సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

'పశ్చిమ షిర్డీ'గా పేరుగాంచిన సాయి మందిర నిర్మాణ విశేషాలు - 1వ భాగం.


ఈమధ్యకాలంలో సాయిబాబా "మహాసమాధి శతాబ్ది" ఉత్సవాలు ఈ విశ్వమంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్న చిన్న పల్లెల నుంచి, పెద్ద పెద్ద పట్టణాల వరకు బాబా మందిరాలలో వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారం ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నారు. ఈ సాయి భక్తి అనే మహావృక్షం ఈ విశ్వం నలుమూలలా వ్యాప్తి చెందుతూనే ఉంటుంది.

పరమ పావన గ్రంథం 'శ్రీసాయి సచ్చరిత్ర' వ్రాసిన హేమాద్పంత్, "ఒకరితో మందిర నిర్మాణాలు, ఇంకొకరితో సంకీర్తనలు, మరొకరితో తీర్థయాత్రలు, నాతోనేమో ఈ సద్గ్రంథ రచన చేయించారు సాయినాథులు" అని వ్రాసుకున్నారు. ఈరోజు కూడా బాబా తమ భక్తులతో ఆధ్యాత్మిక, జనకళ్యాణం కోసం ఎన్నోరకాలుగా ప్రేరణ కలిగిస్తున్నారు. దానికి ఉదాహరణగా తమ భక్తునితో ముంబాయికి దగ్గర థానేలో 'పశ్చిమ షిర్డీ' అనే పేరుతో ఒక విశాలమైన భవ్య సాయి మందిర నిర్మాణం చేయించారు. ఆ 74 సంవత్సరాల భక్తుని పేరు శ్రీ బాలీరం వాసుదేవ్ నైబాగకర్. ఇతను బాబాకు ప్రియభక్తుడు.

ఈ పరమ సాయిభక్తుడు, 'తన జన్మ బాబా సేవకోసమే జరిగింది' అని దృఢంగా నమ్ముతాడు. ఎందుకంటే, వాళ్ళ నాన్న ఒకసారి ఇతని జననం గురించి చెప్పడమే దానికి కారణం. ఇతను వాళ్ళ అమ్మ కడుపులో వున్నప్పుడు ఆమె ప్రసవం చాలా కష్టమయ్యింది. ఆ కాలంలో ప్రసవానికి ఆసుపత్రికి వెళ్లేవారు కాదు. ఒక మంత్రసానిని తీసుకొచ్చి కాన్పు చేయించేవాళ్ళు. ఇతను జన్మించే సమయంలో వీళ్ళ అమ్మగారికి చాలా నొప్పులు వచ్చాయి. ఒక మంచి పేరు ఉన్న మంత్రసానిని పిలిపించారు. ఆవిడ కూడా కాన్పు చెయ్యలేకపోయింది. కానీ దైవవశాత్తు ఆవిడ బాబాకు గొప్ప భక్తురాలు కావడం వలన, ఆమె బాబా విభూతి తెచ్చి ఈవిడ కడుపు పైన మొత్తం పూసింది. బాబా విభూతి పూసిన వెంటనే ఏ కష్టం లేకుండా ఇతను  జన్మించాడు. ఈ విషయం వాళ్ళ నాన్న ద్వారా విన్నప్పటి నుండి తన జన్మ బాబా సేవకోసమే అని దృఢంగా నమ్మేవాడు. బాబా తమ సేవకోసం తనను ఎలా వాడుకుంటారోనని ఎదురుచూస్తూ ఉండేవాడు. బాబా ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదని నమ్మేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఆ క్రమంలో ఇతనికి పెళ్లి కూడా అయ్యింది. 1970లో మొదటిసారి భార్యను తీసుకొని షిర్డీ వెళ్ళాడు. అప్పుడు షిర్డీలో ఇప్పటిలా జనం ఉండేవాళ్ళు కాదు. ఇతను సమాధి మందిరంలో అడుగుపెట్టగానే బాబా ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అంతే! అప్పటినుంచి బాబా సుందర ముఖారవిందాన్ని చూస్తూ ఉండాలని, ఎప్పుడూ బాబా సాక్షాత్కారం కావాలని మనసులో కోరికగా ఉండేది. షిర్డీలో కలిగిన ఆ వర్ణించనలవికాని ఆనందానుభూతిని  పొందాలని అనుకుంటూ ఉండేవాడు. కానీ థానే నుంచి రోజూ షిర్డీ వెళ్లడం కుదరదు కదా. అందుకే ఒకరోజు తన స్నేహితులతో కలిసి మాట్లాడి వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న స్థలంలో ఒక చిన్న మందిరం కట్టించాడు. ఆ మందిరంలో బాబా ఫోటో పెట్టి మరుసటి రోజు నుంచి పూజలు చేస్తామని తన భార్యకు, కూతురికి చెప్పాడు. తరువాత రోజు ప్రొద్దున్నే కాకడ ఆరతి చేయడానికి మందిరానికి వెళ్ళాడు. అక్కడ చూస్తే ఆశ్చర్యం! అక్కడ ఉండాల్సిన బాబా ఫోటోను ఎవరో దొంగిలించారు. దొంగలు ఎలా వచ్చారో, ఎలా తీసుకెళ్లారో ఇప్పటికీ తెలియదు. బాబా సంకల్పమో ఏమోగానీ అప్పుడే ఇతను తన మనసులో, "ఇక్కడ ఒక పెద్ద బాబా మందిరం కడతాను" అని దృఢ నిశ్చయం చేసుకున్నాడు(మరి అంత పెద్ద మందిరం రావలసిన స్థలంలో చిన్న ఫోటో ఉంటుందా?). మందిరం బాబా ఎలా కట్టించారో తరువాత భాగంలో.....

మూలం: సాయి లీల పత్రిక నవంబర్ -డిసెంబర్ 2017.
తెలుగు అనువాదం: శ్రీమతి మాధవి.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo