శ్రీశైలం దగ్గర ఉన్న సుండిపెంట నుండి సాయిబంధువు వినూత్న తన తండ్రి రామారావు గారి అనుభవాన్ని వాట్సాప్ లో పంపించారు. అతని మాటల్లోనే అతని అనుభవాన్ని చదివి ఆనందించండి.
గతంలో ఎవరో పెద్దలు మన అనుభవాలను ఇతరులకు వెల్లడిచేయకూడదని చెప్పగా విన్నాను. కానీ, అనుభవాలను ఇతరులతో పంచుకుంటే వాళ్లలో కూడా బాబాపట్ల శ్రద్ధ, నమ్మకం కలుగుతాయని భావించి ఈ బ్లాగు ద్వారా సాయిబంధువులతో పంచుకుంటున్నాను.
ఒకప్పుడు నేను పనిలో పడి నా దగ్గర ఛార్జీలకు డబ్బులు లేవనే విషయం కూడా మర్చిపోయాను. తీరా బయలుదేరేటప్పుడు చూసుకుంటే జేబులో రూపాయి కూడా లేదు. అప్పుడు సమయం రాత్రి 10 గంటలయ్యింది. అందుబాటులో ఎవరూ లేరు. ఏమి చేయాలో దిక్కు తెలియక సెంటర్లో నిలబడి ఉన్నాను. ఏమి చేయాలో అర్థంకాక, "బాబా! నువ్వే దిక్కు" అనుకున్నాను. 15 నిమిషాల తర్వాత వీఆర్వో గారు వచ్చి, 'వస్తావా?' అని ఆడిగారు. "ఎవరొస్తారా అని ఎదురుచూస్తున్నానండి" అని నేను అతనికి చెప్పగా, దానికి ఆయన, "నేను నీకోసమే వచ్చినట్లుంది. మళ్ళీ తెల్లవారుఝామునే ఇటు రావాల్సి ఉంది. ఎందుకో రూములో ఉండబుద్ధి కాలేదు, అందుకే ఇలా బయటకు వచ్చాను. చూస్తే నేను నీకోసమే వచ్చినట్లుంది" అన్నారు.
నిజంగా అక్కడ వేచి చూస్తున్న ఆ క్షణాన బాబా చెప్పిన మాట "నేనుండగా నీకు భయమేల? నీ భారాన్ని నా మీద వేస్తే అన్నీ నేను చూసుకుంటాను" గుర్తుకొచ్చి ఆయనపై విశ్వాసముంచి వెయిట్ చేశాను. ఫలితం, నాకాయన మీద విశ్వాసం రెట్టింపు కావడంతోపాటు అప్పుడు పొందిన ఆ ఆనందానుభూతి వర్ణనాతీతం. అసలు బాబా నా వెంట, నా ప్రక్కనే ఉన్నాడనే భావనకే వంటిపై రోమాలు నిక్కబొడుచుకొని ఒక రకమైన పులకింతని కలుగజేసింది. చూడడానికి చిన్నదిగానే అనిపిస్తున్నా స్వయంగా అనుభవిస్తే గాని అర్థంకాదు ఆ అనుభూతి. ఈ అనుభవాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బాబాని నమ్ముకుంటే చాలు, ఎటువంటి పరిస్థితిలోనైనా భయపడాల్సిన పనిలేదు. ఆయన రక్షణ సదా మనకి ఉంటుంది.
సాయిరామ్.
🕉 sai Ram
ReplyDelete