1. ఊహకందని బాబా అద్భుతలీల
2. సాయినాథుని దయవల్ల సుఖప్రసవం
ఊహకందని బాబా అద్భుతలీల
సాయిబంధువులందరికీ నమస్కారం. ఈ బ్లాగును నడుపుతున్న సాయిభక్తులకు నా అభినందనలు. బాబా కృపతో ఈ బ్లాగు చాలా బాగా పరుగులు పెడుతూ ఉంది. నా పేరు మాధవి. మాది భువనేశ్వర్. నేను ఇదివరకు చాలా అనుభవాలు మీతో పంచుకున్నాను. ఇప్పుడు మరో అద్భుతమైన బాబా లీలను పంచుకుంటున్నాను. మా బావగారు(మావారి అన్నయ్య) బాబా భక్తుడు. ఆయన 2021వ సంవత్సరం మధ్యలో ఏదో విషయంగా ఎక్స్-రే తీయించుకుంటే, "మీ కాలికండరం వద్ద ట్యూమర్ ఉంది. భువనేశ్వర్‌లో చూపించుకోండి" అని చెప్పారు. దాంతో మా బావగారు, అతని భార్య భువనేశ్వర్‌లోని 'హేమలత క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్'కి వచ్చారు. డాక్టరు ఎమ్.ఆర్.ఐ స్కాన్ చేసి, అది ట్యూమరేనని నిర్ధారించి, "వెంటనే ఆపరేషన్ చేయాల"ని చెప్పారు. మా బావగారువాళ్ళు ఝార్సిగూడలో ఉంటారు. వాళ్ళకి బుర్లా గవర్నమెంట్ హాస్పిటల్ చాలా దగ్గర. అక్కడ ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పి మా బావగారువాళ్ళు వెళ్లిపోయారు. అక్కడ 20% ఆపరేషన్ అయ్యాక పొరపాటున కాలిలో నరాలు కట్ అయ్యాయి. దాంతో ఆపరేషన్ చేస్తున్న డాక్టరు, "మీరు ఆలస్యం చేయకుండా పది గంటలలోపు భువనేశ్వర్‌లోని అపోలో హాస్పిటల్‌కి వెళ్లిపోండి. నేను అక్కడి డాక్టరుతో మాట్లాడతాను" అని చెప్పాడు. వాళ్ళు పాపం వెంటనే అంబులెన్సులో భువనేశ్వర్ అపోలోకు వచ్చారు. అక్కడ డాక్టర్లు తెగిన నరాలను బాగుచేశారు. కానీ, ట్యూమర్ మాత్రం అలాగే ఉంది. మనం సాధారణ మనుషులం. డాక్టర్ ఏది చెప్తే అదే నిజం అనుకుంటాము. వాళ్ళు బాగవుతుందని ఝార్సిగూడ వెళ్లిపోయారు.
రోజురోజుకీ అతని కాలు లావెక్కిపోతూ బాత్‌రూమ్ వరకు నాలుగు అడుగులు వేయగలుగుతున్నారేగానీ అంతకంటే నడవగలిగే పరిస్థితి లేకపోయింది. దాంతో వాళ్ళు ఏమైపోతుందో, ఏమిటోనని భయపడి ఎవరో తెలిసిన బెంగాలీ డాక్టరు ఉన్నారని వెల్లూరులోని సి.ఎమ్.సి హాస్పిటల్‍కి వెళ్లారు. అక్కడ డాక్టర్లు చూసి, "మీకు ఆపరేషన్ ఈమధ్యనే అయినందున మళ్ళీ వెంటనే ఆపరేషన్ చేయలేము. మీకు ఒక ఇంజక్షన్ వేస్తాము. ఈ ఇంజక్షన్ నెలకు ఒకటి చొప్పున ఐదు ఇంజెక్షన్లు వేసుకుని ఐదు నెలల తరువాత మళ్ళీ రండి" అని చెప్పి 50,000 రూపాయలు ఖరీదైన ఒక ఇంజక్షన్ ప్రిస్క్రైబ్ చేశారు. వీళ్ళు "సరేన"ని అక్కడినుండి వచ్చేశారు. అయితే, ఐదు ఇంజెక్షన్లు వేసుకున్నా కాలివాపు కొంచెం కూడా తగ్గలేదు. 2022, జనవరి నెల చివరిలో మా బావగారువాళ్ళు మళ్ళీ వెల్లూరు వెళ్లారు. డాక్టర్లు చూసి, "ఇంజక్షన్ పనిచేయలేదు. ట్యూమర్ మోకాళ్ళను దాటి నడుముకు కొద్దిగా కిందవరకు విస్తరించింది. ట్యూమర్ నడుము దాటి విస్తరిస్తే ప్రమాదం. కాబట్టి కాలు పూర్తిగా తీసెయ్యాలి" అని చెప్పారు. అంతే, వీళ్లకు బుద్ధి పనిచేయలేదు. చాలా భయపడిపోయారు, బాబా గుర్తుకు వచ్చారు.
ఆరోజు 2022, ఫిబ్రవరి 12. నేను ఆఫీసులో ఉండగా మా బావగారువాళ్ళు నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పి, "మాధవీ, నువ్వే ఎలాగైనా నా కాలు బాగుచేయమని బాబాకి చెప్పుకుని, మాకోసం ఆయనను ప్రార్థించు. బాబా నీ మాట వింటారు" అని అన్నారు. నేను వాళ్ళతో, "నాకు అంత శక్తి ఎక్కడిది? అయినా నా ప్రయత్నం నేను చేస్తాను. మీరు కూడా బాబాను ప్రార్థించండి. బాబా అందరి మాటలు వింటారు. మీదీ వింటారు, నాదీ వింటారు, కష్టంలో ఉన్న ప్రతివారి మొర వింటారు. మనం సంపూర్ణ సమర్పణ చేసుకోవాలి, అంతే" అని అన్నాను. వాళ్ళు చాలా బాధపడ్డారు. నేను కూడా ఏడుస్తూ కూర్చున్నాను. ఆ సమయంలో నాతోపాటు డ్యూటీలో ఉన్న ఒక అబ్బాయి, "మేడమ్, మా బావ కటక్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‍లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్‍గా ఉన్నారు. మీరు మీ బావగారి రిపోర్టులు వాట్సాప్‍లో పంపండి. నేను వాటిని మా బావగారికి పంపి ఈరోజు రాత్రి మాట్లాడతాను" అని అన్నాడు. నేను సరేనని రిపోర్టులన్నీ ఆ అబ్బాయికి పంపాను. రాత్రి 12 గంటలకి అతని బావ ఫోన్ చేసి, "మేడమ్, ఇది చాలా సివియర్ కేసు. ట్యూమర్ బాగా విస్తరించింది. ఆ కాలు తీసేయాలని సి.ఎమ్.సి వాళ్ళు సరిగానే చెప్పారు. ఆయనకి ఆపరేషన్ అయితేనే మంచిది" అని అన్నారు.
మరుసటిరోజు నాకు మార్నింగ్ డ్యూటీ. ఆరోజు ఉదయం నేను నా అలవాటు ప్రకారం కాస్త ముందుగానే వెళ్లి ఆఫీసులో వాకింగ్ చేస్తూ మా బావగారి గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నాను. అంతలో ఎవరో పూరీ జగన్నాథస్వామి వీడియో ఒకటి నాకు షేర్ చేశారు. ఢిల్లీలో నాకు తెలిసిన సీమ అనే అమ్మాయికి పూరీ జగన్నాథస్వామి అంటే ఇష్టం. అందుకని ఆ వీడియోని ఆమెకి పంపించాను. తను ఆ వీడియో చూసి చాలా సంతోషించి, థాంక్స్ చెపుదామని నాకు ఫోన్ చేసింది. మాటల మధ్యలో నేను ఏదో బాధలో ఉన్నానని గ్రహించిన తను, "ఎందుకు ఆంటీ, ఏదో బాధలో ఉన్నట్లున్నారు. ఏమైంది?" అని అడిగింది. అప్పుడు నేను జరిగినదంతా చెప్పాను. అందుకు సీమ, "ఏమీ కాదు లెండి ఆంటీ. అంతా బాగుంటుంది. నేను ఇప్పుడే స్నానం చేసి పూజకి కూర్చున్నాను. బాబాను అడుగుతాను. ఏమన్నా చెప్తారేమో చూద్దాం" అని ఫోన్ పెట్టేసింది. నేను కూడా నా డ్యూటీలో నిమగ్నమయ్యాను. అక్కడ సీమ ధ్యానం చేస్తుంటే, ఎప్పుడూ లేనిది ఆమె శరీరంలో తీవ్రమైన వైబ్రేషన్స్ కలగడమేకాక, "ఆయనకి ఆపరేషన్ జరగదు. సరైన సమయానికి ఒక వ్యక్తి వచ్చి, ఆపరేషన్ జరగకుండా ఆపుతాడు. నువ్వు మాధవితో, 'బాధపడొద్దు. అంతా బాగవుతుంది' అని చెప్పు" అన్న మాటలు వినిపించాయి. ఆమె వెంటనే ఆ విషయాన్ని తెలియజేస్తూ నాకు మెసేజ్ పెట్టి, "ఆంటీ, అతనికి ఏమీ కాదు. సమయానికి ఒక వ్యక్తి వచ్చి అతన్ని కాపాడుతారని బాబా చెప్తున్నారు. అది ఎలా, ఏమిటి అన్నది నాకు తెలీదు. కానీ అతని కాలుకి మాత్రం ఏమీ అవదు" అని ఖచ్చితంగా చెప్పింది. నేను ఆ మెసేజులన్నీ మా బావగారికి ఫార్వర్డ్ చేసి, "ఒక అమ్మాయి ఈ మెసేజెస్ పెట్టింది. మీరు బాధపడకండి. బాబా ఏదో ఒకటి చేస్తారు. ఏదో అద్భుతం జరుగుతుంది" అని చెప్పాను. కానీ వాళ్ళు నమ్మలేదు. వాళ్లేకాదు, అసలు ఎవరూ నమ్మలేరు అలాంటివి. ఆయన, "ఇంకా ఆపరేషన్‍కి ఒక్కరోజే ఉంది. నా కాలు తీసేస్తారు. నేను అవిటివాడినైపోతున్నాను. నా బ్రతుకు ఇలా అయిపోయింది" అని ఒకటే బాధపడసాగారు.
2022, ఫిబ్రవరి 15న ఆపరేషన్ చేస్తారనగా ఫిబ్రవరి 14న వాళ్ళు ఒక టెస్టుకోసం వెళ్లి ఓ.పి.లో కూర్చుని ఉన్నారు, నెక్స్ట్ ఈయననే పిలుస్తారు. అంతలో నేపాల్ నుండి ఒక అంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) వచ్చి డాక్టర్ల దగ్గరకి వెళ్లి, "నేను నేపాల్ నుంచి వచ్చాను. నేను అక్కడ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‍లో పనిచేస్తున్నాను. నాకొచ్చిన ఒక ఆదేశానుసారం నేను మీ దగ్గరకి వచ్చాను. ప్రస్తుతం మీ ఇన్‌స్టిట్యూట్‍లో ఏ కేసులు నడుస్తున్నాయి?" అని అడిగాడు. డాక్టర్లు నెక్స్ట్ పేషెంట్ అయిన మా బావగారిని పిలిచి, "ప్రస్తుతం ఈయన కేసు నడుస్తుంది. ఇవి ఈయన రిపోర్టులు. రేపు ఈయన కాలు తీయడానికి ఆపరేషన్ చేయాలని నిర్ణయించాం" అని చెప్పారు. ఆ నేపాలీ డాక్టరు ఆ రిపోర్టులు చూసి, "ఎందుకు ఈయనకు కాలు తీసేస్తున్నారు? ఇది ట్యూమర్ మాత్రమే, క్యాన్సర్ కాదు కదా? మందులతో ఇతనికి మనం బాగుచేయవచ్చు" అని డాక్టర్లతో చెప్పాడు. తరువాత మా బావగారితో, "మీ కాలు తీయాల్సిన పనిలేదు, భయపడకు, నేను ఒక ఇంజక్షన్ ఇస్తాను. ఇలాంటివి మరో రెండు తీసుకుంటే మీ కాలికి ఉన్న ట్యూమర్ చిన్నగా అయిపోతుంది. అప్పుడు ట్యూమర్ ఆపరేషన్ చేస్తాం. మీరు ఇప్పుడు టికెట్ బుక్ చేసుకుని, హాయిగా ఇంటికి వెళ్ళండి" అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. మా బావగారిపై బాబా ఎంత కృప చూపారో చూశారా! అసలు కాలే పోతుందనుకుంటే సమయానికి ఆయన రావడమేమిటి? ఆపరేషన్ జరగకుండా ఆపడమేమిటి? ఎంత ఆశ్చర్యమో కదా!
నెలరోజుల తరువాత మా బావగారు మళ్ళీ వెళ్లి రెండో ఇంజక్షన్ వేయించుకున్నారు. మీరంతా మా బావగారికోసం బాబాను ప్రార్థించండి. మనం మామూలు మనుషులం. బాబాను వేడుకోగలం, అంతే. 'పూర్వజన్మ కృతం పాపం, వ్యాధి రూపేణ పీడితం' అని సాయిచరిత్రలో చదువుతాం. సుఖమైనా, దుఃఖమైనా పూర్వజన్మ ఆర్జిత పాపపుణ్యాల వల్ల మనకు ప్రాప్తమవుతాయి. ఎంతటివారికైనా అవి తప్పవు. కానీ బాబా పాదాలు గట్టిగా పట్టుకుంటే ఆయన కృపతో ఎంతటి కష్టమైనా తొలగిపోతుంది.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!!!
సాయినాథుని దయవల్ల సుఖప్రసవం
సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మేము యు.ఎస్.ఏలో ఉంటున్నాము. నాకు బాబా అంటే ఎంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ఆయన నాకు చాలా అనుభవాలు ప్రసాదించారు. వాటినుండి ఇటీవల జరిగిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా తమ్ముడి భార్య కడుపుతో ఉన్నప్పుడు, "బిడ్డ కాళ్ళు కిందకి, తల పైకి ఉన్నాయి. ప్రేగు కూడా మెడకి చుట్టుకుని ఉంది" అని డాక్టరు చెప్పారు. ఆ కారణంగా కాన్పు కొంచెం కష్టం అవుతుందని మేము భయపడ్డాము. నేను, "సాయితండ్రీ! మీ చల్లని చూపు వలన ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్ డెలివరీ అయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి మ్రొక్కుకున్నాను. ఆయన మీద భారం వేసి కాన్పు సమయంలో ఊదీ పెట్టడం వలన ఎలాంటి ఇబ్బందీ లేకుండా కాన్పు చాలా సులభంగా జరిగింది. "ధన్యవాదాలు బాబా. మీకు మాటిచ్చినట్లు నా మ్రొక్కు చెల్లించుకున్నాను. మీ ఆశీస్సులు, దయ మాపై ఇలాగే ఉండనివ్వండి బాబా. మీరే మాకు దిక్కు. మా కుటుంబాన్ని చల్లగా చూడు తండ్రీ".
Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������
ReplyDeleteOm sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha