పూజ్య శ్రీ మాస్టరుగారు ఒకసారి మాటల సందర్భములో పారాయణ గూర్చి యిలా చెప్పారు
:
"పారాయణకు ప్రధానమైన అంశం పరాయణత చెందడమే. పారాయణాలు చేస్తున్నకొద్దీ యింకా యింకా బాబా లీలలో మనస్సు లగ్నమవ్వాలి. అలా జరిగితేనే పారాయణ సరిగ్గా చేస్తున్నట్లు గుర్తు. కొంత మంది తాము ఎన్నో సంవత్సరాలుగా విడవకుండా పారాయణ చేస్తున్నామని, అయినా మనస్సు ఏకాగ్రమవడం లేదని చెబుతుంటారు.
ఏకాగ్రమవకపోవడానికి కారణం ఆ లీలలను చింతన చేయకపోవడమే. లీలలను చింతన చేస్తుంటే ప్రీతి కలిగి మనస్సు నిలుస్తుంది. అంతేగాక కొంతమంది చాలా పారాయణాలు చేశామని, 108 పారాయణాలు పూర్తి చేశామని చెబుతారు.
కానీ ఏదైనా సమస్య వచ్చినప్పుడు అనేక చోట్లకు పరిగెత్తుతారు.
ఎవరో ఏదో చేయమన్నారు అని ఉపాసనలు,
పూజలు, శాంతులు చేస్తుంటారు. అదెందుకంటే ఏ పుట్టలో ఏ పాముందో అని అంటారు. అంటే బాబా చరిత్ర ఎన్ని పారాయణాలు చేసినా ఆయన తత్వాన్ని వారు అవగాహన చేసుకోలేదన్నమాట. ఆయనే సకల దేవత స్వరూపి అని నిరూపించారు. దేవతలందరికీ అధినాధుడైన సాయినాథుడు ఆయన భక్తుల కోరికలు తీర్చలేడా? ఆయన తీర్చలేని వాటిని దేవతలు తీర్చగలరా?' దేవతలందరూ ఆయనే అయినప్పుడు ఆయా దేవతలను ఆరాధిస్తేనేమి?' అని అంటారు వారు.
ఇక్కడ విషయమది కాదు. దేవతలు కొన్ని పరిమిత శక్తులు కలవారని చెబుతారు. ఉదాహరణకు విద్య రావాలంటే సరస్వతీ దేవిని ఉపాసించాలి. ధనం రావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి.
ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క దేవతగా పెద్దలు చెప్పారు.
అంటే వారు పరిమిత శక్తులు గలవారన్నమాట. ఉదాహరణకు మన శరీరంలో మాట నోటి ద్వారానే వస్తుంది. వినడం చెవుల ద్వారానే చేయగలము. చూడడం కళ్ళ ద్వారానే చేస్తాము. అలాగే ఒక ఇంద్రియం పని మరొకటి చేయలేదు, కానీ వీటన్నిటిని నడిపించే శక్తి ఒకటి వున్నది. అది పని చేయకపోతే ఈ మొత్తం ఆగిపోతాయి. దాని ఆజ్ఞ లేకపోతే యివేవి ఏమి చేయలేవు. అలానే దేవతలందరు ఆయా శక్తులు కలిగి వుండడానికి ఏ మహత్తర చైతన్యశక్తి కారణమో అదే తానే అయిన సాయినాధుని ఆశ్రయిస్తే మనకు ఇతర దేవతలనారాధించవలసిన అవసరమేమున్నది? ఉదాహరణకు వర్షాలు పడాలంటే వరుణ దేవుని ప్రార్థనలు చేస్తాము. కానీ బాబా ఆజ్ఞాపిస్తే వర్షం రావడంగాని, ఆగి పోవడం గాని జరిగిపోతాయి. అందుకని ఆయన చరిత్ర పారాయణ వలన ఆయన చేసిన లీలలలో ఆయన ఎంతటి శక్తివంతుడో మనకు తెలుస్తుంది. అందుకని ఆయనను ప్రార్థన చేస్తే చాలు, సకల దేవతలను ప్రార్థించినట్లే!
అంతేకాదు, ఏ ఇతర దేవతలను శ్రద్ధగా ఆరాధించినా మరొక దేవతను ఆరాధించవలసిన అవసరం లేదని తెలుస్తుంది.
అవసరమైతే ఆ దేవతే మరొకరిని ఆశ్రయించమని చెబుతుంది. సప్తశృంగీ దేవి పూజారి దీనికి ఒక ఉదాహరణ. ఇవన్నీ చదివి గూడా మనకు కష్టాలు తీర్చేందుకు మరొకరు అవసరమైనప్పుడు మనం ఆయన చరిత్ర చదివినందువలన మనకు వచ్చే లాభమేమున్నది? అలాగాక ఆయన లీల చింతనతో చదివితే మనకు ఆయన తప్ప అన్యమేమీ అవసరం లేదు అన్న విశ్వాసం కలుగుతుంది.
అట్టి విశ్వాసం కలగడమే మనం చరిత్ర పారాయణ సరిగ్గా చేస్తున్నట్లు గుర్తు.
కొందరు, "బాబా నాకు కన్పించి, నీ కష్టాలు తీరడానికి ఫలానా దేవతను ఆరాధించమనో,
మరేదో చేయమనో చెప్పారు" అని చెబుతుంటారు. వాళ్లకు చెప్పిన బాబా మనకు కూడా చెప్పినట్లయితేనే వారు చెప్పినది సరియైనది అని మనం భావించాలి.
source : భగవాన్ శ్రీ భరద్వాజ(రచన: శ్రీమతి శ్రీదేవి)
పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ గారు పారాయణ గురించి చెప్పిన వివరాలను కూడా క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. అప్పుడే మనకు సరైన అవగాహనా ఏర్పడుతుంది.
source : భగవాన్ శ్రీ భరద్వాజ(రచన: శ్రీమతి శ్రీదేవి)
పూజ్య గురుదేవులు శ్రీసాయినాథుని శరత్ బాబూజీ గారు పారాయణ గురించి చెప్పిన వివరాలను కూడా క్రింది వీడియోని చూసి తెలుసుకోండి. అప్పుడే మనకు సరైన అవగాహనా ఏర్పడుతుంది.
sairam
ReplyDeleteOm Sree Sachidhananda Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉🙏😊❤
ReplyDelete