ఒక అజ్ఞాత సాయి బంధువు అనుభవాలు:
బాబా ఆశీర్వాదము వలన నేను మహాపారాయణ గ్రూపులో భాగస్వామురాలినయ్యాను. మహాపారాయణ నన్ను బాబాకు చాలా దగ్గర చేయడమే కాకుండా నా జీవితాన్ని మార్చివేసింది. మహాపారాయణ విజయవంతం కావడానికి కష్టపడి కృషి చేస్తున్న అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మహాపారాయణలో చేరాకనే నాకు దాసగణు గారు రచించిన స్తవనమంజరి గురించి తెలిసి మొదటిసారిగా పారాయణ చేశాను. నిజంగా అది ఒక విధమైన దైవిక ఆనందం. నేను ఇప్పటికీ దానిని చాలా స్పష్టంగా గుర్తుంచుకున్నాను. దాసగణు గారు బాబాను చాలా చక్కగా స్తుతిస్తూ ఎంతో అర్థవంతంగా దానిని రచించారు. అది నా హృదయంలో చాలా లోతైన ముద్ర వేసింది. అది చదివాక దాసగణు గారి పట్ల నాకు గౌరవం అధికమయ్యింది. తన శిష్యులు గౌరవింపబడినపుడు బాబా కూడా సంతోషిస్తారని నేను తెలుసుకున్నాను. స్తవనమంజరి పారాయణ (SMP) గ్రూపు గురించి విన్న వెంటనే రెండో ఆలోచన లేకుండా నేను పారాయణ చేయడానికి సిద్ధంగా ఉన్నానని, గ్రూపులో నన్ను చేర్చుకోమని ఆ గ్రూపు కో-ఆర్డినేటర్ ను అభ్యర్థించాను.
ఇక నాకు జరిగిన ఒక అనుభవాన్ని మీకు చెప్తాను. గత కొన్ని నెలలుగా నేను ఆర్థికపరమైన ఇబ్బందులతో సతమవుతున్నాను. అధిక వడ్డీ చెల్లిస్తున్న ఒక అప్పును తీర్చడానికి చాలా ప్రయత్నిస్తున్నాను కానీ సాధ్యపడలేదు. ఈ విషయమై నేను చాలాసార్లు బాబాను ప్రార్థించాను. అలా ప్రార్థించిన తరువాత ఒకవారంపాటు దాని గురించి పూర్తిగా మర్చిపోయాను. ఆరోజు మొదటి ఏకాదశి రోజు మొదటిసారి స్తవనమంజరి పారాయణ ప్రారంభించే ముందుగా ఆ అవకాశాన్ని ఇచ్చినందుకు బాబాకు కృతఙ్ఞతలు చెప్పి, "బాబా! ఒక సంవత్సరంలో నా జీవితాన్ని మార్చివేయండి, ఆర్థిక సమస్యల నుండి కూడా నన్ను బయటపడేయండి" అని ప్రార్థించాను. తరువాత సంతోషంగా స్తవనమంజరి పారాయణ చేసి మళ్ళీ బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆ తరువాత రోజు నా రోజువారీ పారాయణ పూర్తిచేసి ఆఫీసుకు వెళ్ళాను.
మధ్యాహ్నానికి బాబా అద్భుతం చేసారు. ఆరోజు మధ్యాహ్నం సంవత్సరాంతపు ముగింపు కారణంగా ఆరు అంకెల మొత్తం నా శాలరీ అకౌంట్ లో జమ అయ్యింది. అది జీతం పొందడానికి నెల చివరి రోజు కూడా కాదు, కానీ బాబా దయవలన నేను ఊహించని విధంగా ఆ మొత్తం నా అకౌంట్ లోకి వచ్చింది. ఆ సమయంలో నేను పనిలో బిజీగా ఉన్నందున అర్థం చేసుకోలేదు కానీ, ఆ మొత్తం నా అప్పు తీర్చి వేయడానికి సరిపోతుందని తరువాత గ్రహించాను. ఆ క్షణాన అదంతా బాబా ఆశీర్వాదమే అని సంతోషించాను. బాబా నా ప్రార్థనలను విన్నారు. నేను పూర్తిగా మర్చిపోయినా కూడా ఆయన మాత్రం బాధ్యతగా నా సమస్యను పరిష్కరించారు. వెంటనే నేను షిరిడీ సాయి సంస్థాన్ లో నైవేద్యానికి ఫండ్ గా కొంత మొత్తం ఆన్లైన్ లో చెల్లించాను. నేను ఎప్పుడూ అన్నదానానికి విరాళం కట్టేదాన్ని. ఇప్పుడే నైవేద్యానికి కూడా కట్టొచ్చని మొదటిసారిగా తెలిసి కట్టాను. అందువలన బాబా నా దక్షిణను స్వీకరించి ఆశీర్వదించినట్లుగా భావించాను.
మనం బాబాకి పూర్తిగా శరణాగతి చెందితే చాలు, మన యోగక్షేమాలన్నీ ఆయన చూసుకుంటారు. మనం మన సమస్యల గురించి మరచిపోయినప్పటికీ ఆయన మనల్ని సమస్యల నుండి బయటపడేస్తారు. లవ్ యు బాబా! నన్ను మీ సంరక్షణలోకి తీసుకున్నందుకు మీకు చాలా ధన్యవాదాలు.
మూడు రోజులుగా నా అనుభవాలు చదువుతున్న మీ అందరికి కూడా ధన్యవాదములు. సాయిబంధువులందరిని బాబా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.
🕉 sai Ram
ReplyDeleteOm Sairam
ReplyDeleteSai always be with me