మీకు మనస్ఫూర్తిగా చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు నా తండ్రి. మీరు లేని ఒక్క క్షణాన్ని కూడా నేను ఊహించలేను. మీరు లేకపోతే నిజంగా మేము అనాథలం. మీరే మాకు రక్ష, నన్ను అడుగడుగునా కాపాడుతున్న మీకు నేను ఏమి ఇవ్వగలను? మీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ, నా ప్రేమను మీకు పంచడం తప్ప. మీ చల్లని చూవు, దయ ఎప్పటికీ నా కుటుంబం మీద ఉంచండి బాబా. మీకు మాటిచ్చినట్లు నా అనుభవాన్ని పంచుకున్నాను తండ్రి".
సాయినాథ్ మహరాజ్ కి జై!!!
అర్థించినంతనే మూడునెలల గడువు ఇచ్చిన బాబా
శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ కి జై!!!
నేను ఒక సాయి భక్తుడిని. ఇప్పటివరకు నేను, నా కుటుంబం బ్రతికి ఉన్నామంటే అది బాబా దయవలనే. నేను ఇంతకు ముందు కొన్ని అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అనుభవం పంచుకుంటున్నాను. నేను కొంతమంది దగ్గర అప్పులు తీసుకుని వ్యాపారం చేసి ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాను. ఒకరోజు నాకు డబ్బులిచ్చిన ఒక అతను అయితే, "నువ్వు డబ్బులు ఇచ్చేదాక నేను మీ ఇంటి దగ్గరే కుర్చుంటాను" అని చాలా ఇబ్బందిపెట్టాడు. ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే, అప్పటికే చాలాసార్లు నేను వాయిదాలు వేస్తూ వచ్చాను. అందువల్ల ఇంకా అతనికి సమాధానం చెప్పటం నా వల్ల కాలేదు. అతను నా డబ్బులు నాకు ఇవ్వమని గొడవకు దిగాడు. నా సమస్యలను బాబాకి తప్పితే ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. వెంటనే నేను, "ఎలాగైనా అతను నాకు గడువు ఇచ్చేలా అనుగ్రహించు సాయీ. నా అనుభవం బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. అప్పటివరకూ అస్సలు కుదరదు అన్న అతను బాబా దయవలన 3 నెలలు గడువు ఇచ్చాడు. ఈ మూడునెలల్లో బాబా నా సమస్యను పరిష్కరిస్తారని ఆశిస్తున్నాను. "ధన్యవాదాలు బాబా! నేను ఈ ఆర్థిక సమస్యలను తట్టుకోలేకపోతున్నాను బాబా. నన్ను ఈ అప్పుల బాధ నుండి బయటపడవేయి తండ్రీ".

