సర్వజగత్తుకు అధిపతి అయిన ఓ సాయినాథా! మీకు నా పాదాభివందనం. సాయిబంధువులందరికీ నమస్కారం! నా పేరు అనూరాధ. ఒక మహాద్భుతమైన సాయి లీలను నేను బాబా ఆశీర్వాదంతో 'సాయి మహరాజ్ సన్నిధి బ్లాగ్' ద్వారా సాయిబంధువులకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఒకసారి నేను, మా నాన్నగారు దిల్‌షుఖ్‌నగర్ సాయిబాబా మందిరానికి వెళ్ళాం. అక్కడ మా నాన్నగారు నాకు ఒక కొబ్బరికాయను ఇచ్చి, "దీనిని బాబా పాదాలకు తాకించి తీసుకుని రా!" అని చెప్పారు. నేను పూజారిగారి వద్దకు వెళ్లి కొబ్బరికాయ ఇస్తే, అతను దానిని నాకు తిరిగి ఇవ్వకుండా తానే ఉంచుకున్నారు. అసలు మ్రొక్కు ఏమిటంటే, ఆ కొబ్బరికాయను బాబాకు తాకించి, తిరిగి తీసుకొని రావాలి. అందువలన నేను నా మనసులో, "బాబా! కొబ్బరికాయను నువ్వే తీసుకున్నావుగా! మా నాన్నగారు నన్ను ఏమీ అనకుండా చూడు. నాకు ఎలాంటి బాధ కలగకుండా చూడు" అని అనుకున్నాను. అలా అనుకొని బయటకురాగానే మా నాన్నగారు కొబ్బరికాయను గురించి అడిగారు. నేను, "బాబా తీసుకున్నారు" అని చెప్పాను. మా నాన్నగారు చాలా చిరాకుగా, "ఏ పనీ సరిగా చేయవు. ఎప్పుడూ ఇంతే" అంటూ నా మీద కోప్పడ్డారు. నాకు చాలా బాధనిపించింది. ఆ బాధలో కోపంగా బాబాతో, "బాబా! ఇకనుండి నేను నీ గుడిలో అడుగుపెట్టను. నీ ముందే నాకు ఇంత అవమానం జరిగింది, నీవు నిశ్చలంగా కూర్చుని చూస్తున్నావు. గుర్తుంచుకో, నీ గుడిలో అడుగుపెట్టను. నీ దగ్గరకే రాను" అని చెప్పి ఏడుస్తూ గుండె బరువుతో బయటకు వచ్చేశాను. మనసంతా చెప్పలేనంత బాధ! నాకు కన్నీళ్ళు ఆగడం లేదు. నేరుగా ఇంటికి వచ్చి ఫ్రెషప్ అయ్యి హాల్లో కూర్చొని ఏదో ఆలోచిస్తున్నాను. హాల్లో ట్యూబ్‌లైట్ వేసి ఉంది. మీరు నమ్ముతారో నమ్మరో, నా కళ్ళముందే మా ఇంట్లో బండల మీద 'బాబా రూపం' కనపడుతోంది. నా భ్రమేమో అనుకున్నాను. మళ్ళీ చూస్తే ఇంకా స్పష్టంగా బాబా రూపం కనపడుతోంది. "బాబా! నన్ను అందరూ పిచ్చిదాన్ని అంటున్నారు. "ఎప్పుడూ 'బాబా, బాబా' అంటూ ఏదోలా ప్రవర్తిస్తున్నావు" అని అంటున్నారు. నువ్వేమో బండలపై నాకు స్పష్టంగా కనపడుతున్నావు. నాకు మాత్రమే కనపడితే ఎలా బాబా? అందరికీ కనబడు. అందరూ నిన్ను చూడాలి" అని బాబాను ప్రార్థించాను. నా కళ్ల వెంబడి నీళ్లు ఆగడం లేదు. కాళ్ళు చేతులు పనిచేయట్లేదు. బాబా రూపం కనబడుతున్న ప్రదేశాన్ని మా బాబుకి చూపించి, "అక్కడ నీకేమైనా కనపడుతోందా?" అని అడిగాను. వాడు, "హాఁ.. ఏదో రూపం కనిపిస్తోంది" అని చెప్పాడు. అప్పుడు నాది భ్రమ కాదు నిజం అని నిర్ధారణ చేసుకొని వాడితో, "బాబూ! ఇక్కడికి ఎవరినీ రానీకు. ఇక్కడ బాబా ఉన్నారు. ఇటుగా ఎవరినీ నడవనీయకు" అని చెప్పాను. నేను వెంటనే ఫోన్ తీసుకొని మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నాను. అందరూ వచ్చారు. కానీ, "వాళ్లకు బాబా రూపం కనపడుతుందో, లేదో? ఒకవేళ వాళ్ళకి కనిపించకపోతే, నాకు కనిపిస్తుందని అంటున్నాను కదా! ఇక వాళ్ళు నాకు పిచ్చి అని అంటార"ని నాకు లోలోపల చిన్న భయం!
ఆశ్చర్యం ఏమిటంటే, నా మొర ఆలకించి బాబా అందరికీ దర్శనం ఇచ్చారు. అందరూ బాబాను బండలపై చూశారు. 'నేను గుడికి రాను' అని బాధగా అన్నందుకు తనే నా ఇంటికి కదలివచ్చారు నా సాయి. నా సాయి అంతటి దయామయుడు. మనమందరం ఆయన బిడ్డలం కదా! అందుకే కొన్నిసార్లు ఆయనపై అలుగుతుంటాం, కోపాన్ని ప్రదర్శిస్తుంటాం. కానీ ప్రేమమయుడైన సాయి సదా మనపై ప్రేమనే కురిపిస్తూ ఉంటారు.
🕉 sai Ram
ReplyDelete