నేను సదాశివ (AIR, సంబల్పూర్). ముందుగా సాయినాథుని చరణద్వయాలకు నా శతకోటి ప్రణామములు సమర్పించుకుంటున్నాను. తప్పులుంటే మన్నించమని వేడుకుంటున్నాను. “చివరి క్షణం వరకు నీ భక్తునిగానే ఉండనీ ప్రభూ!"
సాయిబాబా కృపాకటాక్షాలకు హద్దులే లేవు. ఆయన తన భక్తులకోసం చేసే అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. అలాంటి వాటిలో నాకు జరిగిన ఒక మహాద్భుతాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను.
మా చెల్లికి పెళ్ళై అత్తగారింట్లో అడుగుపెట్టింది. పాపం తన తలరాత మారుతుందని తనకు కానీ, నాకు కానీ తెలీదు. ఒక సంవత్సరం వరకు తను గర్భం దాల్చలేదు. ఇక్కడ ఒరిస్సాలో ఉన్న మేము చాలా వెనుకబడి వున్నవాళ్ళము. ఒక సంవత్సరంలో పిల్లలు పుట్టకుంటే, ఇక ఆ అమ్మాయికి నరకమే చూపిస్తారు అత్తింటి వాళ్ళు. మా చెల్లి పరిస్థితి కూడా అలాగే అయ్యింది. పెళ్ళికి ముందు నాకు తెలియని విషయమేమిటంటే, మా చెల్లెలి మామగారు చాలా పెద్ద తాంత్రికుడు(ఈ తంత్రవిద్యలు ఒరిస్సాలో చాలా వాడుకలో ఉన్నాయి, నేను చూసాను….. మాధవి). మేము కట్నకానుకలు పెద్దగా ఇవ్వలేదని వేధించడం మొదలుపెట్టాడు. ఒకరోజు నన్ను పిలిచి, "నీ చెల్లికి ఇంక పిల్లలు పుట్టరు, నీవు నీ చెల్లిని వెనక్కి తీసుకెళ్లు" అని గోలపెట్టాడు. నేను ఈ మాటలు విని స్తబ్ధుణ్ణయిపోయాను. "బాబా, మళ్ళీ ఏమిటీ పరీక్ష?" అని చాలా వేదన పడ్డాను. ఏమి చెయ్యాలో తెలీలేదు. ఇంతలో నాకే తెలీని ధైర్యం వచ్చింది. అంత పెద్ద తాంత్రికునితో, "మీరు ఎంత పెద్ద తాంత్రికులయినా మా సాయిబాబా మీకన్నా పెద్ద తాంత్రికుడు. ఆయనే నా చెల్లికి రక్షగా ఉంటాడు. మీ ఇష్టం, మీరేమన్నా చేసుకోండి" అని సవాలు విసిరి, మా చెల్లిని వదిలేసి వచ్చేసాను. మూడు నెలలు గడిచిన తరువాత, మా చెల్లి గర్భవతి అయ్యింది(బాబా కృప ఉంటే, అంతేమరి!). బిడ్డ పుట్టాక పంపుతానని చెప్పి, నేను మా చెల్లిని ఇంటికి తీసుకొచ్చాను. నా చెల్లి మాత్రం, తన మామగారు ఏదో చేస్తారు, అతను చెప్పినట్లు పిల్లలు పుట్టరేమోనని భయపడుతూ ఉండేది. నేను, "బాబా మీద విశ్వాసం ఉంచు! అంతా బాబా చూసుకుంటారు" అనేవాడిని. కానీ నేను కూడా మనసులో భయపడేవాడిని. "బాబా! నేను సవాలు చేసి వచ్చాను, నిన్ను నువ్వే నిరూపించుకోవాలి, ఏమి చేస్తావో, ఎలా చేస్తావో మరి?” అని బాబాను వేడుకునేవాడిని. నా చెల్లికి అప్పుడప్పుడు కడుపులో చాలా నొప్పి వచ్చేది. కారణమేమిటో వైద్యుడికి కూడా తెలిసేది కాదు. అలాంటి సమయంలో నేను బాబా ఊదీని నీళ్లలో కలిపి ఇచ్చేవాడిని. దానితో నొప్పి తగ్గేది. ఒకసారి అలా చాలా నొప్పితో తను బాధపడుతుంటే ఊదీ నీళ్లు ఇద్దామని ఊదీ కోసం వెతికాను. ఏమైందో ఏమోగాని ఇంట్లో ఉండాల్సిన ఊదీ అంతా ఎక్కడ పోయిందో, ఇంట్లో ఎక్కడా కనపడలేదు. అప్పటినుండి ఎప్పుడు నొప్పి వచ్చినా నేను అగరబత్తి వెలిగించి, ఆ క్రిందపడిన బూడిదను బాబా స్మరణ చేసి ఊదీగా ఇచ్చేవాడిని. తన కడుపు నొప్పి తగ్గిపోయేది. తన మామగారు చేసిన తంత్రం వలన మా చెల్లి ఇన్ని బాధలు పడింది. ఆయన గుణీ(తంత్ర విద్యలు) చాలా చేసేవాడు. "అయ్యో, నా మనవడే నష్టపోతాడు" అన్న ఆలోచన ఉండేది కాదు అతనికి. కానీ, బాబా తప్పకుండా రక్షిస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉండేది. అలాగే బాబా సర్వదా నా చెల్లికి పండంటి కొడుకు పుట్టేవరకు తోడుగా వున్నారు. ఇదంతా వ్రాస్తుంటే నా కళ్ళలో నీళ్ళు ఆగటం లేదు. ఇలా ఎన్నో రకాలుగా నన్ను బాబా రక్షించారు. అందుకే నేను ఖరాఖండిగా చెప్పగలను, మన సాయిబాబా- "అనాథనాథ దీనబాంధవుడ"ని. చివరికి ఆ తాంత్రికుడు(మా చెల్లి మామగారు) వచ్చి, "అవును సదాశివా! నీ సాయిబాబా నాకన్నా పెద్ద తాంత్రికుడు. నా తంత్రాలన్నీ చిత్తు చేసి మంచి మనవడినిచ్చాడ"ని చెప్పి, ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు. నేను ఈ అనుభవాన్ని మాధవి మేడమ్ గారితో పంచుకున్నప్పుడు, మేడమ్ గారు నాతో, "అవును సదాశివా, సాయి చరిత్రలో కూడా కుశాభావు అనే తంత్రవిద్య తెలిసిన వాడిని బాబా ఆ తంత్రవిద్యలను వదలిపెట్టమని చెప్పి, అతనిని ఉత్తమ శిష్యునిగా మలచారు. నీ చెల్లిలాంటి కథలు చాలా వున్నాయి. అందుకే మన జీవితాలే సాయి చరిత్రలని నేనంటాను" అని అన్నారు. నిజానికి నేను ఇప్పటివరకు సాయి చరిత్ర చదవలేదు. మేడమ్ గారు చెప్పిన తరువాత చదవాలని అనిపిస్తూ ఉంది. ఇకపై ఆలస్యం చేయక ఎలాగైనా చదివి బాబా గురించి తెలుసుకుంటాను.
ఇంకో లీలతో మళ్ళీ కలుస్తాను.
Jai గురు datta
ReplyDelete