సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1108వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. శ్రీసాయి అనుగ్రహాశీస్సులు
2. బాబా చేసిన సహాయం
3. బాబా ఊదీ తీర్థంతో పూర్తిగా నయమైన వెర్టిగో

శ్రీసాయి అనుగ్రహాశీస్సులు


ముందుగా ఈ బ్లాగు నిర్వాహకులకు మరియు సాటి సాయి బంధువులకు నా నమస్కారాలు. నా పేరు సాహిత్య. ఒకరోజు మా అమ్మకి బాగా తలనొప్పి, నీరసంతో ఒంట్లో బాగాలేదు. అయినా అమ్మ అలాగే పని చేసుకుంటుంది. అయితే మా అమ్మకి కొంచెం బాగా లేకపోయినా ప్రతికూల శక్తి ఆవహించినట్టు మా ఇల్లంతా ఏదో పోయినట్టు బోసిగా ఉంటుంది. ఎంతైనా అమ్మ అమ్మే. నేను, "బాబా! అమ్మకి ఆరోగ్యం బాగైతే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకు చెప్పుకుని, బాబా ఊదీ అమ్మకి పెట్టాను. కొద్దిసేపటికే అమ్మ ఆరోగ్యం మెరుగుపడి నవ్వుతూ పని చేసుకుంటూ కబుర్లు చెప్పడం మొదలుపెట్టింది. నేను ఎంతో సంతోషంగా బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఇంకో రోజు అమ్మ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతుంటే, అమ్మకి బాబా ఊదీ పెట్టి, 'అమ్మ బాధ తగ్గితే, ఈ అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. కొద్దిసేపట్లోనే అమ్మకి నయమైంది. "థాంక్యూ బాబా".


ఒకరోజు మా నాలుగు నెలల పాప విరోచనం అవ్వక కడుపునొప్పితో ఏడవసాగింది. పాప అలా ఏడుస్తుంటే నేను చూడలేకపోయాను. ప్రతిసారీ మందులివ్వడం మంచిది కాదని విన్న నేను బాబా ఊదీనే ఔషధంగా భావించి ఊదీ పాపకు పెట్టి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనే నామాన్ని స్మరిస్తూ "పాపకి నొప్పి తగ్గితే, 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. బాబా దయవల్ల కొంతసేపటికి పాపకి విరోచనమై కడుపునొప్పి తగ్గి హాయిగా నిద్రపోయింది. "థాంక్యూ బాబా".


2022, ఫిబ్రవరి 22న మా పాపకి 4వ నెలలో సాధారణంగా పిల్లలకి వేసే వ్యాక్సిన్ వేయించాల్సి ఉండగా పదిరోజుల ముందు నుండే నాకు, 'అబ్బా మళ్ళీ హాస్పిటలా? అక్కడ చాలా రద్దీ ఉంటుంది. చాలాసేపు వేచి ఉండాలి. పాపతో వేచి ఉండటమంటే కష్టం' అని ఏదో తెలియని ఆందోళన మొదలైంది. ఇదిలా ఉంటే, నేను, మా పాప 13 రోజుల ముందే హైదరాబాద్ నుండి మా పుట్టింటికి వచ్చాము. హైదరాబాదులోని హాస్పిటల్ చాలా పెద్దగా ఉండి అన్ని సదుపాయాలు ఉండేవి. అసలు అది హాస్పిటల్ అన్న భావనే వచ్చేది కాదు. పాపకి పెయిన్‌లెస్ వ్యాక్సిన్ వేయించి హ్యాపీగా ఇంటికి తిరిగి వచ్చేవాళ్ళం. అక్కడి హాస్పిటల్ చూసాక మా ఊర్లో హాస్పిటల్‌కి ఎందుకో వెళ్ళ బుద్ధి అయ్యేది కాదు నాకు. అలాగని హైదరాబాద్ వెళ్లి, తిరిగి ఊరు వచ్చే ఓపిక కూడా లేదు. ఎందుకంటే, నాకు ఆపరేషన్ జరిగి ఎక్కువ రోజులు కాలేదు. అంతేకాదు, వెంటవెంటనే వాతావరణ మార్పు పాపకి మంచిది కాదు. కాబట్టి, తప్పకుండా ఇక్కడే ఊరిలో పాపకి వ్యాక్సిన్ వేయించాలి. అందువలన నేను రోజూ బాబాను, "బాబా! పాపకోసం ఇక్కడ పెయిన్‌లెస్ వ్యాక్సిన్ దొరకాలి. ఎక్కువ సమయం వేచి ఉంచక త్వరగా పాపకి వ్యాక్సిన్ వేసి, 12 గంటలలోపు ఇంటికి పంపాలి బాబా. అంతా సక్రమంగా జరిగితే, నా అనుభవాన్ని 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అద్భుతం! మేము 10 గంటలకు హాస్పిటల్‌కి వెళితే అక్కడ రద్దీ తక్కువగా ఉంది, నేను కోరుకున్న పెయిన్‌లెస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది, ఇంకా డాక్టరు త్వరగా మమ్మల్ని పిలిచి వ్యాక్సిన్ వేశారు, పాప అంతగా ఏడవలేదు కూడా, సరిగ్గా గం.11:30ని.లకు హాస్పిటల్లో మా పని పూర్తయి ఇంటికి బయలుదేరాము. ఇదంతా బాబా దయ. "థాంక్యూ సో మచ్ బాబా. మిమ్మల్ని ఎన్నడూ మర్చిపోకుండా ఉండేలా మాకు బుద్ధిని ప్రసాదించండి. మా కుటుంబంలోని నేనుకానీ, నా భర్తకానీ, నా బిడ్డకానీ, మిగతా సభ్యులుకానీ ఏవైనా తప్పులు చేసి ఉంటే మనస్ఫూర్తిగా మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉండేలా దీవించండి. దయచేసి నా బిడ్డని ఆపరేషన్ అవసరం లేకుండా మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు కలిగి ఉండేలా ఆశీర్వదించండి. అన్నిటికీ ధన్యవాదాలు బాబా. ఆలస్యంగా నా అనుభవం పంచుకున్నట్లైతే క్షమించండి బాబా".


సచ్చిదానంద సమర్థ సద్గురు శ్రీసాయినాథ్ మహరాజ్ కి జై!!!


బాబా చేసిన సహాయం


సాయి బంధువులకు నమస్కారం. నా పేరు గీత. మాది చిత్తూరు జిల్లా. ప్రప్రథమమున ఇచ్చిన మాటను ఆలస్యంగా నెరవేర్చుకుంటున్నందుకు సాయి మహరాజుకు నా క్షమాపణలు. 2020వ సంవత్సరంలో మా అమ్మాయి బి.టెక్ మూడవ సంవత్సరం చదువుతుండేది. తనకి ఎంసెట్ ద్వారా సీట్ వచ్చినప్పటికీ ప్రభుత్వపరంగా వచ్చే ఉపకార వేతనం ఆ సంవత్సరం రాలేదు. అడిగితే, 'మా రేషన్ కార్డులో ఉన్న ఏదో లోపం కారణంగా రాలేద'ని చెప్పారు. పాప చాలా బాధపడింది. చాలా ప్రయాసపడిన తరవాత బాబా దయవల్ల రేషన్ కార్డు సమస్య తీరడంతో మేము ఉపకార వేతనానికి దరఖాస్తు పెట్టాము. బాబా దయవల్ల అది కూడా ఓకే అయ్యింది. మా ఏరియా సచివాలయంకు లిస్ట్ వచ్చింది. వాళ్ళు కాల్ చేసి అమ్మాయిని వచ్చి వేలిముద్రలు వేసి వెళ్ళమని చెప్పారు. అయితే అమ్మాయి వేలిముద్ర ఎంతకీ సరిపోలేదు. సిబ్బంది చాలా ఓపికతో పలుమార్లు ప్రయత్నంచినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అక్కడికి దగ్గరలో బాబా గుడి ఉంది. మా అమ్మాయి, "బాబా! నా ఈ సమస్య పరిష్కారమైతే నేను మీ గుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేస్తాను" అని బాబాను వేడుకుంది. నేను కూడా బాబాను వేడుకుని, "మీ దయతో అమ్మాయి వేలిముద్రలు మ్యాచ్ అయితే, ఈ అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకున్నాను. అయితే సిబ్బంది సాయంత్రం కార్యాలయం మూతపడే సమయం వరకు ప్రయత్నం చేసి అలసిపోయారు కానీ, పని జరగలేదు. దాంతో వాళ్ళు "ఇంక నిన్ను ఆ దేవుడే కాపాడాలి" అని బాధపడ్డారు. మేము బాబాకి మొక్కుకున్న మొక్కు గురించి చెప్పి, ఆయన దయవలన పని జరుగుతుందని కూడా చెప్పి ఇంటికి వచ్చేసాము. మరుసటిరోజు ఉదయం గం.6.30 నిమిషాలకు సచివాలయ సిబ్బంది మాకు ఫోన్ చేసి చాలా ఉత్సాహంగా, "పాప వేలిముద్రలు ఓకే అయ్యాయి. అమ్మాయి పేరు జాబితాలో వచ్చింది" అని చెప్పారు. ఇంకా "ఇది బాబా కృపవలనే జరిగింది. మేము కూడా పాప చేత 108 ప్రదక్షిణాలు చేయిస్తామని అనుకున్నాం. మా తరుపున ఆ ప్రదక్షణలు కూడా చేయండి" అని చెప్పారు. ఎందుకంటే, జరిగింది ఒక అద్భుతమని వాళ్ళకి తోచింది. మొత్తానికి పని అయ్యేటట్లు బాబా మాకు సహాయపడ్డారు. మాకు చాలా ఆనందం కలిగింది. ఇంకా ఆ పని పూర్తయిన వెంటనే పాప బాబా గుడికి వెళ్ళి, మండుటెండలో 108 ప్రదక్షణలు చేసి మొక్కు తీర్చుకుంది. సచివాలయం సిబ్బంది తమ తరపున చేయమని చెప్పిన 108 ప్రదక్షణలు మరుసటి వారం చేసింది. బాబా దయవల్ల పాపకు ఇప్పటికి మూడు విడతలు ఉపకార వేతనం అందింది. ఇలా బాబా ఎప్పుడూ మా కుటుంబానికి అండగా నిలిచి అనుగ్రహిస్తూ ఉన్నారు. "తండ్రీ! మీకు ఇచ్చిన మాట ఇంత ఆలస్యంగా నెరవేర్చుకున్నందుకు నన్ను మన్నించండి. మా కుటుంబానికి మీ అండ ఎల్లప్పుడూ ఉన్నందుకు మీకు సదా ఋణపడి ఉంటాను బాబా".


బాబా ఊదీ తీర్థంతో పూర్తిగా నయమైన వెర్టిగో


నా పేరు మల్లేశ్వరి. ముందుగా సాయి బంధువులకు నమస్కారాలు. ముఖ్యంగా ఈ బ్లాగు నిర్వహిస్తున్న వారికి, ఇలాంటి బ్లాగు ఉందని పరిచయం చేసిన మా బావగారి కూతురు దేవికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఇదివరకు వెర్టిగోతో చాలా బాధపడ్డాను. ఆ కారణంగా మా మరిది కుమార్ పెళ్లిలో ఎలాంటి అనారోగ్య ఇబ్బంది కలగకూడదని నేను బాబాను వేడుకున్నాను. ఆ తండ్రి దయవల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఇకపోతే నేను నాకున్న వ్యాధి నయం కావడానికి బాబాను ప్రార్థించి శిరిడీ నుంచి వచ్చిన ఊదీ నుదుటన పెట్టుకుని, మరికొంత ఊదీ నీళ్లలో కలుపుకుని ఆ తీర్థాన్ని త్రాగి, బాబాను స్మరిస్తూ కాలం గడిపాను. డాక్టరు ఇచ్చిన మందులు కూడా ఆపేసి తీర్థం మాత్రమే తీసుకుంటుండగా బాబా దయవల్ల ఇప్పుడు వ్యాధి పూర్తిగా తగ్గి నాకెంతో ఉపశమనంగా ఉంది. నా ఈ అనుభవం ద్వారా నేను సాయినాథుడు స్మృతిమాత్ర ప్రసన్నుడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. "సమర్థ సద్గురు సాయినాథా! మీ పాదారవిందములకు అనంతకోటి వందనాలు తండ్రి. నేను మిమ్మల్ని వేడుకున్నట్లు నా ఆరోగ్యం బాగుపడేలా చేసి నాకు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించావు దయాత్మ! ఇలాగే నీ కృపాకటాక్షాలు ఎల్లవేళలా మాకు లభించాలి తండ్రి. నా కోరిక నెరవేరితే నా అనుభవాలు బ్లాగులో పంచుకుంటానని మీకు మాటిచ్చి ఆలస్యం చేసినందుకు మన్నించండి ప్రభూ".



3 comments:

  1. Om Sri Samartha Sadguru Sachidananda Sainath Maharaj Ki Jai ��������

    ReplyDelete
  2. Jaisairam bless me for my health and wealth of happiness and happiness in the world of yours Jaisairam bless me for my MBA exam and help me to get above fair grade Jaisairam

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo