శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై
శ్రద్ధ - సబూరి
ఓం సాయిరాం. నేను భువనేశ్వర్ నుంచి మాధవి, ఒక మంచి బాబా లీల మీతో పంచుకోవాలని వ్రాస్తున్నాను. చెప్పనలవికాని ఆశ్చర్యకరమైన లీల ఇది. నా స్నేహితురాలు శోభకు షిరిడీలో బాబా సమక్షంలో జరిగింది ఈ అనుభవం. మేమిద్దరం చాలా సంవత్సరాల తరువాత సంబల్పూర్ లో కలుసుకున్నాము. ఇద్దరమూ ఆప్యాయంగా ఒకరి క్షేమసమాచారాలు ఒకరు తెలుసుకున్న తరువాత బాబా గురించి కాసేపు మాట్లాడుకున్నాము. అప్పుడు తను బాబా చేసిన ఈ అద్భుతమైన లీలను నాకు చెప్పింది. విన్న నేను బాబా చూపిన ప్రేమకు, ఆయన కరుణకు పట్టలేని ఆనందంతో పరవశించిపోయాను. ఆ ఆనందాన్ని మీకు కూడా పంచాలని నా ఆశ.
శోభ నాలుగు సంవత్సరాల క్రితం ఒకసారి షిరిడీ వెళ్ళింది. ఎన్నిసార్లు చూసినా తనివితీరని రూపం సాయినాథునిది. ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకొని అన్ని హారతులకు హాజరు కావాలన్న కోరికతో తాను షిరిడీ వెళ్ళింది. "తాను ఒకటి తలచిన దైవం ఇంకొకటి తలచును" అన్నట్లు శోభ మధ్యాహ్న హారతి, సంధ్య హారతులకు హాజరై మళ్ళీ శేజ్ ఆరతికి వెళ్తున్న సమయంలో ద్వారకామాయి ముందర పడిపోయింది. కాలు నుంచి పాదం వేరయ్యిందా అన్నంత నొప్పి. భరించలేకపోయింది ఆ బాధని. శోభ కొడుకు, "మమ్మీ, డాక్టర్ దగ్గరకి వెళదాం పద" అని షిరిడీ సంస్థాన్ హాస్పిటలుకు తీసుకెళ్లాడు. అక్కడ చూస్తే ఆ రాత్రివేళ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎవరూ లేరు. నొప్పి భరించలేక శోభ ఆస్పత్రి బయటే కూర్చుండిపోయింది. తన కొడుకు మళ్ళీ ఆస్పత్రి లోపలికి వెళ్ళి, "మా మమ్మీ కాలు బెణికినట్లుంది. చాలా నొప్పితో బాధపడుతూ ఉంది. ఎవరైనా కనీసం చూడండి" అని రిక్వెస్ట్ చేసాడు. "డాక్టర్లు ఎవరూ లేరు, ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ విదేశాలకు వెళ్లాలని ఇప్పుడే బొంబాయి వెళ్ళారు" అని వాళ్ళు చెప్పారు. ఏమి చేయాలో అర్ధంకాని పరిస్థితిలో శోభ, "బాబా, నీ దర్శనం కోసం అంతదూరం నుండి వస్తే, నా కాలే విరిగిపోయినట్లుంది, ఈ బాధ నేను భరించలేకపోతున్నాను. ఇక్కడ చూస్తే డాక్టరు అందుబాటులో లేడు, నేనేం చేసేది? మీరే నాకు సహాయం చేయాలి బాబా. మీరు తప్ప నాకు దిక్కెవరు?" అని దీనంగా బాబాను ప్రార్ధించింది. ఇంతలో హఠాత్తుగా తెల్లని లాల్చీ, పైజామా వేసుకున్న ఒకాయన ఆమె దగ్గరకు వచ్చి, "బాబా దర్బారుకు వచ్చి, నువ్వు ఇంత బాధపడుతున్నావా? ఏం, నీకు బాబా మీద నమ్మకం లేదా? అన్నీ ఇక్కడ మన మంచికే జరుగుతాయని తెలుసుకో" అన్నాడు. అప్పుడే అక్కడ టీవీలో శేజ్ ఆరతి ప్రత్యక్ష ప్రసారం మొదలవుతూ ఉంది. శోభతో ఆయన, "ఆ టీవీలో చూడు, నువ్వు కూడా గట్టిగా 'సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!' అను" అన్నారు. అంతే, శోభ తన బాధనంతా మర్చిపోయి టీవీలో బాబాను చూస్తూ "సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!" అంది. అంతలోనే ఆయన తన కాలుకి వైద్యం చేసేసి, "నీ నొప్పిని బాబా తీసేసారు, ఇక నువ్వు వెళ్ళు. మీ ఊరు వెళ్లి, ఒకసారి అక్కడి డాక్టరును సంప్రదించు. అంతా నయమైపోతుంది" అని చెప్పారు. అప్పుడు వీళ్ళు, "మీరెవరు?" అని అడిగితే, ఆయన, "నేను ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టరుని" అని చెప్పి వెళ్లిపోయారు. వీళ్ళు, "హమ్మయ్య! బాబా డాక్టరుని పంపి సహాయం చేసారు, నొప్పి ఇట్టే పోయింది" అని అనుకున్నారు. ఇంతలో నర్సు వచ్చి, "డాక్టర్ లేరని చెప్పాను కదా! మీరు వెళ్ళండి" అని విసుగ్గా మాట్లాడింది. శోభ కొడుకు, "డాక్టరు వచ్చి మమ్మీ కాలు బాగుచేసి వెళ్లారు" అని చెప్పాడు. నర్సు ఆశ్చర్యంగా, 'ఏ డాక్టరు?' అని అడిగింది. అందుకు ఆ అబ్బాయి, "ఆయన తను ఇక్కడ ఆర్థోపెడిక్ డాక్టరునని చెప్పారు" అని చెప్పాడు. ఇప్పుడు ఆ నర్సు అవాక్కయింది. "ఏమిటి, డాక్టర్ వచ్చారా? అదెలా సాధ్యం? ఆయన విదేశాలకు వెళ్తున్నారు కదా!" అని అన్నది. ఇలా ఈ వాదన కొంచెంసేపు జరిగిన తరువాత చివరిగా ఆ నర్సు అక్కడి ఆర్థోపెడిక్ డాక్టరు ఫోటో చూపించి "ఈయనేనా?" అని అడిగింది. శోభ, "హాఁ..ఈయనే వచ్చి వైద్యం చేసారు" అని చెప్పింది. అది విని అందరూ నోళ్లు వెళ్ళబెట్టారు.
తరువాత డాక్టరు చెప్పినట్లుగా శోభ సంబల్పూర్ చేరుకున్నాక హాస్పిటల్ కి వెళ్లి డాక్టరుని సంప్రదించారు. అప్పుడు తెలిసిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, "ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయ్యింది". సాధారణంగా ఫ్రాక్చర్ అయితే పాదం నేలపై మోపడమే అసాధ్యం. అలాంటిది ఆమె ఎలా నడవగలిగింది? షిరిడీ నుండి సంబల్పూర్ కి ఎలా రాగలిగింది? అంతా బాబా లీల. ఆమె కొన్నిరోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి, వైద్యం చేయించుకొని పూర్తిగా కోలుకున్నారు.
బాబా ఎంత లీల చేసారో చూసారా?! ఈ లీల శోభ నోట విన్నాక నాకు గజేంద్రమోక్షం గుర్తుకు వచ్చింది. గజేంద్రుడి బాధ విని నారాయణుడు ("సిరికిం జెప్పడు, శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు") భక్తరక్షణకు పరుగుతీస్తాడు కదా! అలా ఆ స్వామి నిజమైన భక్తుల బాధలు తీర్చడానికి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడనడానికి ఇంతకన్నా ఇంకేం ఉదాహరణ కావాలి?
🕉 sai Ram
ReplyDelete