సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

బాబా ఏ మాయ చేశారో ఏమో!


"బాబా! మీరిచ్చిన ఈ అనుభవాన్ని వ్రాయాలని చాలారోజుల క్రితం మొదలుపెట్టాను. కానీ రోజులు గడుస్తున్నా పూర్తి చేయలేకపోతున్నాను. దయచేసి నా చేయి పట్టుకొని ఈ అనుభవాన్ని పూర్తి చేయించండి బాబా!"

నాకు జరిగిన ఒక స్వీయ అనుభవాన్ని సాయిబంధువులందరి ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

జూన్ 14, 2018 గురువారంనాడు నా సాధారణ అలవాటు ప్రకారం పూజానంతరం పారాయణ చేసుకుంటున్న సందర్భంలో ...

"కొంత బాధ అనుభవించవలసి ఉంటుంది."

"బిడ్డా! భయపడకు. నీకు మూడు రోజులలో నయమవుతుంది."

"నిన్ను రక్షించడానికే నేనున్నాను."

అని మూడు బాబా మెసేజెస్ వచ్చాయి. ఆ మెసేజెస్ ఎందుకోగానీ నా మనసును బాగా తాకాయి. "ఏమిటిది, బాబా మెసేజెస్ ఇలా వచ్చాయి?" అని ఆలోచించాను, కానీ నాకు అర్థం కాలేదు. సరేనని ఊరుకున్నాను. మరుసటిరోజు యథావిధిగా స్నానం చేసి పూజ చేస్తూ ఉన్నప్పుడు నాకు కాళ్ళు లాగేస్తున్నట్లుగా(సాధారణంగా నాకు ఎప్పుడు జ్వరం వచ్చి‌నా ముందుగా కాళ్ళు, పాదాలు లాగుతున్నట్లుగా ఉంటుంది. అదే నాకు జ్వరం వస్తుందనడానికి సంకేతం.) అనిపిస్తూ, కాస్త అసౌకర్యంగా, అసహనంగా అనిపించింది. ఏదో మొత్తానికి పూజ పూర్తి చేసి పూజగది నుండి బయటకు వచ్చేశాను. తరువాత ఆరోజు పారాయణ చేస్తూ ఉంటే, ముందురోజు లాగానే అటువంటి మెసేజ్‌లే మళ్ళీ వచ్చాయి. అప్పుడు అర్థమయింది, నిన్నటినుండి నేను అనారోగ్యం పాలవుతానని బాబా సూచిస్తున్నారని. వెంటనే నా మదిలో, "నాకు జ్వరం వచ్చిందని తెలిస్తే ఇంట్లోవాళ్ళు ఊరుకోరు. టాబ్లెట్స్ వేసుకొని విశ్రాంతి తీసుకోమంటారు. విశ్రాంతి తీసుకుంటే నేను రోజూ చేసుకునే బాబా వర్క్ (ఈ బ్లాగ్ వర్క్, పూజ, పారాయణ) ఆగిపోతుంద"నే భయం, బాధ చుట్టుముట్టాయి. "మూడు రోజులలో నయమైపోతుంది, నేనున్నాన"ని బాబా భరోసా ఇస్తుంటే టాబ్లెట్స్ వేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే, "బాబా! వ్యాధిబాధలనేవి మా పూర్వజన్మ కర్మ ఫలితాలేనని, నా శ్రేయస్సు కోసమే నాకీ అనారోగ్యాన్నిచ్చి ఆ కర్మ నుండి విముక్తి కలిగిస్తున్నావని నాకు తెలుసు. కాబట్టి దానిని తగ్గించమని నేను అడగను. నేను ఏ టాబ్లెట్స్ వేసుకోను, కేవలం నీ ఊదీ మాత్రం తీసుకుంటాను. కానీ ఆ అనారోగ్య కారణంగా నేను రోజూ చేసుకొనే మీ పనికి ఆటంకం కలుగకూడదు. అలా జరగాలంటే ఇంట్లోవాళ్లకి నా జ్వరం సంగతి తెలియకుండా మీరే చూసుకోవాలి" అని బాబాతో చెప్పుకున్నాను.

బాబా చెప్పినట్లుగానే మూడు రోజులు జ్వరం, తలనొప్పి, కళ్ళమంటలు నన్ను బాధించాయి. అయినా కూడా అసలు జ్వరమే లేనట్లు చల్లని నీళ్లతో తలస్నానం కూడా చేసేశాను. కానీ నేను కోరుకున్నట్లుగా బాబా వర్క్‌కి ఏ ఆటంకం కలగలేదు. సంతోషంగా వర్క్ చేసుకున్నాను. మరో విషయం, సాధారణంగా జ్వరం వస్తే, మనలో వచ్చే తేడా ఇంట్లోవాళ్ళకి ఇట్టే తెలిసిపోతుంది, కానీ మావాళ్ళకి అనుమానం కూడా రాలేదు. అదే ఆశ్చర్యం! అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం చెబుతాను.

జ్వరం, దాని ప్రభావం అంతా నా శరీరానికి సంబంధించినది కాబట్టి వాళ్ళకి తెలియలేదని అనుకుందాం. కానీ వైరస్ సంబంధిత జ్వరం(వైరల్ ఫీవర్) వచ్చినప్పుడు జ్వరం తగ్గిన తరువాత పెదవులపై చిన్న చిన్న కురుపులు చాలా వస్తాయి. నాకు కూడా మూడవరోజున ఆ కురుపులు పెదాలపై వచ్చాయి. "ఈ మూడు రోజులైతే బాబా దయవలన నా జ్వరం సంగతి మా వాళ్ళకి తెలియలేదు. కానీ, ఇప్పుడు ఈ కురుపుల వలన తెలిసిపోతుంది" అనుకున్నాను. సరే! తరువాత రెండురోజులు గడిచాక అద్దంలో చూసుకుంటే ఆ కురుపులు చిట్లి రక్తం మరకలతో ఎర్రగా కనిపిస్తూ ఉన్నాయి. అయినా కూడా మావాళ్ళసలు గుర్తించట్లేదు, నన్ను అడగట్లేదు. "ఎందుకు వాళ్ళకి తెలియట్లేదు?" అని నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అలా వారంరోజుల వరకు ఉన్నాగానీ వాళ్ళకి అసలు తెలియలేదు. ఇంట్లో సభ్యులం ఎదురెదురుగా తిరుగుతూనే ఉంటాం, అందరం ఒకేసారి భోజనానికి కూర్చుంటాం, అయినా వాళ్ళు అస్సలు గుర్తించకుండా బాబా ఏ మాయ చేశారో ఏమో! "బాబా! నా జ్వరం సంగతి మావాళ్ళకి తెలియకుండా చూసుకోండి" అని అడిగినందుకు బాబా ఇంత అద్భుతం చేశారు. నేను కోరుకున్నట్లే వాళ్ళకి తెలియలేదు. ఏ అంతరాయం కలుగకుండా బాబా వర్క్ చేసుకొనేలా నన్ను అనుగ్రహించారు. బాబా అనుగ్రహం అంటే అది. బాబా చేసిన ఈ అద్భుతాన్ని మాటలలో చెప్పతరమా, ఏదో ఈ చిన్న ప్రయత్నం తప్ప!

నాకు తెలిసినది ఒకటే, మనం కోరుకున్న కోరిక చిన్నదా లేక పెద్దదా అన్న సంబంధం లేకుండా మనపై ఉన్న అంతులేని ప్రేమతో బాబా వాటిని నెరవేరుస్తూ మనలో పరివర్తన తీసుకొని వస్తూ ఉంటారు. అది బాబా ప్రత్యేక శైలి.

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo