సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

అంతా బాబా దయ


నిన్నటి నా అనుభవాన్ని చదివి ఆనందించి ఉంటారు. ఇప్పుడు మరో అనుభవాన్ని మీకు తెలియజేస్తాను. 

నేను 2018, మే 25న షిర్డీ వెళ్ళాను. అప్పుడు శిరిడీలో నాకు బాబా ఒక చక్కటి అనుభవాన్ని ఇచ్చారు. ఆ అనుభవాన్ని నేను ఇప్పుడు మీతో పంచుకుంటాను.

నేను 7 సంవత్సరాలుగా ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. మా ఇద్దరి కులాలు వేరు. ఇదే మాకు అసలైన సమస్య. పెద్దవాళ్ళ అంగీకారంతో నా వివాహం జరగాలని నేను ఆశించాను. కానీ, అలా జరగలేదు. నేను చాలా నిరాశ చెందాను. “బాబా! నిర్మలమైన మనస్సుతో ఉన్న నాకు ఎందుకు ఈ సమస్య? నేను అనుకున్నట్లుగా ఎందుకు జరగట్లేదు?” అని బాబాని వేడుకున్నాను. 4 సంవత్సరాల క్రితం నాకు కలలో బాబా కన్పించి, "నీ కోరిక నెరవేరుతుంద"ని చెప్పారు. కాబట్టి నేను బాబా మీద పూర్తి నమ్మకాన్ని పెట్టుకున్నాను. కాలం గడుస్తూ ఉంది, కానీ నేను ఆశించినట్లుగా ఏమీ జరగలేదు. చివరికి నేను ఏడుస్తూ, "బాబా! నా పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? అసలు నా తల్లిదండ్రులు అంగీకరిస్తారా, లేదా? అలా కానప్పుడు నాకు ఎందుకు ఆశ కలిగించారు?" అని అడిగాను. ఆ తరువాత మొత్తానికి బాబా దయవలన నా తల్లిదండ్రులు 'సరే' అన్నారు. కాని, కులాలు వేరైనందున సాంప్రదాయ పద్ధతిలో మా పెళ్లి చేయటానికి సిద్ధంగా లేరు. నేను ఎప్పుడూ, "నా వివాహం శిరిడీలో జరిగేలా వీలు కల్పించమ"ని బాబాను అడుగుతుండేదాన్ని. కానీ మేము తెలుగు వాళ్ళం, మరాఠి ఆచారాలు తెలియవు కదా అనే సంశయాలతో, "బాబా! కనీసం మా పెళ్ళికి ముందు శిరిడీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించ"మని ప్రార్ధించాను. నేను అడిగినట్లుగానే బాబా మమ్మల్ని శిరిడీ పిలిచారు. మా శిరిడీ ప్రయాణం నిశ్చయమైంది. నేను ఈ శిరిడీ ప్రయాణంలో నిశ్చితార్ధం చేసుకోవాలని అనుకోని, "బాబా! నా ఈ కోరిక మీకు సమ్మతమైతే, పవిత్ర శిరిడీ క్షేత్రంలో, మీ సమక్షంలో నిశ్చితార్థం జరిగేలా అనుగ్రహించండి" అని చెప్పుకున్నాను. కాబట్టి మేము శిరిడీ వెళ్ళి రెండు ఉంగరాలు కొనుగోలు చేసుకొని, సమాధి మందిరంలో బాబా దర్శనానికి వెళ్లి, పంతులుగారి చేతికి ఆ ఉంగరాలు ఇచ్చాము. పంతులుగారు వాటిని బాబా దివ్య చరణాల వద్ద ఉంచి, తరువాత బాబా సమాధికి తాకించి, పువ్వులతోపాటు నా చేతికి ఇచ్చారు. అలా బాబా ఆశీర్వాదాలతో ఉంగరాలు నా చేతికి రావడంతో నేను చెప్పలేని ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి అయిపోయాను. ఆ ఆనందంలోనే బాబా సమక్షంలో మేము ఇద్దరమూ ఉంగరాలు మార్చుకున్నాము. అలా బాబా దివ్య ఆశీస్సులతో మా నిశ్చితార్థం జరిగిపోయింది. తరువాత నేను దీపాలు వెలిగించి, హారతికి హాజరయ్యి, చక్కటి బాబా దర్శన భాగ్యాన్ని పొంది తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. మేము బస్సు ఎక్కాము. బస్సు స్టార్ట్ అయ్యింది కూడా. కాసేపటికి  అతను తన ఉంగరం ఎక్కడో పోగొట్టుకున్నానని చెప్పాడు. బాబా అంగీకారంతో జరిగిన మా నిశ్చితార్ధపు ఉంగరాన్ని అతను పోగొట్టుకోవడంతో నా మనస్సులో చాలా ప్రతికూల ఆలోచనలు మొదలయ్యాయి. నేను ఆ బాధను తట్టుకోలేక ఒకటే ఏడుస్తూ ఉన్నాను. అంతలో అకస్మాత్తుగా హోటల్ నుండి ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి, మేము ఉంగరాన్ని అక్కడ మర్చిపోయామని, వచ్చి తీసుకోమని మాకు చెప్పాడు. నేను, "ఇప్పటికే మేము శిరిడీ నుండి దాదాపు 5 కిలోమీటర్లు దూరం వచ్చేశామ"ని అతనితో చెప్పాను. అతను, "ఆందోళన పడకండి దీదీ(అక్క), నేను ఒక అబ్బాయితో ఉంగరాన్ని ఇచ్చి‌ పంపుతాను, అతని నెంబర్ కూడా ఇస్తాను. మీరు అతనికి ఫోన్ చేసి మీరు సరిగ్గా ఎక్కడ ఉన్నదీ చెప్పండి. దీదీ, ఇది బాబా ఉంగరం. ఖచ్చి‌తంగా మీకు అందేలా చేస్తాను. మీరు కాస్త బస్సు డ్రైవర్ కి చెప్పి బస్సు ఆపేలా చేయండి" అని చెప్పాడు. నేను అతనికి ధన్యవాదాలు చెప్పి, కొంత సమయం బస్సు ఆపమని డ్రైవరుని రిక్వెస్ట్ చేశాను. అందుకతను సమ్మతించి బస్సు ఆపాడు. కొద్దిసేపట్లో హోటల్ బాయ్ వచ్చి ఉంగరం ఇచ్చాడు. అంతా బాబా దయ. ఆయన ఇలా అనుగ్రహించకుంటే నేను నిజంగా పిచ్చిదాన్ని అయిపోయేదాన్ని. ధన్యవాదాలు బాబా!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo