సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1109వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శిరిడీ యాత్ర అనుభవాలు
2. అడుగడుగునా లీలలు ప్రదర్శించిన బాబా
3. ఊదీ పెట్టుకున్న క్షణం నుండి అంతరించిన సమస్య

శిరిడీ యాత్ర అనుభవాలు


ఓం శ్రీసాయినాథాయ నమః.!!! సాయి బంధువులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలిని. 2021లోని నా శిరిడీ యాత్ర అనుభవాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. 2021, ఫిబ్రవరిలో మా 25వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మేము శిరిడీ వెళ్లాలని అనుకున్నాము. కానీ కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా శిరిడీ వెళ్లడం మానుకున్నాము. ఆ ఒక్క కారణమేకాక అప్పటికి అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులు పూర్తయిన తరువాత ప్రశాంతంగా వెళ్లొచ్చని భావించాము. అయితే ఆ తరువాత కరోనా కేసులు చాలా విపరీతంగా పెరగడం వల్ల శిరిడీ సమాధి మందిరంలో భక్తులకు దర్శనాలు ఆపేసారు. ఈ లోపు ఇంట్లో చెప్పరాని సంఘటనలు, ఆప్తుల మరణాలతో అంతా అస్తవ్యస్తమై ఆయోమయ పరిస్థితి నెలకొంది. ఆ పరిస్థితుల నడుమ 'అనుకున్నప్పుడు శిరిడీ వెళ్లకుండా ఎందుకు మానేసామా?' అని అనుకోని రోజు ఒక్కటి కూడా లేదు. అలా బాబాని చూడాలన్న తపన మరీ ఎక్కువైపోయింది. ఈలోగా అక్టోబరులో శిరిడీలో భక్తుల దర్శనానికి తిరిగి అనుమతించారు. అప్పటినుండి కుటుంబంతో కాకపోయినా ఎవరో ఒకరు తోడు దొరికితే చాలు అని స్నేహితులతో, తెలిసిన వాళ్ళతో కలిసి శిరిడీ వెళ్లి బాబాని దర్శించుకుని వద్దామని ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కుదరలేదు. ఆఖరికి ఎలాగైనా శిరిడీ వెళ్లి రావాలని 2022, సంక్రాంతి సెలవుల్లో టికెట్లు బుక్ చేసాము. కానీ కరోనా మూడో వేవ్ మొదలై కేసులు బాగా పెరగడంతో టిక్కెట్లు క్యాన్సిల్ చేసుకోవలిసి వచ్చింది. తరువాత ఫిబ్రవరిలో మా వివాహ వార్షికోత్సవ సందర్భంగా శిరిడీ వెళదామని మళ్ళీ టికెట్లు బుక్ చేసాము. కానీ అప్పటివరకు జరిగిన వాటి వల్ల నాకు శిరిడీ వెళ్తామన్న నమ్మకం కుదిరేది కాదు. పైగా మా అత్తగారి ఆరోగ్యం బాగాలేక ఆ సమయంలో మా ఇంట్లోనే ఉంటున్నారు. ఆవిడకి ఎప్పుడైనా ఒకసారి తల తిప్పినట్లై వాంతులు అవుతుంటాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటే సర్దుకుంటుంది. కానీ, మేము లేని సమయంలో ఆవిడకి అలా వస్తే ఎలా అన్న భయం. అదలా ఉంచితే నాలుగురోజుల్లో ప్రయాణమనగా మాకు బాగా దగ్గర బంధువైన ఒకాయనకి (ఆయనకి చాలా రోజులుగా ఆరోగ్యం బాగాలేదు) చాలా సీరియస్‌గా ఉందని తెలిసింది. ఈ కారణాల వల్ల ఈసారైనా బాబా మమ్మల్ని రప్పించుకుంటారో, లేదోనని చివరి నిమిషం వరకు భయంభయంగా గడిపాము. ఏదేమైనప్పటికీ బాబా అనుగ్రహం వల్ల ట్రైన్ ఎక్కాము.


ఇక అక్కడినుంచి చూడాలి! ప్రతిక్షణమూ బాబా అనుగ్రహాన్ని అనుభూతి చెందుతూ ప్రయాణం సాగించి అనుకున్న సమయానికి శిరిడీ చేరుకున్నాం. అక్కడ కోవిడ్ కారణంగానో ఏమోగానీ హోటల్స్ అన్నీ ఖాళీగా, చాలా చవకగా అందుబాటులో ఉన్నాయి(ఒక్కరోజు కోసమేనని సాయి సంస్థాన్ రూమ్స్ బుక్ చెయ్యలేదు). గుడికి దగ్గరలో మంచి హోటల్లో రూమ్ తీసుకుని మధ్యాహ్నం ఒంటిగంటకి దర్శనం కోసం క్యూలైన్‌లోకి వెళ్ళాము. అక్కడ ఏ మాత్రమూ వేచి ఉండాల్సిన పనిలేదు. నేరుగా బాబా దగ్గరకు ఒకటే పరుగు. ఐదు నిమిషాల్లో బాబా దివ్యదర్శనం అయింది. తరువాత బయటకి వచ్చి ద్వారకామాయి తదితర అన్నీ దర్శించుకుని భోజనం చేసి రూమ్‌కి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాం. మధ్యాహ్నం హడావిడిగా రావడం, ఎండ వల్ల కాస్త చిరాకుగా అనిపించినా సాయంత్రం దర్శనాలు అద్భుతంగా జరిగాయి. రాత్రి 8 గంటలకు ఆన్లైన్‌లో మేము తీసుకున్న ఉచిత దర్శనం టికెట్ ఉన్నప్పటికీ అక్కడ కూడా బయోమెట్రిక్ దర్శనం పాసులు ఇస్తుంటే తీసుకున్నాం. రాత్రి 7 నుండి 8 గంటల మధ్య వచ్చింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఆ సమయంలో మందిరంలోకి పూవులు, ప్రసాదాలు మొదలైనవేవీ అనుమతించటం లేదు. అందువలన నేను ఇంటి నుండి తీసుకెళ్లిన టెంకాయ, జామపళ్ళు, విషయం తెలియక శిరిడీలో కొన్న ప్రసాదాలు అన్నీ ద్వారకామాయిలో ఉన్న రాతి మీద కూర్చున్న బాబా పటం దగ్గర పెట్టి తీసుకున్నాం.(ద్వారకమాయిలో పైకి అంటే ధుని దగ్గరకి వెళ్ళనివ్వట్లేదు. క్రింది నుంచే లైన్‌లో తిరిగి వెళ్లిపోవాలి). తరువాత దర్శనం లైన్‌లోకి వెళ్లి 5 నిమిషాల్లో బయటికి వచ్చి, 8 గంటల ఆన్లైన్ పాసు మీద మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. అంటే అరగంట వ్యవధిలో రెండుసార్లు బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చి, కాసేపు ప్రశాంత రాత్రి వాతావరణంలో ధ్యాన మందిరంలో కూర్చుని ధ్యానం చేసుకుని(అదో అద్భుతమైన అనుభూతి) బయటకు వచ్చి, టిఫిన్ తిని అక్కడే షాపింగ్ చేస్తూ ఉండగా శేజారతికి సమయం అయ్యింది. కాకడ ఆరతి, శేజారతిలకు భక్తులను అనుమతించట్లేదు. కేవలం మధ్యాహ్న, సాయంకాల ఆరతులకు మాత్రమే అనుమతి ఉంది. అందుచేత ద్వారకామాయి వద్ద బయట ఉన్న పెద్ద టీవీలో భక్తులందరమూ శేజారతి దర్శించి తరించాము. ఆరతి అనంతరం బాబా చుట్టూ దోమతెర దించేవరకు చూసి, ఆపై రూమ్‌కి వెళ్లి పడుకున్నాము. రలా మర్నాడు పొద్దున్నే లేచి బయోమెట్రిక్ పాసు తీసుకుని గం.7.30నిమిషాలకల్లా లైన్‌లోకి వెళ్ళాము. ఆ సమయంలో కాస్త జనం ఎక్కువగా ఉన్నందున దర్శనానికి సమయం పడుతుందని అనుకున్నాం కానీ, 10 నిమిషాల్లోనే దర్శనం అయింది. ఇదివరకు ఎన్నోసార్లు శిరిడీ వెళ్లినప్పటికీ ఇంత త్వరగా అంటే 24 గంటల్లో సునాయాసంగా నాలుగు దర్శనాలు జరగడం ఇదే మొదటిసారి. దర్శనానంతరం బయటకొచ్చాక టిఫిన్ చేసి, షాపింగ్ చేసుకుని రూమ్‌కి వెళ్లేముందు ముఖ దర్శనం చేసుకుందామని అనుకున్నాను కానీ, షాపింగ్‌లో పడి ఆలస్యమవడం వల్ల ముఖ దర్శనానికి వెళ్ళకుండానే బయలుదేరవలసి వచ్చింది. ఫిబ్రవరి 23న మేము క్షేమంగా మా ఇంటికి చేరుకున్నాము. ఆలస్యం చేయకుండా మరుసటిరోజు గురువారం మా శిరిడీ యాత్ర అనుభవాలు సాయి బంధువులతో పంచుకోవాలని బ్లాగుకు పంపాను. బాబా కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్నందువల్ల ఎన్నోసార్లు మా ప్రయాణాన్ని ఆపించినా, చివరికి కరోనా కేసులు బాగా నెమ్మదించిన సమయంలో మమ్మల్ని శిరిడీకి రప్పించి తమ దివ్యదర్శనాలతో ఎంతగానో ఆనుగ్రహించారు. "ధన్యవాదాలు బాబా".


ఓం శ్రీసమర్ధ సద్గురు సాయినాథాయ నమః!!!


అడుగడుగునా లీలలు ప్రదర్శించిన బాబా


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీసచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కి జై!!!


సమస్త సాయిబంధువులకు వందనాలు. నా పేరు సింధు. మొదట్లో నాకు బాబాపై పెద్దగా నమ్మకం ఉండేదికాదు. ఈమధ్యనే ఒక యూట్యూబ్ ఛానెల్లో బాబా లీలలు విన్నాక నాకు బాబాపై నమ్మకం కుదిరింది. అప్పటినుండి మా ఇంట్లో ఉండే సాయి ప్రతిమకు సాయి దివ్యపూజ చేయడం మొదలుపెట్టాను. మొదటివారమే బాబాకు నివేదించిన నైవేద్యంలో చాలా స్పష్టంగా నాకు ఓంకారం దర్శనమైంది. మరుసటి వారం పూజ సమయంలో బాబా నాకు నీళ్లలో దర్శనమిచ్చారు. దాంతో బాబాపై నాకున్న నమ్మకం ఇంకా ఎక్కువైంది. చివరివారం అంటే ఐదవ వారం సాయి దివ్యపూజ పూర్తిచేసి బాబా గుడికి వెళితే అక్కడ కూడా బాబా నాకు ఒక లీల చూపించారు. అక్కడ పనిచేసే ఒక వ్యక్తి నన్ను పిలిచి 'శ్రీగురుచరిత్ర' పుస్తకం నాకిచ్చి సప్తాహా పారాయణ చేయమన్నారు. బాబానే ఆ పుస్తకాన్ని నాకు ఇప్పించారని నా అభిప్రాయం.


ఒకరోజు రాత్రి మా అమ్మకు విపరీతంగా దగ్గు వచ్చింది. అమ్మ ఆపకుండా దగ్గుతూనే ఉంది. అప్పుడు నేను ఊదీ కలిపిన నీళ్లు బాబా చేతికి తాకించి అమ్మ చేత త్రాగించాను. అంతే, వెంటనే దగ్గు తగ్గిపోయింది. అలాగే ఒకసారి వచ్చిన తీవ్రమైన కడుపునొప్పి కూడా బాబా ఊదీ నీళ్లతో తగ్గిపోయింది. దాంతో 'నమ్మితే, బాబా ఎప్పటికీ మనల్ని వదిలేయర'నే నమ్మకం నాకు దృఢమైంది..


ఇటీవల కాలంలో నేను బాబాను ఒక విషయం గురించి ప్రార్ధించాను. అదేంటంటే, మా ఇంటి అమ్మకం గురించి. మేము చాలారోజుల నుండి మా ఇల్లు అమ్మాలని చూస్తుంటే, అస్సలు కుదరడంలేదు. దాంతో నేను బాబాను ప్రార్థించి 'OLX'లో మా ఇల్లు అమ్మకానికి పెట్టాను. బాబా దయవలన వెంటనే ఇంటిని అమ్మగలిగాము. అయితే, ఆ ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. అప్పుడు మరో చెక్ ఇవ్వమని అతన్ని అడిగాము. బాబా దయవల్ల అతను మరో చెక్ ఇచ్చారు. ఈసారైనా ఏ సమస్యా లేకుండా చెక్ క్లియర్ కావాలని బాబాను వేడుకుంటున్నాను. ఇలా చెప్పుకుంటూ పొతే బాబా లీలలు ఎన్నో, ఎన్నెన్నో! "థాంక్యూ సో మచ్  సాయినాథా!".


ఊదీ పెట్టుకున్న క్షణం నుండి అంతరించిన సమస్య


నేను ఒక సాయి భక్తురాలిని. 2022, ఫిబ్రవరి 1, సాయంత్రం నేను స్కూటీపై కాలేజ్ నుండి ఇంటికి బయలుదేరాను. కొద్దిసేపట్లో నా ముక్కు నుండి ఏదో బయటకు వస్తున్నట్లు అనిపించింది. 'చలికాలం కదా! చల్లదనానికి ముక్కు నుండి నీరులా వస్తుంది' అనుకున్నాను. కానీ రానురానూ చాలా ఎక్కువగా వస్తున్నట్లనిపించి చూసుకుంటే అది రక్తం. ఒక్కసారిగా నేను నిర్ఘాంతపోయి, "ఏమిటి బాబా ఇది?" అని 'సాయిరామ్ సాయిరామ్' అని అనుకుంటూ అలాగే ఇంటికి వచ్చాను. ఆలోపు ముక్కు మొదలు నోరు వరకు రక్తం గడ్డకట్టింది. నాకు చాలా భయమేసి, "ఎవరూ లేని నాకు అన్నీ మీరే అయి నన్ను కాపాడాలి బాబా. చాలా చిన్న సమస్య అని చెప్పాలి బాబా" అని బాబాకి చెప్పుకుంటూ హాస్పిటల్‌కి వెళితే, "ఇదంతా జలుబు వల్ల వచ్చింది. తగ్గిపోతుంద"ని  టాబ్లెట్లు ఇచ్చారు. టాబ్లెట్స్ వేసుకుని పడుకున్నాక రాత్రి మళ్ళీ రక్తం కారడం మొదలై ముక్కు నుండి ఒకటే రక్తం. మళ్లీ హాస్పిటల్‌కి వెళ్తే ఎక్స్ రే, సిటీ స్కాన్ మొదలైన అన్ని టెస్టులు చేసారు. 'ఏ ప్రాబ్లం లేదు' అని వచ్చింది. కానీ నా సమస్య సమసిపోలేదు. ఒక వారంలో 1.5 లీటర్ల కంటే ఎక్కువ రక్తం పోయింది. అప్పుడు నేను, "ఇక చాలు బాబా. ఇకనైనా నాకు నయం చేయి తండ్రి. చూసుకునేవాళ్ళు ఎవరూ లేక ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నలిగిపోయిన నాకు ఇదేమి పరీక్ష? దయచేసి నాకొచ్చిన సమస్యను తగ్గించు తండ్రి. ప్రతీ విషయంలో సహాయం చేయమని మిమ్మల్ని అడిగి అడిగి విసిగిపోయాను. ప్రతి సెకండ్ మిమ్మల్ని తలుచుకోవడం వల్ల నేను మీకు అలుసైపోయాను. ఇంకా 'ఓపిక పట్టు' అంటావు కానీ, ఇక మీ పరీక్షలు చాలు తండ్రి. డాక్టరు ముక్కుకి ఎండోస్కోపీ చేస్తామన్నారు. మీరేం చెప్తారు బాబా" అని సమాధానం కోసం 'సాయి మహారాజ్ సన్నిధి'లో చూస్తే, "గడ్డ అదే తగ్గిపోతుంది. భయపడాల్సిన పనిలేదు" అని వచ్చింది. "సరే బాబా" అని హాస్పిటల్‌కి వెళ్తే ముక్కుకి ఎండోస్కోపీ చేసి, "చాలా చిన్న గడ్డ ఉంది. దాన్ని కట్ చేయాలి" అని చెప్పారు. అయితే, "గడ్డ దానంతట అదే తగ్గుతుంద"ని బాబా ముందే చెప్పి ఉన్నందువల్ల, "మళ్ళీ వస్తామ"ని చెప్పి ఇంటికి వచ్చేసి టాబ్లెట్లు వాడసాగాను. నేను ప్రతి గురువారం బాబా గుడికి వెళ్తాను. అలాగే ఒక గురువారం బాబా గుడికి వెళ్లి సరిగ్గా ధుని ముందుండగా నా ముక్కు నుండి రక్తం కారింది. అప్పుడు నేను, "బాబా! మీరు మాకు ప్రసాదించిన ఈ ధుని ఊదీ పెట్టుకుంటున్నాను. ఇది(రక్తం కారడం) ఇంతటితో ఆగిపోవాలి" అని అనుకున్నాను. అంతే, ఆ క్షణం నుండి రక్తం మరి కారలేదు. "ధన్యవాదాలు బాబా. మళ్లీ ఆ పరిస్థితి నాకు రావద్దు బాబా. మీ ఊదీతో నా ఆరోగ్య సమస్యలన్నీ పోవాలి. నాకు తల్లి, తండ్రి గురువు, దైవం అన్ని మీరే బాబా. మేమందరమూ బాగుండాలి బాబా".


4 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  4. Omsairam omsairam omsairam omsairam omsairam

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo