సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆయన "లీలలు" వర్ణనాతీతము


సిద్ధిపేట నుండి ఒక సాయిబంధువు తమ అనుభవాన్ని చక్కగా ఒక పేపర్ మీద వ్రాసి, వాటిని ఫోటో తీసి మెయిల్ ద్వారా బ్లాగుకు పంపించారు. అతనికి, అతని కుటుంబానికి బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటూ అతని అనుభవాన్ని యథాతథంగా మీముందు ఉంచుతున్నాను. చదివి ఆనందించండి.


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై!



సాయిబంధువులందరికీ సాయిరామ్.



నా పేరు చెప్పడం ఇక్కడ ముఖ్యం కాదని నేను భావిస్తున్నాను. నేను సిద్ధిపేట నివాసిని. మనకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో బాబాకు బాగా తెలుసు. 'బాబా రూపాన్ని' చూస్తే నాకు ఎలా అనిపిస్తుందంటే, "కన్నతల్లి ఒడిలో ఒక పిల్లాడు హాయిగా, ఆనందంగా ఎలా నిద్రిస్తాడో అంత హాయిగా ఉంటుంది". సాయిబంధువులతో నా అనుభవాలను ఈ బ్లాగు ద్వారా పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.



నాకు 2004వ సంవత్సరంలో వివాహం అయ్యింది. 2005వ సంవత్సరంలో మేము షిర్డీ వెళ్లాలని నిర్ణయించుకున్నాము. 2005, జూన్ 20న మా కుటుంబమంతా షిర్డీ వెళ్లడానికి బస్ స్టాప్ వద్దకు చేరుకున్నాం. అప్పట్లో ప్రతిరోజూ సాయంత్రం సిద్ధిపేట నుండి షిర్డీకి డైరెక్ట్ బస్సు బయలుదేరేది. అయితే ఆరోజు మేము బస్సు కొరకు చాలాసేపు ఎదురుచూసాము కానీ, బస్సు రాలేదు. కొంతసేపటికి ఒకతను వచ్చి "ఈరోజు షిర్డీ వెళ్లే బస్సు ఏదో కారణం వలన రావటం లేదు, ఈరోజు బస్సు రద్దు చేయబడింది" అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్లకు షిర్డీ వెళ్లే అవకాశం వస్తే ఇలా జరిగిందని మేము చాలా బాధపడ్డాం. కానీ చేసేదిలేక నిరాశతో ఇంటికి వెనుదిరిగి వెళ్ళిపోయాము. మరుసటిరోజు అనగా 2005, జూన్ 21న మళ్ళీ బయలుదేరి బస్ స్టాపుకి వెళ్ళాము. ఆరోజు బస్సు సమయానికి వచ్చింది, అందరం బస్సు ఎక్కి చక్కగా కూర్చున్నాము. షిర్డీ దర్శించబోతున్నామని మా అందరికీ ఒకటే ఆనందం. మా ఆనందానికి హద్దేలేదు. 2005, జూన్ 22 ఉదయాన షిర్డీ పుణ్యభూమిలో అడుగుపెట్టాము. కాలకృత్యాలు తీర్చుకొని అందరం బాబా దర్శనానికి వెళ్ళాము. ఆరోజు మాకు బాబా చక్కటి దర్శనాన్ని ఇచ్చారు. తృప్తిగా బాబా దర్శనం చేసుకొని, "బాబా, మాకు మంచి సంతానాన్ని ప్రసాదించండి" అని వేడుకున్నాము. ఆ దయార్ద్రహృదయుడు 2006, జూన్ 22న పాపను మాకు బహుమతిగా ఇచ్చారు. అంటే నేను 2005, జూన్ 22న ఆయన దర్శనం చేసుకొని సంతానాన్ని ఇవ్వమని అడిగితే, సరిగ్గా సంవత్సరం తరువాత క్యాలెండరులో అదే నెల, అదే తేది కలిసే విధంగా వారు మాకు పాపను ప్రసాదించారు. ఆయన "లీలలు" అంత గొప్పవి, వర్ణనాతీతము. ప్రతిదీ చక్కగా కలకాలం  గుర్తుండిపోయేలా ఇస్తారు.



సాయిబంధువులకు ఇక్కడ నేను ఒక ముఖ్య విషయాన్ని చెప్పాలి! ఆరోజు మేము 2005, జూన్ 20న బస్ స్టాపులో నిలుచున్నప్పుడు మా దగ్గరకు వచ్చి, "ఈరోజు బస్సు రావడం లేదు" అని చెప్పిన వ్యక్తి వేరెవరో కాదు! ఆ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు, యోగిరాజు, సమర్థ సచ్చిదానంద సద్గురు సాయినాథుడే. ఎందుకంటే వచ్చిన వ్యక్తి ఎవరో మాకు తెలియదు, అంతకుముందు చూడలేదు. కాబట్టి ఆ వ్యక్తి బాబా కాకుంటే మేము షిర్డీ వెళ్తున్నామని చెప్పకముందే షిర్డీ వెళ్ళే బస్సు రావడం లేదని ఎలా చెపుతాడు? ఆయన లీలలు విచిత్రం. తనను ప్రేమించే భక్తులను ఎల్లవేళలా కాపాడే కరుణామయుడతడు. నా జీవితంలో జరిగిన మరో అనుభవంతో మళ్ళీ కలుస్తాను.


సాయినాథ్ మహారాజ్ కీ జై!

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo