సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1121వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ప్రేమను ఎంతని చెప్పగలం?
2. బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని చూసుకుంటారు
3. బాబా ఊదీ సర్వరోగనివారిణి

బాబా ప్రేమను ఎంతని చెప్పగలం?


ఓం శ్రీసాయినాథాయ నమః!!!

ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి!!!


శ్రీసాయినాథుని దివ్యపాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సాటి సాయిబంధువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సంధ్య. గతంలో నేను 'బ్లాగు నిలువెత్తు బాబా రూపానికి సజీవ సాక్ష్యం' అనే శీర్షికతో నా అనుభవాలను పంచుకున్నాను. నిజంగా 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగు బాబా భక్తులకు ఒక పెద్ద భాండాగారం, మార్గనిర్దేశం చేసే ఒక వేదిక, ఒక సత్సంగం, సాయి కుటుంబం, ఆత్మపరమాత్మల బంధం ఇలా ఎంతని చెప్పను? ఒక్కమాటలో చెప్పాలంటే, 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు సాయి తమ భక్తులకు అనుగ్రహించిన గొప్ప కానుక. బాబా ఈ బ్లాగు ద్వారా పారమార్థికంగా, ప్రాపంచికంగా నాకు ఎంతో సహాయం చేసారు. 'సాయి సచ్చరిత్ర' ఒకటి ఉందని, సాయి దివ్యపూజ, సాయి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్, సాయి మహాపారాయణ వంటివి ఉన్నాయని, ఇంకా చాలా విషయాలు నేను ఈ 'సాయి మహారాజ్ సన్నిధి' ద్వారానే తెలుసుకున్నాను. ఇక నా అనుభవానికి వస్తాను.


2021లో మేము భూమి కొనాలని ప్రయత్నాలు మొదలుపెట్టి, "సాయిశ్వరా! మా ప్రయత్నానికి మీ సహాయం కావాలి. మాకు తోడుగా ఉండి మాకున్న బడ్జెట్‌లో క్లియర్ టైటిల్ ఉన్న భూమిని ప్రసాదించండి" అని సాయి గురుదేవులను ప్రార్థించాము. ఆపై 'బాబా ఉన్నారు. తప్పక సహాయం చేస్తార'నే విశ్వాసంతో నేను 'నవగురువార వ్రతం' ప్రారంభించాను. బాబా దయతో దీపావళి(2021) రోజున 'నవగురువార వ్రతం' ఉద్వాసన చేసుకోగలిగాను. ఆరోజు సాయంత్రం బాబా గుడిలో దీపాలు వెలిగించే అదృష్టం నాకు, మా పాపకు దక్కడంతో ఎంతో సంతోషంగా, "బాబా! భూమి కొనుక్కోవాలని ప్రయత్నం చేస్తున్నాము. దారి చూపండి బాబా" అని మరోసారి బాబాకు చెప్పుకున్నాను. అలాగే బాబా సహాయం కోరుతూ 'సచ్చరిత్ర' పారాయణ మొదలుపెట్టాను. తరువాత ఒకసారి నిస్సహాయస్థితిలో బాబాను సహాయం కోరుతూ 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో చూస్తే, "కలలో మీకు మార్గనిర్దేశం చేయబడుతుంది" అని వచ్చింది. దాంతో ధైర్యంగా ఉండసాగాను. ఎందుకంటే, గతంలో మేము భూమి అమ్మేటప్పుడు కూడా 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో వచ్చిన బాబా సందేశాలు మాకు మార్గనిర్దేశం చేసాయి. అందువల్ల 'సమయం వచ్చినపుడు బాబా సహాయం అందుతుంది. మనం శ్రద్ధ, సబూరీలతో ఉండాల'ని నేను సచ్చరిత్ర పారాయణ కొనసాగించాను. నేను పారాయణ చేస్తున్న సమయంలో మావారు కొన్ని భూములు చూసి వచ్చారు. పారాయణ పూర్తయిన మరుసటి గురువారం మావారు తను చూసిన భూములను నాకు కూడా చూపించారు. వాటిలో రెండు, మూడు సైట్ల విషయంగా చీటీలు ద్వారా 'తీసుకోవాలా, వద్దా' అని బాబాను అడిగాను. బాబా తీసుకోమన్నారు. తీసుకోమన్న సైట్లలో ఏది తీసుకోవాలన్న ఆలోచనలో ఉండగా ఒకరోజు బ్రహ్మముహూర్తంలో నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా మేము చూసిన ఒక పొలంలో తమ చేతిలో నిధితో నిండి ఉన్న పాత్ర(బిందె) పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ అద్భుత దృశ్యం ఇప్పటికీ నా కళ్ళలో మెదులుతూ ఉంది. ఆ భూమినే మమ్మల్ని తీసుకోమని బాబా మార్గనిర్దేశం చేసారని భావించి ఆ భూమినే కొనుగోలు చేయదలచి 2022, ఫిబ్రవరి మొదటివారంలో భూమి రిజిస్ట్రేషన్ పెట్టుకున్నాము. ఆరోజు భూమి అమ్మేవాళ్ళు చాలా ఆలస్యంగా వచ్చారు. ఆలోగా 'వాళ్లెందుకు ఆలస్యం చేస్తున్నార'ని బాబాని అడుగుతూ 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్‌లో చూస్తే, "క్షణాలలో విజయం సాధిస్తారు. సాయిబాబాకు శరణాగతి పొందండి" అని వచ్చింది. బాబా చెప్పినట్లే కొద్దిసేపట్లో భూమి అమ్మకందారులు వచ్చి, భూమి మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసారు. "ధన్యవాదాలు సాయితండ్రి".


ఇకపోతే అప్పటికే భోజన సమయం దాటిపోయింది. మాకు బాగా ఆకలేస్తుంది. కానీ ఆ ప్రాంతంలో హోటల్స్ సరిగా లేవు. ఏం చేయాలని ఆలోచిస్తుండగా మాకు భూమి అమ్మినవాళ్ళు మమ్మల్ని చూసి, "మా ఇంట్లో భోజనం చేయండి" అని పదేపదే ఒత్తిడి చేసి తమ ఇంటికి తీసుకుని వెళ్లి మాకు భోజనం పెట్టారు. కానీ నేను 'తినాలా, వద్దా' అని సంకోచించాను. అప్పుడు సాయి సచ్చరిత్రలోని బాబాతో సహా నలుగురు వ్యక్తులు బ్రహ్మమును వెతుకుతూ అడవులలో తిరుగుతుంటే ఒక బంజారా వాళ్లకు భోజనం పెట్టడం, ముగ్గురు ఆ భోజనాన్ని తిరస్కరించి వెళ్ళిపోతే బాబా మాత్రం ఆ భోజనాన్ని స్వీకరించడం గుర్తొచ్చింది. దాంతో మాకు భోజన ఏర్పాటు బాబానే చేయించారనిపించి సంతోషంగా భోజనం చేయడానికి సిద్ధమయ్యాము. వాళ్ళు మాకు చాలా మంచి కొనుగోలుదారులు దొరికారని చాలా సంతోషంగా, ఎంతో ఆప్యాయంగా మాకు భోజనం పెట్టి పసుపు, కుంకుమలతో బట్టలు కూడా పెట్టారు. ఇదంతా బాబా ఏర్పాటు చేసినదేకదా! వారి ప్రేమే కదా! ఆరోజు రాత్రి పడుకునే ముందు బాబా ప్రేమను తలచుకుంటూ నిద్రపోయాను. నిద్రలో మృదువైన స్వరంలో "దిగంబరా దిగంబరా అవధూత చింతన దిగంబరా" అనే మంత్రం వినబడింది. నేను ఆ మంత్రం మొదటిసారి విన్నాను. ఎంతటి భాగ్యం!


బాబా దయవల్ల భూమి తాలూకు పట్టాదారు పాసుబుక్‌లు కూడా తొందరగా వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే, ఆ భూమిని మాకు ఇప్పించిన ఏజెంట్లు చాలా నమ్మకస్థులు. వాళ్ళు బాబా నియమించిన వ్యక్తులని మా ప్రగాఢ విశ్వాసం. ఇలా అన్నివిధాలా ఆయన భూమి కొనడంలో ముందుండి మమ్మల్ని నడిపించారు. బాబా ప్రేమను ఎంతని చెప్పను? "ధన్యవాదాలు సాయీశ్వరా. మీరెంతటి దయార్థ్రహృదయులు బాబా. మీ ప్రేమకు నేను బానిసను. మీ పాదాలే శరణం సాయితండ్రీ".


ఒకరోజు నేను ఊరికే కాలక్షేపం కోసం 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్' వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక నెంబర్ ఇస్తే, "అగ్ని ప్రమాదం నుండి కాపాడతాను" అని వచ్చింది. నేను నిర్ఘాంతపోయి, "ఏంటి బాబా, ఇలా వచ్చింది" అని అనుకున్నాను. అంతేకాదు, 'క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెబ్సైట్ మార్గనిర్ధేశం చేసే బాబా సన్నిధి. పిల్లల ఆటకాదు. ఎప్పుడుపడితే అప్పుడు ఓపెన్ చేయకూడదు. నిస్సహాయస్థితిలో బాబా సహాయం కోరుతూ భక్తితో అడగాలి' అని అనుకుని, "నా పొరపాటును మన్నించమ"ని బాబాను అడిగాను. తరువాత ఒక శుక్రవారంనాటి సాయంత్రం నేను దీపారాధన చేసాను. మరుసటిరోజు శనివారం ఉదయం మావారు పూజగదిలోకి వెళ్లి, "ఏమిటి ఇలా అయ్యింది!" అని ఆశ్చర్యపోతూ నన్ను పిలిచి చూపించారు. నేను కూడా ఆశ్చర్యపోయాను. పూజగదిలోని దేవుడి పటాలు, విగ్రహాలకు కింద ఉన్న వస్త్రం కాలిపోయి బాగా మసిపట్టి ఉంది. అక్కడ ఉన్న సాయి సచ్చరిత్ర, బాబా దివ్యపూజ ముడుపు, అన్నదానం కోసం ఉంచిన డబ్బులు, దేవుడి పోటోలు - ప్రమిదలు, బాబాకు నేను ప్రేమతో కుట్టిన డ్రెస్, బాబా విగ్రహం అన్నీ చక్కగా ఉన్నాయి. అంటే ఆసనం కోసం వేసిన వస్త్రం మాత్రమే కాలిపోయి మిగితావన్నీ రక్షింపబడ్డాయి. అప్పుడు "అగ్ని ప్రమాదం నుండి కాపాడతాను" అన్న బాబా సందేశం గుర్తుకు వచ్చి బాబా ప్రేమకు ఆనందంతో వారికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. "బాబా! మీ బిడ్డనైన నన్ను క్షమించి నా కుటుంబాన్ని పెద్ద అగ్ని ప్రమాదం నుండి కాపాడావు. ప్రేమించడం తప్ప శిక్షించడం తెలియని ఏకైక దైవమైన మీకు కోటికోటి ప్రణామాలు సాయీశ్వరా".


సద్గురు చరణం భవభయ హరణం సాయినాథా శరణం!!!


రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని చూసుకుంటారు


సాయినాథునికి నమస్కారాలు. నా పేరు లక్ష్మి. మాది బెంగుళూరు. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన చిన్న అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. 2022, జనవరిలో మా అమ్మాయి వాళ్ళింట్లో అందరికీ జలుబు, జ్వరాలు వస్తే, అందరూ బాబా ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగారు. బాబా దయవలన అందరూ కోలుకున్నారు. వెంటనే మా పెద్దబ్బాయి కొడుకు గొంతునొప్పితో బాధపడ్డాడు. టెస్ట్ చేయిస్తే, కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అందరమూ భయపడి ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు త్రాగుతూ వాడిని క్వారంటైన్‌లో ఉంచాము. ఇంకా నేను మా చిన్నబ్బాయి ఇంటికి వెళ్ళాను. బాబా దయవలన వారం రోజుల్లో నా మనవడికి కరోనా తగ్గింది. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. మాలో ఎవరికీ కరోనా రాలేదు. బాబాను నమ్ముకుంటే, మన క్షేమాన్ని ఆయనే చూసుకుంటారు. "ధన్యవాదాలు బాబా. నా కాలివేళ్ళకు కొంచెం సమస్య ఉంది. అదికాక మా కుటుంబంలో కూడా కొన్ని సమస్యలున్నాయి. మీ దయతో అవన్నీ తొలగిపోవాలి. మా అల్లుడి స్థలం కూడా అమ్ముడుపోవాలి తండ్రి". 


శ్రీసచ్చిదానంద సమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


బాబా ఊదీ సర్వరోగనివారిణి


శ్రీసాయినాథా చరణం శరణం. సాయినాథుని పాదపద్మములకు శతకోటి పాదాభివందనాలు. నేను సాయి బిడ్డను. బాబా నాకు అనుగ్రహించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి నాకు స్కిన్ ఎలర్జీ వచ్చింది. మందులు వాడినా తగ్గకపోవడంతో నేను చాలా భయపడ్డాను. బాబాను ప్రార్థించి పరమపవిత్రమైన ఊదీని ఎలర్జీ ఉన్నచోట రాసి, మరికొంత ఊదీ ప్రసాదంగా తీసుకున్నాను. బాబా దయవల్ల కొద్దిరోజులకి ఎలర్జీ తగ్గిపోయి నేను ఆరోగ్యవంతురాలినయ్యాను. ఇలా బాబా నన్ను చాలాసార్లు కాపాడారు. బాబా ఊదీ సర్వరోగనివారిణి. "శతకోటి కృతజ్ఞతలు బాబా. మీ అనుగ్రహం ఎల్లప్పుడూ మా మీద ఉండాలి తండ్రి".



5 comments:

  1. Om sai ram ��

    ReplyDelete
  2. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  3. Om Sairam
    Sai Always be with me

    ReplyDelete
  4. Baba me daya valana Kalyan ki marriage ipoindi na health bagu cheyandi pl house problem solve cheyandi Rashmi ki pregnancy vachhatatlu chai thandi meku sathakoti vandanalu

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo