ధుమాళ్ న్యాయవాద వృత్తికి సంబంధించిన మరో కేసు గురించి తెలుసుకుందాం. ఈ కేసు ముగ్గురు సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపించబడింది. గాయపడినవారిలో ఒకరికి ఎముక విరిగి, 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై ముగ్గురి తరపున వాదించడానికి ఒప్పుకొని, అప్పీలు మెమో తయారుచేసుకొని ముందుగా జామీను కోసం ప్రయత్నించాడు ధుమాళ్. అయితే, ‘కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలుపడద’ని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి (సీనియర్ ఐరోపా అధికారి) చెప్పాడు. ధుమాళ్ ఒక్కసారి బాబాను స్మరించుకొని, జడ్జి వైపు తిరిగి, “ప్రాసిక్యూషన్‌వారు చెప్పేది నమ్మశక్యంగా లేదనీ, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రం, ఏ డిగ్రీలూ, సర్టిఫికెట్లూ లేని ఒక నాటువైద్యుడిచే ఇవ్వబడింద”ని చెప్పాడు. అంతేగాక, నిందితులు ముగ్గురూ రైతులనీ, వ్యవసాయమే వారి జీవనాధారమనీ, వాళ్ళు జైలులో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందనీ చెబుతూ, వారిపై అభియోగం ఋజువైతే అప్పుడు వారిని జైలుకు పంపవచ్చని వాదించాడు. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశాడు. కొద్దిరోజుల తరువాత కేసు మళ్ళీ విచారణకొచ్చింది. “మీరు వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా? లేక కేవలం క్షమాభిక్ష కోసమా?” అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధుమాళ్‍ని అడిగాడు. ‘క్షమాభిక్ష కోసమే అయితే తాను వ్యతిరేకించన’ని కూడా అన్నాడు. కేసు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి, ‘ఖైదీల విడుదల కోసమే వాదిస్తాన’ని సమాధానమిచ్చి, ఒక నాటువైద్యునిచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకొని, ప్రమాదకరంగా గాయపరిచారని చెప్పడం సబబు కాదని వాదించాడు ధుమాళ్. శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినప్పటికీ చివరికి సాధ్యమైనంతవరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాడు ధుమాళ్. అందుకు న్యాయమూర్తి, “మీరు కోర్టువారి క్షమాభిక్ష కోసం మాత్రమే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది” అని ధుమాళ్‌తో అంటూ, "ఒక నాటువైద్యుడిచ్చిన ధృవపత్రం ఆధారంగా, ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరచారని ఎలా చెబుతున్నావు?” అని ప్రాసిక్యూటర్‌ను అడిగాడు. "ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా!" అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, "నీ వాదన మూడవ తరగతి మేజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావన్న విషయం మరిచిపోయావు" అని గద్దించాడు. దీని తరువాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి నిందితులను విడుదల చేశాడు.
ఇక, ప్రభుత్వరంగంలో ధుమాళ్ సేవల గురించి తెలుసుకుందాం. ధుమాళ్ నాశిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమించబడ్డాడు. ఈ పదవిని అతను 1.11.1917 నుండి 13.5.1925 వరకు నిర్వహించాడు. ఈ పదవిలో ఉన్నప్పుడు ప్రతిదినం వేలకొలది సంతకాలు స్వయంగా (తన సంతకంతో తయారుచేయబడిన స్టాంపు ఉపయోగించకుండా) పెట్టవలసివచ్చేది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా తన న్యాయవాదవృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. అతను చెల్లించే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి సున్నాకు పడిపోయిందంటే, అతని సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ, అతని ఈ త్యాగానికి గుర్తింపుగా 1927లో అతనికి "రావుబహద్దూర్" అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికున్నది. బాబాపై భారం వేసి, తన పని నిర్వహించసాగాడు ధుమాళ్. ప్రతిరోజూ జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి ధుమాళ్ టేబుల్‍పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపరుపై ధుమాళ్ సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపరుతో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు ధుమాళ్ ఎప్పటిలాగే సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాడు. ఇంతలో అతనికి బాగా తెలిసిన, అతనెంతో గౌరవించే ఒక వ్యక్తి అతనిని కలవడానికి వచ్చాడు. సంతకాల పనిని మరుసటి ఉదయానికి వాయిదా వేసి, అతనితో అర్థరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాడు ధుమాళ్. తరువాత జవానును భోజనానికి పంపి, అతను నిద్రపోయాడు. మరుసటిరోజు అతనికి ఊరు విడిచి వెళ్ళాల్సిన పని ఉండి, పేపర్లపై సంతకాలు పెట్టకుండానే ఆఫీసుకు పంపాడు. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాడు. యథావిధిగా సంతకాల కార్యక్రమానికి ఉపక్రమించినప్పుడు, ఆరోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందురోజు సంతకాలు నిలిచిపోయిన పేపర్లను తెప్పించి చూస్తే, వాటన్నిటిపై తన సంతకాలుండటం కనిపించింది. తాను చేయకుండానే వేల పేపర్లపై తన సంతకం ఉండడం చూసిన ధుమాళ్ ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇది కేవలం బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైందని అతను గ్రహించాడు.
అలాగే, బాబా చేసిన మరొక అద్భుత లీల గురించి తప్పక తెలుసుకోవాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ ధుమాళ్ అధీనంలోనే ఉండేవి. ఒకసారి, నెల మొదటివారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు బట్వాడా చేస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖాధికారి అభిప్రాయపడ్డాడు. మొదట ధుమాళ్ ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. రెండు మూడు రోజుల తరువాత అతడు అదే విషయం తిరిగి ధుమాళ్‌కు గుర్తుచేశాడు. దాంతో ధుమాళ్‌కు కూడా అలా చేస్తే బాగుంటుందనిపించి అకౌంట్స్ ఆఫీసరును సంప్రదించాడు. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరుకాలేదనీ, మంజూరు కాకుండా చెక్కు పంపడం అభ్యంతరకరమనీ అతడు చెప్పాడు. అందువల్ల ధుమాళ్ ఏమీ చేయలేకపోయాడు. మరల విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని ధుమాళ్ ముందుంచడంతో ధుమాళ్ అతని అభిప్రాయంతో ఏకీభవించి దీనిపై బాబా అనుమతి కోరదలచి, రెండు చీటీలు వ్రాసి, వాటిని బాబా పటం ముందుంచి, వాటిలోనుండి ఒక దానిని తీయించాడు. ‘జీతాలు బట్వాడా చేయమ’నే ఆదేశం వచ్చింది. దాంతో ధుమాళ్ వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించాడు. తరువాత టీచర్లందరికీ జీతాల బట్వాడా జరిగింది. దీపావళి పర్వదినానికి ముందు జీతాలిచ్చినందుకు అందరూ సంతోషించి అతనికి కృతజ్ఞతలు చెప్పారు. కానీ అక్కౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందోనని కొంచెం ఆందోళనపడ్డాడు ధుమాళ్. కానీ బాబా దయవలన ఏ సమస్యా రాలేదు. ఆ సంవత్సరాంతం జరిగిన ఆడిట్లో ఈ అభ్యంతరం నమోదు చేయబడింది. అందుకు, "భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది" అని జవాబు వ్రాసి పంపాడు ధుమాళ్. దాంతో ఆ సమస్య అంతటితో సమసిపోయింది.
ధుమాళ్ జీవితంలోని ప్రతి మలుపులోనూ, సందిగ్ధస్థితిలోనూ బాబా అతనికి ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని తెలుసుకుందాం. 1910లో ధుమాళ్ సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటీ అతనికి సహాయం చేయదలచి, అతనిని ఉన్నతవిద్యకై విదేశాలకు (ఇంగ్లండు) పంపదలచాడు. ఇంగ్లండులో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, ధుమాళ్ విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకొని, బాబా అనుమతి కోసం వారిని దర్శించారు. అప్పుడు షామా వారి తరఫున బాబాతో, “బాబా, భావూను విదేశాలకు (బిలాయత్) పంపించమంటారా?" అని అడిగాడు. "ఎందుకు?" అని అడిగారు బాబా. "ఉన్నతవిద్య (బార్-ఎట్-లా) కోసం" అని సమాధానమిచ్చాడు షామా. అప్పుడు బాబా, "అతని అభిరుచి (ఇలాయత్), దైవేచ్ఛ (విలాయత్), విదేశాలలో (బిలాయత్) లేదు. ఈ దేశంలోనే ఉంది! అతను ఇంగ్లండుకు ఎందుకు వెళ్ళాలి?" అన్నారు. తనకు ఏది శ్రేయోదాయకమో బాబాకు తెలుసు కనుక మరో మాట మాట్లాడకుండా ఇంగ్లండు వెళ్ళాలనుకునే తన ఆలోచనను విడిచిపెట్టాడు ధుమాళ్.
1912లో జె.జె. హాస్పిటల్లో ధుమాళ్‌కు ఒక ఆపరేషన్ జరిగింది. అది కష్టమైన ఆపరేషన్. ఆపరేషన్‌కు ముందు అతనికి మత్తు ఇచ్చారు. మత్తులోనికి జారేముందు ధుమాళ్ వెనుకకు తిరిగి చూశాడు. తన తల వైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉండటం అతనికి కనిపించింది. దాంతో, బాబా తన వెంటే ఉన్నారన్న భరోసా అతనికి కలిగింది. ఆ తరువాత బాబా దయవలన ఆ ఆపరేషన్ విజయవంతంగా జరిగింది.
1915లో నాశిక్‌లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ధుమాళ్‌కు ఆహ్వానం పంపింది. తన అభిప్రాయాన్ని తెలియజేసేందుకు రెండు రోజులు గడువు అడిగి, తనను ఆ ఉద్యోగంలో చేరమంటారో, వద్దో తెలియజేయవలసిందిగా ప్రార్థిస్తూ బాబాకు ఉత్తరం వ్రాశాడు ధుమాళ్. "నీవు చేస్తున్న ఉద్యోగమే మంచిది. కొత్తదాన్ని అంగీకరించవద్దు!" అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. బాబా ఆదేశం మేరకు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాడు ధుమాళ్.
1918లో బాబా మహాసమాధికి కొద్దిరోజుల ముందు శిరిడీ, పూనా మరికొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన విషజ్వరాలు (ఇన్‌ఫ్లూయంజా) విజృంభించాయి. పూనాలోనున్న అతని అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందనే విషయాన్ని తంతి ద్వారా ధుమాళ్‌కు తెలియజేశారు అతని బంధువులు. ఆ వార్త అందిన వెంటనే అవసరానికి 80 రూపాయలు తీసుకుని తన అన్న దగ్గరికి బయలుదేరాడు ధుమాళ్. నాశిక్ నుండి పూనా వెళ్ళే దారిలోనే శిరిడీ ఉంది కాబట్టి అక్కడ ఆగి, బాబాను దర్శించి, రోగికి ఊదీ, ఆశీర్వాదాలు తీసుకొని వెళదామని తలచాడు ధుమాళ్. వెళ్ళినరోజే బాబా పలుమార్లు అతనిని దక్షిణ అడిగి, అతని దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది అతనికి అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక తన పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదనిపించింది. అయినా, తనను పూనా వెళ్ళడానికి అనుమతించమని బాబాను కోరాడు ధుమాళ్. బాబా రాచఠీవీతో, "రేపు చూద్దాం (ఉద్యా పాహూ)" అన్నారు. అలా బాబా అతనిని మూడు రోజులు శిరిడీలోనే ఉంచారు. ఇంతలో అతని వదిన చనిపోయినట్లు ధుమాళ్‌కు టెలిగ్రాం వచ్చింది. అప్పుడు బాబా అతనిని పూనాకు వెళ్ళడానికి అనుమతించారు. అతని వదిన చనిపోతుందని, అతను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే అతనిని శిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను ఎవరూ తెలుసుకోలేరు. కానీ ఏ విషయంలోనైనా బాబానే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాడు ధుమాళ్. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్దిరోజుల ముందు జరిగింది. అలా బాబా అతనిని శిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో తమతో గడిపే మహాభాగ్యాన్ని ధుమాళ్‌కు ప్రసాదించారు.
ధుమాళ్ డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు అతని ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ, బాబా దయవలన క్రమేణా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాడు. అతను 1.9.1930 నుండి 9.4.1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబరుగానూ, 1932 సంవత్సరాంతము నుండి 1933 ఆగష్టు వరకు సుర్గాన సంస్థానానికి సెక్రటరీగానూ పనిచేశాడు. నాశిక్‌లో ఉన్నప్పుడు అతను తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తూనే ఉండేవాడు. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. ధుమాళ్ సుర్గాన సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు, బాబా ఎంతో దయతో ఏ విధంగా అతనికి ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం!
ఒకరోజు ధుమాళ్ భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని అతను ఉన్న గదిలోనికి ప్రవేశించాడు. తాను భోజనం చేస్తూ ఉన్నందున అతడిని సగౌరవంగా ఆహ్వానించి, ఉచితాసనంపై కూర్చోపెట్టలేకపోతున్నందుకు తనను క్షమించమని కోరాడు ధుమాళ్. అందుకతడు, ‘పర్వాలేదు’ అంటూ నేరుగా ప్రక్కనే ఉన్న గదిలోనికి వెళ్ళి, అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని తదేకంగా కొంతసేపు చూసి తిరిగి ధుమాళ్ ఉన్న చోటికి వచ్చి, "మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను" అని చెప్పి వెళ్ళిపోయాడు. తన జీతాన్ని పెంచమని ధుమాళ్ ఆయనను అసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే తన ప్రయత్నమేమీ లేకుండానే జీతం పెరగడం కేవలం బాబా అనుగ్రహమేనని ధుమాళ్ గ్రహించాడు. బాబా మనపై చూపుతున్న ప్రేమ, తల్లి తన బిడ్డపై చూపేటటువంటిది అని అతనికి అర్థమయింది (మావులిఁచే చిత్ లేకురాచేఁ హిత్).
ధుమాళ్ పూజామందిరంలో బాబా ఫోటోలు కొన్ని ఉండేవి. వాటితో పాటు ఆ తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాడతను. బాబా నిల్చుని ధ్యానమగ్నులై ఉన్న పెద్ద పటం ఒకటి వాటన్నింటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే అతనికి ఎంతో ఇష్టం. మొదట ఆ పటం రాధాకృష్ణఆయీ దగ్గర ఉండేది. ఈ పటాన్ని తనకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాడు ధుమాళ్. ఆయీ ఇంటినుండి ఆ పటాన్ని తీసుకొని మసీదు దారిలో వెళుతున్నప్పుడు బాబా అతనిని లోనికి పిలిచి, అతని చేతిలో ఉన్న పటాన్ని చూస్తూ, "ఏమిటిది?" అని అడిగారు. “ఇందులో మీరున్నారు" అన్నాడు ధుమాళ్. బాబా “ఇటివ్వు” అంటూ ఆ పటాన్ని తమ చేతుల్లోకి తీసుకొని, దానిని ముందూ వెనుకా తదేకంగా చూసి, తిరిగి ధుమాళ్‌కు ఇచ్చి, “ఉంచు!” అన్నారు. బాబా స్పృశించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే అతని కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, ఆ పటాన్ని చూసినప్పుడల్లా, “భావూ! నాకు రాత్రంతా నిద్రలేదు. నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను!" అని బాబా తనతో అన్న సందర్భం అతనికి గుర్తుకొచ్చేది. బాబా తనకు ప్రసాదించిన కానుకగా భావించి ధుమాళ్ ఆ పటాన్ని భక్తిశ్రద్ధలతో పూజించుకునేవాడు.
ఈ ఫోటోలనన్నింటినీ తను ఎక్కడికి వెళితే అక్కడికి తన వెంటే తీసుకుని వెళ్ళేవాడు ధుమాళ్. అతను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాశిక్, దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారీ ఫోటోలను తన వెంట తీసుకెళుతుండటం చూసిన దేవార్లోని అతని వంటవాడు ఒకసారి, “ఫోటోలన్నీ తీసుకొని వెళ్ళడమెందుకు? కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా?” అన్నాడు. తరువాత అదే విషయాన్ని నాశిక్‌లోని అతని సోదరుని కుమారుడు కూడా అడగటంతో, ధుమాళ్ ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి రెండు చీటీలను వ్రాసి బాబా పటం ముందు వేశాడు. బాబా నుండి, ‘ఫోటోలన్నింటినీ తీసుకువెళ్ళమ’నే ఆదేశం వచ్చింది. అతనలాగే చేశాడు. అప్పటినుండి ఫోటోలను తనతో తీసుకెళ్ళే విషయంలో చీటీలు వేసిన ప్రతీసారి ‘ఫోటోలన్నీ తీసుకువెళ్ళమ’నే బాబా ఆదేశం వచ్చేది.
ధుమాళ్ ఎంతో పవిత్రంగా భద్రపరచుకోవడానికి బాబా అతనికి కొన్ని వస్తువులను ప్రసాదించారు. ఒకసారి బాబా అతనిని 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకొని, వాటిని తిరిగి అతనికే ఇచ్చి, "వీటిని భద్రంగా దాచుకో. ఎవరికీ ఇవ్వవద్దు. ఖర్చుపెట్టవద్దు (జపూన్ ఠేవా. కోణాలా దేవూఁ నకో, ఖర్చ్ కరూఁ నకో)" అన్నారు. ఇంకొకసారి ఇలాగే మరో 2 రూపాయలిచ్చి పైవిధంగానే ఆదేశించారు. ఒకసారి ధుమాళ్, బూటీ కలిసి బాబాను దర్శించారు. బాబా బూటీని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా ధుమాళ్‌కు ఇచ్చేశారు. ఇంకొకసారి బూటీ, ధుమాళ్ కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయలు దక్షిణ అడిగారు. అతడు సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయి నాణేలను తమ దోసిలిలోనికి తీసుకొని, దోసిలి మూసి, క్రిందికి పైకి ఆడించి, ఆ నాణేలను తమ రెండు గుప్పెళ్ళలోకి తీసుకొని, ఒక గుప్పెడు ధుమాళ్‌కు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. వారిద్దరూ వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి 15 రూపాయలున్నాయి. వాళ్లు ఆశ్చర్యపోయారు. ఇవేకాక, మరో సందర్భంలో బాబా ధుమాళ్‌కు 30 రూపాయలు ఇచ్చారు. ఇలా బాబా ధుమాళ్‌కు ఇచ్చిన మొత్తం 69 రూపాయలయింది. వీటిని బాబా తనపై చూపిన ప్రేమకు జ్ఞాపికలుగా మాత్రమేగాక, తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణేలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాడు ధుమాళ్.
‘బాబా స్వీకరించే దక్షిణల వెనుక నిగూఢమైన మర్మం ఉండేది’ అని ఆ తరువాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి బాబా తమ భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసేసుకునేవారు (యస్యానుగ్రహ మిచ్చామి తస్య సర్వ హరామ్యహమ్). ఇలా ధుమాాళ్‌కు కూడా తరచుగా జరిగేది. అలాంటి సమయాలలో అతను ఎలాంటి బాధ, విచారం లేకుండా బాబా అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడు. ఎందుకంటే, ‘మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి, వారు మనకు ఇచ్చిందే తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపించవలసింది కూడా ఆయనే కదా!’ అన్నది ధుమాళ్ విశ్వాసం. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలివేసిన సందర్భాలు ఏనాడూ లేవు. అటువంటి రెండు సంఘటనలను చూద్దాం.
ధుమాళ్ ఒకసారి శిరిడీ వెళ్ళినప్పుడు బాబా అతనిని పలుమార్లు దక్షిణ అడిగి అతని దగ్గరున్న డబ్బంతా తీసేసుకున్న తరువాత మరలా, "భావూ, నాకు 7 రూపాయలు ఇవ్వు" అని అడిగారు. తన దగ్గర లేవని ధుమాళ్ చెబితే, “ఎవరినైనా అడిగి తీసుకొని ఇవ్వు” అన్నారు బాబా. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసి బాబా తనలోని గర్వాన్ని, అహంకారాన్ని అణచి అణకువగా మెలగుటకై తనకొక పాఠం నేర్పించారని ధుమాళ్ భావించాడు. బాబా నేర్పిన ఈ విషయం అతనిని ఎంతగా ప్రభావితం చేసిందంటే బాబా మహాసమాధి చెందిన తరువాత అతను శిరిడీ వెళ్ళినప్పుడు, ఆనాడు బాబా భిక్ష చేసిన ఇళ్ళవద్ద భిక్షచేసేవాడు! బాబా దయవలన తన అహంకారం అణిగిందనీ, లేకుంటే తన అహంకారం ఇంకా పెరిగి సమాజంలోని కడజాతివారికి దూరంగా ఉండేవాడిననీ భావించాడు ధుమాళ్.
ఒకసారి బాబా ధుమాళ్ దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని, తిరిగి యాభై రూపాయలు అడిగారు. తన దగ్గర పైసా కూడా లేదని చెప్పాడు ధుమాళ్. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు బాబా. ధుమాళ్ వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు చెప్పాడు ధుమాళ్. ఈసారి హెచ్.వి.సాఠే దగ్గరకు వెళ్ళమన్నారు బాబా. ధుమాళ్ వెళ్ళి సాఠేకు బాబా ఆదేశం చెప్పగానే, సంతోషంగా డబ్బు ఇచ్చాడు సాఠే. దానిని తీసుకొని వెళ్ళి బాబాకు సమర్పించాడు ధుమాళ్. సాఠేను బాబా యాభై రూపాయలు దక్షిణ అడగడంలోని అంతరార్థం ధుమాళ్‌కు తరువాత తెలిసింది. సాఠే రిటైరైన తరువాత అతనికి పింఛను మంజూరైంది. అతడు తనకు యాభై రూపాయలు పింఛను అదనంగా రావలసివుందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకొన్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. ధుమాళ్‌ను దక్షిణ కొరకు సాఠే వద్దకు పంపించడంలోని బాబా ఉద్దేశం, అతనికి అదనంగా యాభై రూపాయల పింఛను మంజూరవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరై ఆర్డరు వచ్చిన తేదీ, బాబా సాఠేను యాభై రూపాయలు అడిగిన తేదీ ఒక్కటే కావడం విశేషం!
బాబా సేవకుడైన రఘు తదితరులకు సంబంధించిన కేసులో, ధుమాళ్ అడుగకుండానే వాళ్లు అతనికి 300 రూపాయలు ఫీజు రూపంలో ఇచ్చారు. ధుమాళ్ అహ్మద్‌నగర్ నుండి శిరిడీ వచ్చి మూడురోజులు ఉన్నాడు. ఆ మూడురోజులలో బాబా అతనిని పలుమార్లు దక్షిణ అడిగి ఆ 300 రూపాయలను తీసేసుకున్నారు. బాబా చేసిన ఈ చర్య ద్వారా, తన గురువు యొక్క సేవకుడిని విడిపించడం కోసం తాను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదనీ, ఎందుకంటే, ఆ కేసు గెలిచింది తన ప్రతిభాపాటవాల వల్ల కాదనీ, బాబా అద్భుతరీతిలో మేజిస్ట్రేటు మనస్సును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైందనీ ధుమాళ్ గ్రహించాడు.
బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి తెలుసుకుందాం. బాబాపై మన నమ్మకం బలపడేందుకు, వారి నిజతత్త్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ ధుమాళ్ ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, బాబా, "దేవుడు, దేవుడు అని ఊరకే ఎందుకు అంటున్నావు? దేవుడు నా జేబులో ఉన్నాడు!" అన్నారు.
ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి, బీదలకు, ఆకలిగొన్నవారికి వడ్డించేవారు. ఇది వారి ప్రేమను, దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు బాబా మసీదు ఆవరణలో పొయ్యిని వెలిగించి దానిపై పెద్దపాత్ర (హండీ) పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారమంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారుచేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడేవారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరీకర్, "బాబా! మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం?" అనడిగాడు. అప్పుడు బాబా, "చంపేవాడే రక్షిస్తాడు. రక్షించేవాడే చంపుతాడు (జో మారీల్ తోచ్ తారీల్, జో తారీల్ తోచ్ మారీల్)" అన్నారు. ఈ మాటలు ‘సృష్టి, స్థితి, లయ కారకుడు భగవంతుడే’ అని చెబుతున్నాయి. అంతేగాక, ‘బాబాలాంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుంది’ అనే నిగూఢ భావం ఇమిడివుంది.
Jai Sairam 🙏🙏🙏
ReplyDeleteOm sai ram ��
ReplyDeleteOM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM
ReplyDelete