సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 95వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. సాయి చూపేంత ప్రేమను, బాధ్యతను వేరెవరు చూపగలరు?
  2.           సాయి ప్రసాదించిన సంతానం 
  3.           తల్లిలా సంసారాన్ని సర్దుబాటు చేసిన సాయి

సాయి చూపేంత ప్రేమను, బాధ్యతను వేరెవరు చూపగలరు?
                             
తాడిపత్రి నుండి శ్రీమతి జ్యోతిగారు తన అనుభవాలను ఇలా పంచుకుంటున్నారు:

సాయే నా సర్వం. 1982లో నాకు 3 సంవత్సరాల వయసున్నప్పుడు మా ఎదురింటిలో ఒక బ్రాహ్మణ కుటుంబం వచ్చి చేరారు. అప్పట్లో బాబా మందిరాలు చాలా తక్కువ కాబట్టి వాళ్ళు ప్రతి గురువారం బాబా ఫోటో పెట్టి, పూజ చేసి, సత్సంగం చేస్తుండేవారు. చిన్నపిల్లనైన నాకు అప్పుడప్పుడే మాటలు వస్తుండేవి. వాళ్ళు మరాఠీలో బాబా ఆరతులు పాడుతుంటే నేను కూడా వచ్చీరాని మాటలతో ఆరతులు పాడుతుండేదాన్ని. అది చూసి అందరూ ముచ్చటపడి నన్ను ముద్దాడేవారు. అప్పటినుండి నాకు బాబాతో అనుబంధం ఏర్పడింది. నాకు దైవమంటే బాబానే. ఆయన తప్ప ఇంకెవరూ తెలీదు. వేరే ఏ గుడికి వెళ్లి మ్రొక్కిందీ లేదు. ఒకవేళ ఎప్పుడైనా ఎవరైనా దేవతల గురించి చెప్పుకుంటుంటే వాళ్ళు దైవం గురించి మాట్లాడుతున్న భావన కూడా నాకు కలిగేది కాదు. అంతలా బాబా నన్ను దగ్గరకు తీసుకున్నారు. అసలు బాబా ఇచ్చిన అనుభవాల గురించి చెప్పాలంటే, 'నా జీవితంలో ప్రతిక్షణం బాబానే. ప్రతిరోజు బాబా భిక్షే'. నా మనసులో ఏది అనుకున్నా నిమిషాలమీద బాబా దానిని నాకు ప్రసాదించి ప్రతిక్షణం నా ప్రక్కనే ఉండి నన్ను కాపాడుతూ ఉన్నారు. నాకు సంతోషం కలిగినా, బాధ కలిగినా బాబా తప్ప మరెవ్వరూ గుర్తుకురారు. ఏ సమస్య వచ్చినా నా భర్తకు గాని, మా అమ్మకు గాని ఇప్పటివరకు చెప్పుకోలేదు. ఏదైనా బాబాతో మాత్రమే చెప్పుకుంటాను. అప్పుడు ఆయన నాకు ఎన్నో ఓదార్పు మాటలు చెబుతారు. ఆయన నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మాటల్లో చెప్పలేను. ఆయన పట్ల నేను భక్తిశ్రద్ధలతో లేనేమో కానీ ఆయన దృష్టి మాత్రం ఎప్పుడూ నాపైనే ఉంది. నా ప్రతి అడుగు ఆయన గమనిస్తూ ఉన్నారు. ఎంతలా అంటే, పొత్తిళ్లలో ఉన్న బిడ్డను చూసుకునే తల్లి కన్నా ఎక్కువగా. ఆయన గురించి చెప్పడానికి ఈ జీవితం సరిపోదు.

సాయి ప్రసాదించిన సంతానం:

నాకు పెళ్ళైన సంవత్సరానికి కొడుకు పుట్టాడు. వాడికి 'జయ సాయి' అని పేరు పెట్టుకున్నాము. వాడు కడుపులో ఉన్నప్పుడు ఒకసారి బాబా, "నా శరీరంలోని ఒక భాగాన్ని కోసి నీ కడుపులో పడవేశాను, దిగులువద్దు" అని చెప్పారు. బాబు పుట్టిన తరువాత 3సార్లు అబార్షన్లు అయ్యాయి. అప్పుడు డాక్టర్లు, "ఈమెకు కొంచెం సమస్య ఉంది. ఎలాగూ ఒక పిల్లాడు ఉన్నాడు కాబట్టి ఆపరేషన్ చేయించుకోండి. ఎందుకంటే ఒకవేళ గర్భం నిలిచినా పుట్టిన పిల్లలు వికలాంగులయ్యే అవకాశం ఉంది" అని చెప్పారు. మా అత్తమామలు, "వేరే ఎవరైనా పెద్ద డాక్టరుకు చూపిస్తాము" అంటే, ఆ డాక్టర్, "మీ ఇష్టం. భారతదేశంలో ఎక్కడైనాసరే ఈమెకు కాన్పు సరిగా జరిగితే నేను నా ఉద్యోగానికే రాజీనామా చేస్తాను" అని కోపంగా అనింది. ఆ మాటలకు మా పెద్దవాళ్ళు భయపడి ఆపరేషనుకు ఒప్పుకున్నారు. కానీ నాకు సంబంధించిన ఏ విషయాన్నైనా బాబాను అడగనిదే నిర్ణయం తీసుకునే అలవాటు లేని నేను, "ఏమిటి బాబా! ఇక నాకు సంతానం కలిగే అవకాశం లేదా?" అని అడిగాను. అందుకు బాబా, "వైద్యుని మాటలు నమ్మవద్దు. నీకు గులాబీ పుడుతుంది" అని చెప్పారు. నేను బాబా మాటల మీద నమ్మకంతో, "నాకు కొంచెం సమయమివ్వండి. నేను తరువాత ఆపరేషన్ చేయించుకుంటాను" అని డాక్టరుతో చెప్పాను. తరువాత బాబా చెప్పినట్లుగానే ఏ మందులుగానీ, కష్టంగానీ లేకుండా చక్కటి పాప పుట్టింది. ఇప్పుడు చెప్పండి, సాయిని మించిన వైద్యుడు ఎవరు?

తల్లిలా సంసారాన్ని సర్దుబాటు చేసిన సాయి:

తరువాత కొంతకాలానికి కొన్ని సమస్యల కారణంగా నేను ఉమ్మడి కుటుంబంలో ఉండలేక, అలా అని వేరు వెళ్లలేక సర్దుకుపోతూ ఉండేదాన్ని. చివరికి ఇక నావల్ల కాదనిపించి, "బాబా! నీవే ఈ సమస్యను పరిష్కరించు" అని ప్రార్థించాను. ఎందుకంటే నాకు నా మీద, నా భర్త మీద, నా పుట్టింటి మీద, ఇంకెవరి మీదా నమ్మకం లేదు. నాకేదైనా బాబానే చెప్పాలి. నేను న్యాయంగా ఉంటే బాబా సహాయం తప్పక లభిస్తుందని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే "ఎవరి నిర్ణయమూ అవసరం లేదు బాబా. నాకు నువ్వు చెప్పిందే మేలు చేస్తుంది. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి" అని వేడుకున్నాను. బాబా, "నువ్వు వెంటనే నీ ఇంటికి వెళ్ళు" అని చెప్పారు. అదే విషయం నేను నా భర్తకు, అత్తమామలకు, ఆడపడుచుకు చెప్పి, అదే నా నిర్ణయమని చెప్పాను. వారు కూడా అందుకు సమ్మతించి, "బాబానే చూసుకుంటారు" అని చెప్పారు. నేను, నా భర్త, పిల్లలు కట్టుబట్టలతో ఇంటినుండి బయటకు వచ్చేసాము. నా భర్త చిన్న కాన్వెంటులో పని చేస్తుండేవారు. వచ్చే ఆదాయం చాలా తక్కువే అయినప్పటికీ బాబా దయవల్ల మేము ఏ లోటూ లేకుండా ఉండేవాళ్ళం. తర్వాత కొన్నిరోజులకి, రామాలయంలో అర్చకుడిగా ఉండమని కొందరు పెద్దమనుషులు వచ్చి అడిగారు. నేను, "పిల్లలు చిన్నవాళ్ళు, ఖర్చులు పెరుగుతున్నాయి. అవకాశం మంచిదే కదా! కనీసం ఇంటి బాడుగ కలిసొస్తుంది, వెళదాం" అని నా భర్తతో అన్నాను. కానీ ఆయనకు అక్కడకు వెళ్లడం ఏమాత్రం ఇష్టం లేదు. నేను, "సరే, బాబాను అడుగుదాం. ఆయన ఏమంటే అదే చేద్దామ"ని చెప్పాను. బాబా, "నేనే రాముడిలా ప్రత్యక్షమయ్యాను, ఎటువంటి అనుమానం లేకుండా వెళ్ళు" అని చెప్పారు. ఇక మావారు సరేనన్నారు. నేను, "బాబా! కుటుంబం విషయంలో నేను పెద్దల ముందు తలదించుకుని నిలబడే పరిస్థితి రాకూడదు. రామాలయంలో నీవే నా సంసారాన్ని సర్దాలి" అని చెప్పుకుని గృహప్రవేశం చేసాను. కొంత సామాను సర్దుకుని మిగిలినవి అలానే ఉంచి ఆ రాత్రి నేను, నా భర్త, పిల్లలు గదిలో పడుకున్నాము. అర్థరాత్రి నా తల దగ్గర ఏదో చప్పుడు వినపడి, నేను కళ్ళు తెరచి చూసాను. అక్కడ బాబా నిలబడి అలమరాలో సామానులు సర్దుతున్నారు. నేను, 'బాబానే కదా! ఏదో సర్దుకుంటున్నారు' అనుకుని మళ్ళీ నిద్రపోయాను. బాబా కనిపించడం మాత్రం కల కాదు, నిజంగానే చూసాను. తెల్లవారాక, "అరే! బాబాను చూసి కూడా అలా ఎలా నేను నిద్రపోయాను?" అని ఎంతో బాధపడ్డాను. అలమరా చూస్తే అంతా శుభ్రంగా సర్దిపెట్టి ఉంది. చూసారా! తల్లి తన బిడ్డ సంసారం సర్దుబాటు చేయడానికి వచ్చినట్టు బాబా ఎలా వచ్చారో!!

బాబా నాపై చూపిన అనుగ్రహం మీకు తెలియజేశాను. నిజానికి ఆయన మహిమను చాటేంత శక్తి నాకు లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం. 'బాబా!' అని తలిస్తే బాబా వస్తారు. గజేంద్రమోక్షంలో ఏనుగు శ్రీమహావిష్ణువును ఎంతగానో స్తుతిస్తే వచ్చాడేమో కానీ మన తండ్రి సాయి సదా మనల్ని కనిపెట్టుకుని పరుగున వస్తారు. నమ్ముకున్న వారికోసం సాయి ఖచ్చితంగా వస్తారు. ఆయన చూపేంత ప్రేమను, బాధ్యతను వేరెవరు చూపగలరు? "బాబా! నా మీద చూపే ప్రేమను నా బిడ్డల మీద కూడా చూపండి". 

1 comment:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo