సౌత్ ఆఫ్రికా నుండి ఒక సాయిభక్తురాలు
తన కోరికలన్నింటిని
సాయి ఎలా తీర్చారో ఇక్కడ మనతో పంచుకుంటున్నారు.
అందరికీ నమస్కారం. నేను సాయిభక్తుల అనుభవాలను బ్లాగ్ లో క్రమం తప్పకుండా చదువుతుంటాను. వాళ్ళు చేస్తున్న కృషి వల్ల అందరికీ సాయిపై ఉన్న నమ్మకం ఇంకా రెట్టింపవుతుంది.
ఇప్పుడు నేను నా ఈ అనుభవాలను, దాదాపు 80 ఏళ్లపాటు బాబా నివసించిన పుణ్యభూమి, సాయిభక్తులకు భూలోక స్వర్గధామమైన షిరిడీ నుండి వ్రాస్తున్నాను. నా జీవితం నిండా బాబా చేసిన అద్భుతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రమే ఇక్కడ వ్రాస్తున్నాను.
నా వైవాహిక జీవితంలో నేను చాలా సమస్యలతో పోరాడుతున్నాను. నేను 2015 సంవత్సరంలో ఇండియాకి వచ్చాను. నేను అప్పటికి షిరిడీ వచ్చి బహుశా ఇంకా రెండు నెలలు కూడా కాలేదనుకుంటాను. నవంబర్ నెలలో నేను షిరిడీలో 9 రోజులపాటు బస చేశాను. నిజానికి నేను 15 రోజులపాటు ఉండాలని ప్లాన్ చేసుకున్నాను, కానీ బాబా ఆజ్ఞ పాటించాలి కదా! అందువల్ల 9రోజులు ఉండి వచ్చేసాను. ఆ టైంలో ఒకరోజు నేను ధూప్ ఆరతికి వెళ్ళాను. నేను క్యూ లైన్ లో ఉండగా ఒక పూజారి అందరికీ పువ్వులు ఇస్తున్నారు. వాటిని ఆరతి పూర్తయిన తరువాత మరలా వెనకకి తీసుకుంటారు. కానీ ఆ సమయంలో ఒక ఎరుపురంగు గులాబీపువ్వు జారి కిందపడింది. నేను అత్యాశ కలిగిన భక్తురాల్ని కావడంతో, ఆ పువ్వు నాకే రావాలని మనసులో కోరుకున్నాను. ఆ పూజారి తన చేతులతో తనంతట తానే నాకు ఆ పువ్వు ఇవ్వాలని బాబాని అడిగాను. అలా అయితే అది బాబాయే స్వయంగా నాకు ఇచ్చినట్లు అనుకున్నాను. ఆరతి పూర్తయిన తరువాత సమాధి మందిరం నుండి బయటకి వస్తూ కూడా బాబా నాకు ఆ పువ్వు ఇప్పిస్తారనే ఆశతో ఉన్నాను. కానీ ఇవ్వలేదు. కాసేపు చూసి ఇక నా పారాయణకి సమయం అవ్వడంతో నేరుగా రూమ్ కి బయల్దేరాను. నేను రూమ్ దగ్గరకు చేరేసరికి అక్కడ మెడలో రుద్రాక్షమాల ధరించి ఉన్న ఒక ముసలాయన నేలపై కూర్చొని కనిపించారు. ఆయన నన్ను చూస్తూ, 'ఓం సాయిరాం' అన్నారు. నేను కూడా 'ఓం సాయిరాం' అని బదులిచ్చాను. తరువాత నేను నా గదిలోకి వెళ్లి బాబా ఫోటోకి నమస్కరించి, పారాయణ ప్రారంభించాను.
కానీ నా మనసులో మాత్రం బాబా నాకు ఆ పువ్వు ఇస్తారనే ఆలోచన కొనసాగుతూ ఉంది. పారాయణం పూర్తైన వెంటనే, క్రింద కనపడ్డ ఆ ముసలాయనకి దక్షిణ ఇవ్వాలని అనిపించింది. నేను క్రిందకి వెళ్లి అతనికి దక్షిణ ఇవ్వగానే ఏం జరిగిందో ఊహించండి. ఆ ముసలాయన నాకు ఒక పువ్వులగుత్తి ఇచ్చి, వాటిని బాబాకి సమర్పించమని చెప్పారు. నాకు చాలా సంతోషం వేసింది. ఆయన నాకు ఊదీ ప్రసాదం కూడా ఇచ్చారు. అవి పట్టుకొని నా గదికి వెళ్లి చూస్తే, ఆ పువ్వులలో ఒక ఎరుపురంగు గులాబీపువ్వు కూడా ఉన్నది. అది చూడగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. బాబాకి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను.
నాకు ఎప్పుడు ఈ విషయం గుర్తుకు వచ్చినా ఎందుకో తెలియకుండా ఆ బాబా ముఖం నా మదిలోకి వస్తుంది. ఆరోజు నా దగ్గరకి వచ్చిన ఆ ముసలాయన నా సాయే. నా సిల్లీ కోరికని తీర్చడానికి ఆయనే స్వయంగా వచ్చారు. ఐ లవ్ యు బాబా! మీరే నా సర్వస్వం, మీరే నా జీవితం. ఎన్నో లీలలు నాకు సాయి ఇచ్చినా, ఈ లీల ద్వారా నేను సాయిపై అమితంగా నా ప్రేమని పెంచుకున్నాను.
మరునాడు ఉదయం కాకడ ఆరతికి వెళ్ళాను. ఆరతి జరుగుతూ ఉండగా గుండె లోతుల నుండి నేను ఏడుస్తూ సాయిని చూస్తూనే ఉన్నాను. నేను పిచ్చిదానిలా అడిగి, నా కోరికని తీర్చడానికి సాక్షాత్తూ ఆ సాయినాథుడినే కదిలి వచ్చేలా చేసానని నన్ను నేనే నిందించుకుంటున్నాను. అలా చిన్నపిల్లలా ఆ హాల్ లో ఏడుస్తూనే ఉన్నాను. తరువాత బాబాతో, "మీరు ఎలా అయినా ఈరోజు వచ్చి నా సమస్యకి పరిష్కారం చెప్పాలి, అది నా కోరిక. ఎందుకంటే మీరు పరోక్షంగా ఇచ్చే సంకేతాలు నాకు అర్థం కావడంలేదు. నేను ఎంత సమయమైనా మీకోసం ఇక్కడే మందిరంలో వేచి ఉంటాను" అని చెప్పాను. దర్శనం పూర్తయిన తరువాత నేను నందాదీపం దగ్గర ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళాను. అక్కడ ప్రదక్షిణలు పూర్తిచేసి, ప్రతి ఒక్కరిలో సాయిని వెతుకుతూ ఉన్నాను. ఇక నాలో ఓపిక నశిస్తూ ఉండటంతో, ”సాయీ, నువ్వు ఏ రూపంలో అయినా, ఏ ఆకారంలో అయినా వచ్చి నాకు ఏదైనా చిన్న సంకేతం ఇవ్వు” అని దీనంగా వేడుకున్నాను. "నీ బిడ్డనైన నన్ను భారమైన మనసుతో నీ దగ్గరనుండి పంపకు" అని అర్ధించాను. పారాయణ మందిరం బయట కార్నర్ లో కూర్చొని నా సాయి ప్రపంచంలో సాయితో మాట్లాడుకుంటూ
ఉన్నాను. కానీ నా కన్నులు మాత్రం సాయినే వెతుకుతూ ఉన్నాయి. నేను చాలా సమయం నుండి అక్కడే ఉన్నందున నన్ను కొందరు భక్తులు, ఇంకా సెక్యూరిటీ సిబ్బంది గమనిస్తున్నారు.
కొంతసేపటికి నన్ను నడివయసు ఉన్న ఒక అంకుల్ కలిసారు. నా సమస్య ఏమిటో ఒక్కసారి కూడా వివరాలు ఏమీ అడగకుండా, నవ్వుతూ, “నీ భర్త ఇక్కడికి ఎప్పుడు వస్తారో నాకు ముందు చెప్పు, నేను అతనితో మాట్లాడాలి” అని అన్నారు. నేను మాట మార్చి నేను ఉండే దేశం మరియు అక్కడి ప్రదేశాల గురించి చెప్పాను. ఆయన, "నేను మందిరానికి 12 గంటలకి మరియు సాయంత్రం 3 గంటలకి మాత్రమే వస్తాన"ని చెప్పారు. నేను నా బాబా ఆలోచనలలో ఉండగా ఈ అంకుల్ కుడివైపు నుండి వచ్చి, 'ఏమాలోచిస్తున్నావు?'
అని అడిగారు. నాకు ఎందుకో కొంచెం భయంగా అనిపించినా తర్వాత నవ్వుకున్నాను. ఆయన నాకు చెప్పిన మాటలు ఇక్కడ రాయలేను, కానీ ఆ అనుభూతి మాత్రం మాటలలో చెప్పనలవి కానిది. నా బాబాని ప్రేమతో ఏ రూపంలో అయినా వచ్చి నాతో డైరెక్ట్ గా మాట్లాడమని వేడుకున్నందుకు అలా వచ్చి, "అంతా బాగుంటుంది" అని చెప్పారు.
దయగల నా తండ్రీ! ఓ సాయిదేవా! నీ ప్రేమామృతధారల నుండి నేను ఇంకా తేరుకోలేక పోతున్నాను. ఆశ్చర్యంగా ఉంది, నేను ఏ మాటలైతే వినాలని అనుకున్నానో అవే అతని ద్వారా చెప్పించారు బాబా. ఇంకా నా ఊహకి అందని విషయాలు కూడా నాతో మాట్లాడారు. నేను ఎప్పుడూ ఆ అంకుల్ నెమ్మదిగా ఉండడం చూసాను, కానీ ఈ రోజు ఉదయం మాత్రం చాలా హుషారుగా కనిపించారు.
ప్రియమైన సాయిభక్తులారా!
బాబాపై పూర్తి విశ్వాసం ఉంచి ఆయనకి మీ భారాన్ని అప్పగించండి. నా పరిస్థితి అసలు మీకు ఎలా వివరించాలో కూడా నాకు తెలియదు. ఏదో చెప్పాలనుకున్నాను కానీ, నా తండ్రి సాయి అంతా మార్చేసారు. నాకు సాయి అంటే పిచ్చి ప్రేమ. మనల్ని భగవంతుడు కూడా అంతే ప్రేమిస్తున్నాడంటే,
ఆ భావాన్ని చెప్పడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. ఆయన మన బాధలను, భయాలను చూస్తూ ఊరుకోరు. సాయిని నమ్ముకొని ఉంటే ఆయన సదా మనతోనే ఉంటారు. మీ గుండె తలుపులు ఆయన కోసం తీసి ఉంచండి. సమయం వచ్చినపుడు మీ కోరికల్ని అడగడం మానేసి ఆయనని ప్రేమించడం మొదలు పెడతారు. మన జీవితాల్లో మనం ఎప్పుడూ సమస్యల్ని ఎదుర్కొంటూనే ఉంటాము, కానీ సచ్చరిత్రలో సాయి చెప్పినట్టు కొంతమంది భక్తులు మాత్రమే సమస్యలకు తట్టుకోగలరు. సాయిభక్తులందరికీ నా మనవి. అందరూ “Shiridi Sai Baba is still alive(సాయి ఇప్పటికీ సజీవులే)” by Jaya Wahi పుస్తకాన్ని తప్పక చదవండి. కొన్నివారాల క్రిందట ఎవరో దాని గురించి షేర్ చేసారు. అప్పటినుండి నేను కూడా ఆ బుక్ తీసుకోవాలని చాలా కుతూహలపడ్డాను.
చివరికి బాబా దయవలన బుక్ తీసుకొని కొన్ని అధ్యాయాలు చదివాను. అది నా హృదయాంతరాళంలో
చెరగని ముద్ర వేసింది.
నేను బాబాకి సదా ఋణపడి ఉంటాను. త్వరలో ఈ ప్రపంచమంతా సాయిప్రపంచం కావాలని మనమంతా ప్రార్ధిద్దాం. ఇక్కడ మోసాలు, గొడవలు, బాధపెట్టడం ఏవీ ఉండవు. కేవలం నమ్మకం మరియు ఓపిక కలిగి ఉండండి, బాబా తప్పక మన ప్రార్ధనలు విని మనల్ని అనుగ్రహిస్తారు. నేను ఇప్పటికే చాలా పెద్ద పోస్ట్ రాసాను. కాని ఇంకా చాలా అనుభవాలు అలానే ఉన్నాయి. అవి ఇంకోసారి మీతో పంచుకుంటాను. ఈ బిజీ ప్రపంచంలో కూడా సాయి నన్ను ఇక్కడికి పిలిచి అమితమైన ప్రేమని చూపించారు. మీలో ఉన్న ప్రేమనంతా సాయిపై చూపండి, పిచ్చిగా ప్రేమించండి. ఆయన మీ ప్రతి కదలికలో మీ వెన్నంటి ఉండి మిమ్మల్ని ముందుకి నడిపిస్తారు. మీ ప్రతి శ్వాసలో ఉంటారు. సాయి అందరిపై తన కరుణ చూపిస్తారు. మీ నమ్మకాన్ని విడువకండి.
🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me