సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఊది మహిమతో-బాబా పాదదాసుడగుట



సచ్చిదానంద స్వరూపుడు, జగత్తును సృష్టించి, పోషించి, లయింప చేసేవాడు, భక్తుల కోరిక ప్రకారం మానవ రూపంలో దర్శనమిచ్చు సదాశివుడు, సద్గురువు అయిన ఆ సాయినాథునికి నమస్కారం.

నా పేరు ఎన్. జనార్ధన్. నేను హైదరాబాదులోని రాంనగర్ నివాసిని. నా వయసు 75 సంవత్సరాలు. కానిస్టేబులుగా ఉద్యోగం చేసి పదవీ విరమణ అనంతరం బాబా సేవలో ఆనందంగా జీవితం గడుపుతున్నాను.

1975వ సంవత్సరంలో నేను కానిస్టేబుల్ గా చిత్తూరుకు దగ్గరగా ఉన్న చెన్నూరు గ్రామంలో పని చేశాను. ఆ గ్రామంలో ఒక ముస్లిం సాయిభక్తుడు ఉండేవాడు. అతని పేరు 'బషీరుద్దీన్ బాబా'. తను ఆ చెన్నూరులోనే ఒక ఆలయం నిర్మించాడు. అది 'రామ్ సాయి మందిర్'. ఇంతవరకు అలాంటి ఆలయాన్ని నేను ఎక్కడా చూడలేదు. సీత, రామ, లక్ష్మణుల మూర్తులు వెనుకకు ఉంటాయి. వారి ముందు బాబా మూర్తి ఉంటుంది. ఎంతో బాగుంటుంది.                       

మేము పదిమందిమి కలిసి సేవ చేయడం కోసం 'రామ్ సాయి మందిర్'కు వెళ్ళేవాళ్ళం. అప్పట్లో గుడి కొత్తగా కట్టడం వల్ల చాలా రద్దీగా ఉండేది. మా పదిమంది ఒక్కొక్కరుగా విడిపోయి బాబా సేవ చేసుకొనేవాళ్ళము. నాది మందిరానికి వచ్చే భక్తుల నుండి కొబ్బరికాయలు తీసుకుని కొట్టే సేవ. అయితే, ఒకసారి కొబ్బరికాయలు కొట్టి, కొట్టి నా చేతులు కమిలిపోయి, గాయమై రక్తం వచ్చింది. బషీరుద్దీన్ బాబా నా చేతిలో నుండి రక్తం రావడం గమనించి, శేజ్ హారతికి ముందు బాబా ఊదీని నా చేతినిండా పూసి, ఒక రుమాలు తీసుకొని పైనుండి చేతికి కట్టి, "మళ్ళీ రేపు శేజ్ హారతికి కట్టు విప్పుతాను, అంతవరకూ అలాగే ఉండనీయండి" అని అన్నారు. మరుసటి రోజు నా చేతికున్న రుమాలుని తీసి చూస్తే ఆశ్చర్యం, అద్భుతం. ఊదీ మహిమ అమోఘం. కనీసం గాయం తాలుకు మచ్చ అయినా లేదు. నాకు గాయమై రక్తం వచ్చింది కదా! కొంచెం అయినా మచ్చ ఉండాలి కదా! అసలు గాయం కావడానికి మునుపు ఎలా ఉందో అలాగే ఉంది. అప్పటినుండి మొత్తం నా జీవితమే మారిపోయింది. అంతా సాయిమయం అయింది. ఏదో గుడిలో సేవ చేసుకుందాం, పుణ్యం వస్తుంది కదా అని వెళ్ళిన నేను సాయికి దాసుడనైపోయాను.

అలా 1975లో బాబా భక్తుడిగా మారిపోయాను. ఇప్పుడు నా వయస్సు 75 సంవత్సరాలు. అంటే బాబాతో నా అనుబంధం 42 సంవత్సరాలు. ఆయన నీడలో నేను, నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. నేను ప్రతిరోజూ రాంనగర్ సాయిబాబా గుడికి వెళ్తాను. ఆ బాబా రప్పించుకుంటున్నాడు. 

1975వ సంవత్సరంలో ఇంకొక విషయం ఏం జరిగిందంటే, ఘంటసాలగారు కాకడ హారతికి వచ్చి ఆ గుడిలో రెండు రోజులు ఉండి కాకడ హారతి, సుప్రభాతం పాడారు. నా ఈ అమూల్యమైన మొదటి అనుభవాన్ని మీతో 'సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్' ద్వారా పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది.

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo